శర్మ కాలక్షేపంకబుర్లు-ఉదయ ప్రార్థన శ్లోకాలు/అర్ధాలు-పరమార్ధాలు.

ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.

బాల భాస్కరుడు

ఉదయమే నిద్ర లేచి మంచం దిగే ముందు పడకమీదనుంచే సెల్ ఫోన్ మొహం చూసిగాని మంచందిగటం లేదెవరూ! నేటి కాలంలో, కాని, కొంతమంది ఇంకా ఈ శ్లోకాలు పఠించి చివరి శ్లోకంతో మంచం దిగుతూ భూమికి నమస్కరించే వారున్నారు, అరుదుగా! 

అసలీ శ్లోకాలేంటి? వాటి అర్ధ పరమార్ధాలేంటీ?

గురు బ్రహ్మ గురు విష్ణుః

గురుదేవో మహేశ్వరః

గురు సాక్షాత్పర బ్రహ్మ

తస్మై శ్రీ గురవేనమః

గురువు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు, సాక్షాత్తు దేవుడు, అటువంటి గురువుకు నమస్కారం.

ఆపదామపహర్తారం

దాతరం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం

భూయో భూయో నమామ్యహం

ఆపదలనుంచి కాచేవాడు, సంపదలిచ్చేవాడు,ఎల్లరచే కొనియాడబడేవాడైన రామునకు మరల, మరల నమస్కారం.

కరాగ్రే వసతే లక్ష్మీ

కరమధ్యే సరస్వతీ

కరమూలే స్థితా గౌరీ

ప్రభాతే కరదర్శనం

చేతి చివర లక్ష్మి,మధ్య సరస్వతి, చెయి మొదట గోవిందుడు ఆవాసం చేస్తున్న చేతిని చూస్తున్నానని,అంటూ కనులు తెరచి,అరచేతుల్ని చూచి కనులకద్దుకుంటాం.

సముద్రే వసనే దేవీ

పర్వతే స్తనమండలే

విష్ణుపత్నీనమస్తుభ్యం

పాదస్పర్శం క్షమస్వ మే

సముద్రంలో తేలియాడుతున్న దేవత, పర్వతాలే స్తనమండలాలుగా ఉన్న విష్ణుపత్నియైన భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను క్షమించు.

అంటూ కాలు భూమి మీద పెడతాం. 

జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు బ్రహ్మ స్వరూపం, చిటికినవేలు పట్టి నడిస్తే లోకాన్ని చూపించిన గురువు తండ్రి విష్ణు స్వరూపం, అజ్ఞానాంధకారాన్ని జ్ఞానమనే వెలుతురుతో పాలద్రోలిన గురువు మహేశ్వర స్వరూపం. ఆ తదుపరి గురువే దైవ స్వరూపం అని నొక్కి వక్కాణించారు,అనగా తల్లి,తండ్రి, గురువులే దైవ స్వరూపాలని చెప్పేరు, గురు సాక్షత్ పరబ్రహ్మ అంటూ.అటువంటి గురువులైన తల్లి,తండ్రులకు, గురువుకు దైవానికి నమస్కారం. 

ఆతదుపరి

రామో విగ్రహవాన్ ధర్మః ఇది మారీచునిమాట, రాముడు మూర్తీభవించిన ధర్మం. ధర్మో రక్షతిః రక్షితః, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షిస్తుంది. అటువంటి ధర్మానికి మరల,మరల నమస్కారం,అంటే ధర్మాన్ని ఆచరిస్తానని ప్రతిన, ధర్మం రక్షిస్తుందని నమ్మకం. ధర్మానికి నమస్కారం.

చేతిలో లక్ష్మి, సరస్వతి, పార్వతి నివసిస్తారు. గోవిందా అంటే నారాయణి,  నారాయణి,నారాయణులకు అభేధం, అక్కడ గోవిందా అంటే పార్వతి, లలితాదేవి స్వరూపం. లలితా దేవికి మరో పేరు ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణీ అంటారు. ఈ మూడు రూపాలూ బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల శక్తి రూపాలు. సర్వమూ నా చేతిలో ఉంది, నా ప్రయత్నంతో సర్వమూ సమకూడుతుందనే నమ్మిక,ప్రతిన. నా ప్రయత్నానికి దైవ శక్తి తోడవాలి,తోడవుతుందని కనులు తెరచి అరచేతులను చూచి కళ్ళకద్దుకుంటాం, ఇది స్వశక్తి మీద నమ్మకం కలగజేసుకోవడం.

సముద్రంలో నివసించే దేవీ, పర్వతాలే స్తనాలుగా కలిగిన, విష్ణుశక్తి స్వరూపిణి భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను,క్షమించమని వేడటం. 

సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆహారం పాల ద్వారా స్తనాలనుంచే ఇస్తుంది. అలాగే భూమి పైనున్న పర్వతాలు స్తనాలలా నీటిని నదులద్వారా ప్రజలకందజేసి, ఆకలి తీరుస్తూ ఉంది.విష్ణుపత్ని, విశ్వం విష్ణు సహస్రనామాలలో మొదటి రెండు నామాలు. సృష్టి సమస్తం విష్ణుమయం, “సర్వం విష్ణుమయం జగత్”, విష్ణువు శక్తి స్వరూపమే సృష్టి. మనకు కావలసిన ఆహారం నుంచి సర్వమూ భూమి నుంచి వచ్చేవే. భూమినుంచి పుట్టి భూమిలో కలసిపోతాం. అటువంటి భూమికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం. 

శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు,ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు? (జవాబు)

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)

భయపడి వరాలిచ్చాడు.

ఎవరికి భయపడ్డాడు?

ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి.

ఎవరువారు?

1.గాంధారి.2.ద్రౌపది.3.కుంతి.

ఎందుకుభయపడ్డాడు

గాంధారి:- ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తనకొడుకులు నీచప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. 

తార్కాణం:- యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు, అపుడామె ’జయోస్తు’ ని దీవించలేదు, ’యతో ధర్మస్తతో జయః’ ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే జయోస్తు అనే దీవించేది. మరో మాట కూడా. యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవిచావా కొడకా అని ఏడ్చింది. 

ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని భయపడ్డాడు. 

గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడు కి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.   

ద్రౌపది:- ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో నేను దాసినా? అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా? అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!…. ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు, భయపడ్డాడు

కుంతి:- ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు.

ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివని పొగిడేడు. ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ధర్మరాజు దాస్య విముక్తి అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు మిగిలిన భర్తల దాస్య విముక్తి అడిగింది. ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు. ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి.అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడయిందంతే! 

 స్వస్తి.