శర్మ కాలక్షేపంకబుర్లు- ఒక చిన్నమాట

ఎవరో!

నా బ్లాగులో టపాలు తీసుకుంటున్నారు గత పదేనురోజులుగా! ఎవరో అభిమానులే ఐ ఉంటారు. ఒక చిన్నమాట.

ఇ బుక్ చేసుకోడానికైతే, తయారు చేసిన ఇ బుక్కులున్నాయి, ఇది తెలిసి ఉండదనుకోను. ”కాదు! నాకు నచ్చిన టపాలు ఇ బుక్ చేసుకోడానికి” ఐతే మీ ఇష్టం. ఇంత కష్టం అవుసరమా? 🙂 కారణం ఎంచుకున్న టపాలు ఇ బుక్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో తెలిసినవాడిని కనక. ఇక ఎంచుకున్న టపాలను ప్రింట్ పుస్తకం వేయించుకోడానికి, ఐతే మీరలా వేయించుకోవడానికి నేను అనుమతి ఇవ్వను.

అభిమానం అన్నది వైరల్ జ్వరంలాటిది. అది పొంగినపుడు ఏం చేస్తున్నామో తెలియదు. నేనూ ఈ జ్వర పీడితుణ్ణే! ఒకప్పుడు. రెండేళ్ళ కితం ఈ జ్వరం వచ్చిన ఒక మనవరాలు ”బ్లాగ్ టపాలు ప్రింట్ బుక్ వేస్తాను” అంటే ”ఖర్చు చాలా అవుతుంది, బుక్ కొనేవారుండరు, భారీగా నష్టపోతావు వద్దని,  నీవు నష్టపోవడం నాకిష్టం లేదు . మనవారికి పుస్తకం కొని చదివే అలవాటిoకా కాలేదు”అని ఆపేశాను.

జ్వరం తగ్గు ముఖం పట్టక సంవత్సరంకితం మళ్ళీ ”ఎన్నిక చేసిన టపాలు ప్రింట్ బుక్ వేయిస్తా, మహా ఐతే నాకు ఐదువందల డాలర్లవుతాయి, నష్టమైనా బాధ లేదు. నాకు కావలసిన వాళ్ళకి బుక్ ఇచ్చుకుంటా”నంది. అప్పుడు చెప్పేను ఇలా ప్రింట్ పుస్తకాలేయించిన వారు పడిన బాధలు ఉదాహరణ చెప్పేను.”ఇ బుక్స్ ఉన్నాయి, అవి చాలు. అభిమానం ఉండచ్చుగాని, ఇంత సొమ్ము ఖర్చు పెట్టేటంత కాదని” అపేశాను. ఆతరవాతా మనవరాలు మాటాడటం మానేసింది, కోపం వచ్చి మాటాడటం మానేసినా బాధ లేదుగాని, తను నష్టపోవడం ఇష్టం లేకపోయింది. అందుచేత ఇప్పుడు టపాలు తీసుకునేవారికో చిన్నమాట, ప్రింట్ పుస్తకం వేయించి డబ్బులు వృధా చేయకండి. ఇదే నా విజ్ఞప్తి.ఈ సంగతి బ్లాగ్ ముఖంగా చెప్పక తప్పలేదు.