శర్మ కాలక్షేపంకబుర్లు-తిరుపతి క్షవరం.

1103.తిరుపతి క్షవరం.

తిరుపతి క్షవరం, అనిగాని తిరుపతి మంగలి క్షవరం అనిగాని అంటారు, ఏం మరే ఊరికి లేని ఈ ప్రత్యేకత తిరుపతికే ఎందుకని కదూ అనుమానం. వైష్ణవక్షేత్రాలలో తలనీలాలివ్వడం అలవాటే! ఇది ఎప్పటినుంచి అలవాటో చెప్పలేను. తిరుపతి వైష్ణవ క్షేత్రం.

ఒకప్పుడు తిరుపతిలో ఇంతమంది యాత్రికులు ఉండేవారు కాదు, అంతెందుకు ౧౯౫౫ సంవత్సరంనాటికి తిరుమలలో దర్శనమంటే మన ఊరిగుడిలోలాగే దర్శనం అయ్యేది, జనం తక్కువగా ఉండేవారు, టిక్కట్ల ఇక్కట్లు లేవు, క్యూ లైన్లు లేవు, అబ్బో! ఎంత ఆనందమో, వాట్సాప్ లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది, ఎస్.వి.రంగారావు గాబోలు దర్శనం చేస్తుండగా తీసిన ఫిల్మ్. తిరుమలగుడి దగ్గర జనం చాలా పలచగానే ఉన్నారు.

తిరుపతి దర్శనానికి వెళ్ళాలంటే పల్లెప్రజలు, కోతలు,నూర్పులు ఐన తరవాత తీరికగా రెండెడ్ల గూడుబళ్ళు కట్టుకుని వెళ్ళేవారు, రైలు సౌకర్యం ఉన్నా. పెద్దపండగెళ్ళిన తరవాత చలి వెనకబడితే ప్రయాణం మొదలెట్టేవారు. ఒక్కో ఊరునుంచి ఇరవై, ముఫై బళ్ళు ఒక్కసారిగా సాగేవి, అంచెలలో మకాములు చేసుకుంటూ, మకాముల్లోనే వంటా భోజనాలు చేస్తూ. బళ్ళతో కొంతమంది నడిచేవారు కూడా, చేపాటి కఱ్ఱలతో. ఆ రోజుల్లో పల్లెలలో యువకులు కఱ్ఱ సాము చేసేవారు. ఇలా అంతా ఒకసారి బయలుదేరడానికి కారణం, దొంగలబారినుండి రక్షణకోసం. అలా సాగిన బళ్ళు, కింది తిరుపతిలో విప్పేవారు. బండికి నలుగురు చొప్పున ఒక వందమంది చేరేవారనమాట. ఇందులో ఆడా, మగా,పిల్లామేకా అంతా ఉండేవారు. ఇక మొక్కులు మొక్కినవారు, గడ్డాలు పెంచినవారు చెప్పక్కరలేదు. సంవత్సరం తరబడి తలా గడ్డమూ మొక్కుకోసం పెంచినవారూ ఉండేవారు. ఆడవారు కూడా తలనీలాలివ్వడం,మూడు కత్తెరలివ్వడం అలవాటే. ఇక నిలువుదోపిడీ ఇచ్చే సందర్భాలూ ఉండేవి. ఇలా ఒక వూరినుంచి చేరిన బళ్ళు తిరుపతిలో కోనేటి పరిసర ప్రాంతాల్లో విప్పుకుని బళ్ళ దగ్గరే, బసకి కాలనీలా ఏర్పాటు చేసుకుని, వంటలు చేసుకుని భోజనాలు చేస్తూ ఉండేవారు. నాటికి కాటేజీలు,ధర్మ సత్రాలూ బహు తక్కువ. కొందరు కొండ కింద పద్మావతి అమ్మవారు, గోవిందరాజులు, రాములవారి దర్శనానికి, ఆ తరవాత తిరుమల కొండ మీదికి దర్శనానికెళితే, కొందరు కాపలా కాసేవారు. ఇలా జరుగుతుండేది. తిరుపతి ప్రయాణం అంటే, తక్కువలో తక్కువ నెల సమయం పట్టేదనమాట.

నాటిరోజుల్లో దేవాలయంవారు తలనీలాలు కోసం ఏర్పాటు చేసినట్టు లేదు. ఒక వేళ ఏర్పాటు చేసినా వారు తక్కువ మంది ఉండేవారేమో! అందుకు బళ్ళు కట్టుకుపోయినవారు, తలనీలాలివ్వడానికిగాను కింద తిరుపతిలో కోనేటి గట్టున కూచుని ఉన్న క్షురలకుల్ని ఆశ్రయించేవారు. వీరూ కొద్దిమంది ఉండడంతోనూ, ఎక్కువ గుళ్ళు గీయాలనే దుగ్ధతోనూ ఒక్కో మంగలి వచ్చిన ప్రతివానిని, కోనేట్లో స్నానం చేసిరమ్మని, స్నానం చేసొచ్చినవానికి కొంత క్షవరం చేసి, మరొకనికి క్షవరానికి వెళ్ళి, మళ్ళీ మొదటివానికి క్షవరం పూర్తి చేసి ఇలా అష్టావధానం చేసేవారు. ఇదేమయ్యా సగంలో వదిలేసేవంటే దుబ్బులా పెరిగిపోయింది, తలా, గడ్డమూ, అసలే బిరుసు వెంట్రుకలు, కొంచం నాననియ్యి సామీ, మళ్ళీ వెళ్ళి కోనేట్లో ములిగిరా అని పంపేవాడు,సమయం కోసం. మరొకడికి చేయడం మొదలెట్టి, వీరిని కూచోబెట్టేవాడనమాట. సగం క్షవరం చేయించుకున్నవాడు పూర్తిగా చేయించుకోకపోడు, మరొకరి దగ్గరకెళ్ళినా అతను క్షవరం చేయడు,కట్టుబాటు కదా!నాటి కాలంలో గుండు,గడ్డం, కత్తితో గీయడమే తప్పించి బ్లేడుతో చేసే అలవాటు లేదు, అటువంటి సాధనమూ లేదు. ఒక్కో మంగలి దగ్గర ఎక్కువంటే నాలుగు కత్తులుండచ్చు. ఒక్కో కత్తితో నలుగురికి చేస్తే అది మొద్దుబారిపోతుంది. మళ్ళీ నూరు రాయి మీద పదును పెట్టాలి,దానికి సమయం పడుతుంది, చేయవలసినవాళ్ళు ఎక్కువున్నారే! అందుకు అలా బండబారిపోయిన కత్తితోనే గుండు,గెడ్డం గీసేసేవారు. ఈ సందర్భంలో గుండు మీద గెడ్డం మీద గాట్లు పడటం మామూలయిపోయింది. రక్తం వచ్చిన చోటల్లా పటిక ముక్క నీళ్ళలో ముంచి రాయడమూ అలవాటే. ఇలా ఒక్కొకరికి గుండు నిండా గాట్లు పడేవనమాట. గాట్లు పడక తిరుపతిలో తలనీలాలిచ్చారంటే అదృష్టవంతులే!

ఆ తరవాత వీరంతా కాలి నడకన కొండపైకెక్కి దర్శనం చేసుకుని కిందికొచ్చేవారు. ఆనాటికి కొండమీద వసతి సౌకర్యాలు లేవు, ఉన్నా బహు తక్కువ.

దర్శనం తరవాత ఇళ్ళకి తిరిగొచ్చినవాళ్ళు, ఊళ్ళలో ఇద్దరు ముగ్గురుగాని ఒక మంగలి దగ్గర జేరితే తిరుపతి మంగలి క్షవరం చేస్తాడురోయ్ అనేవారు. పొరబాటున గాటు పడితే తిరుపతి క్షవరం చేసేవయ్యా అనడం అలవాటయిపోయింది. ఇలా ఈ తిరుపతి క్షవరం ప్రసిద్ధి కెక్కిపోయింది, ఇదీ తిరుపతి క్షవరం కత.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తిరుపతి క్షవరం.

  1. హ్హ హ్గ హ్హ 😀.

    మా చిన్నతనంలో … గుండు కాదు గానీ … మామూలు క్షౌరమే (హెయిర్ కట్) సరిగ్గా చెయ్యక మెట్లు మెట్లుగా కనిపిస్తుంటే తిరుపతి మెట్ల లాగా పెట్టాడేమిట్రా అనేవారని జ్ఞాపకం.

    “తిరుక్షౌరం” అనే మాట కూడా వాడతారు కానీ పూర్తిగా నష్టం వచ్చిందనో, పూర్తిగా మోసం జరిగిందనో చెప్పే అర్థంలో వాడతారనుకుంటాను.

    // “ఒకప్పుడు తిరుపతిలో ఇంతమంది యాత్రికులు ఉండేవారు కాదు,” // అని పైన మీరన్నది అక్షరాలా నిజం. 1958 లోనో 1959 లోనో మా తల్లిదండ్రులు మమ్మల్ని వెంటబెట్టుకుని తిరుపతి తీసుకువెళ్ళారు. తెప్పుకోతగిన జనసమ్మర్దం లేదనే జ్ఞాపకం. కొండమీద రెండురోజులున్నాం. ఎప్పుడనిపిస్తే అప్పుడు వెళ్ళి పలుమార్లు దర్శనం చేసుకున్నాం … మామూలు దర్శనమే, స్పెషలూ కాదూ ఏమీ కాదు. ఇప్పుడో … శుక్రవారం సాయంత్రం నుండే “తిరుపతిలో పెరిగిన భక్తుల రద్దీ” అనే స్క్రోలింగులు నడుస్తుంటాయి టీవీ ఛానెళ్ళలో. హేవిటో, జనాల్లో భక్తి / భక్తి షో బాగా ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంటుంది నామటుకు నాకు.
    ఇప్పటి లాగా క్యూలైన్ల నియంత్రణ పెద్దగా ఉండేది కాదనుకుంటాను అప్పట్లో. 1965 ప్రాంతాల్లో (సరిగ్గా గుర్తు లేదు) గుడి దగ్గర తోపులాట జరిగి 15 మంది వరకు మరణించారని పేపర్లలో చదివినట్లు గుర్తు. దరిమిలా క్యూ వరసల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారనుకుంటాను టి.టి.డి. వారు.

    • విన్నకోటవారు,

      మెట్ల కటింగునే ”డిప్పకటింగూ” అనేవారనుకుంటానండి.

      క్షౌరం అనకూడదండి 🙂 క్షవరం అని ప్రతి అక్షరం విడతీసి ఒత్తి పలకాలండి 🙂

      తిరుపతి క్షవరం వేరు తిరుక్షవరం వేరూనండి 🙂

      ఎలా చెబుతే తెలుస్తుందబ్బా!!!

      మొన్న ఎన్నికలలో ప్రజలు,BJPకి ఎమ్.పి,రాజస్థాన్,చత్తీశ్ ఘడ్ లలో చేసినది తిరుపతి క్షవరం. తెలంగాణాలో కొద్దిలో వదిలేసినది తిరు క్షవరం. 🙂

      ఇక కాంగ్రెస్ వారికి తెలంగాణాలో చేసినది తిరుపతి క్షవరమేనండి 🙂

      భక్తి పెరిగిందో ఏమో చెప్పలేనండి 🙂

      ఒక్క తిరుపతే అనేమి లెండి. శ్రీకాళహస్తి గుడి ఐతే (iron jungle) ఒక అరణ్యంలాగే కనపడిందండి

      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి