శర్మ కాలక్షేపంకబుర్లు-అతి…

అతి…

గత నాలుగు నెలలుగా ఎండలు పేల్చేస్తున్నాయి. మొన్న జూన్ 21 ఉదయం వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం రోజు కురుస్తూనే ఉంది, పదిహేను రోజులుగా. నాలుగు రోజుల కితం ఉదయం కాలేజి వాకింగ్ ట్రేక్ మీద నడుస్తుంటే వర్షం పట్టుకుంది, ఒక్క సారిగా అందరం పక్క స్కూల్ గదిలోకి చేరేం. కొద్ది సేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది.

ఒక పెద్దాయన వాతావరణం ఒక్క సారి మారిపోయిందీ అన్నారు, జానాంతికంగా.

ఒక యువకుడు వర్షకాలం కదా!మార్పు సహజం అన్నాడు.

మార్పు నెమ్మదిగా వచ్చేది అదేంటో ఈ సంవత్సరం మార్పు ఒక్క సారి వచ్చిందే అన్నది, కొద్దిగా చలి కూడా ఉంది, మరో మధ్య వయస్కుని మాట.

ఆరోగ్యాలు జాగ్రత్త హెచ్చరించారొక పెద్దాయన.

ఈ మధ్య వాకింగ్ లో అందరూ తడుస్తున్నారు, రైన్ కోట్లు వేసుకురండని చెప్పినా వినరు, విసుక్కుందో వృద్ధ మహిళ.

గ్రహచారం ఎలా ఉందో అన్నది మరో పెద్దాయన మాట.

గ్రహాలన్నీ మాలికా యోగంలో ఉన్నాయన్నారు, మరొకరు.

అదేంటో అన్నది ఒక యువకుని ప్రశ్న.

ఇటువంటివి చెప్పి ప్రజల్ని భయపెట్టడం అన్నది మరో యువకుని మాట.

విషయం వినరాదా అన్నారు మరో విజ్ఞుడు

గ్రహాలన్ని వరసగా రాసుల్లో ఒక వైపు ఉండడాన్ని మాలికా యోగం అంటారన్నారు మరొకరు.

అలా గ్రహాలు వరసగా ఉండడం అన్నది కొత్త మాటేం కాదు, ఇటువవంటివి జరుగుతూనే ఉంటాయన్నది ఒక యువకుని మాట.

విషయమేంటో తెలుసుకోకుండా తీసిపారేస్తావేం అదిలించారు మరో పెద్దాయన.

మాలికా యోగాలు వస్తూనే ఉంటాయిగాని దీని ప్రత్యేకతేంటో చెబుదురూ అన్నాడు మరో యువకుడు.

ఇప్పుడున్న మాలికాయోగంలో గ్రహాలు వరుసగా తమ స్వస్థానాల్లో ఉండడమే ఆ ప్రత్యేక. ఎలాగంటే శనికి మకర,కుంభాలు స్వస్థానాలు. శని కుంభం లో ఉన్నారు. గురునికి ధనుర్మీనాలు స్వస్థానాలు, గురువు మీనంలో ఉన్నారు. ఆ తరవాత కుజుడు స్వస్థానాలు మేష,వృశ్చికాలు. కుజుడు మేషంలో ఉన్నాడు రాహువుతో కలిసి. శుక్రుని స్వస్థానం వృషభం, శుక్రుడు వృషభం లో ఉన్నాడు. మిథునం బుధుని స్వస్థానం, బుథుడు అక్కడే ఉన్నాడు, చంద్రుని స్వస్థానం కర్కాటకం, చంద్రుడు అక్కడే ఉన్నాడు. ఇలా గ్రహాలన్ని తమతమ స్వస్థానాల్లో వరసగా ఉండడమే ఇప్పటి మాలికా యోగం ప్రత్యేకత, అని విశదీకరించారు, మరొకరు.

దీని విశేషం ఏమో చెప్పండీ అన్నారంతా ఏక కంఠం తో…..

ప్రతీ విషయం అతి చెయ్యడమే ఈ గ్రహమాలికా ఫలితం అని తువ్వాలు దులుపుకుని పైనేసుకుని చకచకా వెళ్ళిపోయారా పెద్దాయన, కర్ర పట్టుకుని…..