శర్మ కాలక్షేపంకబుర్లు-Room No.111

Room No.111

పల్లెలలో సప్తమం అన్నదానిని ఆరునొకటి అనడం అలవాటు. ఎందుకంటే ఈ సప్తమ శబ్దానికి తెనుగులో రోదన ధ్వనించే మాట సమానార్ధకం కనక. సప్తమం అన్నది తెలుగులో రోదన ధ్వనిని సూచిస్తుందని వాడరన్నాగాని ఆ అంకె అశుభమని ఎక్కడా చెప్పలేదే! రోదన ధ్వని సూచించనిమాట వాడుకలో ఉన్నది వాడతారనీ లేదా ఆరున్నొకటి అనిగాని, ఒత్తి ఆరున్నొక్కటి అనిగాని పలుకుతారంతే! సప్తస్వరాలంటారు, రోదనని ఆరున్నొక్క రాగమనీ అంటారు. ఇందులో మూఢనమ్మకమే లేదు. కాదు రోదన ధ్వని సూచించే మాటే మాకు ముద్దంటే, శుభకార్య సమయంలో రోదన ధ్వని సూచించే మాటే వాడతామంటే కాదనేదేలేదు. శుభం, లోకో భిన్న రుచిః కదా!

7 is a prime number ( Last and biggest single digit prime number)

అసలిలా ఆరున్నొకటి లాటి పూర్వ కవి ప్రయోగాలున్నాయా? ఆధారాలున్నాయా! ఆహా! దివ్యంగా ఉన్నది చిత్తగించండి. పోతనగారి మాట.

ఒంటివాడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
గోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతకసాంద్ర దానవేంద్ర!…భాగ..స్కం..౮…౫౬౬

పై పద్యంలో మాయావటువు బలి చక్రవర్తిని ఒకటి రెండడుగులు దానమిమ్మని అడిగాడు, మూడడుగులనలేదు. ఇలా అడిగితే అది మూడదుగులు అని ఈ పద్యం ద్వారా తేలింది చూడండి.

గొడుగో జన్నిదమో కమండులువొ నాకున్ ముంజియో దండమో
వడుగేనెక్కడ భూము లెక్కడ కరుల్ వామాక్షు లశ్వంబు లె
క్కడ నిత్యోచితకర్మ మెక్కడ మదాంక్షామితం బైన మూ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుట బ్రహ్మాండంబు నా పాలికిన్…..౫౭౧

మయావటువు అలా అన్నాడన్నారు పోతనగారు. పై పద్యములో ఒకటిరెండన్నది ఇక్కడ మూడని స్పష్టం చేసారు. అలాగే ఆరున్నొకటి అన్నది రోదన శబ్దాన్ని వాడకుండడానికి తప్పించి వేరు కాదు.

ఇక పదమూడు అన్నది అప్రాచ్యులు వాడరు, దానిని మన వారు ,మూఢనమ్మకం వారిది అనరు, కాని మన దగ్ధయోగాలు కొద్దిగా ఉన్నవైనా మూఢనమ్మకని మాత్రం ధ్వజమెత్తుతారు, ఎంతైనా మెకాలే పుత్రులు కదా! చదువుకున్నవారాయె! నాకైతే ఈ పదమూడన్నదీ అశుభమే కాదు.

13 is a prime number consisting of two smallest prime numbers.

జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక రూం నంబర్ గురించి.

నలభై ఏళ్ళ కితం మాట, జూనియర్ ఇంజనీర్ గా ఎంపికయ్యా, పోటీ పరిక్షలో. ఎస్.ఎస్.ఎల్.సి మాత్రమే చదువుకున్నాను గనక ఇంజనీరింగ్ కి తగిన అర్హత కోసం పదునాల్గునెలలు ట్రయినింగ్ అవమని జబల్పూర్ పంపించారు. బయలుదేరుతూనే నాతో కూడా ఇద్దరు స్నేహితులున్నారు, సర్వమూ భారం నా మీద వేసి, ఒకరు నాతో నేను బయలుదేరే ఊరునుంచి, మరొకరు విజయవాడ నుంచి.. గంగా కావేరీ అర్ధ రాత్రి ఎక్కి మర్నాడు అర్ధ రాత్రికి జబల్పూర్ లో దిగేం.

మిలిటరీ లో పని చేస్తూ అక్కడున్న బావగారొచ్చి స్వాగతం పలికారు,స్టేషన్లో. అప్పటికి నాతో ఉన్న ఇద్దరితో మరికొంతమంది చేరడంతో మొత్తం ఎనిమిదిమంది అయ్యాం. ఇంటికెళదామంటే, ”మీతో రాలేను, ఉదయమే అందరం తిన్నగా ట్రయినింగ్ సెంటర్ కి వెళ్తాము, వీళ్ళని వదలి రాన”న్నా! ”అందరూ వచ్చేయండి, వేన్ తీసుకొచ్చా, పెద్ద హాల్ ఉన్నది, రాత్రి పడుకోడానికి, ఉదయం నేనే తీసుకెళతాను, మన ఇంటికి ఎదురుగా ట్రయినింగ్ సెంటర్ గేటు”, అంటే అందరం పొలోమని వేన్ ఎక్కేసేం. ఇంటికెళ్ళగానే చెల్లాయి స్వాగతం చెప్పి ఆ రాత్రివేళ టీ ఇచ్చి అందరికి సత్కరించింది. ఉదయం టిఫిన్ చేసిన తరవాత మమ్మల్ని సెంటర్లో మా హాస్టల్ దగ్గర వదిలేసి వెళ్ళేరు, బావగారు.

ఒక రూం కి ముగ్గురు, మూడు రూం లు కావాలి. గ్రవుండ్ ఫ్లోర్లో రెండు రూంలు ఉన్నాయనీ వాటి నెంబర్లు 111, 112 మరో రూం పైన మొదటి అంతస్తులో ఇస్తాననీ చెప్పి చెప్పేడు కేర్ టేకర్. ఛ! రూం నె0బర్ 111 బాగోలేదు వద్దనుకున్నారంతా, 112 తీసుకున్నారు ఒక ముగ్గురు. ”ఏంటో! ఏ బేచ్ వాళ్ళూ 111 రూం నెంబరు వద్దంటున్నారేంటో” అని గొణుక్కునాడు కేర్ టేకర్. ”111 రూం కి తేడా ఏమైనా ఉన్నదా” అడిగాను. ”లేదండీ రూం ఫస్ట్ క్లాస్” అన్నాడు. ”ఐతే ఆ రూం నాకివ్వు” అన్నా. ”ఇస్తాను కాని ఒక మాట, ఆ తరవాతొచ్చి నాకు రూం మార్చు, అంటే మార్చనని” చెప్పేసేడు. ”ఆ రూం లో తలుపులు, వగైరా బాగోకపోయినా, లైట్ ఫేన్ పని చేయకపోయినా రూం మార్చమంటా తప్పించి నెంబర్ కోసం రూం మార్చమనను, సరేనా?” అంటే నాకేసి వింతగా చూసారంతా!

నాకూడా ఉన్న నా స్నేహితుడు సుబ్బు” ఏయ్! అందరూ వద్దనుకున్న 111 రూం మనకి మాత్రం ఎందుకూ” అని గునిసాడు. ”చెబుతానుండు” అని రూం కోసం వివరాలిచ్చి, సంతకం పెట్టేసేను. కొంచం సేపు ఉండండి రూం లు తుడిపించి చెబ్తా అనడం తో అక్కడే కూచున్నాం సామాను మీద. మా సుబ్బు 111 గురించి చెబుతానన్నావు అనడం తో ఒక చిన్న కాగితం తీసుకుని 111 సంఖ్య వేసి చివర ఒకట్లను కిందికి సాగదీసి వాటి చివర్లు అడ్డ గీతతో కలిపి, మధ్య గీతకి కిందుగా అడ్డగీత కింద ఒక చిన్న నిలువు గీత గీసి చూపించి ”ఇదేంటి సుబ్బూ” అడిగా! ”ఎంకన్నబాబూ” అని అరిచాడు. అందరూ ఒక సారి ఉలిక్కి పడ్డారు. ”మనం ఇంజనీర్లం కాబోతున్నాం ఇటువంటి మూఢనమ్మకాలుండకూడదు. ఒక మాట చెప్పండి 111 ప్రైమ్ నంబరా” అడిగా! ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ప్రైమ్ నంబర్ గురించి తెలియదనమాట అనుకుని, ప్రైమ్ నంబరేంటో వివరించా. ఒకడు కొంచం నోరు తెరిచి 111 ప్రైమ్ నంబర్ లాగే కనపడుతోంది అన్నాడు.  ”కాదు బాబూ అలా కనపడుతుందిగాని ఇది ప్రైమ్ నంబర్ కాదు మూడుతో భాగింపబడుతుంది చూడ”న్నా! ”మరెందుకు చెప్పినట్టని” నిలదీసాడు.”111 is not a prime number but consists of smallest and the first prime number” ”ఈ నూట పదకొందు సంఖ్యను, సంఖ్యలో ఉన్న అంకెలమొత్తంతో భాగించు, ఏమొచ్చింది? 37 కదా అది నా లక్కీ నంబరు, ఎందుకంటే నేను చదువు ఆ వయసులో మొదలుపెట్టాను. మరో చిత్రం కూడా చూస్తావా? అలాగే ఒకే అంకెలు గలిగిన మూడు అంకెల సంఖ్యను వాటి అంకెల మొత్తంతో భాగించు 37 మాత్రమే వస్తుంది,చూసుకో” అన్నా! గబగబా కాగితాలుచ్చుకుని సరి చూసుకుని ఏంటిదీ అన్నారు. నవ్వేసి ఊరుకున్నా!

పైనగాని 222 నెంబర్ రూం ఖాళీ ఉందేమో చూడమంటే ఖాళీ లేదన్నాడు కేర్ టేకర్.

If Room number 222 is available I prefer room 222 than 111. The reason is

2 is the smallest even number and the only even number to be a prime number.

ముందు ఆ నెంబర్ కాదనుకున్నవారు తరవాత ఆ నెంబర్ గది వారి చేయి దాటిపోయిందని ఎందుకు బాధపడినట్టు? తెలియనితనం కదూ!

కొసమెరుపు:- సామానుచ్చుకుని మా రూం కి వెళుతున్నాం, వెనకనుంచొకడు ”దొంగముండా కొడుకు మంచి నెంబర్ రూం కొట్టేసేడు” అన్నాడు. మరొకడు ”మనమెవరం వద్దంటే కదా అతను తీసుకున్నాడు, ఇప్పుడు చెప్పేడు, ఆ నెంబరు గురించి, మనకా తెలివి లేకపోయిందని బాధ పడుగాని అతన్ని తిట్టుకుని ఉపయోగమేంటీ?” అన్నాడు. అదిగో అలా ఒక అసూయా సంఘం, ఒక అభిమాన సంఘం ఏర్పడిపోయాయా క్షణంలోనే

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-Room No.111

  1. ఏడడుగులు వేసి ఏడవకండి. ఆరున్నొక్క అడుగులు వేసి చూడండి. అంబరాన్నంటే ఆనందం మీసొంతం. కాని మహాజనులారా, ఆరడుగులు ఒకరితో వేశాం కదా అని ఏడవ అడుగు వేరేవారితో వేస్తే దాన్నే తప్పటడుగు అని కూడా అంటారని గుర్తుంచుకుంటారని విన్నవించుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం!

  2. శర్మ గారు,

    ఇవాళ్టి (17-04-2019) “ఆంధ్రజ్యోతి” (హైదరాబాద్) దినపత్రికలో వచ్చిన “బీఎస్‌ఎన్‌ఎల్‌ దైన్యానికి కారకులెవరు?https://www.andhrajyothy.com/Artical.aspx?SID=768565 అనే వ్యాసంలో బి.ఎస్.ఎన్.ఎల్. కు, లాండ్-లైన్ ఫోన్ వినియోగదారులకు త్వరలో దురవస్ధ పట్టబోయే ప్రమాదం గురించి బాగా చర్చించారు. మీరు విశ్రాంత టెలికామ్ ఇంజనీరు కాబట్టి మీకు తప్పక ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఈ పాటికే మీరు కర్ణాకర్ణిగా వినే ఉంటారు.

    వ్యాసంలోని ఆఖరి పేరాలో సూచించిన భవిష్యత్తు గురించి నాకేమీ సందేహం లేదు. జలగల్లాంటి ప్రైవేట్ వ్యాపారుల (అందులోనూ కార్పొరేట్ల) కబంధహస్తాల్లో టెలికాం వ్యవస్ధ ఇరుక్కుపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. అసలు ప్రభుత్వం వారు ముఖ్యమైన సంస్ధలను కూడా ఎందుకు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అందులోనూ కమ్యూనికేషన్లు అన్నది దేశానికి అత్యవసరమైన బేసిక్ రంగాల్లో ఒకటి …. ఆ కారణంగానే ఆ రంగాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. కాని కమ్యూనికేషన్ వ్యవస్ధను కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఎందుకు చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. బి.ఎస్.ఎన్.ఎల్. లాంటి కమ్యూనికేషన్ మహాసంస్ధ కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందంటే చాలా బాధాకరంగా ఉంది.

    వ్యాసం చదివి మీ అనుభవం దృష్ట్యా మీ అభిప్రాయం మా బోంట్లతో పంచుకోవలసినదిగా మనవి.

    https://www.andhrajyothy.com/artical?SID=768565

    • విన్నకోటవారు,

      గత నెల పైగా బ్లాగులోకి రాలేదు,రావాలనిపించలేదు. మొన్న అనుకోకుండా మీ కామెంట్ చూసి టపా రాశాను. గత నెల పైగా వేడి నలభైకి ఒకటి డిగ్రీ తక్కువలోనే ఉంది ఏరోజూ! ఉదయం సాయంత్రం ఒక గంట చొప్పున బయటికి రాగలుగుతున్నాను.

      నేటి BSNL దుస్థితి గురించి చెప్పుకోవాలంటే దగ్గరగా 30-35 సంవత్సరాల చరిత్ర ఓపిగ్గా చెప్పుకోవాలి. అది కూడా ఒకటి రెండు టపాలలో తేలేది కాదు. అందుకుగాను ఈ విషయంలో తలదూర్చి,అనారోగ్యం పాలు కాదలచుకోలేదు. మీ కోరిక నెరవేర్చలేనందుకు, మన్నించండి.

      ధన్యవాదాలతో

      • బీయెస్సెన్నెల్కరె యే
        మాయెన్ ? బ్యూరోక్రసీ సుమా కారణమౌ!
        మా యందరి బాధ్యతగా
        సాయపు సేవలను మరిచి సర్కారవగాన్!

        జిలేబి

      • ఫరవాలేదు శర్మ గారూ, I understand 🙏.

        ఒక సంస్ధ సుదీర్ఘ చరిత్రలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి … కొన్ని మంచివి, కొన్ని అభివృద్ధి నిరోధకాలు. వాటి ప్రభావం దీర్ఘకాలానికి గానీ బయటపడదు. అవన్నీ మననం చేసుకోవాలంటే పెద్ద ఎక్సర్-సైజే అవుతుంది.

        మన బోంట్లు ఎంత ఏం చర్చించుకున్నా …జరిగేది జరుగుతుంది. చూస్తుండటమే మనం చెయ్యగలిగినది.

      • ఒక సంస్థ సుదీర్ఘపు కథ!
        సకలము తానై నిలిచె వసతిగ జిలేబీ
        టకటక హైటెక్కును చే
        ర్చక, వైటెలిఫెంటుగా నరరె కూలె సుమా!

        జిలేబి

  3. YVR’s అం’తరంగం గారు,
    అవసరం సంఖ్యా శాస్త్రం నేర్పిందండి. చైనీయుల గురించి మంచి సంగతి తెలుసుకున్నాను.
    ధన్యవాదాలు.
    ————————————-
    లలితమ్మాయ్!
    లెక్కలెప్పుడూ బలేగానే ఉంటాయి కదా! లెక్కల్లో మనిషని శ్లేషించావా?
    ధన్యవాదాలు.
    ————————————————-
    జిలేబి
    ఉన్న సంగతి కదా!
    టపా నచ్చుకోలుకు ధన్యవాదాలు.
    రాళ్ళేస్తారా? వామ్మో!
    ధన్యవాదాలు.

  4. గురువుగారూ, సంఖ్యా శాస్త్రం బావుంది. నంబర్ల నమ్మకాలు చైనా వాళ్ళకీ వున్నాయి. చైనా భాషలో 4ని sǐ అని పలుకుతారు. పరలోక పిలుపుకీ అదే శబ్దంట. అందువల్ల వీలైనంత వరకూ 4 మాట రాకుండా చూసుకుంటారు. నాలుగో అంతస్తులో ఇల్లు కానీ, నాలుగో నంబరు ఇల్లు కానీ కొనడానికి ఇష్టపడరు.

    • 4ని “షి”అనీ 7ని “షిచి” అనీ అంటారు. మరణాన్ని కూడా”షి”అంటారు. అందుకే వారి పాతకాలపు అపార్ట్మెంట్ లలో 4తోను7తోను అంతమయ్యే నంబర్లే ఉండవు. ఉదాహరణకు ఫ్లాట్103 తరవాత ఫ్లాట్105 ఉంటుంది

  5. ===

    జ్ఞానార్జన పుట్టుకతో
    నే నరుడా రాదు ! నీవు నేర్వగ నేర్వం
    గా నేర్పుగ మారునయా
    చూనాబట్టీ జిలేబి చువ్వన బోదోయ్ !

    మీరు మహా ఘటికులు. ఏ నెంబరు కైనా లెక్కెట్టేయ గలరు !

    అదిరింది టపా !

    అలా మూఢ నమ్మక మన్నది ఎవరండి మిమ్మల్ని

    పదండి ఓ రాయేసొద్దాం వారి పైన 🙂

    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s