బతికియుండిన శుభములబడయ వచ్చు.
వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసంగమః
రామాయణమ్..సు.కాం..సర్గ 13–౪47
మరణించుట వలన పెక్కు ప్రమాదములు కలుగవచ్చును.బ్రతికియుండిన సుఖముల బడయవచ్చు. బతికియున్నవారెప్పుడైనను కలియవచ్చు,అందువలన ప్రాణములు నిలుపుకొందును.
హనుమ లంకలో దిగారు. సీతకోసం వెతికి వేసారిపోయారు, సీత కనపడలేదు. ఒక బలహీన క్షణం లో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, మార్గాలు కూడా ఆలోచిస్తారు. అంతలో ఇదేమి ఇలా ఆలోచిస్తున్నానుకొని లంకిణిని గెలిచి శుభారంభం చేశాను. బతికియుండిన శుభములు బడయవచ్చు, బతుకుతాను,నా వారందరిని బతికించుకుంటాను అని నిర్ణయం తీసుకుంటారు. ఇది పాసిటివ్ తింకింగో మరేదో మీరే చెప్పాలి.
తెలిసో,తెలియకో చైనా ఒక వైరస్ ని ప్రపంచం మీద వదిలింది. దానిని ఎలా ఏ మందులతో ఎదుర్కొంది చెప్పటం లేదు. తన దేశంలో ఎంతమంది మరణించిందీ పూర్తిగా తెలియని విషయమే. అమెరికా, అగ్రరాజ్యం అల్లాడుతోంది మందులకోసం.భారత దేశం కరోనాని సమర్ధంగా ఎదుర్కుంటోంది. ఎలా మడితోనూ, గచ్చాకు పుచ్చాకుతోనా అని హేళన చేస్తున్నవారూ లేకపోలేదు. మనవారికి మందులు లేకుండా ఇతరదేశాలకి మందులు అమ్ముకుంటోంది భారత ప్రభుత్వం , ఇది మరో అసత్య ప్రచారం. అవే కావాలంటోంది అగ్రదేశం. మానింది మందు బతికింది ఊరు అని సామెత.
దేశంలో వలస కార్మికులు ఆకలితో అల్లాడుతున్నారని కొందరి ప్రచారం. మా దగ్గర లాక్ డవున్ ప్రకటీంచిన మరునాటి నుండే వ్యక్తులు సంస్థలు ఆహారం అందించడం మొదలు పెట్టాయి. స్కూళ్ళు కాలేజిలు వసతి కూడా ఏర్పాటు చేశాయి. మానవత వెల్లి విరిసింది. మన వారిని బతికించుకోడమే మన ప్రధమ కర్తవ్యం.బతికియుండిన సుఖముల బడయ వచ్చు నన్నదే నినాదం. ఒక ఫోన్ నంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేయండి, మీకు ఎక్కడైనా మనఊరిలో, ఎంతమందికైనా ఆహారం ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నవారున్నారు. స్వలాభాపేక్ష మరచి ఏ కూరైనా కెజి ఇరవైకే అమ్ముతున్నవారున్నారు. అసత్యాలు అర్ధ సత్యాలు ప్రచారం చేస్తున్నవారున్నారు. ప్రభుత్వం ఇంటికే కావలసిన సరుకులు చేరేస్తోందన్నది మరచిపోయారు మరికొందరు.ఆర్ధికంగా వెనకబడిపోతున్నాం,మరొకరి సన్నాయి నొక్కులు. అసలు బతికి ఉన్నప్పుడు కదా, బతికుంటే నేడు కాకపోతే రేపు సాధించుకుంటాం, మరొకరి మాట
దేశం కరోనాని జయించగలదు అనే నమ్మకాన్ని కలిగి ఉంది.దేశం మొత్తం మీద ఇటువంటి వ్యక్తులు సంస్థలు చాలానే పని చేస్తున్నాయి. మందు కూడా కనుక్కునేలాగే ఉంది.ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాలు చాలా తక్కువనే చెప్పాలి.ప్రపంచం మనకేసి చూస్తోంది,ఆశ్చర్యపోతోంది కూడా. బతుకు బతికించు అన్నదే నేటి నినాదం.జీవితం చూసిన ఒకరి మాట.కరోనాని దూరంగా తరిమేస్తున్నట్లే నిత్య శంకితులను దూరంగా వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి. IGNORE them.
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
చేరి మృగతృష్ణలో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖులమనసు రంజింపరాదు.
సర్వే జనాః సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీ రస్తు
నిత్య మంగళాని భవంతు
సర్వ శ్రీ రస్తు
సర్వమంగళాని భవంతు
సర్వే జనాః సుఖినో భవంతు.
ఇదే పాజిటివ్ థింకింగ్ .. మాష్టారూ.. మళ్ళీ బ్లాగ్ లు చదవడం ఇపుడే మొదలెట్టాను.. మనుషులను పుస్తకాలను చదివిన కొలదీ అసహనం. నిత్యజీవనంలో మంచి అన్నది కొంచెమైన కానరాక. మీ మాటలు గొప్ప దైర్యాన్నిస్తాయి. 🙏
పెద్దవారు గా మంచి మాట చెప్పారు sir. గడ్డుకాలం లో ఆపన్నహస్తం, సేవలు అందిస్తున్న వారికి వందనాలు.
సాధారణ దినాలలోకంటే ఇప్పుడే తాజా కూరలు పండ్లు బాగా దొరుకుతున్నాయి. కాలుష్యం తగ్గింది.
పూర్తిగా అనుకోవద్దుగాని కొంచం మేలు,అంతకే సంతోషం కదా!