ఉద్దాలకుడు,చండిక
మనదేశంలో వాక్స్వాతంత్ర్యం ఎక్కువ, ఎవరేనా ఏమైనా మాటాడేస్తారు. ఇలా మాటాడచ్చు మాటాడకూడదు అనే శషభిషలేం లేవు.
ప్రభుత్వం చెప్పిన దేనినైనా కాదనడమే కొంతమంది మాట. వీరు దుఃఖ భాగుల్లో ఒకరైన నిత్య శంకితులు. అయ్యో! ఇది మంచిదేమో, ఆచరించ తగినదేమో అనే విచక్షణలేదు. కాదనడమే ధ్యేయం.ఇంతకంటే వివరించను. ఈ సందర్భంగా జైమిని భారతం లో ఒక చిన్న కత గుర్తొచ్చింది, చెబుతా!అవధరించండి.
ఉద్దాలకుడు అనే ఆయన ఒక ముని. తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. కొంతాకాలం తరవాత పితృఋణం తీర్చుకోవాలి అని వివాహానికి ప్రయత్నం చేశాడు. పితృఋణం ఏంటని అనుమానం కదా, సంతానాన్ని కనడమే పితృఋణం తీర్చుకోవడం, అంటే వంశాభివృద్ధి చేయడం.. ఒకకన్య దొరికింది, ఆమె పేరు చండిక. వివాహం చేసుకున్నాడు. కాపరం నడుస్తోంది, బ్రహ్మచారి కాదు సంసారి కాదన్నట్టు ఉన్నాడు. ఉద్దాలకుడు చెప్పిన ప్రతి మాటని ఖండిచడమే వ్రతమైపోయిందా ఇల్లాలికి. వివాహమైన కొత్త కదా సరిపెట్టుకున్నాడు. ఎన్నాళ్ళకీ ఆమెలో మార్పు కనపడలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచించి, గురువుతో చెప్పుకున్నాడు, తన కష్టం. గురువు ఆలోచించి ”నువ్వు చెప్పిన ప్రతి పనికి వ్యతిరేకంగా చేస్తోంది కనక, నీకు కావలసిన దానికి ప్రతిగా ఆమెకు చెప్పమని” చెప్పేడు. నేను నీ సంసారం చూడడానికి వస్తున్నానని చెప్పేడు.
ఇంటికొచ్చిన ఉద్దాలకుడు చండికతో తనకు కావలసిన దానికి వ్యతిరేకంగా చెప్పడం మొదలెట్టేడు. ”జపమాల తెంచి పారెయ్యి జపము లేదు తపస్సు లే”దంటే. ”అయ్యయ్యో! మంచి జపమాల తెంచుకుంటారా! అని, జపం చేయండి” అని పట్టుకొచ్చి ఇచ్చింది. ”మడి లేదు తడీ లేదు పంచలని చింపెయ్య”మంటే, ఆరేసిన మడి పంచలు మడత పెట్టి తెచ్చి ఇచ్చింది. ఇలా కావలసినదానికి వ్యతిరేకంగా చెబుతూ కాలం గడుపుతుండగా గురువుగారు వస్తున్నట్టు కబురు తెలిసింది.
వార్త తెలిసాక చండికతో ”గురువు లేడు దేవుడూ లేడు, నా కోసం ఎవరొచ్చినా లేనని చెప్పెయ్యి. ఇక్కడొక రోజు ఉంటానన్నాడు. లోపలికి రానివ్వకు తరిమెయ్యి, బడిత పూజ చెయ్యి, ఆతిథ్యం కాదు, మంచి నీళ్ళు కూడా ఇవ్వకని” చెప్పిపడుకున్నాడు. మర్నాడు ఉదయమే ఉద్దాలకుని గురువుగారొచ్చారు. ”అమ్మా! ఉద్దాలకుడున్నాడా నేనాయన గురువును” అని అడిగాడు. చండిక ”ఉన్నారండి, లోపలికి దయచేయ”మని ఆతిధ్యం ఇచ్చి ఉద్దాలకుని లేపి ”గురువుగారొచ్చారు చూడమ”ని వంట పనిలో పడింది.మంచి వంట చేసి విందు ఇచ్చి ఉద్దాలకుని చే గురువును సత్కరింపజేసి పంపింది. బయట కొచ్చిన తరవాత గురువుకు నమస్కారం చేస్తూ ”మీరు చెప్పిన మంత్రం పని చేసిందని” ఆనందించాడు. కాలం గడుస్తుండగా ఉద్దాలకుని తండ్రి తద్దినం రోజు రాబోతుండగా, ఉద్దాలకుడు చండికతో ”మాతండ్రి తద్దినం తిథి ఎల్లుండి, తద్దినం లేదు గిద్దినం లేదు ఏమీ చెయ్య”నన్నాడు. కత మామూలే తద్దినం పెట్టి తీరాలంది చండిక. ఐతే ఎవరో సామాన్యులని భోక్తలుగా పిలుస్తానంటే కుదరదు ఆచారవంతులనే పిలవాలని పిలిపించింది. రెండు కూరలు రెండు పచ్చళ్ళు చాలు భోజనానికి అంటే కాదు నాలుగు కూరలు,నాలుగు పచ్చళ్ళు చేయాల్సిందే. అవిగాక గారెలు,ఆవడలు,అరిసెలు,అప్పాలు, పరమాన్నం వండి తీరాల్సిందే అని పట్టుబట్టి చేసింది. ఆ తరవాత దక్షణ ఇవ్వక్కర లేదంటే దక్షిణ భారీగా ఇప్పించింది. ఇక చివరి రంగమైన పిండాల పార్వణ మిగిలింది. ఇంత సవ్యంగా పితృ కార్యం జరగడంతో ఆనందంలో ఉద్దాలకుడు విషయం మరచాడు.
పిండాలను జలంలో వదలివస్తానన్నాడు. అంతే చండిక వాటిని తీసుకుపోయి పెంట మీద పారేసింది. చూసిన ఉద్దాలకునికి పట్టరాని కోపమే వచ్చింది, శ్రార్ధం ఇలా తగలబడిపోయినందుకు. అమిత కోపంతో శపించాడు ”రాయివి కమ్మని”. చిగురుటాకులా వణికిపోయింది చండిక, చూసిన ఉద్దాలకుడు చలించిపోయాడు. శాప విమోచనం చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు.
మంచి చెడ్డల విచక్షణా జ్ఞానం నశించిన నేటి కుహనా మేధావులు చండికలాగే ఉన్నారు.
నా చిన్నప్పుడు మా తాతయ్యగారి ఇంటి ఎదురుగా ఉండే భార్యభర్తలు తరచుగా గొడవ పడేవారు. వార్ని ఉద్దేసిస్తూ వాళ్ళు చండీ ఉద్దాలకులురా, ఎడ్డెమంటే తెడ్డెమంటుందని అనేవారు.
అప్పుడు ఎందుకలా అనేవారో నాకు అర్ధం కాలేదు. ఇప్పుడు తెలిసింది ఆ మాట వెనుక కధ.
చండీ శాపవిమోచనం ఎలా అయిందో తెలపగలరు.
మార్జాల దాంపత్యం కూడా ఇలాటిదే అనుకుంటానండీ.
ధర్మరాజు అశ్వమేధం చేస్తాడు,యుద్ధం తరవాత. దానికి రక్షణగా అర్జునుని పంపుతాడు. అతని కాలు తగిలి చండిక మరల స్వరూపం పొందిందని జైమిని భారతం మాట