శర్మ కాలక్షేపంకబుర్లు-కారపు ఆవకాయ/కాయావకాయ

కారపు ఆవకాయ

దీన్నే కారపు ఆవకాయ అంటారు గోజిలలో. దీని పేరులో ఆవ ఉందిగాని దీనిలో ఆవ ఉండదు. అంచేత వేడి చేస్తుంది, అనారోగ్యం చేస్తుందనే మాట ఉత్తదే!

ఆవకాయ పెట్టుకోడానికి తగిన కాయేదీ? కొత్తపల్లి కొబ్బరి,చిన్నరసాలు ఇలా పీచు ఉన్నకాయ ఏదైనా ఆవకాయకి మంచిదే, పుల్లగా ఉంటే!   మాడుగుల ఆవాలు లేదా సన్నావాలు అంటారు, మహ ఘాటు, పెద్దావాలతో పెట్టుకుంటే కమ్మహా ఉంటుంది.  కారం, పచ్చావకాయకైతే గొల్లప్రోలు కాయలు, మామూలు ఆవకాయకైతే వరంగల్ కాయ బాగుంటుంది. వరంగల్ కాయైతే కారం కమ్మగా ఉంటుంది, గుంటూరు కాయ కంటే.వరంగల్ కాయ పెద్దదిగా ఉంటుంది, కొంచం దళసరిగా ఉంటుంది, కారం దిగుబడీ బాగుంటుంది. ఇక ఉప్పు, కళ్ళ ఉప్పు వాడుతారు, ఇందులో కూడా ఐయోడిన్ ఉంటుంది (ట). ఉప్పు ఎండబెట్టుకుని దంచుకుని అమ్మో బాధ పడలేమనుకుంటే పేకట్లో ఉప్పు వాడెయ్యచ్చు, చెమ్మ లేకుండటం ముఖ్యం.

ఇక మాగాయి పెట్టుకోడానికి తగిన కాయ పెద్దరసాలు,పంచదార కలసి, సువర్ణరేఖ ఇలా పుల్లగా ఉండేకాయ, పీచులేనట్టి కాయ, ఊట ఎక్కువగా వచ్చేకాయ ఏదైనా బాగానే ఉంటుంది.

కారపావకాయ పెట్టుకోడానికి కారం, ఉప్పూ గుచ్చెత్తుకోవాలి,కొద్దిగా పసుపేసుకోవాలి, కారమెంతో ఉప్పంత, భానుమతిగారి అత్తగారూ ఆవకాయ గుర్తొచ్చిందా? :). గానుగునూనె సిద్ధం చేసుకోవాలి, నువ్వులనూనె. మెంతులు సిద్ధం చేసుకోవాలి. కొంతమంది వేయించిన మెంతులు కలుపుతారు. పచ్చివి వేయడం శ్రేష్టం. ఇక ఊరగాయ పెట్టుకునే కాయ తెచ్చుకుని, నీటిలో వేసి శుభ్రంగా కడగాలి, తుడవాలి, తడిలేకుండా. ఈ కాయను నిలువుగా సగం పైగా చీరాలి, పూర్తిగా ముక్కలు చేసెయ్యకూడదు. కాయను వెనక్కి తిప్పాలి. ఇదివరలో చీరిన దానికి మరో వైపు మూడొంతులు చీరాలి. కాయ కాయలాగే ఉంటుంది,నాలుగు చెక్కలుగానూ ఉంటుంది. కాయలు ఇలా చేసుకున్న తరవాత తరిగిన కాయలో ఉన్న జీడి,పొర తీసెయ్యాలి. కారం,ఉప్పు గుచ్చెత్తిన దానిలో మెంతులు కలపాలి, నూనె పోసి ముద్దలా చెయ్యాలి. ఆ ముద్దను కొద్దికొద్దిగా కాయను కొద్దిగా విడదీసి కూరాలి, ముందునుంచి వెనకనుంచి. కాయల్ని అలాగే జాడీలో పెట్టేయాలి,మిగిలిన కారం పైన వేసేసి నూనెపోయాలి,తగు మాత్రంగా. మూడు రోజులకో సారి చూడాలి. ఉప్పు తక్కువైతే బూజుపట్టేస్తుంది, అది చూసుకోవాలి.

కాయావకాయ.

ఎలా చూసినా ఆవకాయకి వాడేవి ఐదు సరుకులే. అవి మామిడి కాయ,ఉప్పు, కారం, మెంతులు,ఆవాలు. వాటినే కొన్నిటిని కలిపి కొన్నిటిని వదిలేసి పెట్టే ఆవకాయలు రకరకాలు. ఈ కాయావకాయకు కూడా కాయల్ని పైన చెప్పినట్టు తరుక్కోవాలి. ఇప్పుడు మెంతుల్ని మెత్తగా చేసుకోవాలి. మెంతి పొడి కారం,ఉప్పూ సమానంగా తీసుకుని గుచ్చెత్తుకోవాలి. నూనిపోసి కలిపి ముద్ద చేయాలి. ముద్దను కొద్దికొద్దిగా కాయలలో కూరి భద్రపరచాలి, పైన నూనెపోయాలి. ఈ రెండు రకాల ఆవకాయలని వాడుకోడానికి మూడు నెలల సమయం కావాలి. ఈ కాయావకాయ ఆవ పడనివారికి, డయాబెటిస్ వారికి మంచిది. కాయావకాయ డయాబెటిస్ వారికి మందుగా కూడా పని చేస్తుంది.

దీన్నే కాయావకాయ,  డొక్కావకాయ అంటారు. కనీసం మూడు నెలలదాకా దీని ఉపయోగించలేము. అప్పటికి కాయలో పులుపు పిండికి చేరుతుంది. పిండిలో కారం పులుపు కాయకు చేరుతుంది. ఒక్క కాయ తీసుకుని ముక్క విడదీసుకుని వాడుకోవచ్చు. ఒక సారి తీసి సగం వాడిన కాయ మళ్ళీ అందులో పెట్టకండేం 🙂  కరోనా ఏం చేయలేదు. కరోనా ఉన్నా కతక్క తప్పదుగా

కాయను కాయలా తరుక్కోలేనివారు, ముక్కలు చేసుకోవచ్చు, ఏంచేస్తాం చెప్పండి.

శర్మ కాలక్షేపం కబుర్లు-ఇంటి గుట్టు లంక చేటని

ఇంటి గుట్టు లంక చేటని

శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః.

గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును,
మానమును సంగమంబవమానము మరి
దానమును, మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.

భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము , అవమానము – ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను

Coutesy:-Sri.Chinta Ramakrishna Rao gaaru. andhraamrutam blogspot.com


ఇంటి గుట్టు లంకచేటు అనేది సామెత. ఏది ఇంటి గుట్టు? ఇది రామాయణానికి సంబంధించిన సామెత.ఏంటో చూదాం.

రాముడు కపిసేనతో సముద్రపు ఒడ్డున విడిచి ఉన్నకాలం. సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నకాలం. శరణు! శరణు!! అంటూ పరివారంతో ఆకాశంలో కనపడ్డాడో రాక్షసుడు. తన ప్రవరా చెప్పుకున్నాడు,దాచుకోకుండా, తాను విభీషణుడిననీ,రావణుని తమ్ముడిననీ.. చాలా తర్జనభర్జన తరవాత రాముడు చివరిగా రావణుని కైనా అభయమిస్తాను,శరణు వేడితే అనడంతో విభీషణుడు నేలకి దిగుతాడు. అప్పుడు జరిగిన సమావేశంలో లంక గుట్టు గురించి అడుగుతారు. విభీషణుడు చెబుతాడు, ఇంతలో ఒకరు ఇవన్నీ హనుమ చెప్పినవే,తెలిసినవీ, ఇవి కాక మరేమైనా చెప్పమంటారు. విభీషణుడు మౌనం వహిస్తాడు. ఇది చూసిన రాముడు, లక్ష్మణా మన మిత్రుని లంకాధిపతిగా చూడాలని ఉంది సముద్రజలాలు తెప్పించి అభిషేకించమంటాడు. ( అంత తొందరగా లంకాధిపతిగా విభీషణుని పట్టాభిషేకం ఎందుకు జరిపించాడు రాముడు, మరో టపాలో ) లక్ష్మణుడు విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషేకం చేస్తాడు. ఇప్పుడు కూడా విభీషణుడేం చెప్పడు. అందరూ ఆ విషయం వదిలేస్తారు, రాముడు తరచి అడగకపోవడంతో.

యుద్ధం జరుగుతూ ఉంటుంది. విభీషణుడు ఎవరితోనూ యుద్ధం చెయ్యలేదు. రావణుని పరివారం అంతా మడసింది, మిగిలినవాడు మేఘనాథుడు ఒక్కడే, అతని మీదనే రావణుని ఆశమిగిలింది.ఇటువంటి సమయంలో మేఘనాథుడు నికుంభిలాదేవిని అర్చించడానికి బయలుదేరతాడు. ఈ వార్త తెలిసిన విభీషణుడు కంగారు పడతాడు, రాముని దగ్గరకు చేరి, ”రామా! మేఘనాథుడు నికుంభిలా దేవిని ప్రసన్నం చేసుకోడానికి వెళుతున్నాడు. ఆమెను అర్చించి నల్ల మేకపోతును బలి ఇచ్చి ఆ పని పూర్తి చేస్తే ఆమె కరుణిస్తుంది. ఇక ఆ పైన అతనిని జయించగలవాడు ఉండడు. అందుచేత లక్ష్మణుని పంపి  అతనిని మట్టుపెట్టాలని చెబుతాడు” ఇదీ అసలు రహస్యం. ఇదే ఇంటిగుట్టు, అవసరం వచ్చినప్పుడు చెప్పి రాముని జయానికి దోవచేసినవాడు విభీషణుడు. అందుకే ”ఇంటి గుట్టు లంక చేటని” సామెత.శర్మ కాలక్షేపం కబుర్లు-నీళ్ళావకాయ


నీళ్ళావకాయ

ఎండలు పెరిగాయి. అప్పుడే 40/24 వేడి ఉంటోంది వారం నుంచి. ఓ పక్క కరోనా భయం మరో పక్క ఎండభయం, కదిలేందుకులేదు,మెదిలేందుకులేదు. ఇలాటి సందర్భంలో ఫ్రిజ్ లో ఉన్న కూరలన్నీ నిండుకున్నాయి. ఏంచేయాలనేలోగా ఒక రోజు దూరం పాటిస్తూ కూరలు అమ్మకానికి పెట్టేరంటే అబ్బాయి వెళ్ళి కూరలు తెచ్చాడు. అందులో మూడు మామిడి కాయలున్నాయి. ఈ సంవత్సరం చెట్టున ఆకులేగాని పిందెలేదు, అదేమోగాని పక్కదొడ్డిలో ఉన్న మూడు వేపచెట్లూ పూయలేదు, అలా జరిగింది కొత్త సంవత్సరం. ఈ మూడుమామిడి కాయల్నీ నీళ్ళ ఆవకాయ వెయ్యమన్నా కోడలమ్మాయిని.  వింతగా చూసింది. ఇలా పెడతారని చెప్పి పెట్టించా, అవధరించండి

.ఈ ఆవకాయ మూడు లేదా నాలుగు రోజులకంటే నిలవ ఉండదు, అదీ దీని ప్రత్యేకత.పుల్లగా ఉన్న మామిడి కాయల్ని ముక్కలుగా తరగండి. ఇవి రాలిన కాయలైనా బాధ లేదు గాని ఉడుకు కాయలు మాత్రం కాకూడదు. తరిగిన ముక్కలకి సరిపడా ఉప్పు కారం,ఆవ పోసి కలపండి. నీళ్ళు కళపెళా కాచండి. కాగిన నీరు వేడిగ ఉండగానే ముక్కలతో గుచ్చెత్తిన దానిలో పోయండి, మూత పెట్టి ఉంచేయండి, నాలుగు గంటలు. ఇప్పుడు వాడండి బలే ఉంటుంది, ఆవకాయలానే

శుభమస్తు

శర్మ కాలక్షేపంకబుర్లు-కష్టాలే కలిసొస్తాయి.

సుఖాలు కలిసిరావు కష్టాలే కలిసొస్తాయి.

ఇది నిజమైన మాట. మనం సాధారణంగా అనేసుకుంటాం కాని విమర్శ చేసుకోము. ఒక కష్టం లో ఉండగా మరో కష్టం మీద పడటం గా అనుకుంటాం. అసలు కష్టాలేంటీ అనేదే ప్రశ్న. అష్ట కష్టాలు అనేవారు. ఇప్పుడూ అంటున్నట్టే వున్నారు. ఇవి కాలాన్ని బట్టి మారుతున్నట్టే వుంది.ఒకప్పుడు కష్టమైనది మరొకప్పుడు కాదు. కొన్ని మాత్రం అప్పటికి ఇప్పటికి మార్పురాలేదు. (  అల్లుడు ఇంటికి రావడం )

ఇప్పుడు చేరిన కష్టాలలో ఇంటర్ నెట్ పోవడం కూడా ఒక కష్టంగా చేరిపోయిందనుకుంటాను. మాకెప్పుడూ ఇంటర్ నెట్ పోదు, అనుకోవద్దు, వైద్యుని భార్య కూడా ముండా మోస్తుందని సామెత. అసలే లాక్ డవున్ లో ఉండి ఒక చిన్న ప్లగ్గు తెగిపోవడం మూలంగా ఇంటర్ నెట్ పని చెయ్యకపోతే, కొత్తది తెచ్చుకోడానికి లేకపోయే, మరోటి లేదు, నిజంగా పిచ్చే ఎక్కుతుంది, ఈ సమయంలో. అందరికి పోతే అదో సంతృప్తి.మనకే బయటపోతే బాగుచేసుకోడం మనవల్ల కాకపోతే, అబ్బో ఇంతకు మించిన కష్టం మరోటి లేదు. అదే ఒక రోజైతే, అబ్బో తలుచుకుంటేనే భయంకరం కదా! అలాగనక ఇంటర్ నెట్ పోతే ప్రపంచంలో ఎన్ని పిచ్చాసుపత్రులు కొత్తగా నెలకొల్పాలో! తలుచుకుంటేనే భయం.ఇలాలాక్ డవున్ లో ఉన్న మనకి నెట్ పోతే కష్టం మీద కష్టం వచ్చి పడ్డట్టే. అదే గనక సుఖం మీద సుఖం వచ్చి పడితే అది పులగం మీద పప్పులాటిది. కాని అదెప్పుడూ జరగదు. జరిగినా తెలుసుకో లేం.

నిజానికి కలిసొస్తాయి అనే మాటలోనే అసలు విరుపుంది. మనం    ఒక్కటే
 అర్ధం తీసుకుంటాo. కలసిరావడం అంటే కూడా రావడంగా అనుకుంటాం కాని మరో అర్ధం కూడా చెప్పుకోవచ్చు. అది అనుభవం రావడం లేదా అధికమైన లాభం చేకూరడం కాని కావచ్చు. చెప్పుకోవలసింది రెండవ అర్ధమే కాని మనం అది ఎప్పుడూ చెప్పుకోం. కష్టం వస్తేనే అనుభవం వస్తుంది కదా!

దేవుడా! ఎప్పుడూ నాకు కష్టాలే ఉండేలా ప్రసాదించమన్నాట్ట ఒక భక్తుడు, అదేమయ్యా ఎవరేనా సుఖాలు కావలనుకుంటారుగా అంటే, ఆ భక్తుడు స్వామీ నువ్వు గనక సుఖాలు ప్రసాదిస్తే నిన్నే మరచిపోతా అంచేత ఎప్పుడూ కష్టాలే కావాలి,నిన్ను మరిచిపోకుండా ఉండడానికి అన్నాట్ట.

మరీ అంతొద్దుగాని కష్ట సుఖాలు కలసైరావాలంతే.అసలు కష్టంలోనే కదా ఎవరెవరో తెలిసేది,అసలు స్నేహితులెవరో,బంధువులెవరో తెలిసేది.

సర్వే జనాః సుఖినో భవంతు.

శర్మ కాలక్షేపంకబుర్లు-కుదుపు.

కుదుపు.

కరోనా వైరస్ మానవ జీవితాలని ఒక కుదుపు కుదిపింది.ఏ జీవికైనా ఆహారము,నిద్ర,మైధునము సర్వ సహజ జీవ లక్షణాలు. మానవుడు నాగరికత నేర్చి ఇల్లుకట్టుకోవడం నుంచి అనేకం నేర్చాడు, కాని నేడు నాగరికత పేరున వెర్రిన పడుతున్న వారిని కరోనా ఒక్క కుదుపు కుదిపి మానవులబలహీనతెంతో చెప్పకనే చెప్పింది. సంపాదించుకుంటున్న భూములు,బంగారాలు, వజ్రాలు కట్టుకున్న ఇళ్ళు ఏవీ  కూడా రావని వీటి విలువ గుడ్డిగవ్వ విలువ చేయదని వాటి వెనకపడిపోవద్దనే ఒక హెచ్చరిక ఇచ్చింది.స్వంతలాభం కొంతమానుకు పొరుగువానికి సాయపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది నిజం చేదాం. గుర్తుకు తెచ్చుకుందాం.కలసికట్టుగా నిలుద్దాం,బ్రతుకుదాం. స్వంతలాభం కొంతమానుకు పొరుగువానికి సాయపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది నిజం చేదాం. గుర్తుకు తెచ్చుకుందాం.కలసికట్టుగా నిలుద్దాం,బ్రతుకుదాం.  

మానవ చరిత్రలో, మానవుడు ఇలా ఇంటిలో దాక్కుని కూచుని వుండే సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఇదే మొదటిసారి అనుకుంటాను.లాక్ డవున్ పదునాల్గుతో పూర్తి అవుతోంది.ముందు ఏం జరగనుందీ తెలియదుప్రపంచం మొత్తం మీద ఈ మహమ్మారి బారిన పడి చనిపోయినవారు ఒక లక్షపైన ఉండచ్చు. ఇప్పటికి మహమ్మారిని మానవాళిపై వదలినవారికి ఆత్మ పరిశీన లేనట్టే వుంది. ఈ మహమ్మారి మానవాళినే తుడిచిపెట్టేలా ఉంది. దీని భయంకర రూపం ఇప్పటికి కొంతమందికి నేటికీ తెలియకపోవడమే వింత, ఎంత చెప్పినా .

చనిపోయినవారి కి ఉత్తరగతులు కలిగేలా ప్రార్ధన చేయడమే మిగిలినవారు చేయగలది. ఇంతకు ముందు మానవాళి చరిత్రలో ఇటువంటి సంఘటన జరుగలేదు గనక ఈ ఏప్రియల్ నెలను అంతర్జాతీయ శోకమాసంగా ప్రకటించి, ఇకముందు ప్రతి సంవత్సరమూ ఏప్రియల్ నెలను ప్రపంచ వ్యాప్తంగా లాక్ డవున్ ప్రకటించాలని నా కోరిక.

శర్మ కాలక్షేపంకబుర్లు-బతికియుండిన సుఖముల బడయవచ్చు

బతికియుండిన శుభములబడయ వచ్చు.

వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసంగమః

రామాయణమ్..సు.కాం..సర్గ 13–౪47

మరణించుట వలన పెక్కు ప్రమాదములు కలుగవచ్చును.బ్రతికియుండిన సుఖముల బడయవచ్చు. బతికియున్నవారెప్పుడైనను కలియవచ్చు,అందువలన ప్రాణములు నిలుపుకొందును.

హనుమ లంకలో దిగారు. సీతకోసం వెతికి వేసారిపోయారు, సీత కనపడలేదు. ఒక బలహీన క్షణం లో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, మార్గాలు కూడా ఆలోచిస్తారు. అంతలో ఇదేమి ఇలా ఆలోచిస్తున్నానుకొని లంకిణిని గెలిచి శుభారంభం చేశాను. బతికియుండిన శుభములు బడయవచ్చు, బతుకుతాను,నా వారందరిని బతికించుకుంటాను అని నిర్ణయం తీసుకుంటారు. ఇది పాసిటివ్ తింకింగో మరేదో మీరే చెప్పాలి.

తెలిసో,తెలియకో చైనా ఒక వైరస్ ని ప్రపంచం మీద వదిలింది. దానిని ఎలా ఏ మందులతో ఎదుర్కొంది చెప్పటం లేదు. తన దేశంలో ఎంతమంది మరణించిందీ పూర్తిగా తెలియని విషయమే. అమెరికా, అగ్రరాజ్యం అల్లాడుతోంది మందులకోసం.భారత దేశం కరోనాని సమర్ధంగా ఎదుర్కుంటోంది. ఎలా మడితోనూ, గచ్చాకు పుచ్చాకుతోనా అని హేళన చేస్తున్నవారూ లేకపోలేదు. మనవారికి మందులు లేకుండా ఇతరదేశాలకి మందులు అమ్ముకుంటోంది భారత ప్రభుత్వం , ఇది మరో అసత్య ప్రచారం. అవే కావాలంటోంది అగ్రదేశం. మానింది మందు బతికింది ఊరు అని సామెత.

దేశంలో వలస కార్మికులు ఆకలితో అల్లాడుతున్నారని కొందరి ప్రచారం. మా దగ్గర లాక్ డవున్ ప్రకటీంచిన మరునాటి నుండే వ్యక్తులు సంస్థలు ఆహారం అందించడం మొదలు పెట్టాయి. స్కూళ్ళు కాలేజిలు వసతి కూడా ఏర్పాటు చేశాయి. మానవత వెల్లి విరిసింది. మన వారిని బతికించుకోడమే మన ప్రధమ కర్తవ్యం.బతికియుండిన సుఖముల బడయ వచ్చు నన్నదే నినాదం. ఒక ఫోన్ నంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేయండి, మీకు ఎక్కడైనా మనఊరిలో, ఎంతమందికైనా ఆహారం ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నవారున్నారు.  స్వలాభాపేక్ష మరచి ఏ కూరైనా కెజి ఇరవైకే అమ్ముతున్నవారున్నారు.  అసత్యాలు అర్ధ సత్యాలు ప్రచారం చేస్తున్నవారున్నారు. ప్రభుత్వం ఇంటికే కావలసిన సరుకులు చేరేస్తోందన్నది మరచిపోయారు మరికొందరు.ఆర్ధికంగా వెనకబడిపోతున్నాం,మరొకరి సన్నాయి నొక్కులు. అసలు బతికి ఉన్నప్పుడు కదా, బతికుంటే నేడు కాకపోతే రేపు సాధించుకుంటాం, మరొకరి మాట

దేశం కరోనాని జయించగలదు అనే నమ్మకాన్ని కలిగి ఉంది.దేశం మొత్తం మీద ఇటువంటి వ్యక్తులు సంస్థలు చాలానే పని చేస్తున్నాయి. మందు కూడా కనుక్కునేలాగే ఉంది.ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాలు చాలా తక్కువనే చెప్పాలి.ప్రపంచం మనకేసి చూస్తోంది,ఆశ్చర్యపోతోంది కూడా. బతుకు బతికించు అన్నదే నేటి నినాదం.జీవితం చూసిన ఒకరి మాట.కరోనాని దూరంగా తరిమేస్తున్నట్లే నిత్య శంకితులను దూరంగా వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి. IGNORE  them.

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
చేరి మృగతృష్ణలో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖులమనసు రంజింపరాదు.

సర్వే జనాః సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు

నిత్య శ్రీ రస్తు
నిత్య మంగళాని భవంతు
సర్వ శ్రీ రస్తు
సర్వమంగళాని భవంతు 
సర్వే జనాః సుఖినో భవంతు.

శర్మ కాలక్షేపం కబుర్లు-పదమూడేళ్ళు ఆలస్యంగా అమలు జరిగిన శిక్షలు.

పదమూడేళ్ళు ఆలస్యంగా అమలు జరిగిన శిక్షలు.

ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడాడు. ఆమెను సభకు కొప్పు పట్టి ఈడ్పించారు, దుశ్శాసనుడు వలువలూడ్చాడు. ఆసందర్భంగా భీముడు రౌద్రంగా ఈ శపధం చేశాడు అనగా శిక్ష విధించాడు,

ధృతరాష్ట్రుని తో సహా పెద్దలందరూ ఉండగా. ఆ తరవాత ద్రౌపదికి ఎడమతొడ చూపిన దుర్యోధనునికీ శిక్ష విధించాడిలా, అందరు చూస్తుండగా,వినగా. న్యాయం చెప్పిన వికర్ణునినోరు నొక్కేశారు, పెద్దలు.ఆ శిక్షలివీ

కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ సూచు చుండన్ మదో
ద్ధురు డై ద్రౌపదినిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోక భీ
కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తాఘని
ర్ఘర ముర్వీపతి సూచుచుండ నని నా స్వాదింతు నుగ్రాకృతిన్.

దీనికి అర్ధం చెప్పక్కర లేదు కదా, ఈ పద్యం అందరికి వచ్చినదే.రొమ్ము చీల్చి రక్తం తాగుతానని.

ఆ తర్వాత

ధారుణి రాజ్య సంపదమదంబున గోమలి కృష్ణజూచిరం
భోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరుజేయుదుసుయోధను నుగ్రరణాంగనంబునన్.

దీనికీ అర్ధం చెప్పక్కరలేదు, అందరికి తెలిసింది కనక, తొడలు విరగ్గొట్టి చంపుతానని శిక్ష వేసేడు. తన వేసిన శిక్ష తనే వాయిదా వేసుకున్నాడు. నిజానికి భీముడు అప్పుడే అది అమలు చేసినా ఆక్కడ ఆపగల దమ్మూ,ధైర్యం ఉన్నవాడెవడూ లేడు, కాని ధర్మరాజు కంటి చూపుకు ఆగిపోయాడు. కాలమూ గడిచింది. ఎంతకాలం పదమూడేళ్ళు. భీముడు కసి పెంచుకున్నాడు ఎప్పటికప్పుడు. గాయపడిన మనసు కెలక వేస్తూనే ఉంది,పదమూడేళ్ళూ.

యుద్ధం సిద్ధమైంది.ఆ యుద్ధ కాలంలో కౌరవ సర్వసేనాపతులుగా విధి నిర్వహించిన సమయాలూ చిత్రంగానే ఉంటాయి. భీష్ముడు పది రోజులు,ద్రోణుడు ఐదు రోజులు,కర్ణుడు రెండున్నరరోజులు, శల్యుడు అర రోజు.అనగా ప్రతి సర్వసేనాపతీ మారినప్పుడు బలం తగ్గిపోతూనే వచ్చింది. కర్ణుడు సేనాపతిగా ఉన్నకాలం. దుస్ససేనుడు భీమునితో తలపడ్డాడు.ఘోర యుద్ధం జరిగింది. అందులో దుస్ససేనుడు తన రధం తనే నడుపుకుంటూ భీముని తాకేటట్టుగా యుద్ధం జరిగింది. అప్పుడు కూడాభీముని మీద బాణాలు నాటేడు. అంతే భీముడు రధం దిగిపోయాడు,గద పుచ్చుకుని. దుశ్శాసనుని రధంకి పూన్చిన గుర్రాలను చంపేశాడు. దుస్ససేనుడూ నేలకు దిగాడు. గద్ద కాళ్ళలో చిక్కిన కోడిపిల్లయ్యాడు,దుస్ససేనుడు. గదతో రొమ్ము మీద కొడితే నెత్తురు కక్కుకుని భూమి మీద పడ్డాడు. అంత భీముడు

మును సభ బలికినదానం దనివోక యిచ్చటికి వెదకి వచ్చితి యే
మనియెదనుము నీ మాటలు,వినుటకు నాకినుక సాల వేడ్క పడియెడిన్.

ఒరే సభలో ఏదో అన్నావుగా అదిసరిపోక ఏంటి పేలుతున్నావు, పేలరా నీ మాటలు వినడం నాకు వేడుకగా వుంది సమా అని కత్తి పట్టుకుని ముఖం మీద తిప్పేడు, మోకాళ్ళతో పొడుస్తూ కింద పడిఉన్న దుస్ససేనునితో

ఏ నురము వ్రచ్చినెత్తురు దేనియ యిదె ద్రావెదం గదిసి నను గడిమిన్
మానుప దిక్కు గలిగిన వ్రాని మ్మెలగింపు మీ మొనగలవారిన్.

నీ గుండెలు బద్దలు చేసి రక్తం తేనెలా తాగుతాను, నన్ను ఆపగల దమ్ము ఉన్నవాడెవదో మీ పక్క ఉన్నవాడిని పిలవరా అని కత్తితో గుండె చీలిచి రక్తం తాగేడు. ఇది చూసిన పాంచాల సేనలే భయపడ్డాయి, ఆ సమయంలో భీముని చూసి. అంత ఘోరంగా శిక్ష అమలు చేశాడు.

ఇక దుర్యోధనుడినెలా చంపేడు?

గదా యుద్ధం జరుగుతోంది ఘోరంగా దుర్యోధనుడు గదతో ఎగిరి దూకుతూవుండగా, భీముడు తొడల మీద కొట్టి కూల్చేసేడు. ఆ తర్వాత దుర్యోధనుని తల తన్నేడు, అది చూసి ధర్మరాజు తప్పని వారించాడు.భీముని మీదకు రాబోయిన అబలరాముని కృష్ణుడు వారించాడు.

భీముడు తను విధించిన శిక్షలను తనే అమలుచేశాడు, పదమూడేళ్ళు ఆలస్యంగా.ఆలస్యంగానైనా శిక్ష తప్పక అమలు చేయబడింది.ఇలాటిదే మరో సంఘటన మరో సారి….

శర్మ కాలక్షేపం కబుర్లు-రామోవిగ్రహవాన్ ధర్మ

రామో విగ్రహవాన్ ధర్మ

రామాయణం నుంచి ఎన్నేని కొటేషన్ లు చెప్పచ్చు కాని ప్రముఖంగా చెప్పేవి ఈ కింది రెండూ….

సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్యచ పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః.

మన మనసుకు నచ్చే ప్రియ సల్లాపాలు పలికేవారే చుట్టూ చేరతారు.అయాచితంగా హితవు చెప్పేవాడు దొరకడు.వాడు దొరికినా మనం వినలేం. (తర్జుమా:ఉష శ్రీ)

ఇది నిత్య సత్యం.చెప్పినది నిజంకాదని తెలిసినా మనకెందుకొచ్చిన బెడద. ఊరుకున్నంత ఉత్తమం లేదు కదా అనుకునేవారే ఎక్కువ. ఏమో రేపు ఈయనతో మనకేమన్నా పని బడుతుందేమో, దీనికోసం మనం ఈయనతో గొడవ పడటం ఎందుకూ అని నిజం చెప్పరెవ్వరూ. పొరబాటున ఒకరెవరో నిజం చెప్పబూనుతారు, దానిని మనం వినం. అలా చెప్పబూనినవానిని హేళన చేస్తాం, దానితో వారు, మనకెందుకొచ్చిన తంటా అని ఊరుకుంటారు. ఇది లోక రీతి.

మరొకటి.
రామోవిగ్రహవాన్ ధర్మ
సాధు సత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకేస్య
దేవానా మివ వాసవః

రాముడు మూర్తీభవించిన సత్యం.సాధువు. పరాక్రమవంతుడు.దేవతలలో ఇంద్రునివంటివాడు.
ఐతే వీటిని చెప్పినవారు, సమయ సందర్భాలూ చూదాం.

ఈ రెండిటినీ చెప్పినవాడు రామభక్తుడు, అంధ భక్తుడు కాదు. అసలు సిసలు వైరి రాక్షసుడైన మారీచుడు.రావణుని మంత్రి.ఎప్పుడు చెప్పేడూ? మారీచా నువు బంగారు జింకలా సీతకు కనపడు. దానికోసం రాముని పంపుతుంది, ఆ సమయంలో సీతను ఎత్తుకువస్తానని అన్న ప్రభువు రావణునితో చెబుతాదు,నిర్భయంగా,ఇలా

.కొరగాని చారుల మాటలతో అతిచంచల స్వభావుడవైన నీవు రాముని గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నా దొక్కటే కోరిక రాముడు కోపగించి సర్వ రాక్షస సంహారానికి పూనుకోకుండా భగవంతుడే కాపాడలి.నిన్ను చూస్తుంటే సీత నీ వినాశానికే పుట్టినట్లుంది. నీ మూలంగా రాక్షస జాతి లంకా నగరం నాశనం కానున్నాయి. నిన్నీ పాప కార్యానికి పురికొల్పినవాడు నిజానికి నీ శత్రువే అన్నాడు. నిజంగానే ఎంత నిష్టురమైన సత్యం చెప్పాడు, నిజంగానే రావణుడూ వినలేదు.

శర్మ కాలక్షేపంకబుర్లు-సీత చెప్పిన కత్తి కత


సీత చెప్పిన కత్తి కత

సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ దండకారణ్యం చేరారు. వనాలను చూస్తూ ముని ఆశ్రమాల సొగసు పరిశీలిస్తూ నడుస్తున్నారు. ఒక రోజు హటాత్తుగా ఒక రాక్షసుడు విరాధుడు అనేవాడు ఎదురయ్యాడు. రామ లక్ష్మణులను భయపెడుతూ సీతను పట్టుకున్నాడు. రామ లక్ష్మణులిద్దరూ విరాధుని రెండు భుజాలూ నరికేశారు, ఐనా విరాధుడు చావలేదు. రాముడు విరాధుని పట్టిఉండగా లక్ష్మణుని గొయ్యి తియ్యమన్నాడు, పూడ్చిపెట్టడానికి, అప్పటికి వీరెవరో తెలిసిన విరాధుడు మరణిస్తూ రామ లక్ష్మణులను శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళమని సూచించి చనిపోయాడు. శరభంగ ముని ఆశ్రమం చేరు కున్న రామ లక్ష్మణులను శరభంగముని స్వాగతిస్తూ తాము దేవేంద్రునితో వెళ్ళవలసివున్నా వీరి కోసం అగినట్లు చెబుతూ తమ శక్తులను ధారపోస్తాం తీసుకోమని అడిగారు. విన్న రాముడు తానే వాటిని స్వయంగా సంపాదించుకోవాలనుకుంటున్నానని చెబుతూ తాము నివసించడానికి యోగ్యమైన స్థలం చెప్పమని కోరేరు. దానికి శరభంగ ముని మీరు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళండి అని సూచిస్తూ, ఈ ప్రాంతంలో రాక్షసుల బెడద ఎక్కువగా ఉన్నదని వారినుంచి మునిలోకాన్ని రక్షించమనీ కోరుతారు. సుతీక్షణుని ఆశ్రమానికి వెళ్ళారు, సీతారామలక్ష్మణులు. స్వాగత సత్కారాల తరవాత సుతీక్షణుడు కూడా దివ్య శక్తుల్ని తీసుకోమని అడిగితే శరభంగునికి చెప్పినట్టే చెప్పి, రాక్షసుల బెడదనుంచి మునిలోకాన్ని కాపాడమని కోరుతూ ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ముని ఆశ్రమాలూ దర్శించమని చెప్పారు. మరునాడు అగమ్యంగా బయలు దేరిన సీతారామలక్ష్మణులు నడుస్తుండగా సీత రాముని ఉద్దేసించి ఇలా అంది.

రామా! మనం ఇక్కడికి వచ్చింది రాక్షస సంహారానికే అని మునిలోకం అనుకుంటున్నది.అధర్మం ఎంతటివారినైనా వంచిస్తుంది. అందులో అసత్య భాషణం, పరదారాగమనం, వైరం లేని హింస దానికి మార్గాలు. మీపట్ల మొదటి రెండు చేరలేవు కాని మూడవదైన వైరంలేని హింస మనల్ని బాధించేలా ఉంది. రాక్షసులతో మనకు వైరం లేదు. రాక్షసులు ఎదురైతే మీరు ఆగలేరు. మనం అరణ్యంలో ఉండద్దు. ఈ సందర్భంగా నాకో కత గుర్తుకోస్తోంది చెబుతా,వినండి అని చెప్పి ఇలా చెప్పింది.

ఒక ముని తపస్సు చేసుకుంటున్నారు, పరిక్షాధికారి ఇంద్రుడు సైనిక వేషంలో ఒక కత్తిని ముని కి ఇస్తూ దాచిపెట్టమన్నాడు. ముని కత్తి అందాన్ని పదును చూసి ముచ్చటపడి దాని సంరక్షణకోసం కూడా పట్టుకు తిరగడం ప్రారంభించారు. ఆయన ఆ కత్తిని ఉపయోగిస్తూ అకారణ హింసకు పాల్పడడం మొదలు పెట్టేరు, అధర్మానికి లొంగి. ఆ చర్యలు ఆయనను తపస్సుకు దూరం చేయడమే కాదు నరకానికి తీసుకువెళ్ళాయి. అందుచేత మీరిద్దరూ ఏమి చేస్తే మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నది. దానికి రాముడు

సీతా నీకు మాపట్ల ఉన్న ప్రేమానురాగాలకి చాలా సంతోషం కలిగింది. అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్నా నేను రాజవంశీయుడినే. మంచివాళ్ళను,బలహీనులను రక్షించడమే రాజధర్మం.అందుకే ఆయుధాలు ధరిస్తాం. ఈ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న వీరిని బాధ పెట్టే దుష్టులను శిక్షించడం నా ధర్మం,అందుచేత ఆయుధం విడవనని చెప్పేడు.