శర్మ కాలక్షేపంకబుర్లు-ఏది మంచిదంటారు?

ఏది మంచిదంటారు?

మొన్ననో తెలిసినవారు పలకరించడానికొచ్చి ”అమ్మాయి ఎమ్.బి.బిఎస్ అయింది, ముందు ఏం చేస్తే బాగుంటుందంటారు?” ప్రశ్నించారు. ”చదువుకోనివాణ్ణి నేనేం చెప్పగలనండీ!” అనేశాను. ”జీవితం చూసినవారు కదా!” జవాబొచ్చింది. అంతకు ముందు నడుస్తున్న విషయం పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా తెలిసిపోయింది. ఇంతలో అక్కడే వుండి మా సంభాషణ వింటున్న మా సత్తిబాబిలా ఆదుకున్నాడు నన్ను.

నేటి రోజులకి సరిపడినవి, అవసరమైనవి, ప్రతిచోట కావలసినవి ఈ వైద్య శాఖలు. 1.కళ్ళ డాక్టరు 2. సుగర్ డాక్టరు 3. సైక్రియాట్రీ అనో మరేదో అంటారట, కాని పల్లెప్రజలు మాత్రం పిచ్చి డాక్టర్ అనే అంటారు. ఈ శాఖల వైద్యులు పల్లెలలో కూడా చాలా అవసరంగానే ఉన్నారు. అమ్మాయిని ఇందులో ఏదో ఒకదాన్లో చదివించి ఆపైన , అమ్మాయి చదువుతున్న శాఖలో అబ్బాయిని చూసి పెళ్ళి చేసేయండి. ఆ తరవాత అబ్బాయి ఊళ్ళోనో, మీ ఊళ్ళోనో ఆసుపత్రి తెరిచేయండి, డబ్బే డబ్బు.

”అంత తేలిగ్గా చెప్పేసేరు, ఇవే ముఖ్యమని ఎలా చెప్పగలరు, ఇవే డబ్బు సంపాదించడానికి మంచివ”నీ ప్రశ్న వచ్చింది.

దానికి మా సత్తిబాబు ”అదా అనుమానం, ఐతే వినండి.”

తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ఎక్కడ చూసినా ఎవరిదగ్గర చూసినా, ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో లేనివారు కనపట్టం లేదు, నెట్ కనక్షన్ లేని ఫోన్ లేదు. ఏ పరిస్థితులలోనూ ఫోన్ వదిలేవారు కనపట్టం లేదు.చిన్న పిల్లలనుంచి ముసలాళ్ళ దాకా అందరూ తలవంచుకుని కూచునేవారే! ఫేసు బుక్కో,బ్లాగులో, ట్విట్టరో మరోటో మరోటో. పక్కన ఆటం బాంబు పడినా తలెత్తే సూచన కనపట్టం లేదు. అంతా యోగుల్లాగా తపస్సు చేసుకుంటున్నట్టుండేవారే! ఇక వీళ్ళలో కళ్ళ జోడు లేకుండా ఉన్నవాళ్ళు బహు తక్కువా! అందరికి కొంచం ఇంచుమించు నేత్రరోగం ఉన్నట్టే! ”ఊరినిండా రోగమైతే డాక్టర్ కి పండగ”ని సామెత కదా! పక్కనే కళ్ళజోళ్ళ షాపూ, మందుల షాపు సరే సరికదా! అంచేత కంటి డాక్టర్ మంచిది.

ఇక ఫోన్ తో పాటు పూరిగుడెసెలో కూడా ఉన్నది తల్లి మాలచ్చి టి.వి. నెలకి రెండొందలనుంచి మూడొందలు ఖర్చు. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్ళీ పక్కమీద పడి కునుకు తీసేదాకా టి.వి వదలిపెట్టిన ఆడకూతురు లేదు, మగాడూ లేడు. మా ముఖ్యమంత్రిగారు ఇరవైనాలుగు గంటలూ కరంటిచ్చేస్తున్నారు. టి.వీ కట్టేసే సావకాసమే లేదు. సీరియలో మరోటో మరోటో తప్పించి ఇహ లోకంలో ఉన్నవారే కరువు, ఇంటికెళ్ళి పిలిస్తే పలికే దిక్కు కనపట్టంలేదు,బెల్లు కొట్టినా చలనం లేదు. ఇక భోజనం చేసేటపుడు కూడా టి.వి చూస్తూనో, ఫోన్ చూస్తూనో తింటున్నారు. ఎంత తింటున్నారో, ఎంత కావాలో తెలియటం లేదు. ఇంటిలో భోజనానికి తోడు బజారు సరుకులూ తింటూనే వున్నారు. కూచున్నచోటనుంచి లేచి కాలు కదిపిన పాపాన పోవటం లేదు.పిల్లలనుంచి పెద్దలదాకా అన్నీ గజం పన్నాలే. నాలుగడుగుల దూరంలో ఉన్న దగ్గరికి కూడా బండి లేక కదిలినవారు లేరు. ఈ ఫోన్, టి.వి ల మూలంగా అతృత పెరిగి చిన్న వయసుకే అందరు విపరీతంగా తింటున్నారు, తెలియకుండానే. ఒళ్ళు పెరిగిపోతోంది, సుగర్ వచ్చేస్తోంది. అసలది ఎందుకొస్తోంది? ఆలోచించినవారు లేరు, ఆహార విహారాలలో మార్పు కావాలని చెప్పేవారు లేరు,చెప్పినా వినేవారూ లేరు. అంతా సుగర్ పేష్ంట్లే! ఫాస్టింగ్ మూడొందల స్కోరు తగ్గినవారు లేరు. కొంత కాలానికి గుండె జబ్బు ప్రవేసిస్తుంది, అది తరవాత మాట. అందుచేత సుగర్ డాక్టర్ కావలసినంత అవసరం. ఇది నిత్యకల్యాణం పచ్చతోరణం. ఇన్ పేషంట్ల బాధ తక్కువ. పక్కనే టెస్టింగ్ లేబ్, ఆ పైన మందులకొట్టూ ఎలాగా ఉండేవే. అంచేత సుగర్ డాక్టర్ చదవడం మేలు. అంతా గలగలే.

ఇక సైక్రియాట్రిస్ట్, వీరి అవసరం నేడు పట్టణాలకంటే పల్లెలలోనే ఎక్కువ కనపడుతోంది. పల్లెలలోనే సెల్ ఫోన్ లూ టి.వీ లు ఎక్కువ కనపడుతున్నాయి. పట్టణాలలోని అన్ని సౌకర్యాలూ నేడు పల్లెలలో కూడా ఉన్నాయి. నెట్టు లేని ఫోన్ లేదు, చిత్తు కాగితాలు ఏరుకునేవారి దగ్గర కూడా ఏండ్రాయిడ్ కనపడుతోంది. నెట్టు చాలా చవకా ఐపోయింది. భోజనమైనా మానేస్తాంగాని నెట్టు మానెయ్యలేమంటున్నారు, అందరూ. ఇక నెట్టులో రకరకాలు, ఉద్వేగాలు,మోసాలు, ద్రోహాలు. సమాజంలో ఉన్నదంతా ఇందులోనే ఉంది, ప్రస్తుతం సమాజం వేరుగా లేదనిపిస్తూంది. మనుషులు కనపడకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఆ తరవాత మనుషులు కనపడీ, ఆ మత్తులో జరగ కూడనివే జరిగీ పోతున్నాయి, చేతులు కాలేకా ఆకులూ పట్టుకుంటున్నారు. దీనిలోంచి బయటపడలేక పిచ్చి పిచ్చిగా మాటాడేవారు, పిచ్చి పిచ్చి పనులు చేసేవారు పెరిగిపోయారు. ఇదంతా డోపమైన్ పరిమాణం సరిగా పెరగక, ఆశించినంత దొరకక,పడే బాధ. అంతా ఆనందం వెతుక్కునేవారే. తాత్కాలిక డోపమైన్ పరిమాణం పెంచుకోడానికి ప్రయత్నాలే, లైకులు, ఇతర రూపాలలో. ”ఆనందో బ్రహ్మ”, అంటే ఆనందమే దేవుడని అర్ధం. మరి ఈ దేవుణ్ణి ఆనందంలో వెతుక్కునేవారంతా శాశ్వత డోపమైన్ పరిమాణం పెరిగే పనులు మాత్రం చేయటం లేదు.

అంచేత ఈ సైకియాట్రీ కూడా చాలా బాగా ఉంది. దీనికీ ఇన్ పేషంట్ల సమస్య తక్కువ.

ముగించేస్తునా! మొదటిదానికి కొంచం పెట్టుబడి,బిల్డింగూ కావాలి, చాలా పరికరాలూ కావాలి, అందరికి సాధ్యం కాదు. ఇక రెండు మూడిటికి కొన్ని గదులు చాలు. వైద్యానికి తోడు, టెస్టింగ్ లేబ్, మెడికల్ షాప్ పెట్టుకుంటే ఆదాయం పులగం మీద పప్పే అని ముగించాడు.

వచ్చినాయన లేస్తూ నిజమేనండి, మీరు చెప్పినది, అన్నీ ఆలోచించే అమ్మాయిని సుగర్ డాక్టర్ గా చేస్తున్నాము, అంటూ శలవని వెళ్ళిపోయారు.

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏది మంచిదంటారు?

 1. కొడుకు చిన్నపిల్లల వైద్యుడు. ఇక ప్రసూతి డాక్టరైన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే …. ఇదే చోటున ఖడేరావుగా సదా నిలువవే ధనలక్ష్మీ 🤑. ఇటువంటి ఫార్ములానే కూతురుకి కూడా.

  • విన్నకోట నరసింహారావుగారు,

   పాయింటేగానండి, ఓ చిన్న చిక్కండి. ఓ మొగుడూ పెళ్ళాం ఓ బ్రాంచ్ ఐతే చక్కహా ముచ్చట్లాడుకుంటూ ఆడుతుపాడుతు పని చేస్తుంటే! అదండి సంగతి. కలాపోసన కూడా సరిపోద్దండి. ఒహళ్ళు రాలేకపోయినా మరోళ్ళు సద్దేసుకోచ్చండి. అబ్బో ఆ డాట్రు జంట ఆహా అని ఫ్రీ పబ్లిసిటీ కదండీ
   ధన్యవాదాలు.

 2. లలితమ్మాయ్!

  కొడుకునో బ్రాంచ్ లోనూ కూతుర్నో బ్రాంచ్ లోనూ సద్దేస్తే, ఇంక చెప్పేవా తల్లీ, చిన్న తల్లి నీ ఇంటి దగ్గరే 🙂
  సరదాగా ఏమనుకోకూ

  ధన్యవాదాలు.
  —————————————————————————
  జిలేబి,

  ప్రజలనిలా బతకనివ్వ కూడదనే మీ నిర్ణయం! 🙂

  ధన్యవాదాలు.
  ————————————————————————-
  వనజగారు,

  నిజమే గజం పన్నాలని చూస్తే భయమే వేస్తోంది.

  ధన్యవాదాలు.
  ————————————————————————————-
  అన్యగామి గారు,

  జరుక్ శాస్త్రి గారంటే పేరడీ కింగ్ కదా! అందులో శ్రీపాదవారికి రాసే ఉత్తరమాయే! ఇంక చెప్పేరూ….. ఆనందమానందమాయెనే
  అన్యగామిగారు,
  మరచాను జరుక్ శాస్త్రిగారి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అండి చెప్పడం మరచాను.

  ధన్యవాదాలు.

 3. గురువు గారు, జలసూత్రం రుక్మిణిశాస్త్రిగారు శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారికి వ్రాసిన ఒక ఉత్తరంలో తన అభిమానాన్ని చాటుకొనే ప్రయత్నంలో “గట్టిగా కౌగలించుకొని..” అని ఒక వాక్యం వ్రాసారు. అల్లాగా మీమదిలోంచి బ్లాగులోకి వచ్చిన ప్రతి విషయం నాకు అద్భుతంగా తోస్తుంది. పైన చెప్పిన వాక్యం కాస్త అతిగా అనిపిస్తే క్షమించండి. టపా చాల బావుంది.

 4. **

  అవుతా నేనే డాక్టరు
  నవుతా డబ్బులు గలగలలాడ జిలేబీ
  నవుతా! షుగరూ బీపీ
  చవుకగ వచ్చెడు బతుకున, చకచక ₹పయా 🙂

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s