పాపి చిరాయువు.
”అయ్యా! చాలా కాలం అయ్యింది మీరు మీ బ్లాగుని దర్శించి “పాపి చిరాయువు” అని అంటారు ఎందుకని.” ఇలా మెసేజి వచ్చింది నాలుగు రోజుల కితం. మెసేజి ఇచ్చిన దెవరు, కాంటాక్ట్ డిటైల్స్ మిస్సయ్యాయి,వెతుక్కున్నా. దోరకలేదు,చివరికి దొరికేయి. అది మరో కత మరోసారి….
మెసేజి రెండు భాగాలు, మొదటిది అభియోగం. తలవంచి నమస్కరిస్తున్నా! ఇక రెండవది,రాయక తప్పలేదు, అదేమనగా…….
పాపి చిరాయువు కదా! ఇందులో పాపియన నెవ్వరు? పాపం చేసినవాడు. పాపమననేది? మరో ప్రశ్న. దీనికి మనపెద్దలు చెప్పిన సమాధానం. ”పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం” అనగా ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఎవ్వారినైనా పీడించడం పాపం.
దీన్ని వివరిస్తే ఎంతేనా ఉంది. కొద్దిలో తేల్చేస్తా. ఇతరులకు అవసరంలో మాట సాయం నుంచి సొమ్ము సాయం చేసేదాకా ఏదైనా ఉపకారమే! దీనిలో ప్రతిఫలాపేక్ష ఉండదు, కాని పుణ్యం మాత్రం చేరుతుంది, మన ప్రమేయం లేకనే! ఇక పాపం అన్నది ఇతరులను పీడించడం, ఇది కూడా మాట దగ్గరనుంచి సొమ్ము దాకా ఆపై శారీరికంగా, మానసికంగా హింసించడం దాకా పాపకార్యాలే!
తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, నిప్పు ముట్టుకుంటే కాలకమానుతుందా! అలాటిదే ఇదిన్నూ! ఇటువంటి పనులు చేసేటపుడు మన అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది, పాపం చేస్తున్నావూ అని కాని మనం అంతరాత్మని జో కొట్టేస్తాం.
. అందుకే ”నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవించడం అని” సామెత. పుణ్య పాప కర్మలకి ఫలితం తప్పదు, ఫలితం అనుభవించకా తప్పదు.”ఎవరు చేసిన కర్మవారనుభవింపకా ఏరికైనా తప్పదన్నా! ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పాగలరు, అనుభవింపక తప్పదన్నా!” తత్త్వం.
ఈ పాపపుణ్య కర్మల ఫలితం మరొకరు అనుభవించడం కుదరనిదిన్నూ! పుణ్యకర్మకి భాగస్థులు ఒక్కరే అది భార్య మాత్రమే! భార్య చేసుకున్న పుణ్యంలో మాత్రం భర్తకి భాగం లేదు. భర్త చేసిన పాపంలో భార్యకు వాటాలేదు. అలాగే పాపానికి కూడా భాగస్థులున్నారు. కర్త,కారయిత,అనుమోదకులు.అనగా కర్త పాపం చేసేవాడు, కారయిత పాపం చేయించేవాడు, అనుమోదక అనగా చేస్తున్న పాపాన్ని చూసి చంకలెగరేసి బాగుంది,బాగుందన్నవాడు.
ఉత్కృష్టమైన పుణ్యపాపాల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి. పుణ్యాన్ని అనుభవించాలంటే దేవతవుతారు. పుణ్య ఫలం పూర్తికాగానే మళ్ళీ మానవలోకంలో పుడతారు. ఎలా పుడతారు? అందంగా,ఆరోగ్యంగా, ధనవంతులుగా,తెలివైనవారుగా పుడతారు. అసలు కత ఇప్పుడు ప్రారంభమవుతుంది. పూర్వజన్మ పుణ్య ఫలం చేత ఇలా పుట్టేమన్న స్పృహ పోతుంది. ఇక ధన యవ్వన ఇతర గర్వాలు పెరిగిపోతాయి. కామక్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు పెరిగిపోతాయి. ఇంక చూడండి చేసేవన్నీ పాపాలే ఐ ఉంటాయి. పుణ్య ఫలం వల్ల కలిగిన దీర్ఘాయువు ఇలా దుర్వినియోగం అవుతుంది. చేస్తున్నవేమో పాపాలు కాని దీర్ఘాయువుగా ఉంటాడు. చూడ్డానికి ఇవి రెండు భిన్నంగా కనపడుతూంటాయి. అయ్యో ! దేవుడా ఈ పాపాలు చేస్తున్నవాడిని దీర్ఘాయువుగా ఉంచావే అని వాపోతుంటాం. అదీ పాపీ చిరాయువు కత.
అసలు విషయం చెప్పాల్సి వస్తే చాలా ఉంది కాని మధ్యలోచే దారి తప్పించేశాను,ఏమనుకోవద్దు. క్లుప్తంగా చెప్పి ముగించేశానంతే!బాకీ తీర్చేసుకున్నాను.
ధన్యవాదాలు. ఓపిక చేసుకుని విపులంగా వివరించినందుకు.
చేసిన పాపానికి దీర్ఘ ఆయుషునిచ్చి భగవంతుడు శిక్షించాడు. వాడి కళ్ళముందే వాడి సంతు, చుట్టాలు పోతూవుంటే, వృద్ధాప్యంలో మానసిక, శారీరక కష్టాలు అనుభవించడం ఒక నరకం అని మా అమ్ముమ్మ చెపుతూ ఉండేది.
చెఱువు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు,
పాపి చిరావువెలా అవుతాడు అన్నది మాత్రమే చెప్పి ఊరుకున్నానండి. భగవంతుని శిక్షలు రకరకాలు. అందుకే పెద్దవాళ్ళు ”నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తావ”నేవారు. ఈ శిక్షల పోర్షన్ చాలా పెద్దది కదండి.దీర్ఘాయువిచ్చి శిక్షించడం కూడా అందులో ఒకటండి.
ధన్యవాదాలు.