శర్మ కాలక్షేపం కబుర్లు-రామోవిగ్రహవాన్ ధర్మ

రామో విగ్రహవాన్ ధర్మ

రామాయణం నుంచి ఎన్నేని కొటేషన్ లు చెప్పచ్చు కాని ప్రముఖంగా చెప్పేవి ఈ కింది రెండూ….

సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్యచ పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః.

మన మనసుకు నచ్చే ప్రియ సల్లాపాలు పలికేవారే చుట్టూ చేరతారు.అయాచితంగా హితవు చెప్పేవాడు దొరకడు.వాడు దొరికినా మనం వినలేం. (తర్జుమా:ఉష శ్రీ)

ఇది నిత్య సత్యం.చెప్పినది నిజంకాదని తెలిసినా మనకెందుకొచ్చిన బెడద. ఊరుకున్నంత ఉత్తమం లేదు కదా అనుకునేవారే ఎక్కువ. ఏమో రేపు ఈయనతో మనకేమన్నా పని బడుతుందేమో, దీనికోసం మనం ఈయనతో గొడవ పడటం ఎందుకూ అని నిజం చెప్పరెవ్వరూ. పొరబాటున ఒకరెవరో నిజం చెప్పబూనుతారు, దానిని మనం వినం. అలా చెప్పబూనినవానిని హేళన చేస్తాం, దానితో వారు, మనకెందుకొచ్చిన తంటా అని ఊరుకుంటారు. ఇది లోక రీతి.

మరొకటి.
రామోవిగ్రహవాన్ ధర్మ
సాధు సత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకేస్య
దేవానా మివ వాసవః

రాముడు మూర్తీభవించిన సత్యం.సాధువు. పరాక్రమవంతుడు.దేవతలలో ఇంద్రునివంటివాడు.
ఐతే వీటిని చెప్పినవారు, సమయ సందర్భాలూ చూదాం.

ఈ రెండిటినీ చెప్పినవాడు రామభక్తుడు, అంధ భక్తుడు కాదు. అసలు సిసలు వైరి రాక్షసుడైన మారీచుడు.రావణుని మంత్రి.ఎప్పుడు చెప్పేడూ? మారీచా నువు బంగారు జింకలా సీతకు కనపడు. దానికోసం రాముని పంపుతుంది, ఆ సమయంలో సీతను ఎత్తుకువస్తానని అన్న ప్రభువు రావణునితో చెబుతాదు,నిర్భయంగా,ఇలా

.కొరగాని చారుల మాటలతో అతిచంచల స్వభావుడవైన నీవు రాముని గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నా దొక్కటే కోరిక రాముడు కోపగించి సర్వ రాక్షస సంహారానికి పూనుకోకుండా భగవంతుడే కాపాడలి.నిన్ను చూస్తుంటే సీత నీ వినాశానికే పుట్టినట్లుంది. నీ మూలంగా రాక్షస జాతి లంకా నగరం నాశనం కానున్నాయి. నిన్నీ పాప కార్యానికి పురికొల్పినవాడు నిజానికి నీ శత్రువే అన్నాడు. నిజంగానే ఎంత నిష్టురమైన సత్యం చెప్పాడు, నిజంగానే రావణుడూ వినలేదు.

4 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-రామోవిగ్రహవాన్ ధర్మ

    • శత్రువు చేత కూడా కీర్తింపబడ్డవాడు రాముడు. ఎదురైనవారిని నవ్వుతూ, ముందుగా ప్రియంగా మాటాడేవాడు రాముడు.శత్రువైనా ఎంత చక్కని మాట చెప్పేడు, మారీచుడు.ఇప్పటికి మన నాలకల మీద ఉండిపోయిందే

      నేడు మనమో తెలిసినవారు ఎదురుపడితే
      మనం పలకరించేదేంటి వాడు పలకరించాలిగాని అని తలపక్కకి తిప్పుకు వెళిపోతాం. ప్రియ సంభాషణ ఎంతమందికి తెలుసు. ఇవన్నీ రాముడి నుంచి నేర్చుకోవలసినవే

      సులభా పురుషా రాజన్ ఎంత సత్యం.ఇంతకంటే గొప్ప కొటేషన్లు ఉంటాయా?

వ్యాఖ్యానించండి