శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.

జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. 

మహాభారతం, కవిత్రయ ప్రణీతం, సభాపర్వం,ద్వితీయాశ్వాసం 264నుండి 267 వరకు.

“అనిన ధృతరాష్ట్రుండు కోడలిగుణంబుకు ధర్మంబెరుగుటకు సంతసిల్లి యనుజ సహితంబుగా యుధిష్ఠరు రావించి నీవు సర్వసంపదలు స్వరాజ్యంబును నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖంబుండుము నీకు లగ్గయ్యెడు మని వెండియు…….264

నీవు నిత్యము వృద్ధోపసేవజేసి యెరుగు దెల్లధర్మంబుల నెరుక లేక

కడగి నీ కెగ్గు సేసె నాకొడుకు దీని మఱచునది నీకు నొండ్లు గఱపనేల…265

మనమున వేరమి దలపమియును సక్షమచిత్తుడగుటయును గుణంబులుకై

కొని దోషంబులు విడుచుటయును నుత్తముడయిన పురుషునుత్తమగుణముల్….266

యేను బుద్ధిలేక జూదంబుపేక్షించితి. నల్పబుద్ధిసత్వుం డయిన నన్నును మీతల్లి యయిన గాంధారినిం దలచి,దుర్యోధనాదులు సేసినదుర్నయంబులు సేకొనకుండునది. సర్వశాస్త్ర విదుండయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండువుగా నిక్కురుకులంబునకు లగ్గగునని ధర్మరాజు బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన…267″

//నీ సంపదలు,స్వరాజ్యం తీసుకుని ఇంద్రప్రస్థం వెళ్ళి సుఖంగా ఉండు, నీకు మంచి జరుగుతుంది.నీవు పెద్దవాళ్ళని సేవించడం మూలంగా ధర్మాలన్నీ తెలుసు, నాకొడుకు ధర్మం తెలియక నీకు కీడు చేసేడు, దీన్ని మరచిపో! అన్నీ తెలిసినవాడివి నీకు మరొకరు చెప్పాలా! మనసులో వేరుగా తలపకపోవడం, క్షమాచిత్తం కలిగి ఉండడం, మంచిని తీసుకుని చెడును వదలిపెట్టడం ఉత్తములైనవారి ఉత్తమగుణాలు.

నేను బుద్ధిలేక జూదాన్ని తేలికగా, అశ్రద్ధగా,తీసుకున్నాను. నిర్లక్ష్యం చేశాను.  అల్పబుద్ధి కలిగిన నన్నూ మీతల్లి గాంధారిని తలచి, దుర్యోధనాదులు చేసిన చెడ్డపనులు మనసుకు తీసుకోకు. సర్వశాస్రాలూ తెలిసిన విదురుడు మంత్రిగా నీవు రక్షకుడవుగా ఉంటే ఈ కురుకులానికి మంచి జరుగుతుందని చెప్పి ధర్మరాజుకు పాండురాజు రాజ్యం సమర్పించాడు. //

నాకు బుద్ధిలేకపోయిందయ్యా! నాకు బుద్ధి లేకపోయి జూదాన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేశాను. స్వార్ధబుద్ధి కల నన్నూ మీ తల్లి గాంధారి ముఖాలు చూసి నాకొడుకు వాని అనుచరులు మీ పట్ల చేసిన చెడ్డపనులు మరిచిపో, క్షమించు.