శర్మ కాలక్షేపంకబుర్లు-నైజగుణానికి లొట్టకంటికి మందు లేదు.

నైజగుణమంటే సహజగుణం లేదా పుట్టుకతో వచ్చిన బుద్ధి. లొట్టకన్నంటే గుడ్డికన్ను, ఇదీ పుట్టుకతో వచ్చిందే! ఈ రెండిటికీ మందువల్ల మార్పురాదన్నదే,బాగుపడవన్నదే నానుడిలో చెప్పినమాట. దీనిని మరోలా కూడా చెబుతారు, “పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదని” అంటే మార్పురాదూ అని రూఢంగా చెప్పిన మాట. 🙂

వేపవిత్తును తెచ్చి పంచదారనీళ్ళలో నానబెట్టి మొలకెత్తించి, పంచదారనీళ్ళు పోసి పెంచినా, చెట్టు వేపకాయలే కాస్తుంది, మామిడి కాయలు కాయదు, కాసిన వేపకాయలు చేదుగానే ఉంటాయి.. ఇది సహజం.

పామును పిల్లగా తెచ్చి లేదా గుడ్డును తెచ్చి పిల్లప్పటినుంచి పాలుపోసి పెంచినా అది విషమే కక్కుతుంది,ఎన్నడూ అమృత చిమ్మదు, పెంచిన చేతిని కాటు వేస్తుంది, తన అవసరం బట్టి.

సింహం ముసలిదైనా,వేటాడటానికి కోరలు గోళ్ళు లేకపోయినా, రోగపీడతయైనా, ఆహారం లేక చచ్చిపోతుందిగాని ఎండుగడ్డి తింటుందా?ఇది లక్ష్మణ కవి ప్రశ్న. తినదు, ఆహారం సంపాదించుకోలేకపోతే చనిపోతుంది తప్ప గడ్డి తినదు,తినలేదు. అది అశోకుని సింహమైనా,గాంధీగారి సింహమైనా కోరలు గోళ్ళు ఉంటాయి.గాంధీగారి సింహం గడ్డి తింటుందంటే నమ్మాల్సిందేనా? జూ లో పెంచే సింహానికైనా మాంసమే ఆహారం, గడ్డి కాదు 🙂 సింహం తన సహజగుణం వదులుకోదు, వదులుకోలేదు.

ఎంత చదువుచదివి ఎన్ని నేర్చినగాని
హీనుడవ గుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు?
విశ్వదాభిరామ వినురవేమ.
తాతగారి మాట, ఏంతచదివినా,ఎన్ని అర్హతలు సంపాదించినా, గొప్ప పదవులు నిర్వహించినా హీనుడు (నీచ ఆలోచనా పరుడు) తన స్వగుణం (నైజ గుణం )మార్చుకోలేడు,ఉదాహరణ చెప్పేరు తాతగారు,బోధపడ్డానికి, బొగ్గు నల్లగా ఉంటుంది, ముట్టుకుంటే నలుపు చేతిని అంటుతుంది కూడా, ఇటువంటి బొగ్గును తెచ్చి తెల్లనైన పాలలో నానబెట్టి ఉంచి, ఎన్ని సార్లు కడిగినా, తన సహజగుణం నలుపును వదులుకోలేదు. హీనుడూ అంతే! కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు అరిషడ్వర్గాలన్నారు పెద్దలు. ఇందులో చిట్టచివరిది మాత్సర్యం,(ఈర్ష్య) ఈ మాత్సర్యంకి చిలవలు పలవలే,అసూయ,ద్వేషం. నిజాన్ని కూడా చూడలేకపోవడం ద్వేషానికి పరాకాష్ట.

సహజగుణాలని మార్చేస్తాం, అందరిని సమానం చేసేస్తాం అన్నది ఉత్తి మాట.