శర్మ కాలక్షేపంకబుర్లు-తా చెడ్డకోతి….

తా చెడ్డకోతి….

https://kastephale.wordpress.com/2018/12/24

”తా చెడ్డకోతి వనమంతా చెఱచిందని” ఒక నానుడి, తాను చెడిపోయి ఇతరులను కూడా చెడదీస్తున్నవాడిని గురించి ఈ మాట చెబుతారు, ఇదెలా పుట్టిందని చూస్తే రామాయణం దగ్గరకే పోవాలి, నడవండి చూదాం.

నిన్నటి టపాలో హనుమ లంకలో సీతను వెదకి, చూసి,మాటాడి, ఆ తరవాత అశోక వనాన్ని సమూలంగా పెకలించి వేశాడు కదా!పెద్ద యుద్ధమే జరిగింది. జంబుమాలి,ఏడుగురు మంత్రి పుత్రులు, ఐదుగురు సేనానులు,అక్ష కుమారుడు చనిపోయారు, హనుమ చేతిలో. అప్పుడు వచ్చాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుతో ఘోర యుద్ధమే జరిగింది.రావణుడు చెప్పినట్టు బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కాని హనుమ కట్టుబడలేదు. హనుమ బ్రహ్మాస్త్రానికి కూడా కట్టుబడనక్కరలేదు,బ్రహ్మగారి వరం వలననే. కాని బ్రహ్మాస్త్రం మీద గౌరవం ఉంచి ఆయన కట్టుబడ్డాడు. కట్టుబడిన హనుమను తాళ్ళతో కట్టేశారు రాక్షసులు. అది చూసిన ఇంద్రజిత్తు, రాక్షస లోకానికి పెను ప్రమాదమే పొంచి ఉందని గ్రహించాడు,కాని చెప్పలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిన తరవాత కట్టుబడినవారిని మరి దేనితో బంధించినా బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. అదీగాక బ్రహ్మాస్త్ర ప్రయోగం తరవాత మరే అస్త్రమూ పని చేయదు, వెంటనే  బ్రహ్మాస్త్ర ప్రయోగం కూడదు. ఇందుకే ఇంద్రజిత్తు వాపోయింది.ఎలాగా రావణుని దగ్గరకు తీసుకుపోతారు కదా అని ఊరుకున్నాడు హనుమ,రాక్షసులు కట్టెలతో కొడుతున్నా. రావణ సభకు తీసుకుపోయారు.

రావణుని చూసిన హనుమ ఇలా అనుకున్నారు.

అహోరూపమహోధైర్యమ్ అహోసత్త్వమహోద్యుతిః
అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తతాః….రామా,,,సుం.కాం..సర్గ ౪౯ లో ౧౭

అహో రావణుని రూపమద్భుతం,ధైర్యం నిరుపమానం,తేజస్సు అసదృశము, నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు.

హనుమను చూసి రావణుడిలా అనుకున్నారు.

శంకాహతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతమ్
కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాదిహాగతః…రామా…సుం.కాం….సర్గ౫౦ లో ౨

పూర్వము నేను కైలాసమును కదిలించినపుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడా? కోతి రూపంలో ఇలా వచ్చారా? అని ఆశ్చర్యపోయాడు.

ఆ తరవాత ముఖ్యమంత్రి ప్రహస్తునితో ” ఈ దుష్టుడు ఎక్కడినుంచి వచ్చాడు. వీని రాకకు కారణం ఏమి? వనమును నాశనం చేయడం, రాక్షస స్త్రీలను భయపెట్టడం వలన ఇతనికి కలిగే ప్రయోజనమేమి? ఎందుకు నా లంకలో ప్రవేసించాడు? ఎందుకు యుద్ధం చేశాడు? ఈ దుర్మతిని అడగండి” అన్నాడు.

రావణుని పదప్రయోగాలు దుష్టుడు,దుర్మతి అంటే చెడిపోయినవాడని సామాన్యార్ధం. చెడిపోయిన ఈ కోతి వనాన్ని పాడు చేసింది, ఎందుకు ? అడగమన్నారనమాట.
రావణుని మాటలోకంలో ”తాచెడ్డకోతి వనమంతా చెఱచిందిగా” స్థిరపడిపోయింది.