శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

ఆంధ్ర మహాభారతం కవిత్రయ ప్రణీతం సభాపర్వం,ద్వితీయాశ్వాసం 172 నుండి 264వరకు స్వేఛ్ఛానువాదం

ధర్మరాజు, శకునిల మధ్య జూదం మొదలైంది. ధర్మరాజు పావులు ముట్టుకోకనే,సంపదలు,రాజ్యమూ ఓడిపోయాడు, ఆ తరవాత తనను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, తమ్ములతో సహా!అప్పుడు శకుని నువ్వు ఇంకా ఆడచ్చు, ద్రౌపదిని పందెంగా పెట్టచ్చు అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని పందెంఒడ్డి ఓడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. నీకు ఉచితానుచితాలు తెలియటం లేదు, ఎవరికి ఏ పని చెప్పచ్చో చెప్పకూడదో తెలియకవున్నావని అనడం తో ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పేడు. 

ప్రాతికామి ద్రౌపది దగ్గరకుపోయి సభలో జరిగినది చెప్పి, ఆమెను సభకు రమ్మన్నాడు. విన్న ద్రౌపది,తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? ధర్మరాజునే కనుక్కురమ్మంది. అదేమాట సభలో చెప్పాడు ప్రాతికామి. అనుమానం సభలోనె తీరుస్తారు తీసుకురమ్మని చెప్పాడు, దుర్యోధనుడు. ఆమాటే వెళ్ళి ద్రౌపదికి చెప్పాడు, ప్రాతికామి.  ద్రౌపది ప్రాతికామి వెనక బయలుదేరి సభలో కురువృద్ధుల చెంతకు చేరింది.  ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు, నీవుపోయి  ద్రౌపదిని సభకు, తీసుకురమ్మని దుశ్శాసనునికి చెప్పాడు, దుర్యోధనుడు

దుశ్శాసనుడు తనకోసం బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న ద్రౌపది సభలో ఉన్న గాంధారి దగ్గరకు పరుగెత్తింది.ఎక్కడిదాకా పరుగెట్టిపోతావు?  నిన్ను పట్టకమాననని,  దుశ్శాసనుడు అటువస్తుంటే పట్టపురాణి గాంధారి దగ్గరకి పరుగుపెట్టింది. దుశ్శాసనుడు గాంధారి దగ్గరున్న ద్రౌపదిని పట్టబోతుంటే నన్ను ముట్టకు,రజస్వలను, ఏకవస్త్రను అని చెప్పింది. దుశ్శాసనుడు పట్టపురాణి సమక్షంలో నీవు ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా సభకు తీసుకెళతానని, ద్రౌపదిని కొప్పుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు, అప్పుడు కృష్ణుని తలచింది,ద్రౌపది. అంతట వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఎవరూ బదులు చెప్పలేదు.ఐతే నేను ధర్మ నిర్ణయం చెబుతున్నా! ఆమె అధర్మ విజిత,అంతేకాదు ఏకవస్త్రను సభకు ఈడ్చుకురావడం అన్యాయం అన్నాడు. దానికి కర్ణుడు కుర్రవాడివి, కురు వృద్ధులు, గురువులు ఉన్నచోట ఇలా పలకడం కూడదు. ఒక స్త్రీకి ఒకడు భర్త,ఈమెకు అనేకులు భర్తలు, ఈమెను బంధకి అంటారు, అందుచేత ఈమె ఏకవస్త్రగా గాని,వివస్త్రగాగాని సభకు తీసుకురావచ్చు,ధర్మం తప్పదు, అన్నాడు.కర్ణుని మాటపై దుర్యోధనుడు, పాండవుల,ద్రౌపది వస్త్రాలు ఊడతీయమన్నాడు. 

దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రం లాగుతుంటే అది అశేషమై వస్త్రాలు గుట్టగా పడ్డాయి,కాని ద్రౌపది ఒంటిపై బట్ట తొలగలేదు. అది చూచి దుశ్శాసనుడు సిగ్గుపడ్డాడు. ఇది చూచి భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని శపధం చేశాడు. సభలోనివారంతా ధృతరాష్ట్రుని కౌరవులను నిందించారు, ముసలిరాజులంతా పట్టించుకోలేదనీ తిట్టారు. అప్పుడు విదురుడు కలగేసుకుని సభకి ఇలాచెప్పాడు.వికర్ణుడు ధర్మబుద్ధితో చెప్పేడు. సభలో ధర్మసందేహం తీర్చకపోతే అబద్ధం ఆడిన ఫలితం పొందుతారు, అందుచే ధర్మం చెప్పి తీరాలన్నాడు. అప్పుడు ద్రౌపది పాండవుల పత్నిని, గోవిందుని చెల్లిని,నేడు వీనిచే సభామధ్యంలో, నరపతులు, కురువృద్ధులు,గురువృద్ధులు ఉండగా,  నన్నిలా చేయడం తగునా, నా మాటలకెవరూ సమాధానం చెప్పరే! నే దాసినా? నే దాసినా? అని అరిచింది.దానికి భీష్ముడు అమ్మా! నీ ప్రశ్న ధర్మ సూక్ష్మం, ధర్మరాజే సమధానం చెప్పగలడు, వీరి చర్యలఫలితం తొందరలోనే వీళ్ళు అనుభవిస్తారన్నాడు.

ఆ తదుపరి కర్ణుడు జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని ఒక్కణ్ణి కట్టుకో, పనికిరానివాళ్ళు ఎంతమంది ఉన్నా మేలులేదు, అని ఎకసక్కెమాడేడు.అంతట దుర్యోధనుడు తొడ చూపాడు.రవిలిపోయిన మనసుతో భీముడు తొడలు విరిచి చంపుతానని ప్రతిన చేశాడు. ఇది విన్న భీష్మ ద్రోణులు, కోపానికి ఇది తగు సమయం కాదన్నారు.అంతా ఎరిగిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకిపోయి, సభలో జరిగినదంతా భర్తకు తెలిపింది, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయని కూడా చెప్పింది. 

విన్న ధృతరాష్రుడు దుర్యోధనుని పిలిపించి పాండవులభార్య గౌరవనీయురాలిపట్ల తప్పు మాటలు మాట్లాడం తగదు, చిన్నప్పటినుంచి నీ దుష్ట స్వభావం మాన్చుకోలేదు, నీ మూలంగా పాండవులకు దుఃఖం కలిగిందని, వారిపట్ల దురాగ్రహం పనికిరాదు, అని తిట్టాడు. అందరికి మంచి చేయాలని తలచి ద్రౌపదిని పిలిపించి

’నా కోడళ్ళంద’రిలోనూ ఎన్నదగినదానివి, అయోనిజవు, నీకు వరమివ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దానికి ద్రౌపది ధర్మరాజును దాస్య విముక్తుని చేయమని, కారణం చెప్పింది,ధర్మరాజు తనయుడు దాసపుత్రుడనే పేరు లేకుందుకే అని చెప్పింది. మరో వరం కోరమన్నాడు. మిగిలిన పాండవులను అస్త్ర శస్త్రాలతో దాస్య విముక్తి చేయమంది. తధాస్తు అంటూ, మరో వరం కోరుకోమన్నాడు. 

నేను క్షత్రియ కాంతను, నేను రెండు వరాలు కోరడానికే అర్హురాలను, అని మూడో వరం సున్నితంగా తిరస్కరించింది. . ధృతరాష్రుడు ఆమెను మెచ్చి పాండవులను పిలిపించాడు. ధర్మరాజా! నీ సర్వసంపదలతో, నీ స్వరాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో,ఇంద్రప్రస్థం పోయి సుఖంగా ఉండమన్నాడు.

ద్రౌపది వరాలు కోరలేదు, ఆమెను పిలిపించి ధృతరాష్ట్రుడు వరాలెందుకిచ్చాడు? మెదడుకి పదును పెట్టండి….

శర్మ కాలక్షేపంకబుర్లు- కైక రాముని వనవాసం పదునాలుగేళ్ళే ఎందుకడిగింది?

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!!

ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం.

ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం.

కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా?

రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక.

దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు.

పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు?

రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది.

మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో పన్నెండేళ్ళ వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.