శర్మ కాలక్షేపంకబుర్లు– రాముని  రాజ్యం-భరతుని పట్టం-1 

రామం దశరథం విద్ధి

మాం విద్ధి జనకాత్మజం

అయోధ్యా అటవీం విద్ధి

గఛ్ఛ తాత యధా సుఖం

                                                సుమిత్రా దేవి

రాజ్యం రామునిదే, నాకీ రాజ్యం వద్దు, అన్నవాడు భరతుడు, ఇది నిజం కూడా, కాని ఈ నిజాన్ని నమ్మించడానికి భరతుడు పడ్డపాట్లు తెలుసుకోవలసినవే!    ”రామునిరాజ్యం-భరతుని పట్టం” అన్నదానిని ”రామరాజ్యం-భరతుని పట్నం” అని కూడా అంటుంటారు. నిజానికి, రాముని రాజుగా పట్టాభిషేకం చేసినది భరతుడే!!!

***

ఋషులు,మునులు, పౌరులు,జానపదుల అనుమతితో రామునికి యువరాజ పట్టాభిషేకానికి తలపెట్టేడు, దశరథుడు. సంగతి తెలిసిన కైక చాలా ఆనందించింది.  కాని మంథర, దశరథుడు కైకకిచ్చిన వరాలను గుర్తుచేసి, వాటిని కోరి, ”నీకుమారునికి పట్టాభిషేకం చేయించుకో” అని బోధచేసింది. ఆ మాట తలకెక్కిన కైక 

 వరాలు కోరింది.  రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి, భరతునికి పట్టాభిషేకం చేయాలి. సీతారామ,లక్ష్మణలు నార చీరలుగట్టి అరణ్యవాసానికి వెళ్ళారు, దశరథుడు కైకకిచ్చిన వరాలు అమలు చేయడానికి. రాముని విడచి ఉండలేని దశరథుడు అసువులుబాసాడు. రామలక్ష్మణులు అడవులకు పోయారు, భరత శత్రుఘ్నులు, భరతుని మేనమామ ఇంట ఉన్నారు. దశరథునికి నలుగురు కొడుకులున్నా, చనిపోయేనాటికి ఒక్కరూ దగ్గరలేకపోవడంతో, అంత్యక్రియలు జరుపడానికి, తైలద్రోణిలో వేసి ఉంచారు. 

వశిష్టులు ఇలా కబురు పెట్టారు, భరత,శత్రుఘ్నులకు,”రాజకుమారులు అత్యవసరంగా అయోధ్యలో నెరవేర్చవలసిన కార్యం ఉన్నందున, సత్వరం రావలసింది”. కబురందుకున్న భరతుడు మేనమామ,తాతగార్ల అనుమతితో అయోధ్యకు  బయలుదేరాడు.

అయోధ్య చేరిన భరతునికి పట్టణం వెలవెల బోతూ కనపడింది. తిన్నగా తల్లి దగ్గరకు చేరాడు. తండ్రి మరణవార్త తెలిసింది, దానితో సీతారామలక్ష్మణులు అడవులకెళ్ళేరు, వనవాసానికనీ తెలిసింది. పెద్దవార్త తల్లి చెప్పింది, దశరథుని తాను వరాలు కోరినట్టూ, వాటి అమలుకుగాను రాముడు పదునాలుగేళ్ళు వనవాసం వెళ్ళినట్టు, భరతుని  పట్టాభిషేకం చేసుకోమని చెప్పింది.  విన్న భరతుడు హతాశుడయ్యాడు. తల్లిని  తూలనాడాడు, చివరగా తానెప్పుడైనా నవ్వులాటకైనా రాజ్యపాలన చేయాలని అన్నానా!  అని కూడా అడిగాడు.   పట్టాభిషేకం చేసుకోమన్న మంత్రి, పురోహిత,పౌరులకు తామందరం రామునివద్దకు వెళుతున్నామనీ, రాముని వెనక్కు తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపిద్దామనీ చెప్పాడు.

****

అవగాహన:

తన ప్రమేయం లేకనే తనపట్ల నష్టం జరిగిపోయింది. విచలుతుడై తల్లిని తూలనాడినా, నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.

తండ్రి మరణం, నష్టం పూడ్చుకోలేనిది, తండ్రి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేయడం తప్ప.

తన రాజ్య పట్టాభిషేకం, తన ప్రమేయం లేకనే తల్లి నిర్ణయించడం.  తన ప్రమేయం ఆ నిర్ణయంలో లేకపోయినా, అపార్ధం చేసుకునేవాళ్ళు. పెదతల్లులు, అన్న,వదిన,తమ్ముడు, మిగిలినవారు, బంధుకోటి,ప్రజలు. మొదట నష్ట నివారణ చర్యగా మంత్రులకు రాముని దగ్గరకు వెళుతున్నాం, వెనక్కి తీసుకురావడానికి, సిద్ధం చేయమని చెప్పడం.తండ్రికి అంత్య క్రియలు చేయడం.

ఇంకా కలిగిన నష్టాలను భరతుడు ఎలా అధిగమించాడో తరవాత  చూదాం.

**** 

ఆలోచన.

నాటి కాలానికే పార్థివ శరీరాలని పాడవకుండా ఉంచే ప్రక్రియలున్నాయని తెలుస్తోంది.

భరతునికి కబురుపంపినది వశిష్ఠులు, ఇదేమి? గురువులు కబురుపంపండం అనే ఆలోచనే రాలేదెవరికి. అయోధ్యలో జరిగినదేమో భరతునికిగాని అతని మేనమామ,తాతగార్లకూ తెలియదు. కబురు పంపినవిధం విచారణీయం.

భరతుడు తల్లిదగ్గరకు రాగానే తెలిసినవి పిడుగులాటి వార్తలు.తండ్రి మరణం, అన్నదమ్ములు,

వదిన అడవులపాలవడం, రాజ్యభారం వహించమని తల్లి చెప్పడం (తన ఇష్టానికి వ్యతిరేకంగా)ఒక్కసారిగా సంయమనం కోల్పోయేలా చేసాయి భరతుని. ఇంతటికి కారణం తల్లి అని గుర్తించి, తల్లిని తూలనాడేడు. 

జరిగినదానికి విచారించిన భరతుడు కర్తవ్యాన్ని గుర్తించి, తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మంత్రులకు తాము రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నామని, బాటలు ఏర్పాటు చూడమని,సైన్యాన్ని సిద్ధం చేయమని, పట్టపుటేనుగును సిద్ధం చేయమని,తాను రాజ్యభారం వహించటం లేదని, రాముడే రాజ్యాధికారని చెప్పడం జరిగింది, మంత్రులు,పురోహితులు, పౌరజానపదులూ, పట్టాభిషేకం చేసుకోమని చెబుతున్నా.కొద్ది రోజులకితమే ఈ పౌరులే రాముని వెంబడించి అడవులకీ వస్తామన్నావారు. (Public memory short lived, అంటే ఇదేనేమో.)  

******

(విషయం పెద్దది. ఒక టపాలో రాయడం నా వల్ల కాలేదు. అందుకు భాగాలు చేయక తప్పలేదు, మన్నించాలి.  మొదలుపెట్టి చాలాకాలంగా పూర్తి చేయక వదలివేసినది. నేటికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈ భాగాన్ని పూర్తి చేయగలిగాను. మిగిలినది పూర్తి చేయాలని కోరిక, ఆపై అమ్మదయ.)

(విషయ సంగ్రహణ: వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం నుంచి. ప్రచురణ:గీతా ప్రెస్)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s