శర్మ కాలక్షేపంకబుర్లు- ఉపమా

ఉపమా

ఉపమా కాళిదాసస్య….కాళిదాసుగారికి ఉపమా అంటే ఇష్టమట.

కాలం గడిచింది.  కాళిదాసంతవాడు శ్రీనాథుడు,తెనుగునాట  మరీయన గ్రామీణవంటలు,పిండివంటలు,ఆటలగురించి క్రీడాభిరామమనే పుస్తకమే రాసేసారట. అందులో ఉపమా ఉండకపోతుందా అని నా సంశయం. ఆ తరవాత కాలంలో చెప్పుకోవలసినవారు కందుకూరి, గురజాడేగా, వారు కన్యాశుల్కంలో, ఉపమా గురించి చెప్పేరో లేదోగాని,  ముదిమి పెళ్ళికి ఏనుగులు,గుఱ్ఱాలు, లొట్టి పిట్టల వైనం చెప్పినట్టే ఉంది. ఉపమా గురించి లేదనుకుంటా. ఎంతైనా రాజసం వెళ్ళబోసినవారు కదా అందుకే గుఱ్ఱాలు,ఏనుగులు,లొట్టిపిట్టలు గుర్తొచ్చి ఉంటాయి. ఇక పల్లెటూరి కవి కాళ్ళకూరి నారాయణరావు గారు వరవిక్రయం నాటికలో, తనకొడుకుతో కాళింది పెళ్ళికి సింగరాజు లింగరాజు గారు రాయించిన వివాహ అగ్రిమెంట్లో, ఈ ఉపమా వైనం, వైనంగా జీడిపప్పుతో సహా అని ఉన్నట్టే ఉంది.

వీరిని గ్రామీణకవి అన్నారేం అంటారా? అయ్యో! వీరిది పగోజిలోని ఒకపల్లేటూరు,పుట్టిన ఊరు. అది మొగల్తూరుకు దగ్గరలో ఉన్న ”కొప్పఱ్ఱు” గ్రామం, వారి ఇంటిని దర్శించే భాగ్యం నాకు కలిగింది కూడా. దీనికేంగాని గౌరావఝుల సోదరులు,ఏంటో ఇంటిపేర్లే తప్పులతడకలైపోతున్నాయి,నేడు. అది గౌరావఝులకాదండీ! గౌరవ వఝుల సర్లెండి ఏదో వఝులగాని వీరేమన్నారుషా!

త్రికాల మేకకాలం వా జపేద్విఛ్ఛాన్ సునిశ్చలః
పీత్వాపీత్వా పునఃపీత్వా స్వర్గలోక మవాప్నుయాత్
కాఫీతీర్థ సమంతీర్థం ప్రసాదముపమా సమం
అయ్యర్ సదృశ దేవేశో నభూతో నభవిష్యతి!

వీరు కాఫీని వేంకటేశుని తీర్థంతోనూ, ఉపమాని ప్రసాదంతోనూ, అయ్యర్ ని వేంకటేశునితోను ఉపమా చేసేశారు. పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువుకు దేశం మీదబడ్డ అయ్యర్ ని వేంకటేశునితో సమం చేసేరు. అదండి తెనుగువారి గొప్ప. పరాయివారి గొప్పదనాన్ని గుర్తిస్తాం తప్పించి మన సాటి తెనుగువాని గొప్ప ఛస్తే గుర్తించంగాక గుర్తించం…అంతే…అదంతే

అది సరేగాని అయ్యర్ చేసే ఉపమాకి ఎందుకంత రుచీ? ఇదీ అసలు కొచ్చను. రుచి వస్తువులతోనే రాదు,ఏదెంత మోతాడులో వేయాలో,ఎలా చేయాలో తెలిసినప్పుడే దానికి రుచి.అదే అయ్యర్ చేతి మేజిక్

ఉపమా చెయ్యడానికి కావలసిన సరుకులేంటీ? ఉపమా నూక, దీనినే కరాచీ అనేవారు చాలాకాలం. ఒకప్పుడు కరాచీ మనదే. మొన్న మిత్రుల మధ్య చర్చలో ఒక మిత్రుడు ”కాశ్మీర్ లో స్థలం కొని ఇల్లు కట్టాలని ఉంద”న్నాడు. దానికి మరో మిత్రుడు ”ఆగు కంగారు పడకు మరో రెండేళ్ళలో కరాచీ లోనో, లాహోర్ లోనే ఇల్లు కట్టుకుందువుగాని” అన్నాడు. అంతెందుకు కాంధహార్ మనదే, అదే శకుని ఊరు. మొన్నటి వరకు బంగ్లా మనదేగా! మరచాను ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్న బర్మా మనదేశంలో భాగమే! సుదూరంగా కనపడే ఆస్ట్రేలియా కూడా మనదేనండోయ్! దీన్ని సువర్ణ ద్వీపం అనేవారట… నేడు ఇంటికొకరు అమెరికాలో ఉన్నట్టు నాడు విశాఖ చుట్టు పక్కల జిల్లాలనుంచి ఇంటికొకరు రంగంలో ఉండేవారు, ఆ రంగమే రంగూన్. ”రంగమెల్లిపోదామే నారాయణమ్మ” జానపద గీతం. ఇలా ఎంత జానపద సాహిత్యం మరుగున పడిందో. బర్మా టేకు కి ప్రసిద్ధి, మంచి కలప వ్యాపారమూ జరిగేది.రేషన్ షాపుల్లో బర్మా బియ్యం ఇచ్చేవారు. డేరా మేకుల్లా ఉంటుంది అన్నం అనుకునేవారు. కాలే కడుపుకు మండే బూడిద, ఆరోజుల్లో అదీ గతి లేదు, ఇక్కడ.

Courtesy:Whats App

దానికేంగాని.
అయ్యరు చేసే ఉపమా విధానంబెట్టిదనగా……

ఉప్మా నూక అదే కరాచీ
జీడిపప్పు.
నెయ్యి
నూనె.
శనగపప్పు.
మినపపప్పు.
ఆవాలు.
జీలకఱ్ఱ
కరివేపాకు.

అల్లం

. టమాటా ఇష్టాన్ని బట్టి.
పచ్చి మిర్చి (బజ్జీ మిర్చి)
పాలు.
ఉప్పు.
చిన్నబెల్లం ముక్క.
చిటికెడు పసుపు.

ఉపమా నూక జల్లించండి. జీడి పప్పును చిన్నచిన్న ముక్కలుగా తుంచండి. కరివేపాకును దూసి కడిగి సిద్ధం చేసుకోండి. టమాటాలని చిన్నముక్కలుగా తరుక్కోండి. పచ్చి మిర్చిని నిలువుగా నాలుగు భాగాలు చేయండి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి.

లోతైన మూకుడు తీసుకోండి. ఖాళీ మూకుడు శుభ్రం చేసి స్టవ్ మీద కాలెయ్యండి. వేడేక్కిన మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగినదానితో మూకుణ్ణి తిప్పండి, మూకుడు నిండా అంటుకునేలాగా. ఇప్పుడు నూకని మూకుడులో పోసి దోరగా వేయించండి. తీసుకుని పక్కన పెట్టండి. జీడిపప్పు కూడా కొద్దిగా నెయ్యివేసి వేయించుకుని పక్కన పెట్టండి.

ఇప్పుడు నూనె కొంచం ఎక్కువ వేసి కాగనివ్వండి.  ముందుగా
శనగపప్పు, ఆ తరవాత మినపపప్పు వేయండి. కొద్దిగా వేగేక పచ్చి మిర్చి, అల్లం ముక్కలు వేయండి. ఆ తరవాత ఆవాలు,జీలకఱ్ఱ,కరివేపాకు,జీడి పప్పు పలుకులు, టమాటా చేర్చండి. ఆవాలు చిటపటలాడతాయి, కొంచం దూరంగా నిలబడండి, పొయ్యికి,అయ్యో! ఇదీ చెప్పాలమ్మా ఈ కాలం పిల్లలికీ ..కమ్మని వాసనొస్తుంది.రెండు గ్లాసుల నూకకి 3 గ్లాసుల నీళ్ళు పోయండి, వేగిన పోపులో. తగిన ఉప్పేసి కలపండి. బుల్లిగ్లాసుడు పాలు పోయండి. చిన్న బెల్లం ముక్క,చిటికెడు పసుపు వేయండీ!  ఎసరు కాగనివ్వండి ఆవిర్లొచ్చేదాకా.. నూక ఒక చేతులో అట్లకాడ మరో చేతిలో తీసుకోండీ. అవిర్లొస్తున్న నీటిలో నూక సన్నగా పోయండి, మరో చేతిలో ఉన్న అట్లకాడ తో కదుపుతూ.సరిగాకలియబెట్టకపోతే నూక ఉండకట్టేస్తుంది. ఉప్మా బాగోదు. నూకపోసేసి ఉండకట్టకుండా కలియబెట్టిన తరవాత, కొద్ది సేపు వదిలెయ్యండి. ఉపమా నీరు ఇగిరిపోయి గట్టి పడుతూ ఉంటుంది.

ఇప్పుడు నెయ్యి వెయ్యండి. మరికొంచం నెయ్యి పడనివ్వండి, అలాగని పోసెయ్యకండి. అయ్యరు నెయ్యి వెయ్యడు డాల్డా వాడుతాడు. మూతపెట్టండి, స్టవ్ ఆర్పేయండి. కొద్ది సేపు తరవాత ఉపమాని అట్లకాడతో తీసుకుని అరటాకు మీద వేసుకుంటే జారిపోతూ ఉంటుంది. దీనికి జోడీగా కొబ్బరి పచ్చడిగాని, గుల్ల శనగపప్పు పచ్చడి కాని తోడివ్వండి. నోట పెడితే ఆహా ఏమి రుచి అనరా మైమరచి… అదండి ఉపమా గొప్ప… చేసుకుతినండి…నాకు చెప్పద్దు..ఎలా ఉన్నదిన్నూ….

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- ఉపమా

 1. అనామకం

  నమ్మినా నమ్మకపోయినా నిజమే, నమ్మద్దు శుభం.
  ధన్యవాదాలు.

  హరిబాబు

  మీకలా అనిపించిందా?
  శుభం.
  ధన్యవాదాలు.

  చిరంజీవిగారు,

  తెలియదండి.
  ధన్యవాదాలు.

  విన్నకోటవారు

  కన్యా శుల్కంలో ఉపమా ప్రస్తావన లేదుటండి, సూర్యగారు కూడా చెప్పేసేరు, ముద్దులు వగైరాలేవో ఉన్నాయటండి.

  శ్రీనాథుని నాటికి ఉపమా ఉందా? ఇది అయ్యరు కనుగొన్నదా తెలియదండి.

  కళంతా చెయ్యడం లోనే కదండీ.

  బెల్లం ముక్క వెయ్యడం,పాలు పోయడం వింతగా అనిపించచ్చుగాని, రుచిని తెచ్చేవి అవేనండి.
  ధన్యవాదాలు

  సూర్యగారు

  నేను సినిమాలు చూడ్డం మానేసి దశాబ్దాలు నాలుగు దాటేయండి.ఉపమాలో పాలుపొయ్యడం, చిన్న బెల్లం ముక్క వెయ్యడం మాత్రం నిజమండి. బహు కొద్దిమంది మాత్రమే చేస్తారండి, అందులో అయ్యరు ప్రథముడు, అందుకే తెనుగునాట బతికేస్తున్నాడండి.
  ధన్యవాదాలు.

  అమ్మాయి రాజేశ్వరి

  కరాచీరవ్వ,బొంబాయి రవ్వ, ఉప్మా నూక అని ప్రాంతాన్ని బట్టి వాడుతారు, పేరుని. అన్నీ ఒకటే. ఇక ఉప్పుడురవ్వ,ఇడ్లీరవ్వ దీన్ని ఇడ్లీకి వాడతారు. బర్ఫీ గోధుమనూకనుకుంటా, ఎర్రగా ఉంటుంది సత్యనారాయణస్వామి ప్రసాదానికి, అతి మూత్రరోగుల భోజనానికి వాడతారు.
  ధన్యవాదాలు.

  విన్నకోటవారు.

  కామెంట్లు సమాధానాలు వద్దనుకుని ఆ పెట్టి తీసేశానండి.ఇందులో మొత్తం తీసేసే సావకాశం లేదండి,అదీ సంగతి.

  పాతకాలంలో నాకు తెలిసినవారి గురించిమాత్రమే చెప్పానండి. ఇక నేడు భానుమతి లాటి వారు మచ్చుకి కూడా కనపడ్టం లేదనుకుంటానండి. మంచి ఫోటో ఫార్వార్డ్ చేసినందుకు
  ధన్యవాదాలు.

 2. శర్మ గారు,
  మీ “కష్టేఫలి” బ్లాగ్-స్పాట్ kasthephali.blogspot.com లో 30-09-2019న పోస్ట్ చేసిన అలనాటి తెలుగు సినిమారంగ ప్రముఖుల ఫొటో అద్భుతం. అక్కడ కామెంట్లకు వెసులుబాటు లేదు కాబట్టిన్నూ, ఇది కూడా మీ బ్లాగే కదా అనిన్నూ ఇక్కడ వ్రాస్తున్నాను, ఏమనుకోకండి. ఆ పోస్ట్ కు కామెంట్ వ్రాయక తప్పదు 🙂.

  మొదటగా, ఆ ఫొటో నా courtesy అన్నారు మీరు. Thanks, కానీ అది నా కలెక్షన్ కాదండి. ఫార్వార్డెడ్ గా నాకు వచ్చిన ఫొటోను మీకు ఫార్వార్డ్ చేశాను, అంతే 🙏.

  ‌సినిమాల గురించి తెలిసినది తక్కువ అంటూనే చాలా పేర్లే గుర్తు పట్టారుగా👌🙂.

  సి.ఎస్.ఆర్ గారి ఇంటిపేరు సి = “చిలకలపూడి” అండి.
  భానుమతి గారి లక్షణాలు కరెక్ట్ గా చెప్పారు. మరొకటి కూడా ఉంది … రాజసం. ఆ ఫొటోలో కుర్చీల్లో కూర్చున్న వారిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నది ఆవిడొక్కరే 🙂.
  అవును, భానుమతి గారి ఎడమచేతి వైపు నున్నది టంగుటూరి సూర్యకుమారి గారే.

  విన్నకోట రామన్న పంతులు గారు ఈ ఫొటో కాలం నాటికి సినిమారంగ ప్రవేశం చేసినట్లు లేదనుకుంటాను. నాటకరంగంలో ప్రముఖులుగా ఉండేవారు.

  ఘంటసాల గారి సంగతి తెలియదు … అప్పటికి వచ్చారో లేదో మరి?

  ఫొటోలో ఉన్న వారిలో చాలా మంది గతించినట్లే ఉందండీ. రావు బాలసరస్వతీ దేవి గారు, కృష్ణవేణి గారు జీవించే ఉన్నారు.

  మొత్తానికి తెలుగు సినిమా లెజెండ్స్ కొంతమంది ఒకే చోట కలిసిన memorable ఫొటో.

 3. ఫలహారాలు అనడమే గానీ గురజాడ వారి “కన్యాశుల్కం” లో ప్రత్యేకించి ఉప్మా ప్రస్తావన తగల్లేదు శర్మ గారూ, నాకు గుర్తున్నంత వరకు.

  ఇక శ్రీనాథుడు సంగతి అంటారా, ఆ పుస్తకం నేను చదవలేదు గానీ … అసలు ఆ కాలం నాటికి (15వ శతాబ్దం) ఉప్మా అనే మహత్తరమైన పదార్థం కనిపెట్టబడిందా అని నాకొక చిరు సందేహం.

  ఉండ కట్టకుండా రవ్వని ఆ వేడి నీళ్ళల్లో కలపడం ఉంది చూశారూ … అది ఒక గొప్ప కళ సుమండీ. ఉప్మా కిటుకు సగం దాంట్లోనే ఉంది.

  అవునండీ, ఉప్మాలో బెల్లం కూడా వేస్తారా? మొదటిసారి వింటున్నాను. గోదావరీ జిల్లాలో అలవాటంటారా?

  • కన్యాశుల్కం లో ముద్దులగురించి, ఒకప్పుడు బట్టలు మోసిన జంతువు సంతానం గురించే తప్ప ఉప్మా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.
   “ఉప్మాలో బెల్లం!” ఈ మాట వింటుంటే తొట్టి గ్యాంగ్ సినిమాలో “పెరుగులో నెయ్యి!” అనే డైలాగ్ గుర్తొచ్చింది!

 4. “మొన్న మిత్రుల మధ్య చర్చలో ఒక మిత్రుడు ”కాశ్మీర్ లో స్థలం కొని ఇల్లు కట్టాలని ఉంద”న్నాడు. దానికి మరో మిత్రుడు ”ఆగు కంగారు పడకు మరో రెండేళ్ళలో కరాచీ లోనో, లాహోర్ లోనే ఇల్లు కట్టుకుందువుగాని” అన్నాడు.” – real patriotism of RSS brand!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s