చూసి రమ్మంటే……………
https://kastephale.wordpress.com/2018/12/24
https://kastephale.wordpress.com/2018/12/26/
బ్రహ్మాస్త్రానికి కట్టుబడిన హనుమను తాళ్ళతో బంధించి రావణ సభలో ప్రవేశపెట్టారు.
రావణుని మాట ప్రకారం ప్రహస్తుడు హనుమతో
”నువ్వేం భయపడకు, నిజం చెప్పు. నిన్నెవరు పంపేరు? దేవేంద్రుడా,యముడా? కుబేరుడా?వరుణుడా? లేక విష్ణువే స్వయంగా పంపేడా? చూడ్డానికి కోతిలా ఉన్నావుగాని నీవెవరు? ఇంతటి వీరత్వం వానరులలో ఉండదు. నిజం చెప్పు ఇప్పుడే నిన్ను విడుదల చేస్తాము. అబద్ధం చెప్పేవో నీ ప్రాణం దక్కదు” అని ముగించాడు.
విన్న హనుమ ”మీరు చెప్పినవారెవరిచేతా నేను పంపబడలేదు, నేను వానర జాతివాడిని, నా పేరు హనుమ. మహరాజు సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను, తమ కుశలం అడిగినట్టు చెప్పమన్నారు, మా రాజు” అని చెప్పి రాముని విషయం, సీతమాట చెప్పి , ”మీ లంకలో సీతమ్మను చూశాను, ఆమెను రామునికి అప్పగించడం మంచిదని సుగ్రీవుని మాట, అది మీకు మంచిది. దుర్లభమైన నీ దర్శనం కోసం వనం చెరచాను, నా స్వరక్షణకోసం నాతో యుద్ధం చేసినవారిని చంపేను,” అని ముగించాడు. విన్న రావణుడు అగ్గిమీద గుగ్గిలంలా మండి పడ్డాడు. ఈ కోతికి మరణ దండన విధించమని చెప్పారు. అది విన్న విభీషణుడు, మహరాజా దూతను చంపకూడదని తమకు తెలియనిది కాదు, ఈ దూతను చంపితే ఇక్కడ జరిగినదేమీ అక్కడ తెలియదు, వారా యుద్ధానికి రాలేరు, వార్త తెలిసినా సముద్రం దాటి రాగలవారు ఉన్నట్టు లేదు. ఇక్కడివార్త తెలిసి ఏమీ చేయలేక కృంగి,కృశించిపోతారు. మీ యుద్ధ కాంక్ష తీరదు. ఇతను ఘోరమైన నేరం చేసినవాడే! దూతకి విధింపబడిన శిక్ష వేయడం మంచిదనడంతో కోతులకు తోకంటే మహా ప్రీతి, అందుచేత తోక తగలపెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. హనుమతోకకు నూనె గుడ్డలు చుట్టి అంటించి వీధి వీధి తిప్పుతూ,ఊరేగించారు. హనుమ కట్టుబడిపోయినట్లు ఉండి, చెప్పులతో కొడుతున్నా, ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి వేళ లంక పూర్తిగా చూడలేకపోయాను, ఆ కొరవ వీరిప్పుడు తీరుస్తున్నారనుకున్నాడు.
కొంత సేపు తరవాత ఒక్క సారిగా శరీరం పెంచారు, కట్లు తెగిపోయాయి, వెంఠనే శరీరం తగ్గించారు, కట్లు ఊడిపోయాయి, కోట సింహద్వారం మీదకి ఎగిరితే ఒక ఇనుప ఆయుధం కనపడింది, దాన్ని చేతబట్టి భటులను చంపేరు. వచ్చిన పనిలో సీతను చూడడం అయింది, వీరి బలంలో కొంతమందిని పరిమార్చడం అయింది, రావణుని చెప్పవలసిన మాట చెప్పడమూ ఐంది. లంక ఆనుపానులు చూడడమూ అయింది, ఇంక మిగిలినది వీరికి మరికొంత నష్టం చేకూర్చడం అనుకున్నారు. ప్రహస్తుని ఇల్లు కనబడింది, తోకనున్న నిప్పుతో ముందుగా దానికి నిప్పు పెట్టేరు. ఆ తరవాత ఒక్కొకటీ ప్రముఖుల ఇళ్ళకి నిప్పు పెట్టడం అయింది. లంక అంటుకుంది. అప్పటివరకు వినోదం చూస్తున్న ప్రజలు, మేడలమీదనుంచి, ఉన్నవాళ్ళు ఉన్నట్టు దూకేరు, మంటలనుంచి రక్షించుకోడానికి. ఇలా లంకా దహనం జరిగింది. తోకను సముద్రంలో ముంచి చల్లార్చుకున్నారు. సీతమ్మ ఎలా ఉందో అని భయపడ్డారు, సీతమ్మను మళ్ళీ చూసి ఆమె కుశలం అడిగి,తన కుశలం చెప్పి లంకనుంచి వెళిపోయారు.
సేవకులు మూడురకాలు. నాటినుంచి నేటికీ వీరి సంఖ్య పెరగలేదు. మొదటివారు, చెప్పినపని సవ్యంగా చేసుకురాలేనివారు. రెండు, చెప్పినపని చెప్పినట్లు తు,చ తప్పక చేసుకొచ్చేవారు. మూడు, చెప్పిన పనితోబాటు దానికి సంబధించిన ఇతరపనులూ చక్కబెట్టుకొచ్చేవారు. పని స్వయంగా చేసుకురాలేనివాడిని ముందెందుకు చెప్పేరు? చివరివారి గురించి మొదటగా చెబితే మిగిలినవారూ ఉంటారని తెలియకపోవచ్చని.
హనుమ ప్రతి విషయంలో నూ సంయమనం తప్పలేదు, తనకి అవమానం జరుగుతున్నా! జరిగిన ప్రతి కార్యాన్నీ తనకో అవకాశంగా మలచుకుని రాక్షసులకు, లంకకు తీరని నష్టమే కలగజేశారు. సంయమనం కోల్పోకుండా హనుమ చేసిన పనులు శ్లాఘనీయం.
హనుమకు అసలు చెప్పినమాట దక్షణ దిక్కుగాపోయి సీత జాడ కనుక్కుని వచ్చి చెప్పండి అన్నదే. మరి హనుమచేసినది?సీతను చూశాడు. అక్కడితో చెప్పిన పనైపోయింది, ఆతరవాత దౌత్యం నెరవేర్చాడు, వైరులకు నష్టమూ కలగజేశాడు. అదీ చూసిరమ్మంటే కాల్చిరావడం కత.
ఈ నానుడిని కూడా విపరీతార్ధంలోనే చెబుతున్నారు,నేటి కాలంలో. ఈ ఆవృత్తిలో చివరిగా ఒక నానుడి ఉంది అదేంటో చెప్పండి?
“నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా ” అని ఒక పాత కాలపు సినిమాలోని పాటలో ఒక చరణం కదా శర్మ గారూ. నాటి ప్రభుత్వం తన డ్యూటీ తను చేసింది అనుకోవాలి (లీవులు వగైరా దృష్ట్యానేమో బహుశః?). పేరొచ్చిన తరువాతనయినా ఈనాటి ప్రభుత్వం గుర్తింపునిచ్చింది.
// “తెనుగువారు ఆనందించవలసిన సమయం ” // అన్నారు మీరు. నిజమే, అయితే ఇటువంటి విషయాల్లో ఆనందించడమే కాదు, ఆనందం అని పైకి చెప్పుకోవాలి కూడా అని నా అభిప్రాయం. తమ ఆనందాన్ని పైకి ప్రకటించినవారు తెలుగు బ్లాగుల్లో గత రెండు రోజులుగా నాకయితే కనబడలేదు. ఈ నిర్లిప్తత విచారాన్ని కలిగించింది.
(“సిరివెన్నెల” గారు వైజాగ్ లో ఎమ్.బి.బి.ఎస్. లో తన క్లాస్మేట్ అని మాటల్లో ఒకసారి …. “పద్మశ్రీ” రావడానికన్నా చాలా సంవత్సరాల ముందే లెండి 🙂 …. మా వియ్యంకుడు గారు అన్నారు)
విన్నకోట నరసింహారావుగారు,
ఏమందును మీ మాటకు. 🙂
జిలేబి
అహహహ 🙂
మద్రాసులోని తెలుగు చిత్రపరిశ్రమను చూసి రమ్మంటే …. కాల్చిరాలేదు గానీ …. తన జండాని పాతివచ్చిన మీ మిత్రుడు ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారిని భారతప్రభుత్వం వారు “పద్మశ్రీ” తో గౌరవిస్తున్నారు చూశారా. A well-deserved honour. వారికి, మీకూ అభినందనలు 👏.
విన్నకోటవారు,
మిత్రునికి ప్రభుత్వం సత్కారం పద్మశ్రీ తో, వార్త ఆనందం కలగజేసింది. తెనుగువారు ఆనందించవలసిన సమయం.
మిత్రుని దగ్గర విద్వత్తు ఉన్నది, ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకుని నిలబడ్డాడు, నేటికి గుర్తింపు దొరికింది, ఆనందం. సిరివెన్నెల మిత్రుడినైనందుకు నాకు అభినందనలా? అలాగే కానిద్దాం 🙂 ధన్యవాదాలు.
పాటలు రాసినందుకు నేటి ప్రభుత పద్మశ్రీ ఇచ్చి సత్కారం చేసింది.పాటలురాసినందుకే నాటి ప్రభుత ఉద్యోగం పీకేసింది,చిత్రం కదూ.
ధన్యవాదాలు.
మీరేమో మిత్రుడు అంటున్నారు.
వారెప్పుడైనా మిమ్ము తలచేరా కష్టేఫలే వారు ?
జిలేబి