శర్మ కాలక్షేపంకబుర్లు- బెల్లపు ఆవకాయ!

బెల్లపు ఆవకాయ!

బెల్లము+ఆవకాయ అనాలా?
బెల్లపు+ఆవకాయ అనాలా?

సరే
ఏదోలా అన్నామే సరి చూడండి, సంధి చేస్తే ఏమనాలి?
బెల్లపావకాయ సవర్ణదీర్ఘ సంధియా?
బెల్లపుటావకాయ అనాలా? టుకారసంధియా?

సరే
ఇదేం సమాసం. సమాసం తెలియాలంటే విగ్రహవాక్యం చెప్పుకోవాలట కదూ? 

బెల్లంతో ఆవకాయ తోన్,తోడన్ తృతీయా విభక్తియా?
బెల్లం కలిసిన ఆవకాయా? అందు,న సప్తమీ విభక్తియా?

ఐతే సమాసం విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసమా?అమ్మో! అమ్మో!! నాకూ తెనుగొచ్చేస్తోందండోయ్!

మిత్రులొకరు వాటస్ ఆప్ లో ఇది

పుంప్వాదేశ సంధి అని
విగ్రహ వాక్యం బెల్లం యొక్క ఆవకాయ కనక
షష్టీ తత్పురుష సమాసమని చెప్పేరు.
ధన్యవాదాలు.

ఎందుకింత గందరగోళం, తెల్లోడు చూడండి ఎంగిలిపీస్ లో జాగరీ పికిల్ అనేసేడు, చక్కహా లేదూ

ఏంటో గందరగోళం. తెనుగులో బెల్లపావకాయ, పుల్ల పుల్లగా, కారం కారంగా, తియ్య తియ్యగా ఉండేది తినడానికి ఇన్ని తెలిసుండాలా? ఇవేవీ తెలియకపోతే బెల్లపావకాయ ముద్ద గొంతు దిగనంటుందా?

ఏంటీ? ఆవకాయలో బెల్లమా? మతుండే మాటాడుతున్నారా?

అవును బాబూ! అవును!!

ఆవకాయలో బెల్లం వేస్తారు! దాన్ని బెల్లపు ఆవకాయంటారు, మహా ప్రీతిగా తింటారు. అదెలాగో చూదాం, రుచిగానూ ఉంటుంది .

పుల్లటి మామిడి కాయలు తీసుకోవాలి. బెల్లపు ఆవకాయకి పుల్లటి కాయలెందుకని కదా అనుమానం! పుల్లటికాయలైతేనే రుచిమరి. ఆ తరవాత మీ ఇష్టం. కారం,ఆవ సరి సమానంగా తీసుకోండి. ఆవ తయారు చేసుకునేటపుడు, ఆవాలకి కొద్దిగా మజ్జిగ రాయండి. ఆరనివ్వండి, మిక్సీలో వేయండి. వెంఠనే కొద్దిగా పసుపేసి,ఉప్పేసి కలిపెయ్యండి.పిండి ఐన వెంటనే పొట్టు చెరిగెయ్యండి, ఇలా తొందర తొందరగా చేస్తే ఆవ కనరెక్కదు, లేకపోతే కనరెక్కిపోయి ఆవకాయ బాగోదు. ఇప్పుడు ఆవ,కారమూ గుచ్చెత్తండి, వెంఠనే కాయ దొరక్క పెట్టుకోలేకపోతే! ఉప్పు మాత్రం కలపకండి. ఉప్పు ఎప్పుడూ ఆవకాయ గుచ్చెత్తేటపుడు మాత్రమే కలుపుకోవాలి.ఉప్పు కారం,ఆవ అన్నీ సమాన పాళ్ళు ఉండాలి.

మామిడి కాయలు ముక్కలుగా తరగండి, పెచ్చుని డొక్క ఉండాలి. కారము,ఆవ కలిపిన గుండను వెడల్పైన పళ్ళెం లోకి తీసుకోండి. ఇప్పుడు ఉప్పు కలపండి, ఆపై ముక్కలేయండి, నూని వేయండి, ముక్కల్ని గుండలో పొలపండి, ఆవకాయని తడిలేని జాడీలో పెట్టండి, పైన కొద్దిగా నూని వేయండి, మూత గట్టిగా పెట్టి నిలవుంచండి.

ఇదేంటీ బెల్లపావకాయ చెబుతానని…..

అలా పెట్టిన ఆవకాయని మూడురోజుల తరవాత తీయండి, ఊటవచ్చి ఆవకాయ జారుగా అవుతుంది, ఇందులో మెంతులేయండి, పచ్చివే. ఆపైన నూనెపోయండి. కలపండి పైనా కిందా! వేరే బేసిన్ లోకి తీసుకునీ కలపచ్చు. దీనిని జాగ్రత్త పెట్టండి. తగినంత బెల్లం తీసుకోండి, పాకం పట్టండి, మరీ లేతపాకం బాగోదు, నిలవుండదు, మరీ ముదురు పాకం కాక తీగ పాకం వచ్చేదాకా మరిగించండి. కొద్ది చలారనివ్వండి. అప్పుడు జాడీలో ఊరగాయను ఒక బేసిన్ లో తీసుకుని అందులో ఈ బెల్లం పాకం పోసి కలపండి, ఒక్క రోజు నిలవుంచండి. మర్నాడు పెచ్చులతో సహా ఎండలో పెట్టండి. గట్టి ఎండ తగిలిన తరవాత, మర్నాడు పెచ్చులని ఉన్న పిండి ఊడ్చెయ్యండి, పెచ్చులు పిండి విడి విడిగా ఎండలో పెట్టండి, రెండు గట్టి ఎండలు తగిలిన తరవాత పెచ్చులు పిండి కలిపేయండి. బెల్లపు ఆవకాయ రెడీ. నీరు తగలనివ్వక జాడీలో నిలవ చేయండి. బెల్లపు ఆవకాయ రెడీ!

ఆవకాయ పుల్లపుల్లగా,తియ్యతియ్యగా,కారంకారంగా బలే ఉంటుంది.

శర్మ కాలక్షేపంకబుర్లు- n log బంగారం

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ

  చీమ చాలా చిన్న జీవి, ఇవి సంఘ జీవులు. కష్టపడి పుట్ట నిర్మించుకుంటాయి. అది చాలా సౌకర్యంగా ఉంటుంది. పాములు సొంతంగా గూడు నిర్మించుకోలేవు. ఇవి బలహీనమైన చీమల పుట్టల్ని స్వాధీనం చేసుకుంటాయి. సాధారణంగా చీమలు ఓడిపోతుంటాయి.పాములు చీమల పుట్టల్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం సామాన్యులు పోగుచేసుకున్న బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారంటారు బద్దెన. కాని అప్పుడపుడు ఇలా కూడా జరుగుతుంది.

బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలి చీమల చేతజిక్కి చావదె సుమతీ

బలవంతుడినని విర్రవీగినవారంతా చిన్నవైన చలిచీమల చేత చనిపోయిన మహా సర్పంలా ఐపోతారు సుమా అని కవిగారి మాట. అందుకు ఎప్పుడూ ఎక్కువమందితో విరోధం పెంచుకోకూ అని సలహా కూడా.

ప్రజలు కూడా చిన్న చీమలలాటివాళ్ళు. బంగారం పోగుచేస్తూనే ఉంటారు. ఇదే వారికి ఒక ఆధారం,అత్యవసరాలలో. అదెలాగంటే, ఏ కుటుంబంలో నైనా ఎంతో కొంత బంగారంలో మదుపుచేయాలని చూస్తారు. అది కూడా స్త్రీకి అనగా ఆఇంటి ఆడకూతురికి నగగా ఉండాలని చూస్తారు. దీనిని స్త్రీ ధనం అంటారు, ఆ బంగారం తండ్రి ఇచ్చినదే కావచ్చు లేదా భర్త ఇచ్చినదే కావచ్చు. సాధారణంగా స్త్రీ ధనాన్ని ముట్టుకోడానికి పురుషాహంకారం అడ్డొస్తుoది. పూర్తిగా అర్ధికంగా చితికిపోయి దిక్కుతోచని సమయంలో ఆ ఇంటి స్త్రీ, తన ఒంటి మీద బంగారాన్నిచ్చి కుటుంబాన్ని నిలబెట్టిన కతలూ కోకొల్లలు. అందుకు భారతీయులు అందునా స్త్రీలు బంగారం మీద మోజు చూపిస్తారు, పై పై కబుర్లు చెబుతారుగాని పురుషులూ సహకరిస్తారు.. మరి ఈ బంగారం అధికంగా ఉంటే ప్రభుత్వం పట్టుకుపోతుందని బద్దెనగారు నాడే చెప్పేరు, మరి ఇప్పుడు బంగారం ఎంత వుండచ్చు అన్నది CBDT Central board of direct taxes చెప్పిన మాట ఇలా ఉంది.

1.బంగారం మీదగ్గర ఎంతైనా ఉండచ్చు అది వస్తు రూపంలో ఉండాలి. నాణేలు,బార్ ల రూపంలో ఉండకూడదు. కొన్ని మినహా ఇంపులున్నాయి, కుటుంబ కట్టుబాటులు, మత ఆచారాలుకి సంబంధించిన నాణేలు వగైరా,పాతకాలపు కాసుల పేర్లు,లక్ష్మీ రూపులు వగైరా కావచ్చు..

2. అలా ఉన్న బంగారం మీకు ఎలా సంక్రమించినదీ ఋజువులు కావాలి. అనగా ఆ వస్తువులు మీకు విల్లు ద్వారా గాని మరో విధంగాగాని సంక్రమించిన కాగితాలు కావాలి.అవీ లేకపోయినా బాధ లేదు, మీకు పెద్దలనుంచి వచ్చినదైతే వారి ఆర్ధికస్థితి చెప్పాలి. మీరు స్వంతంగా తయారు చేయించుకుని ఉంటే వాని తాలూకు రసీదులు, అవీ లేకపోయినా బాధలేదు, మీరు సంపాదించిన సొమ్ముకు టాక్స్ కట్టినదీ చూపిస్తేచాలు. ఇవేవీ లేక ఆ బంగారం మాది కాదు మరొకరిది మాదగ్గర ఉంచారన్నా ప్రభుత్వం నమ్మదు,పట్టుకుపోతుంది.

3. ఒక కుటుంబంలో ఎంత బంగారం ఉండచ్చు?

ఒక కుటుంబాన్ని చూద్దాం. ఒక భార్య,భర్త. ఒక కొడుకు కోడలు, ఒక కూతురు, పెళ్ళి కానిది. మొత్తం ఎంత బంగారం ఉండచ్చు వీరందరికి కలిపి?

మగవారికి ఒక్కొక్కరికి 100 గ్రాములు

పెళ్ళైన స్త్రీ ఒకరికి 500 గ్రాములు

పెళ్ళికాని స్త్రీకి ఒక్కొకరికి 250 గ్రాములు

మగవాళ్ళు (తండ్రి,కొడుకు) = 2 X 100= 200 grams

పెళ్ళయిన స్త్రీలు(అత్త,కోడలు) 2 X 500 = 1000 grams

పెళ్ళికాని ఆడపిల్ల 1 X 250 = 250 grams

మొత్తం బంగారం ఆ కుటుంబంలో ఉంచుకోతగినది. 1450 gram.ఈ బంగారానికి ఋజువులు సాక్ష్యాలు అక్కర లేదు. ఐతే ఒకటే షరతు, ఇదంతా వస్తురూపంలోనే ఉండాలి, కాని బార్ లా ఉండ కూడదు. 1450 gramsఅంటే దగ్గరగా 181 కాసులు… 1 కాసు= 8 grams.

దగ్గరగా కేజిన్నర బంగారం నేటి ధర ప్రకారం ఎంత విలువ చేస్తుంది. గ్రాము నాలుగు వేలైతే, 1450 X 4000 = nearly 60 lakh rupees. బంగారంలో పొదుపు నిరర్ధక పెట్టుబడి. దీనిపై రాబడి ఉండదు.మరి దీనిలో ఎందుకు జాగ్రత్త పెట్టాలని చూస్తారు? భద్రత,స్త్రీలవద్ద ఉంటుంది గనక,చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అమ్ముకుంటే తొందరగా సొమ్ము చేతికొస్తుంది, ఆపద తొందరగా గట్టెక్కచ్చు, ఇదీ సామాన్యుల ఆలోచన. చిన్నమెత్తు అన్నది చాలా చిన్న మొత్తం, బంగారపు తూకంలో. ఈ చిన్నమెత్తు బంగారం కూడా లేని భారతీయులు కోటానకోట్లు ఉన్నారు. ఐతే కేజిల కొద్దీ, టన్నుల కొద్దీ బంగారం ఉన్నవారూ ఉన్నారు.

కొంతమంది దగ్గర బంగారపు నిల్వలే దొరుకుతున్నాయి, టన్నుల కొద్దీ, వెతికినకొద్దీ.

ఇక ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లో 181 కాసుల బంగారపు ఆభరణాలుండచ్చంటోది. ఇంత బంగారం ఉన్నవారు సామాన్యులై ఉంటారంటారా? అరవై లక్షల రూపాయలు నిరర్ధక ఆస్థిగా ఉంచగలిగినవారు కోటీశ్వర్లులు కారూ? మరి వీధికెక్కి ఎందుకు కొంతమoది బాధ పడుతున్నారు?

 సామాన్యుని దగ్గర ఇంత బంగారం ఉంటుందా?

స్త్రీ పురుషుల మధ్య ఇంత వివక్షతా! (Gender discrimination)అన్యాయం కదూ!! స్త్రీ శక్తి సంఘాలు పిల్ PIL వేయవేం?

శర్మ కాలక్షేపంకబుర్లు-”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం తెనుగునాట బాగా అలవాటు.

చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.

మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.

చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!

ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో, మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!

ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.

గాడిద మహాలక్ష్మికీ జై!!!

శర్మ కాలక్షేపంకబుర్లు-దుస్సంఘటన

దుస్సంఘటన

{స్వగతం :- ఐదేళ్ళ కితం తణుకు పెళ్ళికి వెళ్ళి వస్తుండగా, బస్సు రావులపాలెంవంతెన పైన ఆగింది, బయటకు చూస్తే బస్సు ఆగిన ప్రదేశం, వంతెన కడుతుండగా 1964-67 ( Not sure of the dates)జరిగిన దుస్సంఘటన ప్రదేశానికి దగ్గరగా వుంది. . . ఒక్కసారిగా నాటి దుస్సంఘటన గుర్తుకొచ్చింది. ఇంటికొచ్చాకా దానిని రాయాలనుకుని మొదలుపెట్టాను. తుది మొదలు కనపడలేదు. ఆపేశాను. కొంత రాసి వదిలేశా. ఆ తరవాత ఈ దుస్సంఘటన గురించి రాయకపోతేనేం అనిపించింది, చాలా కాలం వదిలేశాను. ఈ మధ్య కాలం లో నాల్గవ వంతెన గుండా ప్రయాణం చేశా, మే నెల ఎండలో! అప్పుడు మరల ఈ దుస్సంఘటన కెలక వేసింది. రాదామనుకున్నగాని కుదరలేదు. నాల్గవ వంతెన ఫోటో నిన్న అవతల బ్లాగులో పెడుతుండగా  జ్ఞాపకం మళ్ళీ నిలదీసింది. నాడు చనిపోయిన ఇంజినీర్లకు,పనివారలకు అశ్రుతర్పణంగా ఈ జ్ఞాపకం రాయక తప్పదని రాస్తున్నా. నాటి పరిస్థితులు తెలియజేయాలన్నదే నా అభిమతం, ఆలోచనల ఉరవడిలో ముందు వెనుకలూ ఉండచ్చు, పొరబాటుంటే మన్నించి తెలపండి. టపా చాలా పెద్దయిపోయింది,తప్పలేదు. మన్నించండి.}

ఒకప్పుడు గోజిలు ఒక జిల్లాయే. ఇప్పుడంటే ఇలా ఉన్నాయిగాని ధాత కరువుకి 1816-17 తిండీ నీళ్ళూ లేక గోజి అల్లాడిపోయింది, అనేక మంది చనిపోయారు కూడా. నాడు బతకడానికి బంకమట్టి తినేవారంటే నేటివారు నమ్మలేరు కూడా. పెరుగులో బంకమట్టి పిసుక్కుని తాగేవారని తన అమ్మమ్మ చెప్పిన మాట,అమ్మ చెప్పింది.ఆ తరవాత కాటన్ గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఆనకట్టు కట్టడంతో(1852) గోజి రూపే మారిపోయింది.

ఆ తరవాత కాలంలో ఆనకట్టు 1852, నుంచి తూర్పు ప్రధాన కాల్వ,మధ్య డెల్టా ప్రధాన కాల్వ, పడమటి ప్రధాన కాలవ ఏర్పడ్డాయి, దీనితో పాడి పంటతో పాటు రవాణా కూడా ఈ కాల్వలు, వీటినుంచి చీలిన కాల్వల ద్వారా జరిగేది.ధవళేశ్వరంలో బయలు దేరిన ప్రధాన కాలవ వేమగిరి దగ్గర రెండుగా చీలి ఒకటి మెరక కాల్వ కాకినాడకి, గోదారి గట్టు వెంట చీలిన కాలవ కోటి పల్లికి చేరుతాయి.  వేమగిరి దాటిన తరవాత మెరక కాలవ కి కడియం స్టేషన్ దాటిన తరవాత మరొక చీలిక. కుడి వైపు కాలవని నల్ల కాలవని,ఎడమవైపు కాలవని ఎర్ర కాలవని అంటారు. ఇక్కడి నుంచి ఈ నేల స్వభావం ఎరుపు నలుపులు స్పష్టం గా ఉంటాయి. నల్లకాలవ మీద కడియం దగ్గర ఒక లాక్ ఉంది. చాలా కాలం ఒకటే ఉండేది. ఎర్ర కాలవ మీద లాకు లేదు. ఆ తరవాత కాలంలో ఎర్రకాలవ మీద కూడా లాక్ కట్టేరు. ఇలా ఒక కాలవ రెండుగా చీలి వాటి రెండిటి మీద లాకులు కట్టడం ఇక్కడే ప్రత్యేకత అనుకుంటా. పుట్టింది పగోజి ఐనా బతికింది తూగోజి కనక తూగోజిని చాలా దగ్గరగా పరిశిలించా, జీవితంలో. నాకు రెండు జిల్లాలంటే ఎక్కువ మక్కువ.

రావులపాలెం వంతెన కట్టక ముందు తూగోజిలో ప్రధాన రహదారులు, రాజమంద్రి-కాకినాడ కాలవగట్టు రోడ్డు ద్వారపూడి మీదుగా, రాజమంద్రి-కాకినాడ రోడ్డు రాజానగరం మీదుగా, మద్రాస్-కలకత్తా ట్రంక్ రోడ్డు, రాజానగరం మీదుగా,పేరు ట్రంక్ రోడ్ గోతులు గుంటలతో సింగిల్ మార్జిన్ రోడ్. కాకినాడ-పిఠాపురం రోడ్డు, చిత్రాడ మీదుగా. ఈ పిఠాపురం మద్రాస్-కలకత్తా రైల్ లైన్ మీద ఉంది. దాటి ముందుకెళితే కత్తిపూడి, ఇక్కడ ట్రంక్ రోడ్ కలుస్తుంది.  కాకినాడ-కోటిపల్లి రోడ్డు, కాకినాడ నుంచి రామచంద్రపురం, మండపేట మీదుగా కపిలేశ్వరపురం,మండపేట నుంచి-ఆలమూరు గోదావరిగట్టుకు ముందుకెళితే జొన్నాడకి అదే రావులపాలెం వంతెనకి.రామచంద్రపురం నుంచి ద్రాక్షారామ ఆపైన యానాం. ఇక మెట్ట వైపు రాజమంద్రి నుంచి కోరుకొండ-గోకవరం-రంపచోడవరం, ఆపైన భద్రాచలం వెళ్ళేందుకు రోడ్డు లేదు.ఇవే ప్రధాన రహదారులు.

ఇక టెలిపోన్ ఎక్స్ఛేంజిలైతే రైల్ లైన్ పక్కన ఉన్నవే. రాజమంద్రి,సామర్లకోట, కాకినాడ,పిఠాపురం,తుని. ఆ తరవాత కాలంలో అనపర్తి, అమలాపురం,అంబాజీ పేట, మండపేట.ఇవి మేన్యుయల్ ఎక్స్ఛేంజిలు మిగిలినవన్ని చిన్న చిన్న ఆటో ఎక్స్ఛేంజిలు.

కోనసీమకి ప్రయాణ మార్గాలు కోటి పల్లి రేవు దాటితే ముక్తీశ్వరం..అమలాపురం. రాజమంద్రి నుంచి బొబ్బర్లంక లాంచి. అక్కడనుండి బస్సులో రావులపాలెం,కొత్తపేట, అంబాజీ పేట నుంచి అమలాపురం అలా ముందుకుపోతే ఓడరేవు. అంబాజీ పేట సెంటర్ నుంచి, గన్నవరం అదే అక్విడక్టు గన్నవరం, ముందుకుపోతే రాజో,లు ఆతరవాత సఖినేటిపల్లి. ఆ తరవాత అంతర్వేది. గోదారి పాయ రేవు దాటితే నరసాపురం (పగోజి). అమలాపురంలో కొంకాపల్లి ప్రసిద్ధి, జటకాబళ్ళకి. బస్సులు తక్కువ దగ్గర ప్రాంతాలకి జటకా బళ్ళే శరణ్యం. కోనసీమకి ప్రయాణం అంటే ఒక రోజు పట్టేది. ఇటువంటి కాలంలో గోదావరి దాటడానికున్న సాధనాలు రాజమంద్రి-కొవ్వూరు మధ్య రైల్ వంతెన ఒకటే మార్గం. మిగిలినదంతా నీటి రవాణాయే.తూగోజిల్లాకి కరంటు వచ్చిన కాలం 1950 ప్రాంతం.నాటి రోజుల్లో సీలేరు జల విద్యుత్తే శరణ్యం. అదుగో అటువంటి సమయంలో రావులపాలెం దగ్గర వంతెన కట్టాలని ప్రయత్నం మొదలయింది.ఈ ప్రయత్నానికి ముందుగా చెప్పుకోవలసినవారు కళా వేంకటరావుగారు,కొత్తపేట సుబ్బరాజు గారు. .

రావులపాలెం బ్రిడ్జి అనేది ఒక వంతెనకాదు, అనేక వంతెనల సముదాయం. తూగోజినుంచి పగోజికి కార్లో వెళ్ళాలంటే దాటవలసిన వంతెనలు వరసగా. ధవళేశ్వరం-కోటిపల్లి కాలవ జొన్నాడ దగ్గర, ఆ తరవాత గౌతమి మీద పెద్దవంతెన. అది దాటి ముందుకెళితే అమలాపురంకాలవ, అది దాటితే రావులపాలెం, ముందు కెళితే గన్నవరం కాలవ, అది దాటితేగోపాలపురం కాలవ. ఇదీ దాటితే వశిష్ట మీద గోపాలపురం-దొంగరావి పాలెంల మధ్య వంతెన.అది దాటితే సిద్ధాంతం కాలవ, అలా దొంగరావిపాలెం చేరితే రెండు కిలో మీటర్లలోపు సిద్ధాంతం అమ్మయ్య తూగోజి నుంచి పగోజి చేరేం,మొత్తానికి, ఈ మధ్యలో ఎన్ని పిల్లకాలవలో లెక్కేట్టలేదు.

ఈ వంతెనలను కట్టడానికి జొన్నడ నుంచి మొదలు గన్నవరం కాలవ మీద వంతెన దాకా వంతెనలను ఇంజినీర్స్ ఇండియా అనే సంస్థ, ఆ తరవాత వంతెనలను గామన్ ఇండియా సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. జొన్నాడ దగ్గరకి చేరాలంటే రాజమంద్రి నుంచి రెండు దార్లు, ఒకటి ధ్వళేశ్వరం-కోటిపల్లి కాలవ గట్టు, రెండవది రాజమంద్రి నుంచి కాకినాడ కాలవ గట్టున ద్వారపూడి అక్కడినుంచి మండపేట ఆ ముందు ఆలమూరు ఆ తరవాత జొన్నాడ ఒక చిన్న పల్లెటూరు, నాటికి. ఫోన్ లేదు, ఎలా? అందుకుగాను ఆలమూరులో ఒక పది లైన్ ల చిన్న ఆటో ఎక్స్ఛేంజి పెట్టేరు. దీనిని మండపేటకి కలిపేరు. మండపేటనుంచి రాజమంద్రికి రెండు ట్రంక్ లైన్లు, స్థంబాలమీద. ఆలమూరులో పెట్టిన పదిలైన్ల ఆటో ఎక్శ్ఛేంజిలో Phone No.1 Exchange. No.2 పోస్టాఫీసు, No.3 ఇంజినీర్స్ ఇండియా సైట్ ఆఫీసు, No.7 Sree.మల్లూరి పాపయ్య Landlord అనే వారి ఫోన్. ఇవే ఆ నాడు అక్కడి పోన్ కనక్షన్లు. ధవళేశ్వరం నుంచి కాలవగట్టున రావడానికి రోడ్ లేదు, అదీగాక ధవళేశ్వరం దగ్గర బయలుదేరిన ప్రధాన కాలవ వేమగిరి దగ్గర రెండుగా చీలింది. అదిగో అందులో గోదా రి గట్టు పక్క కాలవే కోటి పల్లి కాలవ. ఇక్కడ ఒక వంతెన కట్టాలి, అది కడితే మద్రాస్ కలకత్తా ట్రంక్ రోడ్ కు చేరేందుకు ఒక రోడ్, దాన్ని మిలిటరీ రోడ్ అనేవాళ్ళం. ధవళేశ్వరం ఆనకట్ట దాటి వచ్చిన భారీ వాహనాలు ట్రంక్ రోడ్ లాలాచెరువు కు చేరేందుకు వాడేదే మిలిటరీ రోడ్, కంకర రాళ్ళు పెద్దపెద్దవి కనపడుతూ ఉండేవి. అదే ఇప్పుడు నేషనల్ హైవే. అక్కడ వేమగిరి దగ్గర వంతెన కట్టేరు. ఆ తరవాత కోటి పల్లి కాలవపై జొన్నాడ దగ్గర వంతెన కట్టేరు. ఇప్పుడు ప్రధాన వంతెన పని మొదలయింది. గోదావరిలో నూతులు తీసి స్థంబాలు నిలబెట్టడం, ఒడ్డున ఆ స్థంబాల మీద పెట్టాడానికి గర్డర్లు తయారు చేయడం మొదలు పెట్టేరు.

సైట్ ఇంజినీర్ అచ్యుతరావు గారు, పేరు గుర్తుండిపోయింది.వారానికో పదిరోజులకో ఒకసారి పలకరిస్తుండేవారు. అందరూ ఒక సారి రండి వంతెన కట్టుబడి చూద్దురుగాని అని పిలిచేవారు, జీపు పంపుతాననేవారు. పని చేసేవాళ్ళం నలుగురం ఎప్పుడూ ఒకడు పలుపుతాడు తగిలించుకుని ఆఫీస్ లో ఉండక తప్పదు. మిగిలిన ముగ్గురిలో ఒకడు ఆఫీస్ లో ఉన్నవాడు డ్యూటి పూర్తైతే పంపేందుకు సిద్ధంగా ఉండాలి. ఏరోజు శలవు లేదు. మిగిలిన ఇద్దరూ కూడా చూసిరావడానికి కుదిరేది కాదు. అందుకు అచ్యుతరావు గారి కోరిక ఎప్పుడూ మన్నించలేకపోయాం, కాని ఫోన్ లో మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించేవారు, ఎప్పుడూ వారు మేము ముఖముఖాలు చూసుకున్నపాపాన పోలేదు. అంతే! అదంతే!!

మొత్తం ఒక టపాగా రాయడానికి ప్రయత్నించా కుదరలేదు,

సశేషం