About kastephale

A retired telecom engineer.

శర్మ కాలక్షేపంకబుర్లు-కోడలికి బుద్ధి చెప్పి……..

కోడలికి బుద్ధి చెప్పి……..

”కోడలికి బుద్ధి చెప్పి, అత్త తెడ్డు నాకింది”, ఈ నానుడిని మన తెనుగునాట బాగా చెప్పుకుంటాం. దీనినే మోటగా కూడా చెబుతారు అది ”కోడలికి బుద్ధిచెప్పి, అత్త రంకుబోయింది” అని, ఇది మరీ మొరటుగా ఉంటుంది కాని మొదటిదాని కత చెప్పుకుందాం.

అనగానగా ఒక ఊళ్ళో ఒక అత్త,కోడలు, ఒకే ఇంట్లో కాపరం చేస్తున్నారు, ఇప్పటిలాగా అత్త కనపడితే పీకనులిపేద్దామని కోడలూ, కోడలు కనపడితే పీక కొరికేద్దామనుకునే, అత్తా, కోడళ్ళు లేనికాలం, సంసారపక్షంగా కొట్లాటలుండే రోజులు. ఉమ్మడి కుటుంబంలో వంటా వార్పూ అంతా అత్తగారి స్వామ్యమే, అప్పుడప్పుడూ కోడలు వండే అలవాటు. అత్త వంటింటి మీద తిరుగులేని ఆధిపత్యం వహించే రోజులూ. ఇటువంటి రోజులలో ఒక రోజు, అత్త కోడలిని వంట చేయమంది. అత్త వంటింటిలోకి రానివ్వడమే మహాభాగ్యం అనుకున్నకోడలు, వంట చేస్తోంది. అత్త కోడలికి వంట చేయమని పురమాయించినా, ఒక కన్ను వంటింటిమీద పడేసి ఉంచింది.

వంట చేస్తున్న కోడలికి కూరలో ఉప్పు సరిపోయిందా? లేదా? అనే అనుమానం వచ్చేసింది. ’ఎలాగో ఒకలా ఉంటుందిలే’ అని వదిలేస్తే, అమ్మో అత్తగారితో కష్టమే, ’వంటకూడా సరిగా చెయ్యడం రాదే! నాకోడలా!’ అని దెప్పుతుందేమో, అనుకుని, ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూసి, ఇటూ అటూ చూస్తే ఎవరూ కనపడలేదు. ఆ( మా బాగా ఉందనుకుని, కూర కలియబెట్టిన తెడ్డు చేతిలో ఉంటే, ఒక్క సారి అంటే ఒక్క సారి, దైవ సాక్షిగా ఒక్కసారి నాలుకతో నాకింది సుతారంగా. ఇటువంటి అనాచారమేదో చేస్తుంది, కోడలు చేయాలి, చేస్తే, చూసి పట్టుకోవాలనుకున్న అత్త, ఒక్క సారిగా ”హన్నా! హన్నా!! హన్నన్నా!!! ఎంత అనాచారం, ఎంత అనాచారం, మడిగా వంట చేస్తూ, రుచి చూస్తావా? అందుకు తెడ్డు నాకుతావా? ఎంగిలి మంగలం చేస్తావా? మా ఇంటా వంటా లేదే, మా పుట్టింటసలే లేదే, ఇటువంటి అనాచారం, నీ పుట్టింట ఇటువంటి అనాచారాలున్నాయా? మీవాళ్ళిలాగే పెంచారుటే నిన్నూ, ఇటువంటి అనాచారం పనులేంటే, వెళ్ళు వెళ్ళూ, తెడ్డు కడుక్కురా” అని చింత చెట్టును దులిపేసినట్టు దులిపేసింది. కోడలికి గుడ్ల నీళ్ళు తిరిగాయి, తెడ్డు నాకుతూ దొరికిపోయింది కదా! ఏమనాలో తెలియక నోరు మూసుకుంది. అత్త, ”ఆహా! ఇన్నాళ్ళకి కోడలి మీద పై చెయ్యి సాధించా”ననుకుని సంతోషపడింది.

రోజులు నడుస్తున్నాయి, ఒక రోజు అత్త వంట చేస్తోంది. ఆ సంఘటన జరిగినప్పటినుంచీ, కోడలు ఒక కన్ను అత్తమీద వేసి ఉంచింది. ఒక రోజు కూరవండుతూ ఉప్పు వేశానా లేదా? అనే అనుమానంలో పడిపోయింది, అత్త. ఏం చేయాలీ? వేసేననుకుని ఊరుకుంటే, ఆతరవాత వెయ్యలేదంటే అవమానం. వెయ్యలేదనుకుని మళ్ళీ ఉప్పేస్తే ఛీ! ఉప్పు కషాయం, నోట్లో పెట్టుకోలేరు. అందుకని అత్త అటూ ఇటూ చూస్తే ఎవరూ కనపడలేదు, గబుక్కున కూర కలియబెట్టిన తెడ్డు, అత్త ఒక్క సారి అంటే ఒక్క సారే, దేవుని సాక్షిగా ఒక్క సారి నాలికతో నాకింది. అమ్మయ్యా! కోడలు ఇది చూడనే చూసేసింది, వెంఠనే ”అత్తా! ఔరా, ఔరా, ఔరౌరా!!! ఇంత అనాచారం మా పుట్టింట నేను నేర్చుకోలేదమ్మా! ఇన్నేళ్ళొచ్చేయి, ఎందుకూ, రేవులో తాడి చెట్టులా పెరిగేవు, ఏంటి ఉపయోగం, మడిగా వంట చేస్తూ తెడ్డు నాకుతావా? ఇదేనా నువ్వు ఇన్నాళ్ళబట్టీ చేస్తున్నది” అని కోడలు, అత్తను దొరకబుచ్చుకుంది. అత్త ఒక్కసారిగా విస్తుబోయింది. ”అమ్మనా కోడలా! నీ పీత బుర్రలో ఇన్ని తెలివితేటలొచ్చేశాయా!” అనుకుని మౌనంగా ఉండిపోయింది.

ఇదిగో ఇక్కడిదాకా రాసేటప్పటికి మా సత్తిబాబొచ్చాడు, చాలా రోజుల తరవాత. వస్తూనే ”ఏంటండీ, నిన్న సవతులయ్యారా? ఇవేళ అత్తా కోడళ్ళమీద పడ్డారూ” అన్నాడు. ”బక్కవాణ్ణయ్యా! అత్తా కోడళ్ళ మీద పడగలిగినంత సత్తా ఉన్నవాడినేం కాదులే” అంటూ ”ఇదేంటీ” అన్నా. దానికి మా సత్తిబాబు

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్లనుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.

తప్పు, తప్పు, తప్పు అనేవాళ్ళ చాలామందే ఉంటారు. ప్రపంచం లో అందరికి ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది, కాని ఈ, తప్పు, తప్పు అని చెప్పేవారికి, తమ తప్పులు తమకు తెలియవు అన్నారు వేమన.

”తప్పులు చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు కాని వారికి తమతప్పు తమకు తెలియదు, అదెలా అంటే ఎర్ర గురివింద గింజకి ముడ్డి కింద నలుపుంటుంది. అదనుకుంటుందీ, నేను ఎర్రగా ఉన్నానూ అని, నిజానికి దాని నలుపు దానికి కనపడదు, దీపం కింద చీకటి ఉన్నట్టు. దీపం అనుకుంటుంది, నేను వెలుగిచ్చేస్తున్నానూ అని, కాని దాని కింద చీకటే ఉంటుంది. అది ఆ దీపానికి తెలియదు. అందుచేత తప్పులెన్నుకోడం అనవసరం. ఆ ఇద్దరూ ఆ ఇంటికోడళ్ళే, ఇద్దరూ దొంగలే, అనాచారం చేసి ఎంగిలి కూడు మగాళ్ళకి పారేస్తున్నారు, ఆ ఇంటి మగాళ్ళు, నిజంగా మగాళ్ళయితే, ఇద్దరిని చెరొకటీ వాయించి ఉండేవారు” అంటూ వెళిపోయాడు.

శర్మ కాలక్షేపంకబుర్లు-తెలగపిండిపొడి.

తెలగపిండిపొడి.

తెలగపిండిపొడినే నువుపిండి అని కూడా అంటారు. తెలగపిండి అంటే నూనె తీయగా మిగిలిన నువ్వుల చెక్క. ఈ రోజుల్లో ముడి నువ్వుల నూనెతీసి దానిని బ్లీచ్ చేస్తున్నట్టుంది. అలా ముడినువ్వుల నుంచి నూనె తీయగా మిగిలినది మాత్రం కాదని మనవి. నువ్వులు దంచి పొట్టు తేసిన తరవాత వచ్చే తెల్లనువ్వులు ఆడించగా మిగిలినదే తెలగపిండి, మన వాడకానికి ఉపయోగపడేది. ఇందులో ఇంకా కొద్దిగా నూనె ఉంటుంది. పాతరోజులలో నువుపప్పులో నూనె తీసిన తరవాత దానిని పశువులకు పెట్టేవారు, దానిలో ఎక్కువగా ఇసక ఉండేది. కొద్దిపాటి నువ్వులను మాత్రం ఇసకలేకుండా చేసుకుని నూనెతీసి మిగిలిన తెలగపిండిని వాడుకునేవారు. నువు పప్పునే వాడుకోవచ్చుగా అనే ప్రశ్న వేయచ్చు. నువ్వులలో నూనె ఉండిపోవడం మూలంగా ఇలా చేసినది ముద్ద అయిపోతుంది, అందుకు చేయరు. నువ్వులను అన్ని కూరలలోనూ వేసివండుతారు, చాలా బాగుంటుంది కూడా. నువుపిండి+పొట్లకాయ, నువుపిండి బీరకాయ, నేతి బీరకాయ ఇలా కలగలుపుగా కూరలు చేస్తారు. ఇలా కూరలు ఒక రోజువే మరి ఎక్కువ కాలం నిలవ ఉంచి వాడుకునేదే నువుపిండి.

నువుపిండి తయారీకి నేటికాలంలో నూనెతీసిన, ఇసకలేని నువుపిండిపొడి అదే తెలగపిండిపొడి బజారులో పాకెట్ లలో దొరుకుతోంది. దీనిలో కావలసిన ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. జీలకర్రకారం, వేయించినదాన్ని కలుపుకోవాలి, వెల్లుల్లి కూడా కొద్దిగా నూనెలో వేయించినవాటిని కచ్చా పచ్చాగా దంచి కలుపుకుంటే నిలవకి బాగుంటుంది. అన్నంలో కలుపుకుని కొద్దిగా నువ్వులనూనెవేసుకు కలుపుకుతింటే……..అహో! అదుర్స్…

ఇలా తినలేమన్నవారికి, కందిపొడిలో ఇలా తయారు చేసినదాన్ని కలుపుకుని వాడుకుంటే ఇంకా బాగుంటుంది.

నువ్వులతో వండుకునేవి, తయారు చేసుకునేవన్నీ కూడా ఔషధాలే! ఎందుకెందుకు పనికొస్తాయో చూదాం.

పక్క తడిపే అలవాటున్న పిల్లలకి కొద్దిగా చిమ్మిలి పెట్టడం ప్రారంభించండి. కొద్దిరోజుల్లోనే ఆ అలవాటు తప్పుతుంది. ఋతువు సరిగా రాని ఆడపిల్లలకి చిమ్మిలి మందు. మధ్య వయసుస్త్రీలకి కూడా చిమ్మిలి మందే. పురటాలికి నువ్వుపొడితో భోజనం పెడితే పాలు పడతాయి సమృద్ధిగా. గర్భాశయం కూడా సరిపడుతుంది కాన్పు తరవాత. వెల్లుల్లితో వాడకం మంచిది. మగవారిలో శీఘ్రస్కలనం తో బాధపడేవారు ఈ నువుపిండి పొడివాడుతుంటే తేడా కనపడుతుంది. ఇక పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వగైరాలకు కూడా మంచిదే,పెద్దవాళ్ళకి ముఖ్యంగా స్త్రీలకి ఎముకలు గుల్లబారడం తగ్గుతుంది.. ఒక్కరోజులో మార్పురాదు, రోజూ కొద్దికొద్దిగా వాడుకుంటుంటే మార్పు కనపడుతుంది. ఇందులో కాల్షియం వగైరా ఔషధాలున్నాయట, నాకు తెలియదుగాని వాడుకుంటే కలిగే ఫలితాలు మాత్రం తెలుసు. ఇది అనుభవ వైద్యం.

శుభం భూయాత్.                                   _/\_

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉరుకుతా ఉరుకుతా

ఉరుకుతా ఉరుకుతా

”ఉరుకుతా ఉరుకుతానన్న సయితేగాని ఉరికినసయితిని జూడలా” అన్నదో జానపదురాలు. ఇది గ్రామ్యం, అసలుమాట “ఉరుకుతా ఉరుకుతానన్న సవతులని చూశాను కాని ఉరికిన సవతిని చూడలేద”న్నది అసలు మాట.

దీనికతేంటిటా? పాతరోజుల్లో బహు భార్యాత్వం బాగానే ఉండేది. ఒక మగవానికి, ఒకరుకంటే ఎక్కువమంది భార్యలే ఉండేవారు. నేనెరిగుండి ఒకాయనకు ముగ్గురు భార్యలుండేవారు, అప్పుడు మరీ చిన్నతనం. ఆ తరవాత కాలంలో, ఒకరికి ఇద్దరు భార్యలుండేవారు, అప్పటికి నా వయసు ఇరవై దగ్గరిమాట. అతను మామ వరుసవాడు. ”మావా! ఒకరితోనే వేగలేకపోతున్నారుకదా! నువ్వు ఇద్దరిని ఎందుకయ్యా కట్టుకున్నావ”న్నా! కొద్దిగా హాస్యప్రియుడాయన. నవ్వి ”ఒరే అల్లుడూ! ఒక అత్త ఇక్కడుంటే, మరో అత్త పుట్టింట్లో ఉంటుందిగదరా” అన్నాడు. ”ఎందుకూ?” అన్నా. ”పురిటికీ” అన్నాడు. ”బాగానే ఉందిగాని, ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరూ నీ దగ్గరే ఉంటారు కదా, అప్పుడేంటీ” అన్నా. పైకి చెయ్యి చూపించి నవ్వేడు. అర్ధం కాలా.! అసలు సంగతి వదిలేసి మరేదో చెబుతున్నారే అని కోప్పడకండి, వస్తున్నా….

ఇలా ఇద్దరు ముగ్గురు భార్యలున్నపుడు వారి మధ్య తగవులూ సహజంగానే ఉండేవి. ఒకరినొకరు కొప్పు పట్టుకుని బయటికి వీధిలోకి ఈడ్చుకొచ్చి, తిట్టిన, తిట్టుకున్న సంఘటనలూ ఉండేవి,కలబది కొట్టుకున్నవారినీ ఎరుగుదును కూడా. ఆ తిట్లలో పడకగది రహస్యాలు కూడా అలవోకగా దొర్లిపోయేవి. ఇలాటి సందర్భం లో ఒక సవతి మరో సవతితో నూతిలో ఉరికి చస్తానని బెదిరింపే పైమాట, ఉరుకుతా ఉరుకుతా అన్నది. దానికి మరో సవతి ”ఉరుకుతా ఉరుకుతానన్న సయితినే చూశానుగాని ఉరికిన సయితిని చూడలేద”న్నమాట. నూతిలో ఉరికి ఛస్తానని బెదిరించిన సవతులను చూశానుగాని నూతిలో ఉరికి చచ్చిన సవతిని చూడలేదంటే, నువ్వు నూతిలో ఉరికి ప్రాణం తీసుకుంటే నా పీడా పోయినట్టే అన్నది, ఈ సవతి మాట.

సవతుల తగువంటే గంగా గౌరిల సంవాదమే మొదటిది. నిన్ను నెత్తిమీదనే ఎక్కించుకున్నాడే అంటే నిన్ను సగం శరీరమే ఇచ్చి తనలో కలుపుకున్నాడని, ఒకరినొకరు దెప్పుకున్నారు కూడా.

కృష్ణుడు కొద్దిగా సవతుల కయ్యంలో చిక్కుకున్నాడేమోగాని రాముడు మాత్రం అందులో చిక్కుకోలేదు.

నాటి మాట సరదాగా చెప్పుకోడానికి చెప్పినదేసుమీ

శర్మ కాలక్షేపంకబుర్లు-అభిమానధనుని ఆత్మవేదన

అభిమానధనుని ఆత్మవేదన.

గాంధారీ పుత్రా! అభిమానధనా!!సుయోధనా!!! ఏమి? అటుల చింతాక్రాంతుడవైయుంటివి, మా సోదరి గాంధారి మరల ఏమైనా నీమనసు కలచెనా?

మామా! శకునీ!! ఏమంటివి ఏమంటివి, మదీయ మాతృమూర్తి ఎన్నడును అటుల నా మనసును కలగింపచేయలేదే! ఆమెకు కనులున్నను కబోదివలెనే బతికినదిగదా! అస్మత్ పితృదేవులకు కనులులేకున్ననూ బాధ కలుగలేదు కదా! నా పరితాపమంతయు నాగురించి కాదు మామా!

నా భావ వారసులు, నా మెచ్చు చెలికాండ్రయిన తెనుగువారిటుల భావ దారిద్ర్యముచే కొట్టుమిట్టాడుచున్నారేలాయని కదా నా వ్యధ. నాడు పాండవులను హతమార్చు ప్రయత్నమున వీరు మన సేనలో భాగమే కదా! మన భావ వారసులుగారా!! మరేల వీరికీచింత? అంతర్జాలమున మనవారిదే కదా ప్రభ, ప్రతిభ. అందున వ్రాయువారందరునూ తెనుగు బిడ్డలే కదా. మన భావజాలమునకున్నూ లోటులేదుగదా! మనమెవ్వరిని భూషింపలేదే, మనకు పెద్దలు, గురువులు అను తేడాలేదే, చిన్నవారనిన తిరస్కారమూ, పెద్దలనిన పురస్కారామున్నూ లేదే! మన భావస్వామ్యమునకు ఎదురు నిలుచువారందరికీ తిరస్కారమే మన పురస్కారము, సత్కారముగదా! పెద్దలను భూషించిన ఎవరు చెప్పుకొందురు? ఎంతకాలము చెప్పుకొందురు? దూషించిన మనలను కలకాలమూ గుర్తుంచుకొనుటలేదా? మనవలన వారు పేరు ప్రఖ్యాతులు బడయుటలేదా? మన భావజాలమును కాదని బతుకనేర్తురా?దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకేగాని ఆత్మకుకావని వీరికి తెలియదా!

జాలమున కొందరర్భకులు వ్రాయమని భీష్మించుచుండిరా? తలుపులు మూసికొనిరిగాని, తలపులు మూసుకొనలేదే! మరొకచోట గిలుకుట మానినారా? ఇదియొక కండూతి గాదా! దీనినుండి తప్పించుకొనగలరా? గజతామర గోకినకొలది పెరుగునను మాట వీరికి తెలియదందునా? దీనికి ఔషధము ఉష్ణోదకము పోసి గోకుకొనవలెనని తెలియదా! అటులనే వీరుకూడా వ్రాసి కండూతి తీర్చుకొనవలనేగాని, తలుపులు మూయుట భావ్యముగాదే! మరికొందరు గోడపై బిడాలములవలె ప్రవర్తించుచుండిరా? గాలివాటు చూసి దూకుట/మానుట చూచుచున్నారా? మరికొందరు ఉరుకుదును,ఉరుకుదును అని బెదిరించుచుండిరా? కొందరు గుంభనగా యుండి ఏదో ఒక దినమున కనుపింపకుండా పోవలయునను దురాలోచన/దూరాలోచన చేయుచున్నారా?తలుపులు బిగించుకొనుటకు కారణము, అంతర్గత కలహములా, చూపోపమియా, ఇసీ! మేమెన్నిటిని వహింపలేదు. మూడుగాళ్ళ ముదుసలుల నస ఎప్పుడునూ ఉండినదేగదా! ఇటుల వ్రాయుట మానినవారంతా ఏదో ఒక దినమున మానసిక వైద్యులను సందర్శించవలసి వచ్చునేమోగదా! వీరింత సున్నిత మనస్కులేల?

అహో! చూడుము, కొందరు వ్రాయుట మానివేసి, ఎన్నడో వ్రాసినవాటిని ప్రచారము నిమిత్తము, ఈ నాటికీ ప్రతిదినమూ అజ్ఞాత రూపముతో వ్యాఖలు ప్రచురించుకొనుటలేదా? మరికొందరు ఎవరు వీక్షించిననూ లేకున్ననూ వ్రాయుటలేదా? కొందరదేపనిగ వ్రాయుటలేదా? మరి వీరికేల ఈ వ్యధ. మరి ఏలనయా వీరికీ దైన్యము?ముడుచుకొనిపోవుచున్నారా? మానసిక కృంగుబాటా? ఎన్నడును మనమేడ్చినదిలేదే, ఎవరినైన ఏడ్పించుటేగాని ఏడ్చుట మనయలవాటుగాదే

సిగ్గు, లజ్జ? వీటికి అర్ధములే తెలియవే, అటువంటివేమైనా ఉండియున్న చిన్ననాడే వదలివేసితిమే! భయమా మనకు ఏ కోశమున లేదే! ఆత్మన్యూనత, అదెన్నడును మనదరిజేరలేదే, మరేల వీరికీదైన్యము? భావ దారిద్ర్యమా? అదేల సంభవించెను. వ్రాయుటకు కారణమే కావలయునా! ఎవరినేని యధేఛ్ఛగా తప్పుబట్టవచ్చు గదా! ఇది భావ ప్రకటనా స్వాతంత్ర్యముగాదా?   మరేల చింత?

లెమ్ము సోదరా లెమ్ము ( నిదురలేదందువా?)
నడుము బిగించుము (వానపామువలె నడుము నిలుచుటలేదందువా?)
కలము ఝుళిపించుము (కత్తిని, కలమునూ కూడా ఝుళిపించు అలవాటు తప్పెనందువా?)
పగతుర గుండెలో నిద్రపొమ్ము. ( ఇప్పుడిక్కడనే నిదురపోతివే)

ఔరా! ఔరా!! ఔరౌరా!!!ఎందులకు వ్యధాభరితుడనగుచున్నాను? మస్తకము వ్రయ్యలగుచున్నదే! ఇదియంతయూ పాండవ హతకులకుట్ర గాని ఆ మాయలమారి కుట్రగాని కానోపుగదా!
ఎవరురా అచ్చట?
చిత్తము దొరా!
ఏమిరా దొరా యందువు ‘చిత్తము దేవరా యనలేవా?’భానుమతి దేవేరివారికి మా రాక విన్నవించుమురా!
ఆజ్ఞ ! దేవరా!!

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరికెవరు స్నేహితులు?

ఎవరికెవరు స్నేహితులు?

ఎవరు స్నేహితులు అని మొన్న టపా రాస్తే శ్రీనివాస్ గారు, రమణా రావుగారు, విన్నకోటవారు, జిలేబి గారు, ఎలాటివారు స్నేహితులో చెప్పారు కాని స్నేహితులు ఎవరో చెప్పలేదన్నారు అందుకే ఈ టపా. అవే శ్లోకాలు కనపడతాయి అదే టపా అని అనుకోకండి. అమ్మయ్య!బాకీలు తీర్చేశానండీ!!కొత్త బాకీలు చెయ్యదలుచుకోలేదు !!!  :)

పాపాన్నివార్యతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలేః
సన్మిత్రలక్షణం మిదం ప్రపదన్తిసన్తః……భర్తృహరి.

అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు బోషించు గుణము
విడువడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్త్రు డీలక్షణంబుల మెలగుచుండు…..లక్ష్మణ కవి.

చెడుపనులనుంచి రక్షించుట,మంచిపనులకు ప్రోత్సహించడం, రహస్యాన్ని దాచిపెట్టడం, కష్టంలో వదలిపెట్టకపోవడం,లేని సమయంలో సొమ్ము ఇచ్చి ఆదుకోవడం, ఇవి సన్మిత్ర లక్షణాలు అన్నారు కవిగారు.

పాపాన్నివార్యతి అంటే పాపం చేయడం నుంచి వారించాలి. నిత్యం ఎవరు చేయగలరు? అలా నివారించగలవారు భార్యకు భర్తా, భర్తకు భార్యా మాత్రమే, మరొకరివల్ల ఇది అసాధ్యం. భారతీయ వివాహంలో ఒక ప్రతిన, ప్రమాణం అదే ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచారామి (అనగా న+ అతిచరామి, ధర్మానికి, నీ మాటకి వ్యతిరేకించి ప్రవర్తించను వగైరా, వగైరా) ఉంది. ఉపమానాలు చెప్పి చెప్పి విసుగూ వచ్చింది, మీకూ చిరాకూ వచ్చింది అందుకు చెప్పటం లేదు.

యోజయతే హితాయ స్నేహితుని మంచిగురించి ఆలోచిచాలంటారు,
భార్య హితవు గురించి భర్త, భర్త హితవు గురించి భార్య మాత్రమే అనునిత్యం చర్య తీసుకోగలరు, మిగిలినవారికది అసాధ్యం. ఉపమానాలూ చెప్పను.

గుహ్యం నిగూహతి, రహస్యాన్ని కాపాడాలన్నారు,ఇందులో భార్యా భర్తలు బలే విచిత్రాలే చేసేస్తారు, చూసేవాళ్ళం నోళ్ళు వెళ్ళబెట్టుకోడం తప్పించి. ఒక ఉపమానం చెబుతా, వినండి. ఈయనకి తాగి అర్ధరాత్రి ఇంటికిరావడం అలవాటూ, వచ్చినవాడు తిన్నగా ఇంటికొస్తాడా? ఒక రోజు ఎదురింటి తలుపు కొడుతున్నాడు, తన ఇంటి తలుపనుకుని. భార్య చూసింది, గబగబా పరుగెట్టుకుని ఎదురింటి దగ్గరకెళ్ళింది, అప్పటికే ఆ ఇంటావిడ తలుపుతీసింది. ఏడవలేని నవ్వు మొహంతో ఎదురింటావిడతో, ”వదినా! కరంటు పోయిందీ, టెస్టర్ కనపడక ఇక్కడికొచ్చారు, కనపడింది, ఫ్యూజ్ పోతే వేశాను,కరంటొచ్చింది, ’అన్నిటికీ కంగారే నడవండి’ ” అని అంటుంటే తాగివున్నవాడి వాలకం చూసిన ఎదురింటావిడ, అతని భార్య చెబుతున్నది విని నోరొదిలేసి చూస్తూ ఉండిపోతుంది, ఎదురుగా కనపడుతున్నదానినినా భార్య ఎంత చక్కగా దాచేసిందో. ఇంట్లోకి మొగుణ్ణి తోసుకొచ్చి, తలుపులేసి, ”తాగద్దు మగడా అంటే చెప్పిన మాట వింటేనా? తాగేరే చూడండి, మనిల్లు ఎదుటివాళ్ళ ఇల్లూ తేడా చూసుకోవద్దూ!మరీ అంత ఒళ్ళు తెలియకుండా తాగాలా? పరువు పోతుందనుకున్నా! ఎన్ని సార్లు చెప్పేది? పరిగెట్టుకుని వచ్చేనుగనక సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మన పరువు బజారున ఉండేది. రేపటినుంచి ఇంటికి తెచ్చెయ్యండి, ఇద్దరం తాగేద్దాం, ఇంట్లో పడి ఏడవచ్చు, పరువు వీధిన పడదు!” ఇందులో చూడండి ఆ భార్య, భర్త చేసిన తప్పూ కప్పేసింది, అతని హితవూకోరింది, పాపాన్నుంచి రక్షించే ప్రయత్నమూ చేస్తోంది కదా! అన్నీ ముచ్చటగా ముప్పేటగా కలిసిపోయాయంతే. ఇలా మరెవరు చేయగలరు?

గుణాన్ ప్రకటికరోతి, మిత్రునిలో ఉన్న సుగుణాన్ని పదిమందిలో చెప్పాలన్నారు. ఆవిడో కూన రాగం తియ్యగలదు, దానికాయన ఆవిడ ఎమ్.ఎస్ స్థాయి గాయకురాలని చెప్పుకొస్తాడు, అలాగే ఆవిడా! ఒక సారి ఎవరో పడిపోతే హాస్పిటలుకి ఆటోలో తీసుకెళ్ళేడు, ఓ! దానిగురించి ఈవిడ తెగ ప్రచారం చేసేస్తుంది, ఇవి అతి అయిపోయి బాధగా ఉంటున్నాయి తప్పించి, అలా ఉన్న సుగుణాన్ని పొగిడి వారిని అదే పంథాలో నడపగలవారు ఒకరికొకరు, భార్యా/భర్తా మాత్రమే.

ఆపద్గతం చ న జహాతి, ఆపదలో ఉన్నప్పుడు వదలిపెట్టకూడదు. దీనికో ఉదాహరణే చెప్పుకోవాలి.

క్షీరేణాత్మగతో దకాయ హి గుణా దత్తాఃపురాతేఽఖలాః
క్షీరోత్నాప మపేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః
గన్తుం పావక మున్మన స్తదభవద్దృష్ట్వాతు మిత్త్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్త్రీ పునాస్త్వీద్పశీ…..భర్తృహరి.

క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్
క్షీరము దప్తమౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు
ర్వారసుహుద్విపత్తిగని వహ్ని జొరం జనె దుగ్ధ, మంతలో
నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ములమైత్త్రి యీగతిన్…లక్ష్మణ కవి

పాలలో నీరు కలిస్తే పాలగుణం నీటికొచ్చింది. పాలు కాగిపోతున్నాయని బాధపడుతూ నీరు పైకి లేచిపోతోంది, ఆవిరిగా. అయ్యో! స్నేహితుడు వీడిపోతున్నాడు, ఈ అగ్ని మూలంగా అని పాలు నిప్పులలో ఉరికి అగ్నిని ఆర్పేస్తున్నాయి. అప్పుడు పాలుచల్లబడితే నీరుకూడా ఉండిపోయింది, పాలతో.

పాలతో నీరుకలిస్తే పాలగుణం నీటికి, నీటి గుణం పాలకీ వచ్చాయి. జీవితం అనే కుంపటిలో, అనుభవాలనే నిప్పులు కాలుస్తుండగా ఒకరు బాధపడుతున్నారని మరొకరు ఆత్మ త్యాగానికే సిద్ధ పడుతున్నారు కదా! ఇదీ అవసర సమయం లో వదలిపెట్టకపోవడానికి పరాకాష్టకదా! ఇది భార్యాభర్తల మధ్య తప్ప మరొకరికి సాధ్యమా!

దదాతి కాలేః, ఒకరికోసం ఒకరు ఆత్మ త్యాగానికే సిద్ధపడే భార్యాభర్తలు అవసరానికి ఇవ్వకపోవడం అనేదే జరగదు. భారతీయ వివాహ వ్యవస్థలో స్త్రీధనమని ఉంది, ఆమెకు పెట్టిన నగలు, ఆమె సంపాదన, ఆమె ఆస్థులు అన్నీ ఆమె ఇష్టం, మగవాడు కలగచేసుకోడానిఉకి లేదు, ఇది శిష్టాచారం. ఈయన వ్యాపారం చేశాడు బాగానే సంపాదించాడు, విధి కలసిరాలేదు, పూర్తిగా నష్టపోయాడు, అప్పుడు ఆమె తన మెడలోని మంగళసూత్రం తో సహా ఇచ్చి ఆదుకున్నవారెందరో! అలా మరలా మొదలు పెట్టినవారు ఆ తరవాత ఆమె దగ్గర తీసుకున్న సొమ్ము మరలా వడ్డీతో ఇచ్చేసిన సందర్భాలెన్నో! ఇది కూడా భార్యా భర్తలలోనే సాధ్యం.

నిజం చెప్పాలంటే ఈ శ్లోకం పూర్తిగా భార్యాభర్తలగురించి చెప్పినదే! ఐతే కొన్ని గుణాలు పైవారిలో ఉండచ్చు, వారు కూడా ఉపకారమూ చెయ్యచ్చు కాని ఇలా భార్యకి భర్తా, భర్తకిభార్యలా మాత్రం కాదు కదా! ఇప్పుడు చెప్పండి అసలు సిసలు స్నేహితులు భార్య భర్త మాత్రమే కదా!

ఇటువంటి స్నేహం ఎలా ఉండాలి, మొదలవాలి?

ఆరమ్భగుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధిముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్……..భర్తృహరి.

మొదలు చూచిన కడుగొప్ప పిదప గుఱుచ
యాది కొంచము తర్వాత నధికమగుచు
దనరు దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలిక గుజన సజ్జనులమైత్రి…..లక్ష్మణ కవి.

మొదట ఎక్కువగానూ తర్వాత చిన్నదైపోయే, మొదట చిన్నదిగానూ ఆ తరవాత పెద్దదయే,ఉదయ, మధ్యాహ్న కాలాలలో ఉండే మన నీడలా, దుర్జనుల, సుజనులతో మైత్రి ఉంటుంది.

ఇద్దరూ ఎక్కడెక్కడో పుడతారు, పెరుగుతారు. పెద్దలు చూసి నీకు వీరు సరిపోతారని చెబుతారు. కొద్దికాలం మాటాడుకుని అగ్ని సాక్షిగా స్నేహం మొదలుపెడతారు. ఇది మధ్యాహ్నపు ఎండలో నీడలా మొదలవుతుంది. కాలం గడుస్తున్నకొద్దీ ఆ స్నేహం పెరుగుతూ ఉండి చివరకి సూర్యుడు అస్తమిస్తే నీడ అస్తమించినట్లు, ఒకరు అస్తమిస్తే అప్పుడు ఈ స్నేహం ఆగిపోతుంది. అలా కాక ఉదయపునీడలా సహజీవనం తో ప్రారంభమయి ఆ తరవాత చేసుకున్న పెళ్ళిళ్ళు మధ్యాహ్నపునీడలా తగ్గిపోతున్నాయి, అటువంటి సమయంలో

కూరిమిగలదినములలో
నేరములెన్నడును గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ…

స్నేహం ఉన్నకాలంలో వారే వీరు, వీరేవారు చెప్పడమే కష్టం,ఎవరెవరో. ఆ స్నేహం కాస్తా విరిగింది, కారణం ఏదయినాకావచ్చు, చిన్నదే అయిన కారణం కూడా పెద్ద భూతం లా పెద్దదిగానూ కనపడచ్చు, అప్పుడు ఎవరు మాటాడినా రెండవవారికది తప్పుగానే తోస్తుంది,మరి అటువంటి స్నేహం అవసరమా?

ఇంతకీ నిజమైన స్నేహితులు భార్యభర్త అవునాకాదా చెప్పండి….

శర్మ కాలక్షేపంకబుర్లు-గట్టి పకోడి

గట్టి పకోడి.

మొన్న పకోడి కూర గురించి రాస్తూ గట్టి పకోడీ, మెత్తటి పకోడి అన్నా. మెత్తటి పకోడీ కూర చెప్పేరు,గట్టి పకోడీ గురించి చెప్పలేదేం అన్నారు, మిత్రులు విన్నకోట వారు, ఆకుకి అందని పోకకి పొందని సమాధానం చెప్పేసి తప్పించేసుకున్నా, అస్తమానం అందర్నీ బుట్టలో పడెయ్యడం కుదురుతుందా? ముందుకొస్తే డాక్టర్ సుమన్ లతగారు నిలదీశారు, తప్పించుకోడానికి దారిలేక ఇలా…..

మెత్తటి పకోడి వేసుకోడానికి శనగపిండి, కొద్దిగా వరిపిండి, బళ్ళారి నీరుల్లిపాయలు, పచ్చి మిర్చి ఏదయినా సరిపోతుంది, వేసేసుకోవచ్చు. మరి గట్టి పకోడీకి అలా కుదరదు.

నిజానికి కోడికాని కోడి ఈ గట్టిపకోడీ. గట్టిపకోడీ కి మొక్కజొన్నపిండి కావాలి, కొద్దిగా, వరిపిండి, కొంచం శనగపిండి చాలు, వీటిని కలిపేసుకుని, కొద్దిగా పసుపేసి, ఉప్పేసి, అందులో నీరుల్లిలో చిన్నపాయలు, గొల్లప్రోలు పాయలు తరుక్కుని, సన్నపచ్చి మిర్చి సన్నగా తరుక్కుని, పిండిలో కలిపేయాలి. గట్టి పకోడి ఇంకా బాగోవాలంటే, తోటకూర కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి.

నీరుల్లిపాయని ఎల్లియం సీపా అని, వెల్లుల్లిని ఎల్లియం సతీవా అని అంటారట. ఉల్లిపాయలు తరిగేటపుడు కళ్ళ నీళ్ళు తక్కువ కార్చాలంటే ఒక ఉల్లిపాయను కత్తిపీటకి సగం తరిగి కత్తిపీటని ఉంచేస్తే చాలు.నీరుల్లి పాయ తరిగేటపుడుటపుడు కళ్ళంట నీళ్ళొస్తాయి, ముక్కు చీదాలి, రొంప పట్టినట్టు ఉంటుంది, నిజంగా ఏడ్చినట్టే ఉంటుంది, రొంప పట్టేసిందా? వంటింటిలోకెళ్ళి ఇల్లాలికి ఉపకారం చేసినట్టు ఉల్లిపాయలు తరిగేయండి, రొంప దెబ్బకి పరార్, ఎల్లియం సీపా రొంపకి మంచి మందండీ, ఇది హోమియో మందు, దారి తప్పేసేను మన్నించండి, మళ్ళీ పకోడీల్లోకొచ్చేద్దాం.

బాగా కాగిన నూనెలో పిండి విదిపితే బంగారం రంగులో వేగిన తరవాత దేవుకుని పేపర్ మీద పోసుకుంటే నూనె పీల్చేస్తుంది, పేపరు. తింటే కరకరలాడుతూ, మధ్యమధ్య పచ్చిమిర్చి తగిలి, కళ్ళనీళ్ళొస్తే, వెంటనే ఉల్లిపాయ తగిలితే ఆనందం, పచ్చిమిర్చి తగిలితే “మంచినీళ్ళు తాగాలనికూడా చెప్పాలా? ఏంటోనమ్మా! ఏదీ గుర్తుండదంటే ఎలా చచ్చేదీ” అని దీర్ఘం తీస్తుంటే, అబ్బో అప్పుడు గట్టి పకోడీ రుచే వేరూ.

ఒక చల్లటి సాయంత్రం సన్నటి జల్లు కురుస్తుంటే, పడక కుర్చీ వేసుకుని కిటికీ దగ్గర కూచుని జల్లు చూస్తుంటే, ఇల్లాలు గట్టి పకోడీవేసి పళ్ళెంలో తెచ్చి పెడితే, చల్లని పిల్లగాలి వీస్తుంటే, ”తినండీ” అన్న మాట వినపడితే,
”నువ్వు తిన్నావుటోయ్” అంటూ ఒక పకోడీ అమె నోటికందిస్తుంటే,
”చాలు, ముదిమికి ముచ్చట్లు లావని, లేటు వయసులో ఘాటు ప్రేమా?”.. అని మూతి తిప్పుకుంటుంటె.
”అదేమోయ్! అన్యాయం!! మూడు పాతికలకే ముసలా?” అంటూ ఒక పకోడీ ఆమెకుపెడితే, “ఓహో! ఏమీ మా శ్రీవారి ప్రేమా!” అని ఇల్లాలు మురిసిపోతుండగా పకోడీల పళ్ళెం ఖాళీ చేస్తే, శ్రీమతి వారు పళ్ళెం పట్టుకెళ్తుండగా,
”ఏమోయ్! మాట,”
”చెప్పండి,”
”ఇలారా!”
”వినపడుతోందిగా!!”
”మరీ అంత దూరం ……”
”పిచ్చి వేషాలెయ్యక ఏంటో చెప్పండి” అని కొద్ది దూరానికొస్తే
”రాత్రికి ఉల్లిపాయ పులుసు పెట్టకూడదూ?”
”ఎందుకు పెట్టకూడదూ? పెట్టచ్చు, కోరికలు లావయిపోతున్నాయే!, ఉల్లిపాయలెవరు తరుగుతారు? మా ఆయనా?”
”ఓ! అలాగే,”
”చాల్లెండి, ఉల్లిపాయలు తరగడం పేరు చెప్పి, చెయ్యి తెగ్గోసుకోగలరు,ఇంకక్కడినుంచి ముక్కుచీదడం, తుమ్ములు, నానా రభసా చేస్తే వీధిలోవాళ్ళంతా, నాకేదో తవ్వి తలకెత్తుతున్నట్టు అనుకోవాలనా? మీ సంగతి నాకు తెలీదా! ఏభయి ఏళ్ళనుంచి చూస్తుంటే” అని ఆటపట్టిస్తే, ముసిముసినవ్వులు నవ్వుతూ లోపలికెళ్ళి రాత్రి బోజనానికి గట్టిపకోడీకి జోడీ ఉల్లిపాయపులుసు, అదికూడా ఇలాపెడితే.

నీరుల్లిలో బళ్ళారి రకం పెద్దవి, గొల్లప్రోలు ఉల్లిపాయలు చిన్నవి, చిన్నవి చాలా ఘాటుగా ఉంటాయి. వీటిని సన్నగ చిన్న ముక్కల్లా తరుక్కోవాలి. సన్న పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకోవాలి. చింతపండు పులుసు పిసుక్కుని,పల్చగా,ఉప్పేసి, కొద్దిగా పసుపేసి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చేర్చేసి, కొద్దిగా కొట్టు పిండి, (వరిపిండే వేసి,) సన్నటి సెగని మరగనివ్వాలి, కొద్దిగా పోపుపెట్టాలి. బాగా గట్టి పడనివ్వకుండా గరిట జారుగా ఉండేలా చూసుకోవాలి.

ఈ ఉల్లిపాయల పులుసు కొద్దిగా వేడిగా ఉండగా అన్నం లో కలుపుకుని కొద్దిగా నూనెవేసుకుని, గట్టి పకోడీ నంచుకుంటూ, ఇల్లాలితో కబుర్లాడుతూ భోజనం చేసి, ఒక్క వక్కపలుకు నోట్లో పారేసుకుని (లేకపోతే ఉల్లిపాయ వాసనని ఇల్లాలు గొడవ పెడుతుందికదా) భుక్తాయాసాన్ని తీర్చుకోడానికో వంద అడుగులేసి,
”ఏమోయ్! ఇంకా అవలేదూ?”
”మీకేం! మహరాజులా భోజనం చేసెళ్ళేరు, ఎంత దేవుకుంటే అవుతుంది? ఏంటిటా?”
“అబ్బే ఏంలేదోయ్! పనయితే వస్తావేమో కబుర్లాడుకుందామని, మిగిలిన పని రేపు పొద్దున చేసుకోవచ్చులే” అని నసిగితే
”రేపు పొద్దునెవరు చేస్తారుటా? మా ఆయనా?”
”ఆ అలాగే చేస్తాను, ఏం చెయ్యలేనా?”
”వద్దు మహప్రభో వద్దు, ఆ తరవాత నా తిప్పలెవరికెరుక, వస్తున్నా ఉండండి, ఆ కంప్యూటర్ దగ్గర కూలబడకూడదూ కాసేపు” అని మెత్త మెత్తగా వాయిస్తుంటే…
పని పూర్తి చేసుకొచ్చి ”చెప్పండి ఏంటిటా?” అని అడుగుతూ కూచుంటే
”ఇప్పటిదాకా ఎండ పేల్చేసి, చల్లబడితే హాయిగా ఉందికదూ” అంటే
”ఏ కాలానికి ఏది తప్పుతుంది?”
ఇలా కబుర్లాడుకుంటుంటే….
మధురం మధురం ఈ సమయం ,ఇక జీవితమే ఆనందమయం….

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు స్నేహితులు?

ఎవరు స్నేహితులు?

అసలు స్నేహితులెవరు? ఈ ప్రశ్న నన్ను చాలా కాలం నుంచీ వేధిస్తోంది. స్నేహితుడు అనే మాటకి అర్ధం చెప్పమంటే ఫ్రెండ్ అని చెబితే కాని తెలియని రోజులొచ్చాయి. అసలు స్నేహితుడు/స్నేహితురాలు అనేవారెవరు? ఇప్పుడు ఫేస్ బుక్ లో లైక్ కొట్టేవాళ్ళూ, ట్వీట్ చేసేవాళ్ళూ అంతా స్నేహితులేనా? స్నేహితునికి/స్నేహితురాలికి ఉండవలసిన లక్షణాలేమిటి? అన్ ఫ్రెండ్ అనే మాటకి అర్ధం ఏమిటి? శత్రువనుకోవాలా? అని చూస్తే,

ఇదిగో ఈ శ్లోకం కనపడింది, అవధరించండి.

పాపాన్నివార్యతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలేః
సన్మిత్రలక్షణం మిదం ప్రపదన్తిసన్తః……భర్తృహరి.

అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు బోషించు గుణము
విడువడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్త్రు డీలక్షణంబుల మెలగుచుండు…..లక్ష్మణ కవి.

చెడుపనులనుంచి రక్షించుట,మంచిపనులకు ప్రోత్సహించడం, రహస్యాన్ని దాచిపెట్టడం, కష్టంలో వదలిపెట్టకపోవడం,లేని సమయంలో సొమ్ము ఇచ్చి ఆదుకోవడం, ఇవి సన్మిత్ర లక్షణాలు అన్నారు కవిగారు.

పాపాన్నివార్యతి అంటే పాపం చేయడం నుంచి వారించాలి. పాపం, తప్పుచేస్తే కలుగుతుంది. తప్పునుంచి మళ్ళించడం సాధ్యమా? ఎవరైనా చెప్పగలరుకాని చేయించలేరు కదా! ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు తక్కువ జరుగుతాయి, మందలో ఉంటే….”పబ్బుకెళదాం రావే!” ”అమ్మో! రాను”, ”వాడిదేం కరిగిపోదు, నీదేం అరిగిపోదులే! ఒక్కరోజు పబ్బుకెళ్ళినంతలోనే పాతివ్రత్యం పోదులే”, ఇదెవరిమాట? నీతి మీద అసలు నియమం లేనివారిది. దీనికి తోడెక్కువుంటుంది, మిగతావారు భజన చేస్తారు. మంచిమాట వినరు గాని చెడ్డమాటకి ఊపెక్కువ. రాను అని చెప్పగలిగినవారెంతమంది ఉంటారు. ”ఒకసారికే కదా!” మానవ బలహీనత, ”ఆ( ఎవరు చూసారు లెద్దూ, ఎవరిగోలవారిది”, ఇది సమర్ధింపు.. తప్పు, ఒక సారి మొదలు, తరవాత అలవాటు, ఆ తరవాత వ్యసనం. దీనినుంచి రక్షించేవారుండరు. అసలెవరు చూశారు? మనల్ని ఎవరు పట్టించుకుంటారు! ఇది మనల్ని మనం మోసం చేసుకోడం. మనకెందుకుపోనిద్దూ ఎవరిష్టంవారిది అనుకుంటారంతే, ఎవరూ తప్పని చెప్ప సాహసించరు.. మారీచుడు కూడా సులభా పురుషా రాజన్ అని ఎప్పుడు చెప్పేడు? నిన్ను చంపుతా వెళ్ళకపోతే అన్నపుడు కదా! బాగున్నంతకాలం హాయి, హాయ్ అనేసుకుంటే పోలా! ఉన్నమాట చెప్పి విరోధమెందుకు తెచ్చుకోడం అనుకునేవారే హెచ్చు. ఇదీ మానవ బలహీనతే. వేమనతాత ఏమన్నారు

వేరు పురుగుజేరి వృక్షంబు జెరచును
చీడ పురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు జేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ.

వేరుపురుగు చేరితే ఎంత పెద్ద వృక్షమైనా చచ్చిపోతుంది. చాలాపెద్దదాన్ని వృక్షం అని చిన్నదాన్ని చెట్టు అని అంటారు. ఎంత పెద్దదయిన వృక్షాన్నయినా చిన్న వేరుపురుగు చంపేస్తుంది,తల్లి వేరు కొరికేసి జీవనాడి లేకుండా చేస్తుంది..దానితో వృక్షమైనా చస్తుంది. చీడ పురుగుచేరితే చెట్టు చెడుతుంది, చచ్చిపోదు, చీడపురుగు చెట్టుని పాడు చేస్తుంది.. చెడ్డవాడు మంచివాడిని పాడుచెయ్యడానికే చూస్తాడు, అదివాడి నైజం, నైజ గుణానికి లొట్టకంటికీ మందులేదని సామెత కదా! అందుచేత పాపాన్నుంచి రక్షించే స్నేహితుడు కావాలి.

యోజయతే హితాయ స్నేహితుని మంచిగురించి ఆలోచిచాలంటారు, జరిగేమాటా? ఎవరి స్వార్ధం వారిదే! మరొకరిగురించి ఆలోచనే కనపట్టంలేదు. పొరబాటు జరిగిందేమోనని, అది ముందు జీవితానికి మంచిది కాదేమోనని, ఒకరికి ఒకమాట చెప్పేను, వారికామాట నచ్చినట్టులేదు, మాటాడటమే మానేశారు. ఇప్పుడు ఎవరు ఎవరిగురించి ఆలోచిస్తారు? ఇక ముందు నేనెవరైకైనా చెబుతానా, ఈ అనుభవంతో?

గుహ్యం నిగూహతి, రహస్యాన్ని కాపాడాలన్నారు, ప్రతిజీవితంలోనూ కొన్ని రహస్యాలుంటాయి, తెలిసినవారు వాటిని పదిమందిలో చెప్పకూడదు, కాని నేడు జరుగుతున్నది దానికి వ్యతిరేకమే. ఇంతకుమించి చెప్పుకోడం బాగోదు. కావాలని తప్పులు చేయించి వేధించేవారే కనపడుతున్నారు. రహస్యాన్ని కాపాడే స్నేహితులు కావాలి.

గుణాన్ ప్రకటికరోతి, మిత్రునిలో ఉన్న సుగుణాన్ని పదిమందిలో చెప్పాలన్నారు, ఇప్పుడు జరుగుతున్నదేంటీ? అందరిలో ”మావాడుట్టి వెధవాయండీ” అన్నట్టు మాటాడి, ఒకరూ ఉన్నపుడు, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, నీకు తగిన గుర్తింపురాలేదనేవారే కనపడుతున్నారు. దీన్నే ముడ్డి కాల్చి ఉప్పు పెట్టడం అంటారు. ఎవరిడబ్బా వారు కొట్టుకోడానికే సమయం చాలటం లేదు, మరొకరి గొప్ప చెప్పే పెద్దమనసున్నవారు కావాలి.

ఆపద్గతం చ న జహాతి, ఆపదలో ఉన్నప్పుడు వదలిపెట్టకూడదు. దీని గురించిన టపాలే రాశాను. ఒకప్పుడు ఒక ఆఫీసర్ గారితో గొడవొచ్చింది, నాకు. అది తెలిసినది మొదలు నా స్నేహితులంతా నాతో మాటాడటమే మానేశారు. అంతా బాగున్న కాలంలో హాయ్ హాయ్ అన్నవారే నావల్ల ఉపకారం పొందినవారే.. ఒక స్నేహితుడు మాత్రం ”ఒరే బాధపడకు, రోజులిలాగే ఉండవు, నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు చేస్తున్నపని తప్పుకాద”నేవాడు, నిన్న మొన్న మాటాడి, జ్ఞాకానికొచ్చావు, రాత్రి పదిగంటలవేళ, పడుకుని ఉంటావని పిలవలేదని, ఉదయమే మాటాడేడు.

దదాతి కాలేః, ప్రపంచంలో గొడవలన్నిటికి మూలకారణం కాంతా కనకాలే, సొమ్ముకావలసివచ్చి అడుగుతాడేమోనని పారిపోయేవారే ఎక్కువ. ధనమూలమిదం జగత్. ఇదే సత్యం…డబ్బుంటే అందరూ స్నేహితులే, చుట్టాలే…లేకపోతే ఒక్కడు కనపడడు.

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ…
సొమ్ములున్నపుడు అందరూ చుట్టాలే, అందరూ స్నేహితులే, ఎలా వస్తారటా? కవి చమత్కారంగా చెప్పేరు, నిండా నీరున్న చెరువులోకి కప్పలు చేరినట్టనీ, బలే ఉపమానం, నీరుతగ్గిపోతే కప్ప ఒక్కటీ కనపడదు, అలాగే సొమ్ము తగ్గిపోతే ఒక్క బంధువూ, స్నేహితుడూ కనపడడు.

ఇలా కవిగారు చెప్పిన మంచిగుణాలున్న వారు స్నేహితులుగా దొరుకుతారా? అసలు ఆ స్నేహితులు, మన చుట్టూ అలా ఎందుకు తిరగాలి, ఇన్ని ఉపకారాలు చేస్తూ? ఇన్ని సుగుణాలూ ఒకరిలో ఉంటాయా? అసలు ఇటువంటి స్నేహితులు కావాలనుకుంటే, మనలో ఈ మంచి గుణాల్లో ఎన్నుండాలి? మనలో మంచి గుణాలు లేక మంచివారు స్నేహితులుగా ఎలాదొరుకుతారు? అంటే ముందు మనలో మంచిగుణాలు, కవిగారు చెప్పినవి కొన్నయినా ఉండాలి కదా! అబ్బా! కవిగారెంత డొంకతిరుగుడుగా చెప్పేరో చూడండి, ఇటువంటి గుణాలుండాలిరా అబ్బీ అంటే ఎవరు వింటారు? :)

ఇటువంటి స్నేహం ఎలా ఉండాలి, మొదలవాలి?

ఆరమ్భగుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధిముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్……..భర్తృహరి.

మొదలు చూచిన కడుగొప్ప పిదప గుఱుచ
యాది కొంచము తర్వాత నధికమగుచు
దనరు దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలిక గుజన సజ్జనులమైత్రి…..లక్ష్మణ కవి.

మొదట ఎక్కువగానూ తర్వాత చిన్నదైపోయే, మొదట చిన్నదిగానూ ఆ తరవాత పెద్దదయే,ఉదయ, మధ్యాహ్న కాలాలలో ఉండే మన నీడలా, దుర్జనుల, సుజనులతో మైత్రి ఉంటుంది.

ఉదయపునీడ పెద్దదిగా ఉండి మధ్యాహ్నానికి మనమీదనే పడుతుంది, అంటే పొడవు తగ్గి, తొందరగా మొదలయే స్నేహాలు, అలాగే వదలి ఉండలేనట్టుగా మొదలయి, తొందరగానే ముగుస్తాయి,అదే మంచివారితో స్నేహం మధ్యాహ్నపు నీడలా చిన్నదిగా మొదలయి సాయంత్రపు నీడలా పెరుగుతుంది. సూర్యుడు అస్తమించినపుడు నీడ అస్తమించినట్లు, ఆ వ్యక్తులు అస్తమించిన తరవాతనే ఆ స్నేహమూ అస్తమిస్తుంది. అదీ అలా ఉండాలి స్నేహమంటే. లేకపోతే

కూరిమిగలదినములలో
నేరములెన్నడును గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ…

స్నేహం ఉన్నకాలంలో వారే వీరు, వీరేవారు చెప్పడమే కష్టం,ఎవరెవరో. ఆ స్నేహం కాస్తా విరిగింది, కారణం ఏదయినాకావచ్చు, చిన్నదే అయిన కారణం కూడా పెద్ద భూతం లా పెద్దదిగానూ కనపడచ్చు, అప్పుడు ఎవరు మాటాడినా రెండవవారికది తప్పుగానే తోస్తుంది, ”వెధవ! వాడిపాపాన వాడేపోతాడు” అని తిట్టుకుంటూ.