బోద్ధారో మత్సరగ్రస్తాః
మంచిమాట ఎవరికీ అక్కరలేదు. ఈ మాటన్నది నేనుకాదండి,స్వయంగా భర్తృహరి అన్నదే! ఈ మాటంటూనే శతాకాలు మొదలెట్టేరు, మొదట చెప్పినది నీతి శతకమే, ఇదే మొదటి శ్లోకం, అవధరించండి.
బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః
అబోధోవహాతాశ్చాన్యే జీర్ణ మజ్గ సుభాషితమ్
బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు
ప్రబలగర్వభూషితుల్ ప్రభువులెన్న
నితరమనుజు లబోభోపహతులుగాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.
తెలిసినవారు అసూయాపరులు, ప్రభువులా గర్వాంధులు. సామాన్యులకు తెలుసుకొనుతెలివి లేదు, కావున నేను చెప్పదలచిన సుభాషితం నాయందే అణగిపోయినది.
ఆనాటికి ఈనాటికి ఇందులో మార్పురాలేదు.
ప్రభువులు ఎప్పుడూ ప్రభువులే! నిరంకుశులే! ఏ కాలంలో ఐనా! వారికి, సుభాషితం చెవినేసుకునే సమయమే ఉండదు. అధవా చెవినిబడ్డా ఆచరించే మనసు, సమయం ఉండవు. వారికెంత సేపు వారి గొప్ప కైవారం చేయించుకోడం, వంది మాగధుల స్తుతులు, రాబడి లెక్కల చిక్కులు, కాంతల కౌగిళ్ళు, ఇంకా ఇతర విషయాలే తప్పించి మంచిమాట వినే సావకాశమెక్కడా?
నేను రెండవవారుగా చెబుతున్నా తప్పించి,భర్తృహరి మాత్రం వీరిని మొదటగానే చెప్పారు, ”బోద్ధారో” అంటే మంచి చెడ్డ చెప్పవలసినవారు.. వీరిని బోద్ధలన్నారు. వారు నేటికాలపు మేధావులు, అనుకోవచ్చు. అసలు నీతిబోధ వీరే చెయ్యాలి కాని వారికా సమయమే దొరకదు. వీరికి తమ గొప్ప నిరూపించుకోడానికి, కాంతాకనకాల పై మోజు తీర్చుకోడానికి, ప్రభువుల దయ చూరగొనడానికి,ప్రభువుల,కాంత కైవారాలు సలపడానికి, ఇతర మేధావులను కించపరచే దానిలోనే సమయం సరిపోదు. వీరు మత్సరగ్రస్తులన్నారు, కవిగారు. అంతశ్శత్రువులారన్నారు,పెద్దలు. వీటిలో చివరిదే మత్సరము అదేఅసూయ.కామ, క్రోధ,మోహ,లోభ,మద, మాత్సర్యాలే అవి. ఒక్కొకమెట్టు పెరుగుతూ చివరిదైనదే అసూయ. ఈ అసూయ కూచోనివ్వదు,నిలబడనివ్వదు. అసూయ చేసే చిన్నెలు చూడవలసినదేగాని చెప్పడం వర్ణించడం చాలా కష్టం. ఆడ,మగ తేడా లేదు వీరిలో. ఇక వీరెన్ని రకాలు, నా తల మీద ఉన్న వెంట్రుకలన్ని గ్రూపులు, గ్రూపులో కూడా ఒకరంటే మరొకరికి పడదుగాక,పడదు. ఉన్నమాట చెప్పుకోవాలంటే అందరూ స్వార్ధపరులే! అందరూ కాంతాకనకాల వెంట పరుగులు తీసేవారే! ఇక సమాజానికి మంచిమాట చెప్పే సమయమేదీ? బహు కొద్దిమంది కుమ్మరావలో ఇత్తడి ముంతల్లా అక్కడక్కడ కనపడచ్చు.
మిగిలినవారు, సామాన్యులు. వీరికి రెక్కాడితేగాని డొక్కాడదు, శరీరమాద్త్యం ఖలు ధర్మ సాధనం, వీరిది. ఏరోజు కారోజు ”పిట్టనికొట్టా పొయిలో పెట్టా” సరిపోతుంటుంది, పొయిమీదకి పొయి కిందకి వెతుక్కోడమే వీరికి జీవిత లక్ష్యం, పరమార్ధం అయినది..వీరికి సుభాషితం వినే సమయమే లెదు. ఒక్కొకపుడు విన్నా, ఆచరించే సమయం లెదు, తాహతసలే లేదు. కారణం ఏదైనా సుభాషితం ఆచరించాలంటే విత్తం కావాలి, అది వీరి దగ్గర పూజ్యం, అందుచేత ఒక వేళ మంచి మాట వీరి చెవిని పడినా అది నిష్ప్రయోజనం.
కవిగారు ఇంకా ఇలా అనుకున్నారు, ఇటువంటి సమాజంలో నా సుభాషితం ఎవరికి కావాలి? ఎవరికి చెప్పను, అని వేదన పడ్డారు, సుభాషితం నా లోనే అణగిపోయిందన్నారు. అలాగని చెప్పడం మానేసేరా? లేదు. ఆరు శతకాలు చెప్పేరు, చెప్పడం నాధర్మం,నా పని నేను చేస్తున్నా! విత్తనాలు వెదజల్లుతున్నా! పండే పంటని సద్వినియోగ పరచుకోవడమనేది, ముందు తరాల పని, అనుకున్నారు.నేటికీ కవిగారు చెప్పిననాటి పరిస్థితులు మారలేదు.
నేటికీ కవిగారు చెప్పిననాటి పరిస్థితులు మారలేదు. నేటి ప్రభువులు ఇదంతా మతమౌఢ్యం, చెప్పడానికే వీలు లేదంటున్నారు, బడిలో. తరవాత తరాలవారి మాటేమో……
మంచి మాట అనగానే మనసుకు భయం పుడుతుంది. మూలాన్ని పట్టుకున మూలుగుతూ ఉండే మనసుకు మూలమంటే భయం. మూలం తెలిస్తే దానికి ఉనికి ఉండదు. మరి తన ఉనికినే తానే పాడుచేసుకోవాలంటే, ఆమనసుకు యోగసిద్ది ఉండాలి. అందుకే మంచి అనగానే మనకెందుకు అంటూ చుట్టూ ఉన్నవారిని మనసు చూస్తుందంటారు.
newsgita.com నేటిన్యూస్ రేపటికి గీతాపాఠం.
newsgita
మంచిమాట చెప్పేరు