శర్మ కాలక్షేపంకబుర్లు- మేలుకొలుపు

Courtesy: You tube

మేలుకొలుపు

మేలుకోవయ్యా! కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా!!
రంగనాథ స్వామికి మేలుకొలుపు భానుమతి కంఠంలో…
 

లోకాలనేలే స్వామికి నిద్ర,  ఆయనకు   మేలుకొలుపు. బలే ఊహ కదా! ఇది మానవులు చేసే చిత్రం. నవవిధ భక్తి మార్గాలలో సారూప్యం ఒకటి. ఇందులో భక్తుడు భగవంతుని తనలాగే ఊహించుకుని సేవించుకోవాలనుకుంటాడు, అందుకే ఈ మేలుకొలుపు. ఇక

కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ట నర శార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం

అంటే రామా, లేవయ్యా తెలవారుతోంది లేనాయనా! నిత్య కార్యక్రమాలున్నాయి , లేచి నిర్వహించు అని గురువుగారు హెచ్చరించారు. ఇది మొదటి రోజు రాజసౌధం వదలిన రామునికి మేలుకొలుపు నదీ తీరంలో! రాముడు మళ్ళీ ఎప్పుడూ తెల్లరుతోంది లే అనే హెచ్చరిక విన్నట్టు కనపడలేదు.
 

ఇక ముందుకెళితే

వేంకన్నబాబుకి

ఉత్తిష్టోత్తిష్ట గోవింద   ఉత్తిష్ట గరుడ ధ్వజ

ఉత్తిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు.

గరుడుడు ధ్వజంగా కలవాడా లేవయ్యా! లే!! లెద్దూ!!! ముల్లోకాలకీ మంగళం కలగాలంటే  లేవాలి, లే!!! మానవుని తొందర కనపడుతోందీ మేలుకొలుపులో,లే,లే,లే అంటూ తొందరపడుతూ తొందర పెడుతున్నాడు, భక్తుడు. . ఇలా మానవులలో మహరాజులు వంది మాగధులని మేలుకొలుపు కోసం నియమించుకునేవారు.
 

ఇదొక హెచ్చరిక….ఇలా నిర్నీత సమయానికి హెచ్చరిక చేయడం కోసం ఏభయ్యేళ్ళ కితం టెలిఫోన్ వ్యవస్థలో ఒక సర్వీస్ ఉండేది. బహుశః దీని గురించి చాలామందికి తెలియకా పోవచ్చు. This service was popularly known as morning alarm service or Wake up call. ఎందుకంటే ఇది పట్టణాలలో మాత్రమే ఉండేది. దీనికో నంబరు  176 , దానికి ఫోన్ చేసి ఫలానా నంబరుకు ఫలానా సమయంలో హెచ్చరిక, మేలుకొలుపు తెలపండి అన్నది ముందు బుక్ చేసుకుంటే, వారు phone పెట్టేసిన తరవాత మళ్ళీ ఆ నెంబర్ కి పిలిచి విషయం నిర్ధారించుకునేవాళ్ళం. ఇందుకు గాను ఆ హెచ్చరిక వినిపించిన తరవాత (After completion of the wake up call at the stipulated time.) రెండు కాల్స్ కి ఛార్జి చేసేవాళ్ళం.

 
చాలా మందికి తెలియని మరో సేవ సమయం చెప్పడం. దీనికి ఒక నెంబరు అది 174. దీనికి పిలిస్తే సమయం చెప్పేవాళ్ళం వరుసగా రెండు సార్లు. దీనికి ఒక కాల్ ఛార్జి చేసేవాళ్ళం.
 

అసలు సమయం చెప్పే వ్యవస్థ ఎందుకు ఏర్పాటయింది, దీనికో కారణం చెబుతా. ఐ.ఎస్.టి అనగా ఇండియన్ స్టాండర్డ్ టయిం నిర్ణయించేది 82.5 డిగ్రీల తూర్పు అక్షాంశం, longitude . గ్రీన్విచ్ లో రాత్రి పన్నెండు 00.00 గంటలైతే డిల్లీ లో ఉదయం 05.30 నిమిషాలవుతుంది.

 ఈ రేఖ డిల్లీ దగ్గరనుంచి, మన ఆంధ్రాలో అన్నవరం మీద  నుంచి   పోతుంది. దీనికోసమే అన్నవరంలో దేవాలయం పక్కగా సన్ డయల్ ఉన్నది, వెళ్ళినపుడు చూడండి . ఇక్కడ సమయం ఖచ్చితంగా Indian Standard time. ఐ.ఎస్.టి. ఇక దీని గురించిన ఒక టపా పలభాయంత్రం పెరుతో ఉన్నది, ఇదే బ్లాగులో.

 విషయాని   కొస్తే.డిల్లీలో సమయమే దేశం అంతా పాటించాలి,ఎలా? అందుకుగాను రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకి డిల్లీ టెలిఫోన్ ఎక్ఛేంజి వారు ఆ సమయం చెప్పే  observatory కి ఫోన్ చేసి తమ మాస్టర్ క్లాక్ ని సరి చేసుకునేవారు. The time is taken from the Sun dial in the observatory. ఆ తరవాతనుంచి సాయంత్రం  నాలుగు గంటలకి కలకత్తా,బొంబాయి, మద్రాస్ ఎక్స్ఛేంజిలవారు డిల్లీ నుంచి సమయం తెలుసుకుని తమ  గడియారాలు మార్చుకునేవారు. ఆ తరవాత నుంచి మిగిలిన చిన్న ఊళ్ళ వారు సమయాన్ని చూపే గడియారాలు సరి చేసుకునేవారంటే, సమయాన్ని సరి చూసుకునేందుకు ఇంత వ్యవస్థ ఉండేదంటే నమ్మగలరా! కాని ఇది నిజం. 
 
మిగిలిన చిన్న ఊళ్ళలో ఫోన్ ఎత్తీ సమయం అడిగితే ఊరకనే చెప్పేవాళ్ళం. పల్లెలలో ఇలా నిర్నీత సమయానికి లేపి హెచ్చరించే వ్యవస్థ లేకపోయినా రాత్రి డ్యూటీ వారిని, ఫలానా సమయానికి లేపండి అని అడిగితే లేపేవాళ్ళం.ఈ ఉదయమే మేలుకొలుపుల్లో ఎన్నెన్ని పదనిసలో……