శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లేరు మీద బండి నడక.

నల్లేరు మీద బండి నడక.

నల్లేరుబండి నడక,నల్లేరు మీద బండి నడక ఇలా వివిధరకాలుగా చెబుతారీ నానుడిని, ప్రజలు. చాలా సులభంగా జరిగే పనిని ఇలా నల్లేరు మీద బండి నడకపోతో పోలుస్తారు, కూడా. ఇదేంటీ అనేది అనుమానం మా హరిబాబుకి. కాదనుకుంటూనే చెయిచేసుకోవలసొచ్చింది. చెయిచేసుకోవడమంటే మరో అర్ధం ఉందండోయ్! అలా అనుకునేరు, అదేం కాదు. రాయాలిసొచ్చిందన్నదే ప్రస్థుతార్ధం.

ఏరు అంటే చిన్న నది. కొన్ని ఏరుల్లో వర్షకాలంలో మాత్రమే నీళ్ళుంటాయి, మరికొన్నిటిలో ఎప్పుడూ నీళ్ళుంటాయి. అందుకే సుమతీ శతకకారుడు ”ఎప్పుడు నెడ తెగకపారు నేరును” అన్నారు. మరి ఇటువంటిదే ఈ నల్లేరు కూడా, బండి అన్నది ఎడ్లబండే,అనుమానమేలేదు.

ఏటివతల వ్యవసాయమన్నది ఒక నానుడి.ఏటి ఆవల వ్యవసాయమైతే ప్రతి వస్తువు చేలోకి పట్టుకెళ్ళడం ప్రయాస, ఒక్కొకప్పుడు పని ఒకరితో జరిగేదీ కాదు కూడా. కారణం ఏరు దాటవలసిరావడం. ఆనాటికి వంతెనలు లేవు, నేటికీ లేవు . లోతున్న, వెడల్పైన ఏరైతే పడవ ఉపయోగం తప్పనే తప్పదు. బండి ప్రయాణం ప్రయాస. కొన్ని ఏర్లు కొద్దిలోతుంటాయి, వాటి మీదైతే ఖాళీ బండిని తోలుకు పోవచ్చు, ఏటొడ్డు దాకా సామనుతో వెళ్ళిన బండిని ఖాళీ చేసి, బండిని అవతలకి, నీటిలో ఎడ్ల సాయంతో తోలుకుపోయి, ఇవతలగట్టున దించిన సామాను మనుషులు పాటిరేవునో పడవ మీదో అవతలికి చేర్చి, మళ్ళీ బండి మీద వేసుకుని వెళ్ళక తప్పని పరిస్థితులు,పాత కాలంలో… బురదా, బాడీ. ఇలా ఏటి మీద బండితో ప్రయాణం చికాగ్గా కష్టం తో కూడి ఉండేది. మరి ఈనల్లేరు అనే ఏటిలో నీరు ఎప్పుడూ ఉంటుందిగాని బండి పూటీ ములగనంత ఉంటుంది. దానికితోడు బురద ఉండదు, గులకరాయి,ఇసుక ఉన్న ఏరు కనక బండిని సామానుతో సహా ఎటిలో దింపేసి ఆవలి ఒడ్డుకు తోలుకుపోవచ్చు,చాలా సులభంగా, ఏ ఇబ్బంది పడకుండా. అందుకు అదెంత పనయ్యా! నల్లేరు మీద బండి నడకంత సులువు అనడం అలవాటయిందన మాట, నిజంగానే ఈ నల్లేరు, నెల్లూరు జిల్లాలో ఉందట. అదీ నల్లేరు మీద బండి నడక కత.

పెద్దపీట.

అప్పులివ్వడంలో మీవాళ్ళకి పెద్దపీటేసుకున్నారు, అభియోగం. కావలసిన వాళ్ళకి పెద్దపీటేసి మిగిలినవాళ్ళకి తొంట చెయ్యి చూపెట్టేరు లెండి. ఇది మరో ప్రయోగం. ఇలా తెలుగు మాటల ప్రయోగం ఉండేది, జనసామాన్యంలో, ఇప్పటికీ ఉన్నాయో లేదో, టి.వి పరిభాషలో కొట్టుకుపోయాయో తెలీదు. క్లీన్ షేవా? క్లీన్ స్వీపా?. అగ్రాసనం అనేది మరో మాటా. అగ్రాసనం అంటే సినిమావారేసినట్టు ఎత్తు మీదేసిన కుర్చీకాదు. పెద్ద కుర్చీ అనీకాదు. మొదటి ఆసనం. ఇదెలా ఉండేది? ధర్మరాజు పట్టాభిషేకానికి వేసిన సింహాసనాన్ని వర్ణించాడు,వ్యాసుడు. ఆరుబయట వేదిక,వేదికమీద బంగారు కోళ్ళతో,బంగారం తాపడం చేసిన పెద్దదైన సింహాసనం, నెమలి తూలికలతో అలంకరింపబడింది, కూచుంటే సుఖంగా,మెత్తగా ఉండేందుకు. అదుగో అటువంటి సింహాసనమనమాట. ఇది సామాన్యులకి అందని మాని పండే! వర్తించదనికదూ సందేహం…ఉండండి చెబుతా! పీట చూశారా ఎప్పుడేనా? నా చాదస్తం కాని మీకు పీట చూడాల్సిన అవసరం లేదు కదా? ఇప్పుడంతా టేబులు భోజనాలే కదూ! నేల మీద కూచుని భోజనం చేసేవారు, వింతగా ఉందా? నిజమండి బాబూ!. అప్పుడు పీట మీద కూచుని భోజనం చేసేవారు. కొంతమంది భోజనం పీట మీద పెట్టుకుని కింద కూచుని తినేవారు. ఈ అన్నం తినడంలో కూడా అలవాట్ల తేడా. అన్నం కంచంలో ఎదురు చివర పెట్టుకుని, ముందుకు లాక్కుని కలుపుకుతినే అలవాటు కొంతమందిది. కొంతమంది తమ వైపు అన్నం పెట్టుకుని అన్నం ఎదురుగా తోసుకుని కలుపుకుని తినేవారూ ఉన్నారు. దీనికీ ఎదో చెబుతారా అలవాటు గురించి. ఒక పంక్తిలో భోజనాలకి పీటలేసి వాటి ముందు ఆకులేసి వడ్డించేవారు. ఐతే మొదటి ఆకు దగ్గర ఉన్నపీట పెద్దదిగా ఉండేది, అదేగాక, కూచునే పీటకి వెనక మరో పీట ఉండేది. అది మామూలు పీటలా ఉండేది కాదు. వెడల్పులో పైన అర్ధచంద్రాకారంలో పొడుగు కొంత ఎక్కువగా ఉండేది. ఈ పీటలకి వెండి పువ్వులేసి ఉండేవి. మిగిలిన పీటలు సామాన్యంగా ఉండేవి. ఈ పీటలు ఒకటి కూచోడానికీ, రెండవది ఆపీట వెనక ఏటవాలుగా నిలబెట్టబడి ఉండేది,ఎందుకు? భోజనం చేసేవారు,భోజనం చేస్తూ వెనక్కి జేరబడటానికి. ఈ పీటలని ఇలా పంక్తిలో ఇంట్లో భోజనాలకి వేస్తే, ఇంటి యజమాని ఆ పీటపై కూచుని భోజనం చేసేవాడు. ఇక ఇది గ్రామత్వేనా వేసిన పంక్తి ఐతే ఆ మొదటి పీట మీద సభాపతి కూచుని భోజనం చేసేవారు. ఇదీ పెద్దపీట వేయడమంటే! పంక్తి భోజనాలలో చాలా చాలా పద్ధతులు కట్టుబాట్లూ ఉన్నాయి,వాటిని పాటిస్తారు. పంక్తిలో మొదట ఎవరు కూచోవాలీ భోజనానికి అన్నదానికీ ప్రోటోకోల్ ఉండేది. అలా పంక్తిలో మొదట కూచున్నవారు అంటే అదో గౌరవం, పెద్దవారుగా, ముఖ్యులుగా గుర్తింపూ! ఇప్పుడు పీటలే లేవుగా పెద్దపీటలెక్కడ?

నేటికాలానికి పెద్దపీటేసేరు అంటే దోచిపెట్టేరని స్థిరమైపోయింది.

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లేరు మీద బండి నడక.

 1. నిస్సందేహంగా గురువు గారు రథచక్రాలని నిలబెట్టే సారథే. వారు కాకపోతే మరెవరు మనకి విడమర్చి ఇంత విజ్ఞానం ఊరికినే పంచిపెట్టేవాళ్ళు?

 2. నల్లేరు తీగలను పచ్చడికి కూడా వాడతారని అన్నారు. అయితే // “ తాటి చెట్టుకు పాకుతున్న నల్లేరు వాడకూడదు. దానిలొని సుగుణాలన్ని విషపురితమవుతాయి అని పతంజలి ఆయుర్వేదంలో చెప్పబడింది. “ // అని గోతెలుగు.కామ్ లో కనబడింది 👇.
  http://m.gotelugu.com/issue8/197/telugu-columns/nalleru-plant/

  • విన్నకోటవారు,

   నల్లేరు తీగ జాతిది. కణుపులుగా ఉండి ఎక్కువగా తాడిచెట్లనే ఆశ్రయిస్తుంది, పైకి పాకుతూ.దీనికి చిన్న చిన్న ఆకులు కూడా ఉంటాయండి. తాడి చెట్టున ఉన్న నల్లేరును వాడరు, కారణం తెలియదండి.
   ధన్యవాదాలు.

 3. బాగుంది మాస్టారూ!

  మొత్తానికి పోష్టుని నల్లేరు మీద బండి నడకలా అలా అలా లాగించేశారు.మొగాంబో ఖుష్ హువా:-)

  తెలుగు బ్లాగు లోకానికి మీరు పెద్ద పీట ఆసామీ!

  __/\__

  • హరిబాబు గారు,

   నల్లేరు మీద బండి కదండీ అందుకు అలా నడిచిపోయిందనమాట.

   పెద్ద పీట నాకొద్దండోయ్. చాలామంది ఈ పెద్ద పీట కోసం కొట్టేసుకుంటున్నారు, వాళ్ళకిచ్చేయ్యండి బాబూ!
   ధన్యవాదాలు.

 4. మీరు వ్రాసే టపాలు చదవడం “నల్లేరు మీద బండి నడక” లాగే సాఫీగా సాగిపోతుంది శర్మ గారూ. టపాలు వ్రాయడం కూడా మీకు నల్లేరు మీద బండి నడకేనేమో అనిపిస్తుంది.

  నల్లేరు కథ ఆసక్తికరంగా ఉంది కానీ “నల్లేరు మీద బండి నడక” అంటే బాట మీద పరుచుకున్న / పరిచిన నల్లేరు తీగల మీద బండి సాఫీగా నడుస్తుంది అని కదా ఆ మధ్య చెప్పుకున్నాం. ఈ ఏరు కథ కూడా ఉందా?
  నల్లేరు నెల్లూరు జిల్లాలో ఉందా? ఆ జిల్లాలో “కండలేరు” అని ఒక పేరు మాత్రం కాస్త పరిచయం వార్తల ద్వారా (పెన్నా, సువర్ణముఖి నదులు కాక).

  పెద్దపీట వివరణ బాగుంది. అగ్రాసనం, అగ్రతాంబూలం (ఆ వివాదం సందర్భంగా శిశుపాల వధ) వగైరాలు వింటే మహాభారతం గుర్తొస్తుంది. మీరన్నట్లు ఇప్పుడు పీటలు గురించి తెలిసినవారెవరు? అసలు భోజనానికి క్రింద కూర్చుని లేచే అలవాటుంటే కాళ్ళు కాస్త స్వాధీనంలో ఉంటాయి 🙂.

  • విన్నకోటవారు,

   నల్లేరు అన్నది బదనికలా ఉంటుందండి. సారీ బదనిక అంటే చెప్పాలికదూ (అదే పేరసైట్)ఇది ఎక్కువగా తాడి చెట్లనే అశ్రయిస్తుంది, మరే ఇతర చెట్టునీ ఆశ్రయించదు. పైకి పాకుతుందిగాని దారిలోకి పాకేటంతగా పెరగదు. అందుచేత దారిలో నల్లేరు ఉండడం దాని మీద బండి నడక ఉత్తదేనండి. నల్లేరు అన్నది ఏరు అందులో అనుమానమే లెదండి. తరవాత కత మామూలేనండి.

   అగ్రపూజ,అగ్ర తాంబూలాలకి మూలం భారతమే కదండీ. సామాన్యుల దగ్గర కొచ్చేటప్పటికి అది పెద్ద పీటయిందండి, మరేం లేదు.

   ఇక నా టపాలు నల్లేరు బండి నడక అంతా మీ అభిమానం కదా!
   ధన్యవాదాలు.

   • పెద్దలు అనుమతిస్తే ,
    నాకు తెలిసిన , అనుభవంలోని అంశం …..
    మా పల్లెటూళ్ళల్లో , ఊరవతల తుప్పల్లో ఈ నల్లేరు
    ప్రాకుడు మొక్కలు విశేషంగా ఉండేవి . ఇవి కణుపులు
    కనుపులుగా నేలపై అల్లుకుని ఉండేవి . వర్షాకాలంలో బండ్ల బాటలలో గుంటలు ఏర్పడి ప్రయాణం సుగమం
    కానప్పుడు ఈ నల్లేరు ఆగుంటల్లో వేసేవారు . బాగా మృదువుగా , సన్నగా ఉండే ఒక రకం నల్లేరు పచ్చడి
    చేసుకునేవారు . తాటి చెట్లమీద ప్రాకే నల్లేరు కూడా
    చూచేను . పూర్వం నల్లేరును దాటింపుకు కూడా
    వాడేవారు .
    ఇక ,
    నెల్లూరు జిల్లాలో నల్ల ఏరు ఎక్కడుందో , ఆకథ నాకు
    తెలియదు .

   • లక్కాకులవారు,

    నాది శ్రుతపాండిత్యమన్న సంగతి తమకు ఎఱుక కలిగియే ఉండి యుండును. 🙂 ఎవరో చెప్పిన మాట నమ్మబుల్ గా ఉండడంతో ఊ కొట్టితిని. తమరు చెప్పినదీ నమ్మబుల్ గానే ఉన్నది, దీనికిని జే కొట్టెదనుగాక 🙂 ఇదియును ఎఱుకలోని మాటే కదా! 🙂
    ధన్యవాదములు

   • కథలన్ గట్టన మేలు గాను నరరే కష్టేఫలీశర్మయే
    పథమున్ బోయెడు బండి గాంచి తనదౌ పాండిత్యమున్ చేర్చుచున్
    మథియింపన్ తన దైన శైలిని సభామర్యాదతో రావులున్
    రథచక్రంబును కొంత నిల్పిరయ ధారాటమ్ము నేనాపుచున్ 🙂

    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s