పదమూడేళ్ళు ఆలస్యంగా అమలు జరిగిన శిక్షలు.
ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడాడు. ఆమెను సభకు కొప్పు పట్టి ఈడ్పించారు, దుశ్శాసనుడు వలువలూడ్చాడు. ఆసందర్భంగా భీముడు రౌద్రంగా ఈ శపధం చేశాడు అనగా శిక్ష విధించాడు,
ధృతరాష్ట్రుని తో సహా పెద్దలందరూ ఉండగా. ఆ తరవాత ద్రౌపదికి ఎడమతొడ చూపిన దుర్యోధనునికీ శిక్ష విధించాడిలా, అందరు చూస్తుండగా,వినగా. న్యాయం చెప్పిన వికర్ణునినోరు నొక్కేశారు, పెద్దలు.ఆ శిక్షలివీ
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ సూచు చుండన్ మదో
ద్ధురు డై ద్రౌపదినిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోక భీ
కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తాఘని
ర్ఘర ముర్వీపతి సూచుచుండ నని నా స్వాదింతు నుగ్రాకృతిన్.
దీనికి అర్ధం చెప్పక్కర లేదు కదా, ఈ పద్యం అందరికి వచ్చినదే.రొమ్ము చీల్చి రక్తం తాగుతానని.
ఆ తర్వాత
ధారుణి రాజ్య సంపదమదంబున గోమలి కృష్ణజూచిరం
భోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరుజేయుదుసుయోధను నుగ్రరణాంగనంబునన్.
దీనికీ అర్ధం చెప్పక్కరలేదు, అందరికి తెలిసింది కనక, తొడలు విరగ్గొట్టి చంపుతానని శిక్ష వేసేడు. తన వేసిన శిక్ష తనే వాయిదా వేసుకున్నాడు. నిజానికి భీముడు అప్పుడే అది అమలు చేసినా ఆక్కడ ఆపగల దమ్మూ,ధైర్యం ఉన్నవాడెవడూ లేడు, కాని ధర్మరాజు కంటి చూపుకు ఆగిపోయాడు. కాలమూ గడిచింది. ఎంతకాలం పదమూడేళ్ళు. భీముడు కసి పెంచుకున్నాడు ఎప్పటికప్పుడు. గాయపడిన మనసు కెలక వేస్తూనే ఉంది,పదమూడేళ్ళూ.
యుద్ధం సిద్ధమైంది.ఆ యుద్ధ కాలంలో కౌరవ సర్వసేనాపతులుగా విధి నిర్వహించిన సమయాలూ చిత్రంగానే ఉంటాయి. భీష్ముడు పది రోజులు,ద్రోణుడు ఐదు రోజులు,కర్ణుడు రెండున్నరరోజులు, శల్యుడు అర రోజు.అనగా ప్రతి సర్వసేనాపతీ మారినప్పుడు బలం తగ్గిపోతూనే వచ్చింది. కర్ణుడు సేనాపతిగా ఉన్నకాలం. దుస్ససేనుడు భీమునితో తలపడ్డాడు.ఘోర యుద్ధం జరిగింది. అందులో దుస్ససేనుడు తన రధం తనే నడుపుకుంటూ భీముని తాకేటట్టుగా యుద్ధం జరిగింది. అప్పుడు కూడాభీముని మీద బాణాలు నాటేడు. అంతే భీముడు రధం దిగిపోయాడు,గద పుచ్చుకుని. దుశ్శాసనుని రధంకి పూన్చిన గుర్రాలను చంపేశాడు. దుస్ససేనుడూ నేలకు దిగాడు. గద్ద కాళ్ళలో చిక్కిన కోడిపిల్లయ్యాడు,దుస్ససేనుడు. గదతో రొమ్ము మీద కొడితే నెత్తురు కక్కుకుని భూమి మీద పడ్డాడు. అంత భీముడు
మును సభ బలికినదానం దనివోక యిచ్చటికి వెదకి వచ్చితి యే
మనియెదనుము నీ మాటలు,వినుటకు నాకినుక సాల వేడ్క పడియెడిన్.
ఒరే సభలో ఏదో అన్నావుగా అదిసరిపోక ఏంటి పేలుతున్నావు, పేలరా నీ మాటలు వినడం నాకు వేడుకగా వుంది సమా అని కత్తి పట్టుకుని ముఖం మీద తిప్పేడు, మోకాళ్ళతో పొడుస్తూ కింద పడిఉన్న దుస్ససేనునితో
ఏ నురము వ్రచ్చినెత్తురు దేనియ యిదె ద్రావెదం గదిసి నను గడిమిన్
మానుప దిక్కు గలిగిన వ్రాని మ్మెలగింపు మీ మొనగలవారిన్.
నీ గుండెలు బద్దలు చేసి రక్తం తేనెలా తాగుతాను, నన్ను ఆపగల దమ్ము ఉన్నవాడెవదో మీ పక్క ఉన్నవాడిని పిలవరా అని కత్తితో గుండె చీలిచి రక్తం తాగేడు. ఇది చూసిన పాంచాల సేనలే భయపడ్డాయి, ఆ సమయంలో భీముని చూసి. అంత ఘోరంగా శిక్ష అమలు చేశాడు.
ఇక దుర్యోధనుడినెలా చంపేడు?
గదా యుద్ధం జరుగుతోంది ఘోరంగా దుర్యోధనుడు గదతో ఎగిరి దూకుతూవుండగా, భీముడు తొడల మీద కొట్టి కూల్చేసేడు. ఆ తర్వాత దుర్యోధనుని తల తన్నేడు, అది చూసి ధర్మరాజు తప్పని వారించాడు.భీముని మీదకు రాబోయిన అబలరాముని కృష్ణుడు వారించాడు.
భీముడు తను విధించిన శిక్షలను తనే అమలుచేశాడు, పదమూడేళ్ళు ఆలస్యంగా.ఆలస్యంగానైనా శిక్ష తప్పక అమలు చేయబడింది.ఇలాటిదే మరో సంఘటన మరో సారి….
అవును కళ్ళముందే ఇంటి కోడలికి ఘోర అవమానం జరుగుతుండగా నీతులు చెప్పిన పెద్దమనుషులు కూడా శిక్షార్హులే.
అందుకే ఒక సుభాష్ చంద్ర బోస్ ,అల్లూరి, భగత్ సింగ్ ..- ఈ వీరులు అసలైన భరతమాత ముద్దుబిడ్డ లయ్యారు.
మానవహక్కుల ధర్మపన్నాల బేచీ లు నేరస్థుల వైపు పనిచేస్తాయి.
నీతులు చెప్పినవాళ్ళకీ శిక్ష పడిందండి,యుద్ధంలో/ ఒక్కడూ బతకలేదు. అందరూ చచ్చారా రోజు కురు సభలో ఉన్నవాళ్ళు.
కళ్ళు లేక వింటూ వుండిపోయిన గుడ్డి రాజుకీ శిక్ష పడింది. ఏంటో తెలుసా?
భీముడు రోజూ ఎత్తిపొడుపు మాటలతో చంపుతుంటే నిత్యమూ, ఏభై ఏళ్ళపాటు వాళ్ళ మోచేతి నీళ్ళు తగేలా.
మన వీరులను ప్రభుత్వం గుర్తించకపోయినా ప్రజలు గుర్తించారండీ.
మానవ హక్కులవారిని తలుచుకోవడమే మహా పాపమనిపిస్తుంది కదండీ
Yes sir. భారతం లోని సంఘటనలు కళ్ళకు కట్టినట్టు మీరు ఈ టపాలో వ్రాశారు sir.
ధన్యవాదాలు
అవును శర్మ గారు. శిక్షల అమలులో జాప్యం ఇప్పుడూ జరుగుతోంది. దానికి పెద్ద ఉదాహరణ మొన్నీ మధ్యే దేశమంతా చూసింది కదా.
పాపం, తన శపధంలో భీముడు యుద్ధంలోనే చంపుతానని అన్నాడు ….. దుశ్శాసనుడి విషయంలో “అనిన్” అన్నాడు, దుర్యోధనుడి విషయంలో “రణాంగనంబునన్” అన్నాడు. కానీ మళ్ళీ ఆవేశం ఆపుకోలేక వెంటనే ఆయుధం వైపు చూసాడు గానీ అన్నగారి అనుమతి లభించలేదు. పైగా … తమ కళ్ళెదుట జరుగుతున్న ఘోరాన్ని ఆపలేక పోయారు గానీ … “కోపం తగదు” అని భీముడికి నీతులు చెప్పి వెనక్కు లాగడానికి మాత్రం ముందుకొచ్చారు ఆ భీష్మాదులు. దాంతో
శిక్ష అమలు పదమూడేళ్ళు వాయిదా పడింది.
అసలు భీముడు వెనక్కు తగ్గకుండా ఆ ఇద్దరినీ అప్పుడే అక్కడే వేసెయ్యాల్సింది …. తక్షణ న్యాయం జరిగుండేది, మహాభారత కథ ఓ మలుపు తిరిగుండేది. భార్యను అంత అవమానించినప్పుడు కూడా “కోపం తగదు” అని ఎదుటి వాళ్ళు సూక్తులు చెప్పడం ఏమిటి? ఆ ధర్మరాజు మీనమేషాలు లెక్కపెట్టడం ఏమిటి? (అలా అయితే యుద్ధంలోచంపుతానన్న అతని శపధం తప్పినట్లవుతుంది కదా అంటారేమో లెండి విజ్ఞులు? ఇలా జరిగుంటే చరిత్ర ఎలా ఉండేది అని ఊరికే ఓ ఊహాగానం చెయ్యడం లెండి, అంతే)
భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంది.ప్రపంచంలో ఉన్నదే భారతంలో ఉంది.
అప్పటి లాగే ఇప్పుడు శిక్షా ఆలస్యమయింది.మొన్న మార్చ్ ఇరవైకి రావలసిన టపా ఆలస్యమయిపోయిందంతేనండి
భీముడు అప్పుడే శిక్ష అమలు జరిపివుంటే ఏమయ్యేది? ఏంకాదు. మొన్న హైదరాబాడ్లో శిక్ష అమలు చేస్తే ఏమయింది. ఒకసారి అంతా ఘోరం,ఘోరంఅన్నారు. నాలుగు రోజులికి మరిచిపోయారు. అలాగే అప్పుడు కూడా అందరు ఘోరం అని ఉండేవారంతే.