శర్మ కాలక్షేపంకబుర్లు- వంకాయ బండ పచ్చడి

వంకాయ బండ పచ్చడి

వంకాయలు రెండు రకాలు తెల్లవి నల్లవి. వీటిలో మళ్ళీ రెండు రకాలు పొడుగువి గుండ్రనివి. గుండ్రని వాట్లో పెద్ద కాయలు వేరు, ఇవి ఒక్కొకటి కేజి ఆ పైన తూగుతాయి కూడా. వీటిని మా దగ్గర జేగురుపాడు వంకాయ అంటాం. ఇవి తెల్లగా పెద్దవిగా ఉంటాయి. ఇందులో ముళ్ళొంకాయ కూడా ఉంటుంది,తెల్లగా, పెద్దదిగా. ఇలా పెద్దగా ఉన్న కాయలు పచ్చడికి బాగుంటాయి. ఇందులో చారలున్న కాయలుంటాయి, వీటిలో గిజర ఎక్కువుంటుంది, ఇవి మాత్రం బాగోవు పచ్చడికి. గిజర అంటే గింజలని అర్ధం, ఈ గింజలు చిన్నచిన్నగానే ఉంటాయి. 

ఈ కాయని నిప్పుల మీద కాల్చాలి, నిప్పులు దొరకవు కదూ! గేస్ బర్నర్ మీద ఇనప చిక్కం వేసి  కాల్చచ్చు. కాల్చిన కాయను పక్కన పెట్టుకోండి. సన్నగా చింతపండు పులుసు పిసకండి. దానిలోకి ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కోండి. అలాగే పచ్చి మిర్చిని కూడా బాగా సన్నగా తరగండి. కొచం పసుపు పిసర వేయండి. కాల్చిన వంకాయ పైన నల్లగా మాడినది ఒలిచేయండి. ఇప్పుడు ఈ ఒలిచిన వంకాయను చింతపండు పులుసులో వేసి పిసకండి. మిక్సీ లో వేయద్దు. బండతో దంచుకుంటే బాగుంటుంది, బండ దొరకదుగా! పప్పు గుత్తి ఉంటే దానితో కలపండి. ఇందులో పోపు వేయండి, ఇష్టమైతే ఇంగువ వేయండి,పోపులో.కొద్దిగా వేయించిన నువ్వు పప్పు కలపండి.చిన్న బెల్లం ముక్కేయండి. తీపిగా తినాలనుకుంటే ఎక్కువే వేయండి. ఉప్పు సరి చూసుకు వేయండి. మూత పెట్టి ఉంచేయండి. నాలుగు గంటల తరవాత వాడండి. ఆ రుచేవేరు కదా!

 

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- వంకాయ బండ పచ్చడి

 1. వంకాయ బండ పచ్చడి అయినా పులుసు పచ్చడి అయినా మేము (అంటే మీరా? అని అడగకండి, అర్ధం చేసుకోండి) లావాటి నల్ల వంకాయల తోటే చేసేస్తాం. లావాటి తెల్ల పచ్చడి వంకాయలు ఇక్కడ దొరకటం లేదు. ఈ రుచి కూడా అలవాటు అయిపోయింది. అలవాటు అయింది కాబట్టి బాగానే ఉంటోంది. ………… మహా

  • బులుసు సుబ్రహ్మణ్యం గారు,

   బహుకాల దర్శనం,కుశలం కదా!

   కావలసినవి దొరక్కపోతే దొరికినదానితో సంతృప్తి పడాలి కదండీ!

 2. నోటిని పండ్లే లేవోయ్
  చాటెద వంకాయకూర చకచక చేయన్
  వాటముగా “నెట్లో” నా
  మాటామంతియిది నేటి మగువల్లారా 🙂

 3. మా అయ్యరు గారికి చెప్పి చేయమని వెంఠనే ఆర్డరు జారీ చేసేసా

  ఇట్లు
  పరమసాధ్వి
  జిలేబి

  • అదేమిటి “జిలేబి” గారూ? మీరు చెప్పిన కాకా హోటల్ / కామత్ / “మేక-డొనాల్డ్ ” / పిట్జా హాట్ / జొమేటో / స్విగ్గీ ఏమయినాయి? మళ్ళీ అయ్యరు గారే బలా?

   • అబ్బే! ఉచిత సలహలు, ఆలోచనలు, గట్రా మిగతా వారికే. మనదాకా వస్తే అన్నిటికీ అయ్యరే 🙂

 4. వాడడం నాలుగు గంటల తరవాతా? అంటే మధ్యాహ్న భోజనంలోకి ఈ పచ్చడి కావాలనుకుంటే పొద్దున్నే తయారు చేసెయ్యాలన్నమాట?
  ఏమిటో మా అమ్మ, తరవాత ఇంటావిడ చేసిపెడితే తినడమే తప్ప ఈ కిటుకులేమీ తెలియవు.

  • వినరా వారూ

   ఇవన్నీ అయ్యేపనులేనా ? శుభ్రం గా కాకా హోటలు కెళ్ళి, లేక కామత్ హోటల్ కెళ్లి, లేక మెక్కడొనాల్డో, పిజ్జా హట్టో అదీ కుదరదనుకుంటే జొమేతో ని కాల్స్చేసో తెప్పించుకోవడమే బెటరంటా 🙂 మీ‌రు దీని పై డబ్బా వాలా వారి వేగముతో స్పందించవలె 🙂

   జిలేబి

   • Swiggy కూడా ఉంది, మరిచిపోయారే “జిలేబి” గారు 😃?

    ఎందుకు అవవు? చేసుకునే / చేసిపెట్టాలనే ఆసక్తి, అభిరుచి ఉండి, సమయం కుదుర్చుకుంటే తప్పక అవుతాయి. మామూలు రోజుల్లో కుదరకపోతే శనాదివారాలున్నాయిగా?

    పైన శర్మ గారు చెప్పిన పరికరాలు ఈ కాలంలో అపార్ట్మెంట్ జీవితాల్లో దొరకవనుకుంటే ప్రత్యామ్నాయం కూడా శర్మ గారే చూపించారుగా.

    “జర్నీ” అనే చిత్రంలో హీరోయిన్ చిన్న ఊరు నుండి నగరానికి వస్తుంది ఉద్యోగం ఇంటర్వ్యూ నిమిత్తం. వేరేవారి పురమాయింపు మీద రిసీవ్ చేసుకున్న హీరో ఇంటర్వ్యూ అయిన తరువాత భోజనానికి హోటల్ కు తీసుకువెడతాడు. అక్కడ కిటకిటలాడుతుంటుంది. ఆడవాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తుంటే, “మీ ఊళ్ళో ఇంట్లో వంట చేసుకోరా?” అని హీరోతో అంటుంది ఆ అమాయక హీరోయిన్. అటువంటి కాలంలో బతుకుతున్నాం.

    నా ఈ జవాబు “డబ్బావాలాల” వేగంతో సమానంగా ఉందా 🙂?

   • ఈ హీరోయిన్ కత ఈ మధ్యనే ఎక్కడో చదివానబ్బా? ఎక్కడా?
    వంటింట్లోకి ప్రవేసించడం కూడా ఒక కళ. ””ఏం చెయ్యద్దు మహప్రబో, ఇక్కడినుంచి కదిలి పేపరు చూసుకోండి హాల్లో, టైమ్ అవగానే భోజనానికి పిలుస్తాగా”” అన్నది స్టాండర్డ్ డయలాగొస్తుంది, ఆ వెంటనే గడుసుకోడలు తలుపుచాటునుంచి కిసుక్కున నవ్వి ””అత్తయ్యా! సాయానికి రానా”” అడుగుతుంది. చిన్నబుచ్చేసుకోక నిలదొక్కుకోవాలి 🙂
    వంట చెయ్యకపోయినా చెయ్యడమెలాగో నేర్చుకోవాలిగా 🙂 ””నువు పప్పు వేయించావా”” అడిగితే మీ అమ్మగారూ ఇలాగే అడిగేవారు అని అత్తగారిని తలుచుకోరూ 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s