శర్మ కాలక్షేపంకబుర్లు-భూమి గుండ్రముగానున్నది.

భూమి గుండరంగానే ఉందయ్యా! మాకు చాలా కాలం నుంచే తెలుసు.

బల్లపరుపుగా లేదంటారా? చిత్తం కాని నేటికీ బల్లపరుపుగా ఉందనే సంఘాలు పశ్చిమదేశాల్లో ఉన్నాయష.

దానికేంగాని, పూర్వం భారతదేశంలో వేశ్యలు ఉండేవారు.వారికి సమాజంలో గౌరవమూ ఉండేది,వారు సర్వతంత్ర స్వతంత్రులు కూడా. ఎవరితో లైంగిక సంబంధం ఉంచుకోవడం , తెంచుకోవడం వారిష్టం, బలవంతం లేదు. వారు కొన్ని చోట్ల ప్రభుత్వాలలో కూడా ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. వేశ్యా జీవితాన్ని ఒక వృత్తిగా నాటి సమాజం గుర్తించింది. ఒకే ఇంట్లో ఒకరు వేశ్యగా ఉంటే మరొకరు సంసారిగా ఉన్న సంఘటనలూ ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చిన తరవాత వేశ్యావృత్తి అనేది నీచం అని ఒక చట్టం చేసి నిషేధించారు. ఆ కాలానికి వేశ్యల ఇళ్ళు తెలిసి ఉండేవి, వీరిని భోగ స్త్రిలనీ పిలిచేవారు. . భోగం మేళాలనీ ఉండేవి. వీటినీ నిషేధించారు. బాగు! బాగు!! ఏంజరిగిందీ? ప్రభుత్వంలో ఉన్నవారి అంతేవాసులు వేశ్యలను పోగుచేసి, కొందరిని బలవంతంగా ఆ వృత్తిలోకి దింపి కంపెనీలు మొదలెట్టేరు. ఒక స్త్రీ పరపురుషునితో లైంగిక సంబంధం పెట్టుకుంటే పోలీసులు కేస్ రాసి కోర్టుకి తీసుకుపోయేవారు. అంతేవాసుల కంపెనీల మీద దాడి చేస్తే వూరుకుంటారా? పోలీసులకి ఆదాయ వనరు ఏర్పడింది.మామూళ్ళతో కాలం గడిచింది, ఒక్క పోలీస్ కేనా ఆదాయం, మరి ప్రభుత్వాలలో పెద్దలకీ చేరింది, సొమ్ము.

కాలం గడచింది, వేశ్యలకీ సహనం నశించింది, కోర్టు గడప తొక్కేరు. చివరికి కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ మధ్యనే ఒక తీర్పిస్తూ సుప్రీం కోర్ట్ ఇలా చెప్పింది.

మేజర్లయిన స్త్రీ పురుషులు ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకోవడంలో పోలీస్ జోక్యం అనవసరం. వేశ్యగా జీవించడం ఒక వృత్తి. ఐతే బలవంతంగా వేశ్యా వృత్తి చేయించడం నేరం. వేశ్యా గృహాలు నడపడం నేరం.

చక్రం తిరిగి కిందకొచ్చింది. భూమి గుండ్రముగా ఉన్నది.

చెప్పుకుంటే చాలా ఉన్నాయి మరో ముచ్చట మరో సారి.

శర్మ కాలక్షేపంకబుర్లు-నైజగుణానికి లొట్టకంటికి మందు లేదు.

నైజగుణమంటే సహజగుణం లేదా పుట్టుకతో వచ్చిన బుద్ధి. లొట్టకన్నంటే గుడ్డికన్ను, ఇదీ పుట్టుకతో వచ్చిందే! ఈ రెండిటికీ మందువల్ల మార్పురాదన్నదే,బాగుపడవన్నదే నానుడిలో చెప్పినమాట. దీనిని మరోలా కూడా చెబుతారు, “పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదని” అంటే మార్పురాదూ అని రూఢంగా చెప్పిన మాట. 🙂

వేపవిత్తును తెచ్చి పంచదారనీళ్ళలో నానబెట్టి మొలకెత్తించి, పంచదారనీళ్ళు పోసి పెంచినా, చెట్టు వేపకాయలే కాస్తుంది, మామిడి కాయలు కాయదు, కాసిన వేపకాయలు చేదుగానే ఉంటాయి.. ఇది సహజం.

పామును పిల్లగా తెచ్చి లేదా గుడ్డును తెచ్చి పిల్లప్పటినుంచి పాలుపోసి పెంచినా అది విషమే కక్కుతుంది,ఎన్నడూ అమృత చిమ్మదు, పెంచిన చేతిని కాటు వేస్తుంది, తన అవసరం బట్టి.

సింహం ముసలిదైనా,వేటాడటానికి కోరలు గోళ్ళు లేకపోయినా, రోగపీడతయైనా, ఆహారం లేక చచ్చిపోతుందిగాని ఎండుగడ్డి తింటుందా?ఇది లక్ష్మణ కవి ప్రశ్న. తినదు, ఆహారం సంపాదించుకోలేకపోతే చనిపోతుంది తప్ప గడ్డి తినదు,తినలేదు. అది అశోకుని సింహమైనా,గాంధీగారి సింహమైనా కోరలు గోళ్ళు ఉంటాయి.గాంధీగారి సింహం గడ్డి తింటుందంటే నమ్మాల్సిందేనా? జూ లో పెంచే సింహానికైనా మాంసమే ఆహారం, గడ్డి కాదు 🙂 సింహం తన సహజగుణం వదులుకోదు, వదులుకోలేదు.

ఎంత చదువుచదివి ఎన్ని నేర్చినగాని
హీనుడవ గుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు?
విశ్వదాభిరామ వినురవేమ.
తాతగారి మాట, ఏంతచదివినా,ఎన్ని అర్హతలు సంపాదించినా, గొప్ప పదవులు నిర్వహించినా హీనుడు (నీచ ఆలోచనా పరుడు) తన స్వగుణం (నైజ గుణం )మార్చుకోలేడు,ఉదాహరణ చెప్పేరు తాతగారు,బోధపడ్డానికి, బొగ్గు నల్లగా ఉంటుంది, ముట్టుకుంటే నలుపు చేతిని అంటుతుంది కూడా, ఇటువంటి బొగ్గును తెచ్చి తెల్లనైన పాలలో నానబెట్టి ఉంచి, ఎన్ని సార్లు కడిగినా, తన సహజగుణం నలుపును వదులుకోలేదు. హీనుడూ అంతే! కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు అరిషడ్వర్గాలన్నారు పెద్దలు. ఇందులో చిట్టచివరిది మాత్సర్యం,(ఈర్ష్య) ఈ మాత్సర్యంకి చిలవలు పలవలే,అసూయ,ద్వేషం. నిజాన్ని కూడా చూడలేకపోవడం ద్వేషానికి పరాకాష్ట.

సహజగుణాలని మార్చేస్తాం, అందరిని సమానం చేసేస్తాం అన్నది ఉత్తి మాట.

శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.-1

కురుకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనలో భీమ,దుర్యోధనులు గదాయుద్ధంలో తలపడ్డారు. ప్రదర్శన శ్రుతి మించుతోంటే, ద్రోణుడు కృపుని పంపి ఆపుచేయించారు. దుర్యోధనుడు ఉడికిపోయాడు, తనది పైచేయి కాలేదని. ఈ లోగా అర్జునుని అస్త్ర ప్రదర్శన, ప్రజల చప్పట్లు దుర్యోధనునికి పుండు మీద కారం చల్లినట్లనిపించింది. ఈ లోగా కర్ణుని రాక, అర్జుని ఎదిరించడం ఎడారిలో మలయమారుతమే అయింది, దుర్యోధనునికి. అర్జునిని ధిక్కరించిన అస్త్ర ప్రదర్శన ఆనందమే అయింది, కాని కర్ణుడు, అర్జునినితో తలపడ్డాన్ని కృపుడు ఆపుచేయడంతో దుర్యోధనుని మనసు మళ్ళీ కలకబారింది. కర్ణుడు రాజయితే, అర్జునిని ఎదిరించవచ్చనే ఆలోచన అప్పటికప్పుడు దుర్యోధనుని మదిలో పుట్టి పెరిగింది. కర్ణుని అంగరాజుగా చేయాలనే తలంపు బలంగా కలిగింది, సాధించుకోడానికి తండ్రి దగ్గరకుపోలేదు, తిన్నగా భీష్ముని దగ్గరకే చేరాడు, ఎందుకంటే అప్పటికి ధృతరాష్ట్రుడు భీష్మ,విదురుల మంత్రాంగంలో రాజ్యం నడుపుతున్నాడు. కర్ణుని అంగరాజుగా చేయాలనుకుంటున్నా అన్నదానికి భీష్ముడు తలవూపారు. భీష్ముడు కర్ణుని అంగరాజుగా నియమించడాన్ని ఎందుకు ఒప్పుకున్నట్టు? భీష్మునికి కురురాజ్య క్షేమం,కురు వంశాభివృద్ది ముఖ్యం. కురు రాజ్యంలో నాటి కాలాని రాబోయే తరంలో అర్జునుడు సాటి, మేటి విలుకాడు, మరొకడు లేదు. మరొకడు కూడా అంతటివాడు రాజ్యంలో ఉండడం మంచిదే! అటువంటివాడిని వదలుకోవడం రాజ్యానికి మంచిది కాదనే ఆలోచనతో ఒప్పుకున్నాడు. విషయం ద్రోణునికి చేరింది. ఆయన ఆలోచనేమి? కర్ణుడు కూడా తన శిష్యుడే, అర్జునుడంతవాడో కాకపొయినా , తన శిష్యునికే రాజ్య పదవి కట్టబెడుతోంటే ఆనందంతో తలూపాడు. ఇక విదురుడు,ఈయనకు దుర్యోధనుని దురాలోచన తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. తను అడ్డగించినా కార్యం ఆగదనే విషయం గుర్తించి,బయట పడకపోవడమే మేలని మిన్నకున్నాడు. అప్పటికి దుర్యోధనుడు పాండవులపట్ల చేసిన దురాగతాలు తెలిసినవాడు కనక. అవి భీమునికి విషాన్నం పెట్టడం,గంగలో తోయించడం. వీటిని పెద్దల దాకా చేరకుండా అడ్డుకున్నది కుంతి.

ఇప్పుడు భీష్మ,ద్రోణ,విదురుల ఆలోచనతో తండ్రి దగ్గరకుపోయి కర్ణుని అంగరాజుగా నియమించమని కోరాడు, జరిగిన విషయం తెలుసుకున్న ధృతరాష్రుడు నియామకం చేసాడు.

శర్మ కాలక్షేపంకబుర్లు-అతి…

అతి…

గత నాలుగు నెలలుగా ఎండలు పేల్చేస్తున్నాయి. మొన్న జూన్ 21 ఉదయం వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం రోజు కురుస్తూనే ఉంది, పదిహేను రోజులుగా. నాలుగు రోజుల కితం ఉదయం కాలేజి వాకింగ్ ట్రేక్ మీద నడుస్తుంటే వర్షం పట్టుకుంది, ఒక్క సారిగా అందరం పక్క స్కూల్ గదిలోకి చేరేం. కొద్ది సేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది.

ఒక పెద్దాయన వాతావరణం ఒక్క సారి మారిపోయిందీ అన్నారు, జానాంతికంగా.

ఒక యువకుడు వర్షకాలం కదా!మార్పు సహజం అన్నాడు.

మార్పు నెమ్మదిగా వచ్చేది అదేంటో ఈ సంవత్సరం మార్పు ఒక్క సారి వచ్చిందే అన్నది, కొద్దిగా చలి కూడా ఉంది, మరో మధ్య వయస్కుని మాట.

ఆరోగ్యాలు జాగ్రత్త హెచ్చరించారొక పెద్దాయన.

ఈ మధ్య వాకింగ్ లో అందరూ తడుస్తున్నారు, రైన్ కోట్లు వేసుకురండని చెప్పినా వినరు, విసుక్కుందో వృద్ధ మహిళ.

గ్రహచారం ఎలా ఉందో అన్నది మరో పెద్దాయన మాట.

గ్రహాలన్నీ మాలికా యోగంలో ఉన్నాయన్నారు, మరొకరు.

అదేంటో అన్నది ఒక యువకుని ప్రశ్న.

ఇటువంటివి చెప్పి ప్రజల్ని భయపెట్టడం అన్నది మరో యువకుని మాట.

విషయం వినరాదా అన్నారు మరో విజ్ఞుడు

గ్రహాలన్ని వరసగా రాసుల్లో ఒక వైపు ఉండడాన్ని మాలికా యోగం అంటారన్నారు మరొకరు.

అలా గ్రహాలు వరసగా ఉండడం అన్నది కొత్త మాటేం కాదు, ఇటువవంటివి జరుగుతూనే ఉంటాయన్నది ఒక యువకుని మాట.

విషయమేంటో తెలుసుకోకుండా తీసిపారేస్తావేం అదిలించారు మరో పెద్దాయన.

మాలికా యోగాలు వస్తూనే ఉంటాయిగాని దీని ప్రత్యేకతేంటో చెబుదురూ అన్నాడు మరో యువకుడు.

ఇప్పుడున్న మాలికాయోగంలో గ్రహాలు వరుసగా తమ స్వస్థానాల్లో ఉండడమే ఆ ప్రత్యేక. ఎలాగంటే శనికి మకర,కుంభాలు స్వస్థానాలు. శని కుంభం లో ఉన్నారు. గురునికి ధనుర్మీనాలు స్వస్థానాలు, గురువు మీనంలో ఉన్నారు. ఆ తరవాత కుజుడు స్వస్థానాలు మేష,వృశ్చికాలు. కుజుడు మేషంలో ఉన్నాడు రాహువుతో కలిసి. శుక్రుని స్వస్థానం వృషభం, శుక్రుడు వృషభం లో ఉన్నాడు. మిథునం బుధుని స్వస్థానం, బుథుడు అక్కడే ఉన్నాడు, చంద్రుని స్వస్థానం కర్కాటకం, చంద్రుడు అక్కడే ఉన్నాడు. ఇలా గ్రహాలన్ని తమతమ స్వస్థానాల్లో వరసగా ఉండడమే ఇప్పటి మాలికా యోగం ప్రత్యేకత, అని విశదీకరించారు, మరొకరు.

దీని విశేషం ఏమో చెప్పండీ అన్నారంతా ఏక కంఠం తో…..

ప్రతీ విషయం అతి చెయ్యడమే ఈ గ్రహమాలికా ఫలితం అని తువ్వాలు దులుపుకుని పైనేసుకుని చకచకా వెళ్ళిపోయారా పెద్దాయన, కర్ర పట్టుకుని…..

శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.

కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.


కుమారస్త్ర విద్యా ప్రదర్శనలో అర్జునునితో తలపడ్డానికి సిద్ధమయ్యాడు, కర్ణుడు. తగదని వారించారు కృపుడు. కారణమడిగాడు దుర్యోధనుడు. రాజుకాని వాడు రాజుతో తలపడడానికి లేదని చెప్పేరు, కృపుడు. ఐతే కర్ణుని రాజుగా ( అనగా పరిపాలకునిగా) ప్రకటిస్తున్నానని చెప్పి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసాడు. ఈ సంఘటన గురించి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి.

తనకే రాజ్యార్హత లేదు అంగరాజ్యానికి కర్ణుని ఎలాపట్టాభిషేకం చేసాడు? మరికొందరు, దుర్యోధనునికి ఆ హక్కు వున్నది పట్టాభిషేకం చేయచ్చు. ఇలా రకరకాల మాటలున్నాయి. కాని భారతం లో ఏమున్నది?

దుర్యోధనుడు కర్ణుని అంగ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుని, విషయం భీష్మునికి చెప్పేడు,ద్రోణునికి,విదు రు నికి తెలిసింది. ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు. అప్పుడు కర్ణునికి అంగరాజ్యం పట్టాభిషేకం చేశాడు దుర్యోధనుడు. అసలు పట్టాభీషేకం అంటే ఒక సర్వతంత్ర స్వతంత్ర్య రాజ్యం ఇచ్చేయలేదు. ఇది కురు సామ్రాజ్యంలోని ఒక పరగణా లేదా ఒక చిన్న రాజ్యం. దీనికి పరిపాలకుడుగా నియామకం జరిగింది, అంతే!