శర్మ కాలక్షేపంకబుర్లు-తెలిసిన మూర్ఖుడు

తెలిసిన మూర్ఖుడు

రావణుడు తెలిసిన మూర్ఖుడని, దుర్యోధనుడు తెలియని మూర్ఖుడనీ అంటారు. తెలిసి మూర్ఖత్వం ఏంటని కదా ప్రశ్న. ఒక సంఘటన చూదాం రామాయణంలో

హనుమ సముద్రందాటి లంకలో ప్రవేసించి,సీత కోసం వెతికి వేసారి, చివరకి అశోకవనం లో సీతను చూసి, మాటాడి, ఉంగరమిచ్చి,చూడామణి పుచ్చుకున్నాడు. వచ్చిన పనైపోయింది. అమ్మా! కొద్దిగా పళ్ళు తింటానంటే సరేనంది, సీత. పళ్ళు తిన్నాడు.

అశోకవనం సమూలంగా నాశనం చేసిపారేశాడు. చూసిన రక్షకులు యుద్ధానికొచ్చారు. వాళ్ళని చంపేశాడు. కొత్తవాళ్ళొచ్చి యుద్ధం చేసేలోగా అక్కడో భవనం కనపడితే, దాని స్థంభం ఒకటి ఊడబెరికి గాల్లో తిప్పేడు. అగ్నిపుట్టింది, భవనం అంటుకుపోయింది. బతికినవాడెవడో పోయి కబురు చెబితే సేనను పంపేడు,రావణుడు. వచ్చినవాళ్ళంతా చచ్చేరు. కబురు పట్టుకుపోతే,జంబుమాలిని పంపించాడు, సేనానాయక కుమారుల్ని పంపేడు. వచ్చినవాళ్ళు వచ్చినట్టే యుద్ధంలో చచ్చేరు. సేనానాయకుల్ని పంపేడు, వాళ్ళగతీ అంతే అయింది. ఆ తరవాత అక్ష కుమారుణ్ణి పంపేడు. వచ్చిన అక్షకుమారుడితో యుద్ధం చేశాడు. హనుమ శరీరం పెంచాడు, వంగి ఒక్క చరుపు చరిచాడు,అక్ష కుమారుడి రథం మీద. ఆ అదురుకి అక్షకుమారుడు గాలిలోకి ఎగిరాడు. గాలిలోకి ఎగిరినవాడిని గాలిలోనే కాళ్ళు పట్టుకుని, నేల కేసి కొట్టేడు. అక్ష కుమారుడు రూపులేకుండా ఛిద్రమైపోయాడు. కబురందుకున్న రావణుడు, ఓటమి అంటే ఏమో తెలియని ఇంద్రజిత్తును యుద్ధానికి పంపుతూ ఇలా చెబుతాడు.

శ్రీమద్రామాయణం. సుందరకాండ.సర్గ ౪౮ లో ౧ నుండి స్వేఛ్ఛానువాదం.

మూడు లోకాల్లో నిన్ను గెలవగలవాడు లేడు. యుద్ధంలో ఏం చేయాలో ఆలోచించి చెయ్యి. నీవు నా అంతవాడవు.యుద్ధానికి నిన్ను పంపుతున్నాను కనక నాకు నిశ్చింత. ఒక మాట విను.వచ్చినవాడు,

ఎనభై వేలమంది భటులను, జంబుమాలిని,ఏడుగురు వీరులైన మంత్రి పుత్రులనూ అవలీలగా చంపేడు. ఆ తరవాత సేనా నాయకులు ఐదుగురూ మరణించారు. ఇక చనిపోయిన అశ్వ,గజ, పదాతులకు లెక్కే లేదు. ఆ తరవాత యుద్ధానికెళ్ళిన నీ తమ్ముడు అక్షకుమారుడు రూపుమాసిపోయాడు. నీ మీదున్నంత నమ్మకం, నాకు వారి మీద లేదు.అసలు నిన్ను చూస్తేనే వైరులు భయంతో లొంగిపోతారు, ఐనా నీవు వానరునితో యుద్ధం చేసేటపుడు మన సేన నశించకుండా ఉండేలా జాగ్రతలూ తీసుకో! ఒకే దెబ్బతో పలువురిని హతమార్చే వానరునితో ముష్టి యుద్ధం లాటి చిన్న చిన్న ప్రయత్నాలు ఫలించవు, అంతెందుకు వజ్రాయుధమే సరిపోదు. అందుచేత బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తూ యుద్ధానికి వెళ్ళు. యుద్ధానికి వచ్చిన వానరుడు బ్రహ్మాస్త్రానికి కాని లొంగడు. వచ్చినవాడు వాయువు,అగ్నిక0టే బలవంతుడు అసలు నిన్ను పంపడం ఇష్టం లేదు, కాని రాజధర్మంలో నేనే యుద్ధానికి వెళ్ళకూడదు, అందుకు నిన్ను పంపుతున్నాను. ఇలా చెప్పి యుద్ధానికి పంపేడు.

వెళుతూ తండ్రికి ప్రదక్షిణ,నమస్కారాలు చేస్తూ యుద్ధానికి సాగాడు, ఇంద్రజిత్తు.

ఇక్కడికాపేద్దాం. రావణుడు చెప్పిన ప్రకారంగానే ఎంతమంది యుద్ధంలో చచ్చేరో లెక్క లేదు. సేనాని కుమారులు ఏడుగురు,సేనానులు ఐదుగురు, జంబుమాలి, చివరగా అక్షకుమారూడు చనిపోయినా రావణుడు యుద్ధ ప్రయత్నం మానలేదు. తెలిసి ఇంతమంది మరణించారని చెబుతూ, వచ్చినవాడు వాయువు,అగ్ని కంటే బలవంతుడంటూ ఇంద్రజిత్తును సంధికి కాక యుద్ధానికి పంపడం అంటే తెలిసిన మూర్ఖత్వమా? కాదు కాదు ఇదే విధి అంటే.