దేవ శుని
శునకః మగ కుక్క శునీ ఆడ కుక్క. ఈ ఆడ కుక్కకో పేరు. అదే ”సరమ” ఇది దేవతల కుక్కట. దేవతల కుక్క అనగా దేవతలయొక్క కుక్క షష్టీ తత్పురుష సమాసమా? లేక కుక్క దేవతా? ఇదే సమాసమో తెలీదు 🙂 ఏమైనాగాని ఈ కుక్కకో కత అదీ ఎక్కడా? ఋగ్వేదంలో. అదేంటో చూదాం. కుక్క దేవతంటే ఇష్టం లేనివాళ్ళు చదవద్దు 🙂
దేవతల రాజు దేవేంద్రుడు, ఈయన ఈ దేవతల కుక్కకి ఒక పని అప్పజెప్పేడు. అదే దేవతల ఆవుల్ని మేతకి తోలుకుపోవడం కాయడం, వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడమే ఆ పని. సరమ చాలా జాగ్రత్తగా ఈ పని చేస్తూ వచ్చింది.
ఒక రోజు దొంగలు దేవతల ఆవుల్ని దొంగిలించి తోలుకుపోయారు. సరమ దేవేంద్రుని దగ్గర దొంగలు ఆవుల్ని తోలుకుపోయిన సంగతి చెప్పింది. విన్న దేవేంద్రుడు సైన్యాన్ని వెంట బెట్టుకుపోయి ఆవుల్ని విడిపించుకు రమ్మన్నాడు. సరమ సైన్యంతో వెళ్ళింది. దొంగలనాయకునితో ఆవుల్ని అప్పగించమని చెప్పింది. దొంగల నాయకుడు సరమా నువ్వు ఎంత భక్తిగా ఆవుల్ని కాసినా ఒక్క రోజునా దేవేంద్రుడు నీకు పాలు తాగమని ఇవ్వలేదు. నువ్వు నీ సైన్యంతో మా పక్షానికొచ్చెయ్యి. నీకు నిత్యమూ ఆవుల పాలు ఇస్తాను అని చెప్పి ప్రలోభ పెట్టేడు.సరమ ఈ ప్రలోభానికి లొంగిపోయి దొంగలతో సైన్యంతో సహా చేరిపోయి పాలు తాగుతూ కాలం గడుపుతోంది.
ఆవుల్ని విడిపించుకురావడానికి పోయిన సరమ, సైన్యం ఎందుకు తిరిగిరాలేదేమోనని దేవేంద్రుడు పరిశీలించగా జరిగినది తెలిసింది. అప్పుడు దేవేంద్రుడు సైన్యంతో వెళ్ళి దొంగలను శిక్షించి ఆవుల్ని మళ్ళించి, సరమ నెత్తి పై కొట్టడంతో అప్పటివరకు సరమ తాగిన పాలన్నీ కక్కుకుంది. సరమను కుక్క సైన్యాన్ని, తనతో వచ్చిన సైన్యాన్ని వెంట బెట్టుకుని దేవేంద్రుడు అమరావతి చేరుకున్నాడు.
ఈ దేవతల కుక్క భారతం మొదటిలో కనపడుతుంది, సరమ పేరుతో. ఈమెకు ఒక కొడుకు, వాడి పేరు సారమేయుడు, చిన్నవాడు. ఇతను జనమేజయుడు చేస్తున్న దీర్ఘసత్రయాగం
( బహుకాలం సాగే అన్నదానం ఎడతెరిపి లేక) దగ్గరకి ఆడుకోడానికి వచ్చాడు. ఇది చూసిన జనమేజయుని తమ్ములు శ్రుతసేనుడు,భీమసేనుడు, ఉగ్రసేనుడు అనేవాళ్ళు సారమేయుణ్ణి బయటికి తరిమేశారు, కొట్టేరు. వాడు పోయి తల్లి సరమకి చెప్పుకున్నాడు. కోపం పట్టలేని సరమ జనమేజయుని దగ్గరకొచ్చి
క్షితినాథ కడు నకరుణాన్వితులై నీతమ్ములతి వివేకదూరుల్
మతి దలపక నా పుత్రకు నతిబాలకు ననపరాధు నడచిరి పెలుచన్.
తగునిది తగ దని యెదలో వగవక సాధులకు బేదవారలకెగ్గుల్
మొగి జేయు దుర్వినీతుల కగుననిమిత్తాగమంబులయిన భయంబుల్
రాజా! కరుణలేని నీతమ్ములు, ఆలోచన లేనివారు, నాకొడుకు బహుచిన్నవాడు, అపరాధం ఏమీ లేనివానిని కొట్టేరు.
ఇది చే య చ్చు, ఇది చేయకూడదని ఆలోచించక, పేదవారికి,సాత్వికులకు బాధ కలిగించేవారికి కారణం లేని భయాలు కలుగుతాయని చెప్పి వెళ్ళిపోయింది.
సరమ దేవతల కుక్కే! కుక్కదేవత కాదు. కుక్క దేవతైతే పిల్లలుండరు. దేవతలకి పిల్లలుండరుగా!