శర్మ కాలక్షేపంకబుర్లు- ఉపమా

ఉపమా

ఉపమా కాళిదాసస్య….కాళిదాసుగారికి ఉపమా అంటే ఇష్టమట.

కాలం గడిచింది.  కాళిదాసంతవాడు శ్రీనాథుడు,తెనుగునాట  మరీయన గ్రామీణవంటలు,పిండివంటలు,ఆటలగురించి క్రీడాభిరామమనే పుస్తకమే రాసేసారట. అందులో ఉపమా ఉండకపోతుందా అని నా సంశయం. ఆ తరవాత కాలంలో చెప్పుకోవలసినవారు కందుకూరి, గురజాడేగా, వారు కన్యాశుల్కంలో, ఉపమా గురించి చెప్పేరో లేదోగాని,  ముదిమి పెళ్ళికి ఏనుగులు,గుఱ్ఱాలు, లొట్టి పిట్టల వైనం చెప్పినట్టే ఉంది. ఉపమా గురించి లేదనుకుంటా. ఎంతైనా రాజసం వెళ్ళబోసినవారు కదా అందుకే గుఱ్ఱాలు,ఏనుగులు,లొట్టిపిట్టలు గుర్తొచ్చి ఉంటాయి. ఇక పల్లెటూరి కవి కాళ్ళకూరి నారాయణరావు గారు వరవిక్రయం నాటికలో, తనకొడుకుతో కాళింది పెళ్ళికి సింగరాజు లింగరాజు గారు రాయించిన వివాహ అగ్రిమెంట్లో, ఈ ఉపమా వైనం, వైనంగా జీడిపప్పుతో సహా అని ఉన్నట్టే ఉంది.

వీరిని గ్రామీణకవి అన్నారేం అంటారా? అయ్యో! వీరిది పగోజిలోని ఒకపల్లేటూరు,పుట్టిన ఊరు. అది మొగల్తూరుకు దగ్గరలో ఉన్న ”కొప్పఱ్ఱు” గ్రామం, వారి ఇంటిని దర్శించే భాగ్యం నాకు కలిగింది కూడా. దీనికేంగాని గౌరావఝుల సోదరులు,ఏంటో ఇంటిపేర్లే తప్పులతడకలైపోతున్నాయి,నేడు. అది గౌరావఝులకాదండీ! గౌరవ వఝుల సర్లెండి ఏదో వఝులగాని వీరేమన్నారుషా!

త్రికాల మేకకాలం వా జపేద్విఛ్ఛాన్ సునిశ్చలః
పీత్వాపీత్వా పునఃపీత్వా స్వర్గలోక మవాప్నుయాత్
కాఫీతీర్థ సమంతీర్థం ప్రసాదముపమా సమం
అయ్యర్ సదృశ దేవేశో నభూతో నభవిష్యతి!

వీరు కాఫీని వేంకటేశుని తీర్థంతోనూ, ఉపమాని ప్రసాదంతోనూ, అయ్యర్ ని వేంకటేశునితోను ఉపమా చేసేశారు. పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువుకు దేశం మీదబడ్డ అయ్యర్ ని వేంకటేశునితో సమం చేసేరు. అదండి తెనుగువారి గొప్ప. పరాయివారి గొప్పదనాన్ని గుర్తిస్తాం తప్పించి మన సాటి తెనుగువాని గొప్ప ఛస్తే గుర్తించంగాక గుర్తించం…అంతే…అదంతే

అది సరేగాని అయ్యర్ చేసే ఉపమాకి ఎందుకంత రుచీ? ఇదీ అసలు కొచ్చను. రుచి వస్తువులతోనే రాదు,ఏదెంత మోతాడులో వేయాలో,ఎలా చేయాలో తెలిసినప్పుడే దానికి రుచి.అదే అయ్యర్ చేతి మేజిక్

ఉపమా చెయ్యడానికి కావలసిన సరుకులేంటీ? ఉపమా నూక, దీనినే కరాచీ అనేవారు చాలాకాలం. ఒకప్పుడు కరాచీ మనదే. మొన్న మిత్రుల మధ్య చర్చలో ఒక మిత్రుడు ”కాశ్మీర్ లో స్థలం కొని ఇల్లు కట్టాలని ఉంద”న్నాడు. దానికి మరో మిత్రుడు ”ఆగు కంగారు పడకు మరో రెండేళ్ళలో కరాచీ లోనో, లాహోర్ లోనే ఇల్లు కట్టుకుందువుగాని” అన్నాడు. అంతెందుకు కాంధహార్ మనదే, అదే శకుని ఊరు. మొన్నటి వరకు బంగ్లా మనదేగా! మరచాను ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్న బర్మా మనదేశంలో భాగమే! సుదూరంగా కనపడే ఆస్ట్రేలియా కూడా మనదేనండోయ్! దీన్ని సువర్ణ ద్వీపం అనేవారట… నేడు ఇంటికొకరు అమెరికాలో ఉన్నట్టు నాడు విశాఖ చుట్టు పక్కల జిల్లాలనుంచి ఇంటికొకరు రంగంలో ఉండేవారు, ఆ రంగమే రంగూన్. ”రంగమెల్లిపోదామే నారాయణమ్మ” జానపద గీతం. ఇలా ఎంత జానపద సాహిత్యం మరుగున పడిందో. బర్మా టేకు కి ప్రసిద్ధి, మంచి కలప వ్యాపారమూ జరిగేది.రేషన్ షాపుల్లో బర్మా బియ్యం ఇచ్చేవారు. డేరా మేకుల్లా ఉంటుంది అన్నం అనుకునేవారు. కాలే కడుపుకు మండే బూడిద, ఆరోజుల్లో అదీ గతి లేదు, ఇక్కడ.

Courtesy:Whats App

దానికేంగాని.
అయ్యరు చేసే ఉపమా విధానంబెట్టిదనగా……

ఉప్మా నూక అదే కరాచీ
జీడిపప్పు.
నెయ్యి
నూనె.
శనగపప్పు.
మినపపప్పు.
ఆవాలు.
జీలకఱ్ఱ
కరివేపాకు.

అల్లం

. టమాటా ఇష్టాన్ని బట్టి.
పచ్చి మిర్చి (బజ్జీ మిర్చి)
పాలు.
ఉప్పు.
చిన్నబెల్లం ముక్క.
చిటికెడు పసుపు.

ఉపమా నూక జల్లించండి. జీడి పప్పును చిన్నచిన్న ముక్కలుగా తుంచండి. కరివేపాకును దూసి కడిగి సిద్ధం చేసుకోండి. టమాటాలని చిన్నముక్కలుగా తరుక్కోండి. పచ్చి మిర్చిని నిలువుగా నాలుగు భాగాలు చేయండి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి.

లోతైన మూకుడు తీసుకోండి. ఖాళీ మూకుడు శుభ్రం చేసి స్టవ్ మీద కాలెయ్యండి. వేడేక్కిన మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగినదానితో మూకుణ్ణి తిప్పండి, మూకుడు నిండా అంటుకునేలాగా. ఇప్పుడు నూకని మూకుడులో పోసి దోరగా వేయించండి. తీసుకుని పక్కన పెట్టండి. జీడిపప్పు కూడా కొద్దిగా నెయ్యివేసి వేయించుకుని పక్కన పెట్టండి.

ఇప్పుడు నూనె కొంచం ఎక్కువ వేసి కాగనివ్వండి.  ముందుగా
శనగపప్పు, ఆ తరవాత మినపపప్పు వేయండి. కొద్దిగా వేగేక పచ్చి మిర్చి, అల్లం ముక్కలు వేయండి. ఆ తరవాత ఆవాలు,జీలకఱ్ఱ,కరివేపాకు,జీడి పప్పు పలుకులు, టమాటా చేర్చండి. ఆవాలు చిటపటలాడతాయి, కొంచం దూరంగా నిలబడండి, పొయ్యికి,అయ్యో! ఇదీ చెప్పాలమ్మా ఈ కాలం పిల్లలికీ ..కమ్మని వాసనొస్తుంది.రెండు గ్లాసుల నూకకి 3 గ్లాసుల నీళ్ళు పోయండి, వేగిన పోపులో. తగిన ఉప్పేసి కలపండి. బుల్లిగ్లాసుడు పాలు పోయండి. చిన్న బెల్లం ముక్క,చిటికెడు పసుపు వేయండీ!  ఎసరు కాగనివ్వండి ఆవిర్లొచ్చేదాకా.. నూక ఒక చేతులో అట్లకాడ మరో చేతిలో తీసుకోండీ. అవిర్లొస్తున్న నీటిలో నూక సన్నగా పోయండి, మరో చేతిలో ఉన్న అట్లకాడ తో కదుపుతూ.సరిగాకలియబెట్టకపోతే నూక ఉండకట్టేస్తుంది. ఉప్మా బాగోదు. నూకపోసేసి ఉండకట్టకుండా కలియబెట్టిన తరవాత, కొద్ది సేపు వదిలెయ్యండి. ఉపమా నీరు ఇగిరిపోయి గట్టి పడుతూ ఉంటుంది.

ఇప్పుడు నెయ్యి వెయ్యండి. మరికొంచం నెయ్యి పడనివ్వండి, అలాగని పోసెయ్యకండి. అయ్యరు నెయ్యి వెయ్యడు డాల్డా వాడుతాడు. మూతపెట్టండి, స్టవ్ ఆర్పేయండి. కొద్ది సేపు తరవాత ఉపమాని అట్లకాడతో తీసుకుని అరటాకు మీద వేసుకుంటే జారిపోతూ ఉంటుంది. దీనికి జోడీగా కొబ్బరి పచ్చడిగాని, గుల్ల శనగపప్పు పచ్చడి కాని తోడివ్వండి. నోట పెడితే ఆహా ఏమి రుచి అనరా మైమరచి… అదండి ఉపమా గొప్ప… చేసుకుతినండి…నాకు చెప్పద్దు..ఎలా ఉన్నదిన్నూ….

శర్మ కాలక్షేపంకబుర్లు-బొంగు భుజాన వైచికొని పోయెద

బొంగు భుజాన వైచికొని పోయెద

   తెనుగునాట తిరుపతి వేంకట కవులను తెలియనివారుండరని నమ్మకం. ”తెలుసు” అన్నవారికి రెండు దణ్ణాలు, తెలియదన్నవారికొక దణ్ణం, అలా ముందుకుపోదాం! ఈ కవుల గురించి చిరు పరిచయ ప్రయత్నం, మన్నించండి.

ఈ తిరుపతి వేంకట కవులన్నవారు ఇద్దరు. ఒకరు దివాకర్ల తిరుపతి శాస్త్రి, మరొకరు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి. ఇద్దరిది ఒక వూరుకాదు,బంధువులూ కారు. సహాద్యాయులు అనగా క్లాస్ మేట్స్, ఎక్కడా గురువుగారు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి దగ్గర. ఇద్దరికి మధ్య దశాబ్దం వయసు తేడా. అదేగాక ఒకరు పరమ సాత్వికులు మరొకరు…బుసకొట్టే….ఇక  కవిత్వం ఎలాచెప్పేరయ్యా ఇటువంటి ఇద్దరూ అంటే ”ఒక పద్యపాదం అతను చెబితే మరొకటి నేను చెప్పేవాడినన్నారు”, వేంకట శాస్త్రిగారు. ఇదీ అసలు విచిత్రం.

వీరి రోజుల్లో తెనుగునాట సంస్థానాలు ఉన్నాయి. రాజుల పరిపాలన అంతంత మాత్రంగా ఉన్నా, భాషను రాజులే పోషించారు. వీరిద్దరు కలిసి అష్టావధానం,శతావధానం చేసిన వారు. తమ పాండిత్యాన్ని లోకానికి తెలియజేయడం కోసం, సత్కారాల కోసం, వీరు రాజాస్థానల చుట్టూ తిరుగుతుండేవారు. అలా వివిధ ఆస్థానాలలో తిరిగినప్పుడు కలిగిన అనుభవాలను ”నానా రాజ సందర్శనం” అని పుస్తకం రాసేసారు. అదొగో అలా రాసిన పుస్తకాన్ని ఈ మధ్య శ్రీ రామక పాండురంగ శర్మగారు నెట్లో పెట్టేరు మిగతా కొన్ని పుస్తకాలతో,

 http://www.teluguthesis.com/2017/07/tirupathi-venkata-kavula-rachanalu.html

అందులో ఒక అనుభవం గురించి రాసిన విషయం అవధరించండి.

విశాఖపట్నం సంస్థానం, అధిపతి గోడె గజపతిరావు గారు. తిరుపతి వేంకటకవులు ఈ సంస్థానానికి వెళ్ళి దర్శనం కోసం అర్జీ పంపుకున్నారు. ప్రభువు అర్జీ చూడటం జరిగింది గాని అనుము,మినుము చెప్పలేదు. అంటే అవుననిగాని కాదనిగాని చెప్పలేదు. అసలిటువంటి అర్జీ కి సమాధానం చెప్పాలంటే ప్రభువుకు కూడా తెనుగు పూర్తిగా తెలిసి ఉండాలి. రసాస్వాదన చేయగలిగి ఉండాలి. కొద్దో గొప్పో కవులకు సత్కారమూ చెయ్యాలి. తమ దగ్గర ఉన్న కవులను వీరితో పోటీకీ దింపాలి, ఇది కవిత్వ పోటీగాని కుస్తీపోటీ కాదు, సభ చేయాలి, కవిత్వాన్ని సవాలూ చేయాలి, సమయస్ఫూర్తితో చెప్పిన దాన్ని ఆస్వాదించి ఆనందించాలి, దీనంతటికి సమయం కావాలి, మందికావాలి, సరే చిన్న తల్లి ముందు కావాలి. అందుకే ఈ ప్రభువు అనుము మినుము చెప్పక  వూరకుండి ఉంటారు. కవులేమో విశాఖలో ఉండిపోయారు. వచ్చిన తరవాత దర్శనం చేసుకోక వెళ్ళకూడదు, ఇది సంప్రదాయమూ కాదు. ఎలా? ప్రభువు నుంచి కబురుకోసం ఎదురుచూచి విసిగిపోయారు. మరోమారు అర్జీ పెట్టుకుందామని చింతించి, అర్జీని పద్య రూపంలో ఇలా రాసారు.

ఉ// సంగరశక్తి లేదు వ్యవసాయము సేయుట సున్న సంతలో

నంగడి వేసి యమ్ము టది యంతకు మున్నె హుళక్కి, ముష్టికిన్

బొంగు భుజాన వైచికొని పోయెద మెక్కడికేని ముష్టి చెం

బుం గొనిపెట్టు మొక్కటి యమోఘ మిదే కద! దంతిరాణృపా !

అర్ధం ఏంటీ? ”సేనలో చేరి యుద్దం చేయగల శక్తి లేదు, వ్యవసాయం చేయడం చేతకాదు, వర్తకం చేదామంటే మొదలే తెలియనిది.ముష్టి ఎత్తుకోడం తెలుసు. ఒక్క ముష్టి చెంబు కొనిపెట్టు, ఇంతకు మించి ఘనంగా ఏం చెయ్యద్దు, అదే గొప్ప, గజపతి రాజా” అన్నది.

ఈ అర్జీని అధికార్లు చూసారు, ప్రభువు దగ్గరకీ చేరిపోయింది. ఈ అర్జీ చూసిన ప్రభువుకి కోపం రాలేదు, కంగారు పడిపోయాడు, ఏం? ఎందుకూ… అదికదా కవుల గొప్పతనం. అర్ధమేంటో వివరంగా చూదాం.

ప్రభువు పేరు గజపతి దాన్ని ఎలా తర్జుమాచేసారు? దంతి, దంతావళము అంటే ఏనుగు అనగా గజము, ఏనుక్కి ఇలా పర్యాయపదాలు ఎనభై ఒక్కటి ఉన్నాయట, అదీ తెనుగు భాష గొప్ప.. రాణ్ అనగా పతి, ప్రభువు, సరే గజపతి అయిందిగా మళ్ళీ నృపా ఎందుకూ? అదేకదా గిల్లి జోలపాడటమంటే. నృపా అంటే రాజా అని అర్ధం మొత్తానికేమయింది?. దంతిరాణృపా అంటే గజపతిరాజా అని అర్ధం. సరే ముందుకెళదాం, అర్జీలో విశేషం చూదాం!

గజపతి రాజా! ”సంగరశక్తి లేదు”, అంటే మరొకరిని అణచేసి నంపాదించే శక్తి లేదు, ”వ్యవసాయము సేయుట సున్న”   కవితావ్యవసాయం చెయ్యడం అలవాటయి, అసలు వ్యవసాయం వెనకబట్టింది. ఇక, ”సంతలో నంగడి వైచి యమ్ముటది ముందె హుళక్కి”, వ్యాపారం చేయడం అన్నది ఒక కళ, అది అందరికి పట్టుబడదు.మాకంటావా ఏకోశానా వ్యాపార లక్షణమే లేదు. మరేం చేతనవునయ్యా అంటే! బొంగు భుజాన వేసుకుని ముష్టి ఎత్తుకోడం తెలుసు. బొంగు భుజాన వేసుకోవడం అంటే?

మామూలు కంటే ఎక్కువ లావున్నబోలు వెదురు కర్రని ”బొంగు” అనిగాని, వెదురు బొంగు అని కాని అనడం అలవాటు. ముష్టి ఎత్తుకోవడానికి చాలా మార్గాలున్నాయి. భారత దేశం అంటేనే వైవిధ్యం. ఇందులో కాశీ కావడితో ముష్టి ఎత్తుకోవడం ఒక అలవాటు, ఒక పద్ధతి. కాశీ కావడి తెలుసా? చెబుతా.  లావుపాటి వెదురు బొంగుకు  చివరలలో చిల్లులేస్తారు. అందులోంచి ఇత్తడి గొలుసులు వేలాడదీస్తారు, పైన శీల వేస్తారు. కిందకి వేలాడుతున్న గొలుసుల్ని”చేర్లు” అంటారు. వీటికి ఇత్తడి బిందె కింద భాగంలో ఉండేలాటి వాటిని అమరుస్తారు. ఇక ఈ కావడికి పసుపు బట్టకడతారు, కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవిని బట్టపై చిత్రించి వేలాడదీస్తారు. ఆపైన ఇలా ముష్టికి వచ్చేవారు కాషాయం ధరించి ముఖాన భస్మం ధరించి ఉంటారు. ఓ వీధిలో వారు చేరితే కాశీ విశ్వేసుని గురించి ప్రయాణం గురించి కథ చెబుతూ ”భవతి బిక్షాం దేహి” అంటారు అనగా ”బిచ్చం వెయ్యి తల్లీ” అని తెలుగులో అర్ధం. ఒక చెంబుతీసుకుని ఇంటింటికి వెళతారు. ఇది కంచు చెంబు పెద్దదిగా అనగా శేరు బియ్యం దాకా పట్టేదిగా ఉంటుంది. మరి కావడెందుకూ? కాశీ విశ్వేసుని పటం వేలగట్టడానికి, చెంబుతో కంటే ఎక్కువొచ్చిన బియ్యం తదితరాలని దాచుకోడానికి.

ప్రస్థుతానికొస్తే ఈ జంట కవులు కాశీవాసం చెసి వస్తూ కాశీకావడి తెచ్చుకున్నవారే! అప్పటికే బొంగు భుజాన వేసుకున్నవారే,  ఇది అందరికి తెలిసిన విషయమే! అందుకుగాను వీరు కాశీకావడి ఉన్నదిగాని ముష్టి చెంబు లేదు, అది కొనిపెట్టు, ఇంతకు మించి ఘనంగా చెయ్యద్దులే సన్మానం, అది కొనిపెడితేనే ఘనం.  నీవిచ్చే ముష్టిచెంబు పుచ్చుకుని మా దగ్గర కాశీ కావడితో ఎక్కడేనా అడుక్కుంటాం! మమ్మల్ని ఇక్కడినుంచిపోనీ!  కవులు పెట్టుకున్న అర్జీ అంతరార్ధం.

బొంగు భుజాన వైచికొని పోయద మెక్కడికేని అంటే కాశీకావడి( వెదురు బొంగుతో తయారు చేసినదానిని) భుజం మీదకి ఎత్తుకుని అడుక్కుంటూ పోతామన్నది అర్ధం.

  రాజుగారెందుకు కంగారు పడినట్టూ అదికదా అసలు మాట.  రాజుగారు మాటాడక ఊరుకుంటే చాలాకాలం సభ చెస్తానని ఊరించి అనుమూ,మినుమూ చెప్పక సంస్థానం నుచి తరిమేసాడనచ్చు. కవులు అడిగినట్టే ముష్టి చెంబు కొనిపెడితే ?ఈ కవులా సంస్థానా ల వెంట తిరిగేవాళ్ళు. మరో సంస్థానంలో విశాఖలో ఏమిచ్చారని ఎవరేనా కొంటె కోణంగి అడగకా  పోడు, వీరు దాని మీద చిలవలు పలవలుగా పద్యాలల్లి ముష్టి చెంబు చూపించాగలరు, అప్రతిష్ట కదా! అందుచేత సభ చేసి తీరాలి, తప్పదు. అదీ రాజుగారికి కలిగిన ఇరకాటం. కవయః నిరంకుశః అంటే ఇదే! ఆ తరవాతే జరిగిందీ వేరే చెప్పాలా?

నాటి రాజుగారూ లేరు, కవులూ లేరు అంతా కాలగతిలో కలసిపోయారు, కాని అక్షరం నిలబడిపోయి చరిత్ర చెబుతోంది, అదికదా అక్షరం గొప్ప. న+క్షరం అనగా నాశము కానిది.

అదీ బొంగు భుజాన వేసుకుపోవడం కత.

 

నామాటః  ఈ బ్లాగులో టపాలు రాయడం మానేసి చాలా కాలమే అయింది.  బ్లాగులో ఇప్పటికి 1115 వెయ్యిన్నూట పదేను టపాలున్నాయి. ఈ టపాతో 1116 వెయ్యిన్నూటపదార్లు. నేటితో ఈ బ్లాగుకు ఎనిమిదేళ్ళు నిండినవి.

స్వస్తి.