శర్మ కాలక్షేపంకబుర్లు-సన్నికల్లు దాచినంతలో …..

సన్నికల్లు దాచినంతలో …..

”సన్నికల్లు దాచినంతలో పెళ్ళాగిపోతుందా?” ఇదొక నానుడి. సన్ని కల్లు అంటే నూరు రాయి,పొత్రం. ఇది ప్రతి ఇంటా ఉండేవే. పెళ్ళికి సన్నికల్లెందుకూ? పెళ్ళిలో సప్తపది తొక్కిస్తారు. ”సఖ్యం సాప్తపదీనం” అన్నది పెద్దల మాట. దంపతులయ్యేవాళ్ళు జీవితకాల స్నేహితులు కాబోతున్నవారు. సన్నికల్లు మీద ప్రమాణం ఏంటీ? సన్నికల్లు రెండు భాగాలు. నూరు రాయిని గౌరి దేవిగా భావిస్తారు. పొత్రాన్ని ఈ శ్వరునిగా భావిస్తారు. వీరిద్దరూ ఆది దంపతులు, విడదీయలేనివారు. వారి సాక్షిగా స్నేహం మొదలు పెడుతున్నాం , ”జీవితకాలంలో ఒకరి చెయ్యి మరొకరు వదలం, ఎట్టి పరిస్థితులలోనూ” అన్నదే ఆ ప్రతిజ్ఞ. సరేగాని ఒక చిన్న కత చెప్పుకుందాం.

ఒక ఇంట పెళ్ళి జరుగుతోంది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మేనబావ. అంటే మేనత్తకొడుకు, మేనరికం అనమాట. ఇప్పుడంటే మేనరికాలొద్దంటున్నారుగాని, ఒకప్పుడు మేనరికం ఉంటే, మరొకరు పిల్లనివ్వడానికా కుర్రాడికి ముందుకొచ్చేవారు కాదు. మేనమామ కూతుర్ని లేవదీసుకుపోయినా తప్పుకాదనే రోజులు. ఆడ పడుచంటే పిల్లతల్లికి పడదు, మహా కోపం. పెళ్ళికొడుకు ,పెళ్ళి కూతురూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళికూతురు తండ్రి మాటాడలేదు, మేనరికానికిఇష్టం ఉన్నా. కారణం పెళ్ళాం నోటికి జడిసి, పెళ్ళి ఇష్టమేననలేదు. పెద్దలు కలగజేసుకున్నారు. పెళ్ళి కుదిరిపోయింది, ముహూర్తాలెట్టేసేరు. పెళ్ళివారొచ్చేసేరు, పెళ్ళయిపోతోంది. కాని పెళ్ళి కూతురు తల్లికి కడుపు రవిలిపోతోంది.ఎలాగైనా పెళ్ళి ఆపు చెయ్యాలని పెళ్ళికూతురి తల్లి ప్రయత్నం. ఏం చేయాలో తోచక, సప్తపది తొక్కడానికి సిద్ధం చేసి ఉంచిన సన్నికల్లు,పొత్రం దాచేసింది,కనపడకుండా. సప్తపది సమయమొచ్చేసింది. సప్తపది తొక్కించి పిల్ల కాలికి మెట్టెలు తొడిగిస్తారు,పెళ్ళికొడుకు చేత. కొంతమంది ఈ సప్తపది కార్యక్రమం పూర్తైతేగాని పెళ్ళి అయినట్టు భావించని ఆచారమూ ఉంది. బ్రహ్మగారు ”సన్నికల్లు,సన్నికల్లు” అని అరుస్తున్నాడు. ఇల్లంతా వెదికారు, సన్నికల్లు కనపడలేదు. కడిగి పసుపురాసి,బొట్టెట్టి, తోరంగట్టి సిద్ధం చేసుంచిన సన్నికల్లేమైందీ? అనుమానం పిల్ల తల్లిమీదకే పోయింది, ఆవిడకీ పెళ్ళి ఇష్టం లేదని అందరికి తెలుసుగనక. . ఏమీ అనే సమయంకాదు, మరో ఇంటినుంచి సన్నికల్లు తెచ్చేదీ కాదు. సన్నికల్లు ఎవరింటిది వారు వాడుకోవాలిగాని, సప్తపదికి మరో ఇంటినుంచి తెచ్చేదీ ఆనవాయితీ కాదు, ఎవరూ ఇవ్వరు. పెళ్ళికూతురికి పుట్టింటినుంచి ఏమైనా ఇస్తారుగాని సనికల్లు మాత్రం ఇవ్వరు. సన్నికల్లంటే గౌరీ దేవి, పుట్టింటివారు ఇవ్వని గౌరిదేవిని అత్తగారివ్వాలి, ఆ పిల్ల వేరు కాపరం కనక పెట్టుకుంటే, లేదూ అత్తిల్లే తన ఇల్లు కనక అత్త తరవాత ఆ ఇంటి గౌరి దేవి ఈ పిల్లకే వస్తుంది, అంటే ఆ ఇంటి కోడలికి. సన్నికల్లు కనపట్టం లేదు, ఏం చేయాలంటే ఏం చేయాలని అందరూ గుంపుచింపులు పడిపోతున్నారు. సంగతి గ్రహించిన బ్రహ్మగారు సన్నికల్లు దాస్తే పెళ్ళి ఆగుతుందా ? ఉపాయం చెబ్తా అని ఇంటెదురుగా ఉన్న రెండు రాళ్ళు తెచ్చి కడిగి పసుపురాసి,బొట్టెట్టి, తోరంగట్టి సప్తపది తొక్కించి పెళ్ళి జరిపించేసేరు. సన్నికల్లు దాచేస్తే తనకి ఇష్టం లేని, తన కూతురు పెళ్ళి ఆగిపోయుందనుకున్న ఆ ఇంటి ఇల్లాలి తెలివితక్కువతనమూ, లేకితనమూ బయట పడ్డాయంతే. పెళ్ళాగిందా? జరిగిపోయింది. తరవాత నలుగురూ ఆ ఇంటి ఇల్లాలినే తిట్టేరు, తన లేకితనం బయట పెట్టుకున్నందుకు.

ఏ పనైనా అసలు వారికి ఇష్టమైతే, మనం మోకలడ్డినంతలో ఆగిపోదు,జరిగిపోతుంది….

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సన్నికల్లు దాచినంతలో …..

 1. @Anon
  బ్రహ్మ గారు అనడం గురించి నేను గమనించినది ఏమంటే … పురోహితుడిని తూ.గో.జీ.లో బ్రహ్మగారు అనడం ఆ ప్రాంతపు ఆనవాయితీ, మర్యాద. అంతేకానీ బ్రహ్మదేవుడిని ప్రత్యేకించి బ్రహ్మగారు అనడం నేను వినలేదు.
  అయినా నేను చెప్పినదాని కన్నా సాధికారికమైన వివరణ శర్మ గారు ఇస్తారని ఆశిస్తాను.

  • YVR’s అం’తరంగం’గారు,

   సన్నికల్లు పార్వతి,రాయి శివునికి ప్రతీక. కొత్త దంపతులు లక్ష్మీ నారాయణులు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఎవరిని ఎవరుతొక్కడం అనే సమస్యఏ లేదండి. అది తాకడమే, లోకులు తొక్కడం అనుకుంటారంతే 🙂
   ధన్యవాదాలు.

 2. బ్రహ్మ ను మటుకే బ్రహ్మగారు అని ఎందుకు అంటారు. విష్ణువును విష్ణువు గారు శివుడిని శివుడు గారు అనరు.

  • Anon
   బ్రహ్మగారు సృష్టికర్త. భూమి మీదున్న అందరు స్త్రీ పురుషులూ సృష్టికర్తలే! సాటి సృష్టికర్తను గౌరవించడానికే బ్రహ్మగారు అంటారు 🙂

 3. // ” సన్నికల్లు దాస్తే పెళ్ళి ఆగుతుందా ? ” //
  హ్హ హ్హ హ్హ 😀😀. ఆ పెళ్ళికూతురి తల్లి చేసిన పనిలో లేకితనం కన్నా తెలివితక్కువతనమే ఎక్కువనిపిస్తోంది.

 4. ఏసు ప్రభువు శిలువ క్కూడా ఇదే అర్థమయి వుంటుందంటారా ? నూరు రాయి + పొత్రము = అడ్డము +నిలువు ? క్రాసు

  జిలేబి

 5. మనుచరిత్రంలో సన్నికల్లు మీద ఒక ప్రసిధ్ధమైన పద్యం ఉంది

  తండ్రీ నాకు ననుగ్రహింపగదె వైద్యంబంచు ప్రార్ధించినన్
  గాండ్రల్ గా నటు పల్కి హుంకృతుల బోకాల్మంటి వోహో మదిన్
  తీండ్రల్ గల్గిన వారి కెక్కరణినేనిన్ విద్య రాకుండునే
  గుండ్రా డాచిన పెండ్లి యేమిటికి జిక్కున్ కష్ట ముష్టింపచా !!

  విద్యనేర్పనన్న గురువు (బ్రహ్మమిత్రుడనే ముని) దగ్గరే అదృశ్యంగా కూర్చుని ఆయుర్వేదం అంతా నేర్చుకున్నాడు ఇందీవరాక్షుడనే గంధర్వరాజు. అపైన అంతా నేర్చేసుకున్నా నన్న గర్వంతో విలాసంగా గురువుగారిని వెక్కిరిస్తూ “తండ్రీ వైద్యం నేర్పవయ్యా అని బ్రతిమాలిత్తే బొబ్బలుపెట్టి తరిమేస్తావా? పట్టుదల ఉంటే విద్య రాకుండాపోతుందా? సన్నికల్లు దాచేస్తే ఎక్కడన్నా పెళ్ళి ఎందుకు ఆగిపోతుందటయ్యా?” అంటున్నాడు. (ఇల్లా ప్రేలినందుకు గురువుగారు తగిన శాస్తి చేసారు లెండి వెంటనే!)

  • తాడిగడప శ్యామలరావు గారు,

   మంచి పద్యం గుర్తు చేశారు. కత రాసే హడావుడిలో పద్యం నా స్మృతిలో మరుగున పడిపోయిందండి.

   ఈ నానుడి మనుచరిత్రం కాలానికే ప్రసిద్ధమైనది కదా!

   ఏమైనా శిష్యుడు గురువుని ”కష్ట ముష్టింపచా” అని తిట్టడం నచ్చలేదండి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s