దుస్సంఘటన
{స్వగతం :- ఐదేళ్ళ కితం తణుకు పెళ్ళికి వెళ్ళి వస్తుండగా, బస్సు రావులపాలెంవంతెన పైన ఆగింది, బయటకు చూస్తే బస్సు ఆగిన ప్రదేశం, వంతెన కడుతుండగా 1964-67 ( Not sure of the dates)జరిగిన దుస్సంఘటన ప్రదేశానికి దగ్గరగా వుంది. . . ఒక్కసారిగా నాటి దుస్సంఘటన గుర్తుకొచ్చింది. ఇంటికొచ్చాకా దానిని రాయాలనుకుని మొదలుపెట్టాను. తుది మొదలు కనపడలేదు. ఆపేశాను. కొంత రాసి వదిలేశా. ఆ తరవాత ఈ దుస్సంఘటన గురించి రాయకపోతేనేం అనిపించింది, చాలా కాలం వదిలేశాను. ఈ మధ్య కాలం లో నాల్గవ వంతెన గుండా ప్రయాణం చేశా, మే నెల ఎండలో! అప్పుడు మరల ఈ దుస్సంఘటన కెలక వేసింది. రాదామనుకున్నగాని కుదరలేదు. నాల్గవ వంతెన ఫోటో నిన్న అవతల బ్లాగులో పెడుతుండగా జ్ఞాపకం మళ్ళీ నిలదీసింది. నాడు చనిపోయిన ఇంజినీర్లకు,పనివారలకు అశ్రుతర్పణంగా ఈ జ్ఞాపకం రాయక తప్పదని రాస్తున్నా. నాటి పరిస్థితులు తెలియజేయాలన్నదే నా అభిమతం, ఆలోచనల ఉరవడిలో ముందు వెనుకలూ ఉండచ్చు, పొరబాటుంటే మన్నించి తెలపండి. టపా చాలా పెద్దయిపోయింది,తప్పలేదు. మన్నించండి.}
ఒకప్పుడు గోజిలు ఒక జిల్లాయే. ఇప్పుడంటే ఇలా ఉన్నాయిగాని ధాత కరువుకి 1816-17 తిండీ నీళ్ళూ లేక గోజి అల్లాడిపోయింది, అనేక మంది చనిపోయారు కూడా. నాడు బతకడానికి బంకమట్టి తినేవారంటే నేటివారు నమ్మలేరు కూడా. పెరుగులో బంకమట్టి పిసుక్కుని తాగేవారని తన అమ్మమ్మ చెప్పిన మాట,అమ్మ చెప్పింది.ఆ తరవాత కాటన్ గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఆనకట్టు కట్టడంతో(1852) గోజి రూపే మారిపోయింది.
ఆ తరవాత కాలంలో ఆనకట్టు 1852, నుంచి తూర్పు ప్రధాన కాల్వ,మధ్య డెల్టా ప్రధాన కాల్వ, పడమటి ప్రధాన కాలవ ఏర్పడ్డాయి, దీనితో పాడి పంటతో పాటు రవాణా కూడా ఈ కాల్వలు, వీటినుంచి చీలిన కాల్వల ద్వారా జరిగేది.ధవళేశ్వరంలో బయలు దేరిన ప్రధాన కాలవ వేమగిరి దగ్గర రెండుగా చీలి ఒకటి మెరక కాల్వ కాకినాడకి, గోదారి గట్టు వెంట చీలిన కాలవ కోటి పల్లికి చేరుతాయి. వేమగిరి దాటిన తరవాత మెరక కాలవ కి కడియం స్టేషన్ దాటిన తరవాత మరొక చీలిక. కుడి వైపు కాలవని నల్ల కాలవని,ఎడమవైపు కాలవని ఎర్ర కాలవని అంటారు. ఇక్కడి నుంచి ఈ నేల స్వభావం ఎరుపు నలుపులు స్పష్టం గా ఉంటాయి. నల్లకాలవ మీద కడియం దగ్గర ఒక లాక్ ఉంది. చాలా కాలం ఒకటే ఉండేది. ఎర్ర కాలవ మీద లాకు లేదు. ఆ తరవాత కాలంలో ఎర్రకాలవ మీద కూడా లాక్ కట్టేరు. ఇలా ఒక కాలవ రెండుగా చీలి వాటి రెండిటి మీద లాకులు కట్టడం ఇక్కడే ప్రత్యేకత అనుకుంటా. పుట్టింది పగోజి ఐనా బతికింది తూగోజి కనక తూగోజిని చాలా దగ్గరగా పరిశిలించా, జీవితంలో. నాకు రెండు జిల్లాలంటే ఎక్కువ మక్కువ.
రావులపాలెం వంతెన కట్టక ముందు తూగోజిలో ప్రధాన రహదారులు, రాజమంద్రి-కాకినాడ కాలవగట్టు రోడ్డు ద్వారపూడి మీదుగా, రాజమంద్రి-కాకినాడ రోడ్డు రాజానగరం మీదుగా, మద్రాస్-కలకత్తా ట్రంక్ రోడ్డు, రాజానగరం మీదుగా,పేరు ట్రంక్ రోడ్ గోతులు గుంటలతో సింగిల్ మార్జిన్ రోడ్. కాకినాడ-పిఠాపురం రోడ్డు, చిత్రాడ మీదుగా. ఈ పిఠాపురం మద్రాస్-కలకత్తా రైల్ లైన్ మీద ఉంది. దాటి ముందుకెళితే కత్తిపూడి, ఇక్కడ ట్రంక్ రోడ్ కలుస్తుంది. కాకినాడ-కోటిపల్లి రోడ్డు, కాకినాడ నుంచి రామచంద్రపురం, మండపేట మీదుగా కపిలేశ్వరపురం,మండపేట నుంచి-ఆలమూరు గోదావరిగట్టుకు ముందుకెళితే జొన్నాడకి అదే రావులపాలెం వంతెనకి.రామచంద్రపురం నుంచి ద్రాక్షారామ ఆపైన యానాం. ఇక మెట్ట వైపు రాజమంద్రి నుంచి కోరుకొండ-గోకవరం-రంపచోడవరం, ఆపైన భద్రాచలం వెళ్ళేందుకు రోడ్డు లేదు.ఇవే ప్రధాన రహదారులు.
ఇక టెలిపోన్ ఎక్స్ఛేంజిలైతే రైల్ లైన్ పక్కన ఉన్నవే. రాజమంద్రి,సామర్లకోట, కాకినాడ,పిఠాపురం,తుని. ఆ తరవాత కాలంలో అనపర్తి, అమలాపురం,అంబాజీ పేట, మండపేట.ఇవి మేన్యుయల్ ఎక్స్ఛేంజిలు మిగిలినవన్ని చిన్న చిన్న ఆటో ఎక్స్ఛేంజిలు.
కోనసీమకి ప్రయాణ మార్గాలు కోటి పల్లి రేవు దాటితే ముక్తీశ్వరం..అమలాపురం. రాజమంద్రి నుంచి బొబ్బర్లంక లాంచి. అక్కడనుండి బస్సులో రావులపాలెం,కొత్తపేట, అంబాజీ పేట నుంచి అమలాపురం అలా ముందుకుపోతే ఓడరేవు. అంబాజీ పేట సెంటర్ నుంచి, గన్నవరం అదే అక్విడక్టు గన్నవరం, ముందుకుపోతే రాజో,లు ఆతరవాత సఖినేటిపల్లి. ఆ తరవాత అంతర్వేది. గోదారి పాయ రేవు దాటితే నరసాపురం (పగోజి). అమలాపురంలో కొంకాపల్లి ప్రసిద్ధి, జటకాబళ్ళకి. బస్సులు తక్కువ దగ్గర ప్రాంతాలకి జటకా బళ్ళే శరణ్యం. కోనసీమకి ప్రయాణం అంటే ఒక రోజు పట్టేది. ఇటువంటి కాలంలో గోదావరి దాటడానికున్న సాధనాలు రాజమంద్రి-కొవ్వూరు మధ్య రైల్ వంతెన ఒకటే మార్గం. మిగిలినదంతా నీటి రవాణాయే.తూగోజిల్లాకి కరంటు వచ్చిన కాలం 1950 ప్రాంతం.నాటి రోజుల్లో సీలేరు జల విద్యుత్తే శరణ్యం. అదుగో అటువంటి సమయంలో రావులపాలెం దగ్గర వంతెన కట్టాలని ప్రయత్నం మొదలయింది.ఈ ప్రయత్నానికి ముందుగా చెప్పుకోవలసినవారు కళా వేంకటరావుగారు,కొత్తపేట సుబ్బరాజు గారు. .
రావులపాలెం బ్రిడ్జి అనేది ఒక వంతెనకాదు, అనేక వంతెనల సముదాయం. తూగోజినుంచి పగోజికి కార్లో వెళ్ళాలంటే దాటవలసిన వంతెనలు వరసగా. ధవళేశ్వరం-కోటిపల్లి కాలవ జొన్నాడ దగ్గర, ఆ తరవాత గౌతమి మీద పెద్దవంతెన. అది దాటి ముందుకెళితే అమలాపురంకాలవ, అది దాటితే రావులపాలెం, ముందు కెళితే గన్నవరం కాలవ, అది దాటితేగోపాలపురం కాలవ. ఇదీ దాటితే వశిష్ట మీద గోపాలపురం-దొంగరావి పాలెంల మధ్య వంతెన.అది దాటితే సిద్ధాంతం కాలవ, అలా దొంగరావిపాలెం చేరితే రెండు కిలో మీటర్లలోపు సిద్ధాంతం అమ్మయ్య తూగోజి నుంచి పగోజి చేరేం,మొత్తానికి, ఈ మధ్యలో ఎన్ని పిల్లకాలవలో లెక్కేట్టలేదు.
ఈ వంతెనలను కట్టడానికి జొన్నడ నుంచి మొదలు గన్నవరం కాలవ మీద వంతెన దాకా వంతెనలను ఇంజినీర్స్ ఇండియా అనే సంస్థ, ఆ తరవాత వంతెనలను గామన్ ఇండియా సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. జొన్నాడ దగ్గరకి చేరాలంటే రాజమంద్రి నుంచి రెండు దార్లు, ఒకటి ధ్వళేశ్వరం-కోటిపల్లి కాలవ గట్టు, రెండవది రాజమంద్రి నుంచి కాకినాడ కాలవ గట్టున ద్వారపూడి అక్కడినుంచి మండపేట ఆ ముందు ఆలమూరు ఆ తరవాత జొన్నాడ ఒక చిన్న పల్లెటూరు, నాటికి. ఫోన్ లేదు, ఎలా? అందుకుగాను ఆలమూరులో ఒక పది లైన్ ల చిన్న ఆటో ఎక్స్ఛేంజి పెట్టేరు. దీనిని మండపేటకి కలిపేరు. మండపేటనుంచి రాజమంద్రికి రెండు ట్రంక్ లైన్లు, స్థంబాలమీద. ఆలమూరులో పెట్టిన పదిలైన్ల ఆటో ఎక్శ్ఛేంజిలో Phone No.1 Exchange. No.2 పోస్టాఫీసు, No.3 ఇంజినీర్స్ ఇండియా సైట్ ఆఫీసు, No.7 Sree.మల్లూరి పాపయ్య Landlord అనే వారి ఫోన్. ఇవే ఆ నాడు అక్కడి పోన్ కనక్షన్లు. ధవళేశ్వరం నుంచి కాలవగట్టున రావడానికి రోడ్ లేదు, అదీగాక ధవళేశ్వరం దగ్గర బయలుదేరిన ప్రధాన కాలవ వేమగిరి దగ్గర రెండుగా చీలింది. అదిగో అందులో గోదా రి గట్టు పక్క కాలవే కోటి పల్లి కాలవ. ఇక్కడ ఒక వంతెన కట్టాలి, అది కడితే మద్రాస్ కలకత్తా ట్రంక్ రోడ్ కు చేరేందుకు ఒక రోడ్, దాన్ని మిలిటరీ రోడ్ అనేవాళ్ళం. ధవళేశ్వరం ఆనకట్ట దాటి వచ్చిన భారీ వాహనాలు ట్రంక్ రోడ్ లాలాచెరువు కు చేరేందుకు వాడేదే మిలిటరీ రోడ్, కంకర రాళ్ళు పెద్దపెద్దవి కనపడుతూ ఉండేవి. అదే ఇప్పుడు నేషనల్ హైవే. అక్కడ వేమగిరి దగ్గర వంతెన కట్టేరు. ఆ తరవాత కోటి పల్లి కాలవపై జొన్నాడ దగ్గర వంతెన కట్టేరు. ఇప్పుడు ప్రధాన వంతెన పని మొదలయింది. గోదావరిలో నూతులు తీసి స్థంబాలు నిలబెట్టడం, ఒడ్డున ఆ స్థంబాల మీద పెట్టాడానికి గర్డర్లు తయారు చేయడం మొదలు పెట్టేరు.
సైట్ ఇంజినీర్ అచ్యుతరావు గారు, పేరు గుర్తుండిపోయింది.వారానికో పదిరోజులకో ఒకసారి పలకరిస్తుండేవారు. అందరూ ఒక సారి రండి వంతెన కట్టుబడి చూద్దురుగాని అని పిలిచేవారు, జీపు పంపుతాననేవారు. పని చేసేవాళ్ళం నలుగురం ఎప్పుడూ ఒకడు పలుపుతాడు తగిలించుకుని ఆఫీస్ లో ఉండక తప్పదు. మిగిలిన ముగ్గురిలో ఒకడు ఆఫీస్ లో ఉన్నవాడు డ్యూటి పూర్తైతే పంపేందుకు సిద్ధంగా ఉండాలి. ఏరోజు శలవు లేదు. మిగిలిన ఇద్దరూ కూడా చూసిరావడానికి కుదిరేది కాదు. అందుకు అచ్యుతరావు గారి కోరిక ఎప్పుడూ మన్నించలేకపోయాం, కాని ఫోన్ లో మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించేవారు, ఎప్పుడూ వారు మేము ముఖముఖాలు చూసుకున్నపాపాన పోలేదు. అంతే! అదంతే!!
మొత్తం ఒక టపాగా రాయడానికి ప్రయత్నించా కుదరలేదు,
సశేషం
నన్నయ భారతం లోని యయాతికి అనువైన పద్యం పోతన భాగవతం లోని మురారికి కూడా వర్తిస్తుందా?
హరిబాబు గారు,
నన్నయగారి యయాతి పద్యాన్ని పోతనగారి కృష్ణుడికి లింకేస్తానంటారా? బాగుందిగాని, చెయ్యి పట్టుకోడం పోలిక ఉందిగాని తేడా ఉన్నట్టుందండి.
ధన్యవాదాలు.
శర్మ గారు,
మధ్యలో వచ్చినందుకు ఏమనుకోకండి.
యయాతి దేవయాని చెయ్యి పట్టుకున్నాడని తెలిసినదే. ఆ రకంగా కృష్ణుడు ఎవరి చెయ్యి పట్టుకున్నాడంటారు? రుక్మిణిని చెయ్యి పట్టుకుని రథం మీదకు ఎక్కించుకున్న ఘట్టాన్ని గాని యయాతి ఉదంతంతో పోల్చే ప్రయత్నమా? అదే గనుక అయితే మీరన్నట్లు తేడా ఉంది.
అబ్బే శర్మ గారు అలా ఉత్తిగానే తేడా అంటూ చెప్పుండరండీ వినరా గారు. అంతరార్థం ఏదో
తప్పక వుంటుంది
వారి టపాకై వేచి చూద్దాం.
విన్నకోటవారు, జిలేబి.
యయాతి చెయ్యి అందించడానికి, మురారి చెయ్యి అందించడానికి, పోలిక తేడా మన హరిబాబుగారు చెబితేనే అందంగా ఉంటుందనుకుంటున్నానండి.
ధన్యవాదాలు.
ఇంతకీ ఏమి చెప్ప వచ్చి టెలికాం బాక్సులో మునిగితేలి సశేషం పెట్టినారు 🙂
బామ్మా! ఏంటీ తెగ తిరుగుతున్నావ్ ఇండియాకి సింగపూర్ మధ్య! మనవడికి పెళ్ళి చేశావా! వాళ్ళ బతుకువాళ్ళని బతకనీ 🙂
Wait and see the next part.
very nice memories sir! We need to record the history – whether people take it or not!
హరిబాబుగారు,
చరిత్ర తెలుసుకోవలసినదే! ఇది చేదు జ్ఞాపకం ఐనా అక్షర బద్ధం చేశా. ఈ దుస్సంఘటన తరవాత కొంత నా పాత్ర ఉండడం తో గుర్తుండిపోయింది.
ధన్యవాదాలు.
చాలా ఆసక్తికరంగా ఉంది శర్మ గారూ. అందుకే చరిత్ర తెలుసుకోవాలంటే నాకు మహా ఇంట్రెస్ట్. రావులపాలెం వంతెన కడుతున్నప్పుడు నేనొక సారి చూడడం జరిగింది.
—————–
// “కాకినాడ-పిఠాపురం రోడ్డు, చిత్రాడ మీదుగా. ఈ పిఠాపురం మద్రాస్-కలకత్తా ట్రంక్ రోడ్డు మీద ఉంది. ” // అన్నారు పైన. ఏమనుకోకండి, పిఠాపురం మద్రాస్-కలకత్తా రైలు మార్గంలో ఉంది కానీ ట్రంక్ రోడ్డు మీద కాదు. అక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెడితే కత్తిపూడి వస్తుంది. ఆక్కడ ట్రంక్ రోడ్డుకు కలుస్తుంది 🙏.
విన్నకోటవారు,
పొరబడ్డాను. అలాగే కాలవల విషయంలో కూడా తడబడ్డాను. సరి చేశాను చూడగలరు.
చరిత్ర తెలుసుకోవలసినదే, కొన్ని జ్ఞాపకాలు చేదుగా ఉండచ్చుగాని చరిత్రకి ఎక్కకపోతే పొరబాటే! అందుకే దీన్ని అక్షరబద్ధం చేశానండి. మరేమైనా పొరబాట్లు కనపడితే చెప్పగలరు.
ధన్యవాదాలు.