శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుడు-అంగరాజ పట్టాభిషేకం.-1

కురుకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనలో భీమ,దుర్యోధనులు గదాయుద్ధంలో తలపడ్డారు. ప్రదర్శన శ్రుతి మించుతోంటే, ద్రోణుడు కృపుని పంపి ఆపుచేయించారు. దుర్యోధనుడు ఉడికిపోయాడు, తనది పైచేయి కాలేదని. ఈ లోగా అర్జునుని అస్త్ర ప్రదర్శన, ప్రజల చప్పట్లు దుర్యోధనునికి పుండు మీద కారం చల్లినట్లనిపించింది. ఈ లోగా కర్ణుని రాక, అర్జుని ఎదిరించడం ఎడారిలో మలయమారుతమే అయింది, దుర్యోధనునికి. అర్జునిని ధిక్కరించిన అస్త్ర ప్రదర్శన ఆనందమే అయింది, కాని కర్ణుడు, అర్జునినితో తలపడ్డాన్ని కృపుడు ఆపుచేయడంతో దుర్యోధనుని మనసు మళ్ళీ కలకబారింది. కర్ణుడు రాజయితే, అర్జునిని ఎదిరించవచ్చనే ఆలోచన అప్పటికప్పుడు దుర్యోధనుని మదిలో పుట్టి పెరిగింది. కర్ణుని అంగరాజుగా చేయాలనే తలంపు బలంగా కలిగింది, సాధించుకోడానికి తండ్రి దగ్గరకుపోలేదు, తిన్నగా భీష్ముని దగ్గరకే చేరాడు, ఎందుకంటే అప్పటికి ధృతరాష్ట్రుడు భీష్మ,విదురుల మంత్రాంగంలో రాజ్యం నడుపుతున్నాడు. కర్ణుని అంగరాజుగా చేయాలనుకుంటున్నా అన్నదానికి భీష్ముడు తలవూపారు. భీష్ముడు కర్ణుని అంగరాజుగా నియమించడాన్ని ఎందుకు ఒప్పుకున్నట్టు? భీష్మునికి కురురాజ్య క్షేమం,కురు వంశాభివృద్ది ముఖ్యం. కురు రాజ్యంలో నాటి కాలాని రాబోయే తరంలో అర్జునుడు సాటి, మేటి విలుకాడు, మరొకడు లేదు. మరొకడు కూడా అంతటివాడు రాజ్యంలో ఉండడం మంచిదే! అటువంటివాడిని వదలుకోవడం రాజ్యానికి మంచిది కాదనే ఆలోచనతో ఒప్పుకున్నాడు. విషయం ద్రోణునికి చేరింది. ఆయన ఆలోచనేమి? కర్ణుడు కూడా తన శిష్యుడే, అర్జునుడంతవాడో కాకపొయినా , తన శిష్యునికే రాజ్య పదవి కట్టబెడుతోంటే ఆనందంతో తలూపాడు. ఇక విదురుడు,ఈయనకు దుర్యోధనుని దురాలోచన తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. తను అడ్డగించినా కార్యం ఆగదనే విషయం గుర్తించి,బయట పడకపోవడమే మేలని మిన్నకున్నాడు. అప్పటికి దుర్యోధనుడు పాండవులపట్ల చేసిన దురాగతాలు తెలిసినవాడు కనక. అవి భీమునికి విషాన్నం పెట్టడం,గంగలో తోయించడం. వీటిని పెద్దల దాకా చేరకుండా అడ్డుకున్నది కుంతి.

ఇప్పుడు భీష్మ,ద్రోణ,విదురుల ఆలోచనతో తండ్రి దగ్గరకుపోయి కర్ణుని అంగరాజుగా నియమించమని కోరాడు, జరిగిన విషయం తెలుసుకున్న ధృతరాష్రుడు నియామకం చేసాడు.