శర్మ కాలక్షేపంకబుర్లు-పొత్తంబొచ్చిందా?

పొత్తంబొచ్చిందా?

మదిలో ఊహని అక్షరబద్ధం చెయ్యడం తేలికైన సంగతేంకాదు 🙂 బిడ్డని ప్రసవించే తల్లి పడేయాతన లాటిదే అది. అనుభవిస్తేకాని తెలియదు. అక్షరబద్ధం చెయ్యడం పద్యమే కావచ్చు,గద్యమే కావచ్చు. కొంతమంది ఇలా విషయం అక్షరబద్ధం చెయ్యక ఉండలేరు, అదో కండూతి,దానినే వ్యసనమనీ అన్నారు (ట). అలా అక్షర బద్ధం చేసినదాన్ని పదిమందికి చేరేందుకు అచ్చు వేయించడం మరో వ్యసనం, తప్పనిదిన్నీ, అదీగాక కవియే దీనికి పూనుకోవలసిరావడమున్నూ ఇబ్బంది కలిగించేది, ఎప్పటినుంచో ఇదే చరిత్ర నడుస్తున్నదిన్నూ…..

నేటి కాలంలో ఈ కండూతిని తీర్చుకునే మార్గమే బ్లాగులు. నా బ్లాగులో రాసిన చాలా టపాలని పుస్తకంగా అచ్చు వేయించమని చాలామంది కోరేరు. కాని నేనే ముందడుగు వెయ్యలేదు. చాలామంది వేయిస్తామన్నవారూ కనపడ్డారుగాని, వారూ సాహసించలేదు. ఒకరిద్దరు మిత్రులు ఇలాగే పుస్తకాలు వేయించి,చేతులు కాల్చుకున్నట్టు తెలిసింది. చేతులు కాల్చుకునే ఆర్ధిక స్తోమత లేకపోవడం అసలు కారణం. ఏమైతేనేమి మంచే జరిగిందనుకున్నా!

మొన్న శ్రావణ శుక్రవారం,వరలక్ష్మీ వ్రతం ముందురోజు, ఇల్లాలి పేరిట ఒక టపా వచ్చింది,చూస్తిని కదా! రెండు పుస్తకాలు. జడకందములు-మాకందములు. మాకందములు అనే మాట మీద శ్లేష చేసినట్టుందే అని అనుకున్నా. ( జడ కందాలు, జడకే అందాలు, జడమీద రాసిన కంద పద్యాలు. మా కందాలు,మా కందపద్యాలు, మాకందాలు, మామిళ్ళు) చూస్తే జడమీద నూటపదారు మంది కవులు రాసిన కంద పద్యాల సంకలనం. పుస్తకం పుచ్చుకున్నచోటే నిలబడి చదవకుండా ఉండలేకపోయా! కందం కట్టలేనుకాని అస్వాదించగలను. ఏంటని ఇల్లాలు కళ్ళతోనే అడిగింది, లోపలికొచ్చాకా. కవితని ఆస్వాదించగల ఆరోగ్య పరిస్థితి లేకున్నా, కొన్ని పద్యాలు వినిపించా! కొద్ది సేపు నవ్వుకుంది, బాధలో కూడా. నిజానికి కవికి కావలసిందిదే! తన కవిత్వంతో తాను రసానుభూతి పొంది ఆనందించడం, ఇతరులూ ఆ రసానుభూతి పొందేలా చేయడం. అది తెలిసి ప్రోత్సహిస్తే….అంబరమంటేదే ఆనందం…ఇద్దరికీ, కవికి పాఠకుడికీ..

ప్రకృతిలో కొచ్చి ఎవరు పంపించారని చూస్తే గ్రంధ సంపాదకులు శ్రీ కంది శంకరయ్యగారని, పరిష్కర్త శ్రీ గుండు మధుసూదన్ గారని చూసి ఆనందం కలిగింది, మా అడ్రస్ ఎలా సంపాదించి ఉంటారనుకున్నా, నన్ను చూడ్డానికి చాలామంది బ్లాగర్లు వచ్చారు, చాలా మంది దగ్గర నా అడ్రస్, ఫోన్ నంబర్లున్నాయి. వీరెవరూ ఇచ్చి ఉండినదికాదు, ఎందుకంటే నా ఇల్లాలి పేరు పూర్తిగా ఎవరికి తెలియదు కనక. మరెలా? ఊహించలేనంత విశేషమేం కాదు, మన భారత దేశం లో ఏదైనా సాధ్యమే!తమతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినవారి అడ్రస్ లు ( మైలింగ్ లిస్ట్స్) అమ్ముకునే సంస్థలు చాలానే ఉన్నాయి మరి. ఏమైనాగాని జిలేబిగారి పనుపున శ్రీ కందివారు పంపిన పుస్తకాలు చేరాయి, అదే ”పొత్తంబొచ్చిందా” కత.నన్ను గుర్తు పెట్టుకుని పుస్తకం పంపే ఏర్పాటు చేసిన జిలేబిగారికి ధన్యవాదాలు. కవి మిత్రులందరికి అభినందనలు. 

పుస్తకాలంటే పుచ్చుకున్నానుగాని సందేహం మిగిలిపోయింది, ఎందుకంటే రచయిత తనచ్చేయించిన పుస్తకం పంపిస్తే పారితోషికం పంపడం మన నాగరికత, ఇప్పుడు ఈ పారితోషికం ఎక్కడికి పంపాలి. జిలేబిగారికి శంకరయ్యగారిచ్చిన ప్రశంసా పత్రమూ వీటితో ఉంది…. మరి జిలేబి అడ్రస్ ఎక్కడా? జిలేబి అడ్రస్ దొరకబట్టుకునే పనిలో ఉంటా! ఈ సందర్భంగా నా అభిమాన రచయిత తమ పుస్తకం ప్రచురణకుగాను అనుభవించిన ఒక సంఘటన, వారి ”అనుభవాలూ-జ్ఞాపకలూనూ” నుంచి, నా మాటల్లో.. నా మాటల్లో ఎందుకన్నానంటే విషయం మావూళ్ళో జరిగినదీ, దానికి స్థానిక భౌగోళిక స్థితి తెలియడం కొంత అవసరమేమోనన్న అనుమానంతోనే.

మా ఊరు అనపర్తి. దానికి దక్షణంగా మూడు కిలో మీటర్ల దూరంలో చేలకి అడ్డపడితే తుల్యభాగ, దానిని దాటితే పొలమూరు, శ్రీ శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఊరు. మా ఊరు నాలుగు భాగాలుగా ఉంటుంది. పాతఊరు కి ఇరుపక్కలా దక్షిణంగా నల్లకాలవ, ఉత్తరంగా ఎర్ర కాలవ ఉంటాయి, తూర్పుగా ప్రవహిస్తూ. వీటికీ పేళ్ళు రావడానికి కారణం,మా ఊరు మెట్ట,మాగాణీల సరిహద్దు రేఖమీద ఉంటుంది. ఎర్రకాలవ మెట్టకి మాగాణి సరిహద్దులో ఎర్ర నేలని ఉంది కనక, ఎర్రకాలవన్నారు. నల్లకాలవ పూర్తిగా మాగాణిలోనే ఉంటుంది అందుకు నల్లకాలవన్నారు. ఆ రోజుల్నాటికి ఎర్ర కాలవ మీద వంతెన ఉంది, అది దాటితే నేటి వ్యాపార స్థలం, ఒక కిలోమీటర్ దూరంలో ఇనపదారి. దానికి కూత వేటు దూరంలో దక్షిణంగా పెదరెడ్డిగారనే శ్రీ ద్వారంపూడి రామారెడ్డిగారి భవంతి. ( పెద్దరెడ్డిగారి భవంతి నేనెరిగిన కాలంలో ఉంది, అందులో గ్రంధాలయంఉండేది) రెడ్డిగారు పేరుకే పెద్ద రెడ్డిగారు కాదు, చేతికి ఎముకలేని మనిషి,వదాన్యుడు. అంతటివాడే ఆయన తమ్ముడు వేంకట రెడ్డిగారున్నూ! లక్ష్మణుడే! ఇనపదారి దాటితే నేటి ఆధునిక నివాసాలు,కాలేజి వగైరాలున్న మా ప్రదేశం. నల్లకాలవ మీద నాటికి వంతెన లేదు. నల్లకాలవ దాటితే నేడున్నది మహలక్ష్మీపేట, నాటికి లేనిదే! కతలోకొద్దాం.

శ్రీపాదవారు ఒక పుస్తకం రాశారు, అప్పటికే కొన్ని పుస్తకాలు ప్రచురించారు కూడా, వడ్లగింజలు వగైరాలు. ఈ పుస్తకం పేరు ”వీరపూజ”. దీనిని ప్రచురించడం కోసం పిఠాపురం రాజావారిని ఆశ్రయించడమూ, అక్కడ పనికాకపోవడమూ జరిగిపోయాయి. అనపర్తిలో వదాన్యులైన పెదరెడ్డిగారికి పుస్తకం చదివి వినిపించి, వారి ఆర్ధిక సాయం కోరేరు, ప్రచురణ నిమిత్తం. రెడ్డిగారున్నూ ఒక వంద రూపాయలిస్తాను, ”మళ్ళీ వారం” అని వాగ్దానమ్మున్నూ చేసారు. మళ్ళీ వారం కలిసారు శాస్త్రిగారు,రెడ్డిగారిని ”మళ్ళీవారం” అన్నారు. కాలం గడుస్తోంది, వారం వాయిదాలు పడుతూనే ఉన్నాయి. వాయిదా వేసినా రెడ్డిగారిలో ప్రసన్నత తగ్గలేదు, ఎందుకు వాయిదా పడుతోందో తెలియదు. ఇక ఇది చూస్తున్నవారు నానా రకాలుగా మాటాడేరు. ఒక రోజు శాస్త్రిగారికీ ఈ అనుమానమొచ్చింది. శ్రీపాదవారి మనసు చదివినట్టే, వెనకనుంచి పెదరెడ్డిగారి తమ్ముడు పిలిచి రహస్యం విప్పేశాడు. పెదరెడ్డిగారి సన్నిధిలో ఉండే ఫలానా వ్యక్తి లేకుండా వస్తే, మీ పనవుతుందీ అని సారాంశం. అలాగే వారం వారం వస్తూనే ఉన్నారు, ఏ సమయంలో రెడ్డిగారిని కలిసినా ఆ సన్నిధానవర్తి లేకుండాపోలేదేనాడూ. ఇంతకీ ఆ సన్నిధానవర్తికి శాస్త్రిగారికి వైరమా? అదీ లేదు. ఇలా జరుగుతుండగానే వీరపూజ శ్రీ కాశీనాథునివారు ప్రచురింపజేయడమూ, ప్రచురించిన పుస్తకాన్ని శ్రీపాదవారు పెద్ద రెడ్డిగారికి ఇవ్వడమున్నూ జరిగిపోయింది. వారం వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది,కాలం రావాలంతే!

ఒకరోజు భోజనంచేసి రెడ్డిగారిదగ్గరికి బయలుదేరారు శ్రీపాదవారు. నల్లకాలవ దక్షణ గట్టుకొచ్చేటప్పటికి సన్నిధానవర్తి కొంతమందితో మాటాడుతూ కనిపించారు. బల్లకట్టూ ఆగట్టునే ఉంది. శ్రీపాదవారు బల్లకట్టెక్కి నడిపే అతన్ని తోసెయ్యమన్నారు.,హడావుడి పడుతూ. అది చూసిన ఒకరు టైమెంతా? అన్నారు. శ్రీపాదవారు చెప్పడం నడిస్తే కుదరదు అన్నారు. ఆ సమయంలో రాజమంద్రికి రైలుందొకటి, నాటికింకా బస్సులు లేవు. పరుగులాటి నడకతో వెనకనే సన్నిధానవర్తి వస్తున్నాడేమోననే సందేహంతో, పెద్దరెడ్డిగారింటికి చేరారు. శ్రీపాదవారిని చూచిన పెద్దరెడ్డిగారు తమ్ముడితో ఎవరిపేరో చెప్పి వంద తెమ్మనడం, తమ్ముడు తేవడం, సొమ్ము శ్రీపాదవారి చేతుల్లో పెట్టి రెడ్డిగారు ఆనందించారు.  వంద రూపాయలు శ్రీపాదవారి చేతిలోపెట్టి రెడ్డిగారనందించారు,శ్రీపాదవారూ ఆనందించారు.

కల్పవృక్షం చుట్టూనే ముళ్ళకంచెలుంటాయి, గంధపుచెట్లనాశ్రయించుకుని విషనాగులున్నట్టు. ఇదే లోకవృత్తి, ఏదీ ఆగదు. ఇప్పుడు చదవండి శ్రీపాదవారి మాటల్లో………

 

21 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పొత్తంబొచ్చిందా?

 1. శర్మ గారికి ,
  మీకు ప్రగాఢ సంతాపం.
  మీ శ్రీమతి గారి సాహచర్యం లో సాగిన అనుభవ పూర్వకమైన,విజ్ఞానదాయకమైన మీ టపాలు , ఇట్లాగే కొనసాగాలని, ఆ చర్య తో మీరు కొంత ఉపశమనం పొందగలుగుతారనీ ఆశిస్తున్నా !

 2. సర్! మీ శ్రీమతి గారి గురించిన వార్త చదివిన తరువాత చాలా బాధ కలిగింది. ఏం రాయాలో తెలియటం లేదు.
  మీరు అన్యోన్య దంపతులు. మీరు బ్లాగులో వ్రాసిన విషయాల ద్వారా మీ దంపతుల గొప్పదనం గురించి తెలిసింది. ఆమె లేని లోటు లోటే.

  అయితే, భార్యాభర్తలు ఎవరికైనా జీవితంలో ఎప్పటికైనా ఇలాంటి సమస్యను అనుభవించటం తప్పనిసరే అయినా, ఆ పరిస్థితి అనుభవంలోకి వచ్చినప్పుడు భరించటం కష్టమే.

  ఆమెకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను.
  మీరు, మీ కుటుంబసభ్యులు ఇలాంటి కష్టసమయంలో బాధను తట్టుకుని ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • పైన అనామకం అని వచ్చిన వ్యాఖ్య anrd గారు వ్రాసిందనిపిస్తోంది వారి బ్లాగ్ లో చూస్తే. ఇక్కడ అనామకం గా ఎందుకు పోస్ట్ అయిందో తెలియదు.

   http://aanamdam.blogspot.com/

  • గురువు గారూ,
   మీ ధర్మపత్ని గారి మహాభినిష్క్రమణ వార్త
   చాలా విచారం కలిగించింది. ఈ ఆపత్సమయంలో
   మీకు, మీ కుటుంబానికి సర్వేశ్వరుడు తగిన
   మనోధైర్యం ప్రసాదించాలని మనఃస్ఫూర్తిగా
   కోరుకుంటున్నాను. __/\__.

 3. గురువు గారు, అన్నీ తెలిసిన మీకు ఈ ఒక్క వాక్యంతో స్వాంతన ఒనగూరుతుందని అనుకోను. అయినా అమ్మ గారు లేని లోటు లోటే. ఆవిడకి సద్గతులు కలగాలని ప్రార్థిస్తూ…

 4. శ్రీ శర్మ గారూ,

  మీ శ్రీమతి గారు మొన్న ఆరవ తేదీన స్వర్గస్ధులయ్యారని ఈ రోజు మీ అబ్బాయి గారి ద్వారా తెలిసింది. కబురు విని చాలా విచారించాను. వారు గత కొంతకాలంగా నలతగా ఉన్నప్పటికీ మెల్లిగా కోలుకుంటున్నారని ఆమధ్య విని, త్వరలో పూర్తి స్వస్ధత పొందుతారని ఆశించాను. ఇంత పెద్ద వయసులో మీకిటువంటి కష్టం రావడం దురదృష్టకరం.

  మీకు, మీ తదితర కుటుంబసభ్యులకూ నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను 🙏.

 5. మీకు, మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు, శర్మ గారూ.
  ఇంట్లో ఆరోగ్యపరిస్ధితులు చక్కబడ్డాయని ఆశిస్తాను.

 6. “ఇనపదారి” అంటే ఏమిటి శర్మ గారూ? మొదటిసారి వింటున్నానీమాట.

  • విన్నకోట నరసింహారావుగారు,

   ఇనుపదారి అంటే.. Railway track ఈ మాటిప్పుడెవరూవాడటం లేదనుకోండి అలా భావాల వరదలో దొర్లుకొచ్చేసిందండి 🙂
   ధన్యవాదాలు

   • థాంక్సండీ శర్మ గారూ. ఇనపదారి అని మునుపు వినలేదు. మామూలుగా .. పట్టాలు అనేవాళ్ళం. అక్కడ పట్టాలు వస్తాయి / పట్టాలు దాటాలి … ఇలాగన్నమాట, మీకు తెలియనిదేముంది. మీరు చెప్పిన “ఇనపదారి” పేరు బాగుందండి. .

   • విన్నకోటవారు,

    ”హెచ్చరిక!
    ఇనుపదారి దాటుట ప్రమాదము. అతిక్రమించువారు శిక్షింపబడుదురు.”

    ఇలా హెచ్చరిక బోర్డులు రైల్వే స్టేషన్లలో కనపడేవి కదండీ!మాట పాతదే! వాడుకలోంచి పోయిందండీ. రాసేటప్పుడలా ఆ మాట వచ్చేసింది. మరో చిన్న మాట! ఇంగ్లీష్ కీ బోర్డ్ మీద టైప్ చేసేటపుడు సాధ్యమైనవరకు షిఫ్ట్ కీ గాని,కేప్ లెటర్స్ కీ గాని ఒత్తకుండా ఉండేలా టైప్ చేయాలని చూస్తాను. ఎందుకంటే ఆ కీలు నొక్కుతుంటే సమయం వ్యర్ధమయి ప్రవాహం (ఫ్లో) ఇబ్బంది పడుతుంది. అందుకు కొత్తకొత్త మాటల కోసం ప్రయత్నం చేస్తుంటా! ఇదో అలవాటు.
    ధన్యవాదాలు.

   • వినుమా శుభాంగి విదురుల
    నినారినుము దారి యంట! నీవని వుంటే ?
    తనది ప్రయోగమ్ములు సూ
    వె! నెలతుక లనిన జిలేబి పేర్పులు సుమ్మీ 🙂

    జిలేబి

   • అనామకం జిలేబి
    అసలే పెద్ద అనామతు, అందులో మళ్ళీ అనామకం 🙂
    ఇనపదారి అన్నమాట నేను పుట్టించలేదు. పాత మాటే గుర్తు చేశానంతే.కొత్తమాటలు పుట్టించడం పాత వాటిని విరిచి హింస పెట్టడం అంతా అమ్మవారి కాతా పనులు 🙂 విరుపు తప్పించి కలుపు తెలియనిదే!
    ఎప్పుడూ వ్యయకలనమే కాని సంకలనం ఎరుగని మాతల్లి 🙂
    విరుపుతో మీ పద్యం అద్భుతం, ఈ మాట నాదికాదు కందివారిదే 🙂 విరుపులోనే అమ్మవారికి సొగసు కనపడుతుంది 🙂
    ఇటుకలతో గోడ కట్టుబడి రెండు రకాలు గోడు,పాళీ అంటారు. అమ్మవారిదేదీ కాదు 🙂

   • త్సునామి వలె పేర్పులకట ! ధూముధాములున్
    కనెర్ర లును జేయుచు తిలకాష్ట బంధముల్ !
    అనామతువి! నాపయిన కమాలు గా జిలే
    బి నామ మొకటీ! విరుపులు భీకరంబుగా !

  • వెంకట రాజారావు . లక్కాకులగారు,
   జిలేబి యా మజాకా ?
   ఏం బత్తోగానీండి రాజా….ఏం చెప్పను 🙂
   ధన్యవాదాలు

 7. అదన్నమాట “జిలేబి” గారు వ్యాఖ్య రూపంలో పదేపదే అడిగిన “పొత్తంబొచ్చిందా?” అన్న ప్రశ్న రహస్యం. మీకు పోస్టు ద్వారా పంపించిన పుస్తకం అందిందా అని వాకబు చేయడమన్నమాట. బాగుంది. ఆ మాట డైరెక్ట్ గా మీకు ఇ-మెయిల్ ఇచ్చి కనుక్కోవచ్చుగా, బ్లాగులో వ్యాఖ్య పెట్టి అందరినీ తికమక చేసే బదులు? అవున్లెండి, అలా చేస్తే “జిలేబి” గారి ప్రత్యేకతేముంది?

  రచయతకు పారితోషికం పంపించడమన్నది మంచి ఆలోచన. పారితోషికం ఎక్కడికి పంపాలి అన్న మీ సంశయానికి ఈ క్రింది సమాచారం ఏమన్నా ఉపయోగపడుతుందేమో చూడండి. “శంకరాభరణం” పద్యాల బ్లాగ్ లో ఒక వ్యాఖ్యలో ఇవ్వబడిన వివరాలు ఇవి.
  ===========================
  https://kandishankaraiah.blogspot.com/2018/05/blog-post_27.html

  27, మే 2018, ఆదివారం
  “జడశతకము కవుల పట్టిక”

  ఒక వ్యాఖ్య 👇
  A.Satyanarayana Reddy మే 29, 2018 2:09 PM
  “అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సూచన మేరకు నా బ్యాంకు అకౌంటు వివరాలను క్రింద ఇస్తున్నాను.
  Kandi Shankaraiah
  A/C No. 62056177880
  State Bank of India,
  J.P.N. Road, Warangal Main,
  IFSC SBIN0020148

  డబ్బులు పంపినవారు తాము ఎంత పంపారో జడశతకం వాట్సప్ సమూహంలో కాని, బ్లాగులో కాని, నా వ్యక్తిగత వాట్సప్ నెం. 7569822984 కు కాని, నా మెయిల్ shankarkandi@gmail.com కు కాని తెలియజేయమని మనవి.”
  ===============================

  • విన్నకోట నరసింహారావుగారు,

   నాకున్నూ జిలేబిగారి మాట ”పొత్తంబొచ్చిందా” అన్నది అర్ధం కాలేదు. మొన్న పుస్తకాలు పుచ్చుకున్న తరవాత అర్ధమయిందండి. మీరన్నట్టు చేసి ఉంటే జిలేబి ఎందుకవుతుందంటారు 🙂

   పారితోషికం పంపడానికి మార్గం చెప్పినందుకు ధన్యవాదాలు. ఎవరినో బతిమాలాలి బేంక్ కి పంపేందుకు… చూద్దాం…
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s