పరివేదన
మాతా నాస్తి పితా నాస్తి
నాస్తి బంధు సహోదరః
అర్థం నాస్తి గృహం నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత
తల్లి లేదు,తండ్రి లేడు,బంధువులు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు, ధనం లేదు,ఇల్లు లేదు! హెచ్చరిక! హెచ్చరిక!!
తల్లి లేదు,తండ్రిలేడు, ఇల్లు లేదు వాకిలి లేదు, సొమ్ములేదు, అంటారేంటీ? ఎదురుగా కనపడుతున్నవి,అనుభవంలోకి వస్తున్నదంతా నిజం కాదా? మన ఎదురుగా ప్రత్యక్షంగా కనపడుతున్నవారిని, అనుభవంలోకి వస్తున్నవాటిని లేవనుకోడం ఎలా?
మానవులకున్నవి మూడు అవస్థలు. జాగ్రదావస్థ,స్వప్నావస్థ, సుషుప్తావస్థ. జాగ్రదావస్థలో సర్వము అనుభవం లోకి వస్తూనే ఉంటుంది, అన్నీ స్వానుభవంలోకి వచ్చేవే! స్వప్నావస్థలో మనసే అన్నిటిని సృష్టించుకుని వానితో కొంతసేపు గడపి, సుఖానుభవమో,దుఃఖనుభవమో పొందుతుంది, మెలకువ వచ్చిన తరవాత అదంతా కలయని తెలిసి నవ్వుకుంటుంది. ఈ అనుభవమూ నిజం కాదు, ప్రత్యక్ష,పరోక్ష ప్రమాణమూ కాదు. ఇక చివరిదైన సుషుప్తావస్థలో ఈ సృష్టి సమస్తమూ లయమైపోతుంది. ఏదీ ఉండదు. మనకి మనమే తెలియం, మెలకువ వచ్చేదాకా! అప్పుడీ తల్లి తండ్రి; ఆస్తి పాస్తి ఏమయ్యాయి? అదే దీర్ఘ నిద్ర ఐనపుడు నా తల్లి,నాతండ్రి, నాసొమ్ము,నాఇల్లు అన్నీ మనకి ఉన్నవేనా? ఇవి సర్వమూ లేనివే! అన్నీ లయమైపోయినవే! అంతా మిధ్య. ఆ దీర్ఘనిద్ర చెందినపుడు ఇవన్నీ ఉండవు సుమా! శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, బతికియున్నప్పుడే ఈ బంధాలన్నీ, అంతా! ఇప్పుడు చదవండి శ్లోకం.
మాతానాస్తి,పితానాస్తి,
నాస్తిబంధు సహోదరః,
అర్ధం నాస్తి గృహం నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత. ఇదీ హెచ్చరిక.
జన్మ దుఃఖం జరా దుఃఖం
జాయా దుఃఖం పునః పునః
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత
పుట్టుక దుఃఖ కారణం. ముసలితనం దుఃఖమే! భార్య వలన దుఃఖం, ఇది మరల మరల కలుగుతోంది. సంసారమే ఒక సముద్రం, దుఃఖ కారణం. హెచ్చరిక! హెచ్చరిక!!
పుట్టుక దుఃఖ కారణమే! తల్లి గర్భంలో, నరకం అనుభవించి ఈ లోకానికొస్తాం,( అదే గర్భనరకం) కాలం గడుస్తుంది, ఒకరికి పతిగానో సతిగానో కాలమూ గడుస్తుంది, చివరికి ముసలితనమూ మీద పడుతుంది,పులిలా. చెయ్యి కాలు కదుల్చుకోలేం, నరకం మరెక్కడో లేదు, అప్పటిదాకా అవాచ్యాలు ధారాళంగా పలికిన నోరూ పడిపోతుంది, ఏం కావాలో నోటితో చెప్పలేం, ఇదే అసలు నరకం. చూసేవాళ్ళు లేక, చేసేవాళ్ళు లేక మలమూత్రాలలో పడి కొట్టుకుంటూ బతకడం నరకం, ఇంతకంటె చావు మేలనిపిస్తుంది. ఇది దుఃఖమే కదా! చేసుకున్నవారికి చేసుకున్నంత అని సామెత, అదృష్టవంతులెపుడూ ఇతరుల చేత చేయించుకోకుండానే గట్టెక్కుతారు. ప్రత్యక్ష ప్రమాణమే! ఇదంతా ఒక సారితో సరిపోతుందా! మరల పుట్టుక,మరల చావు, మరల పుట్టుక ఈ చక్రనేమి గడుస్తూనే ఉంటుంది, అదే సంసారం అంటే, చావు పుట్టుకల క్రమం. ఇది సుమా కష్టం అనేదే హెచ్చరిక!
కామ క్రోధశ్చ లోభశ్చ
దేహే తిష్ఠంతి తస్కరాః
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత
జ్ఞానమనే రత్నాన్ని దొంగిలించడానికి శరీరం లో మాటు వేసిన దొంగలే కామ,క్రోధ,లోభాలు. హెచ్చరిక! హెచ్చరిక!!
కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలనే ఆరు గుణాలు మనసులో తిష్ఠ వేసుకున్న దొంగలలాటివి. మనకు దుఃఖాలనుంచి విముక్తి కలిగే ఆలోచన కలిగినపుడల్లా, ఆ బుద్దిని హరిస్తూ ఉంటాయి, మాయలో పడేస్తుంటాయి. ఈ అంతఃశ్శత్రువులు ఎంత బాధపెడతాయో చెప్పలేం. జీవితంలో బాధ వీటితోనే! వీటి గురించి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. ఇవి మనలో గూడు కట్టుకుని ఉన్నాయి సుమా హెచ్చరిక!
ఆశయా బద్ధ్యతే జంతుః
కర్మణా బహుచింతయా
ఆయుః క్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత
జీవులన్నియు ఆశకు లోబడిపోయేవే! ఆశకు లోబడి చాలా పనులు చేస్తుంటాయి! కాని ఆయువు తరిగిపోతోందని మాత్రం గుర్తించవు. హెచ్చరిక! హెచ్చరిక!!
లోకంలో వారందరూ ఆశకు కట్టుబడిపోయేవారే! ఆశ నాలుగు రకాలు. ఆశ,పేరాశ, దురాశ,నిరాశ. ధర్మబద్ధమైన అశతో జీవిస్తే ఇబ్బందులుండవు. కాని పేరాశ కుదురుగా ఉండనివ్వదు, ఆ తరవాతది దురాశ ఇది అసలు చేరకూడదుగాని చేరిందా! ఇక చెప్పేదే లేదు. రకరకాల పనులు చేయాలనేదే ఆలోచన, తన అర్హతకు తగినది కావాలనుకునేది ఆశ. తన అర్హతకు కానిదానిని కోరుకోవడం పేరాశ. అర్హత ధర్మం తో నిమిత్తం లేక సర్వమూ నాకే కావాలనుకోవడం దురాశ. దురాశకు పోతే తామే ఉండమనే విచక్షణ నశిస్తుంది. వీటికి ఉదాహరణలు ఎదురుగా కనపడుతున్నా నమ్మలేం. ఏదో ఆశించి జరగకపోతే నిర్వేదం పొంది దిగజారిపోవడమే నిరాశ. అంతఃశ్శత్రువులు కమ్ముకొచ్చి, జ్ఞానం నశించి ఆయువు క్షీణిస్తోందని గుర్తించలేనితనం కలుగుంది. దురాశ ఆయువును తీస్తుంది. ’దురాశ దుఖానికి చోటు’ అన్నది నానుడి. ఏ సమయంలో కూడా ఆయువు గడచిపోతోందనే ఆలోచన మాత్రం రాదు. పుట్టినరోజన్న సంబరమేకాని అయువు ఒక సంవత్సరం తగ్గిపోయిందన్న విచక్షణ ఉందదు, ఇదీ హెచ్చరిక!
సంపదః స్వప్నసంకాశాః
యౌవనం కుసుమోపమం
విధుః చంచలమాయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత
సంపదలన్నీ స్వప్న సదృశాలు, యౌవనం పువ్వు లాటిది. ఆయువు మెరుపు తీగలాటిది. హెచ్చరిక! హెచ్చరిక!!
కలిగి ఉండడమే సంపదన్నది నేటి మాటే కాదు,నాటి మాట కూడా! కలిగి ఉండడం సంపదైతే అదేది? అరుదైన వస్తువులా? భూమి వగైరా ఆస్థులా? బుద్ధియా? అందరూ అనుకునే సంపద కలిగి ఉండడం అనేది చిన్నమ్మ కటాక్షమే! ఈ తల్లి కటాక్షం బహు చంచలం. కొబ్బరికాయలో కి నీరు చేరినట్టు నేడు చేరుతుంది, రేపు కనపడదు. కలలో సంపద ఇలలో కనపడనట్టు, ఇలలో సంపద కూడా స్వప్నం లో లాటిదే! ఇక యౌవనమా అదెంతకాలం? యౌవనం పువ్వు లాటిదన్నారు, అంటే పువ్వు వాడిపోయినట్టు యౌవనమూ వాడిపోతుంది. ఆయువు ఎంతకాలమో తెలియదు. హెచ్చరిక.
క్షణం విత్తం క్షణం చిత్తం
క్షణం జీవితమావయోః
యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత
క్షణం భాగ్యం, క్షణం భోగం. జీవితమే క్షణ భంగురం.యమునికి దయ లేదు. హెచ్చరిక.
జీవితం క్షణ భంగురం, అందులో భోగం క్షణమే, భాగ్యమూ క్షణమే! యముడు కరుణ లేనివాడు, అయ్యో వీడు ధర్మాత్ముడు కొద్ది కాలం ఉండనిద్దాం, వీడు దుర్మార్గుడు వీణ్ణి తొందరగా తీసుకుపోదామనుకోడు. సమయం వచ్చిన వెంఠనే ఎవరైనా సరే ఏ అవస్థలో ఉన్నా సరే వరుణ పాశం తగిలించి జీవిని తీసుకుపోవడమే ఆయన కర్తవ్యం. అందుకే ఆయనకు సమవర్తి అని పేరు. అటువంటి యముడు ఎప్పుడు వస్తాడో తెలియదు,హెచ్చరిక.
పై ఆరు శ్లోకాలలోనూ జీవితంలో జరిగేవాటిని, జరగుతున్నవాటిని వాటిని గురించిన హెచ్చరిక చేశారు. మొత్తంగా చూస్తే జీవితం క్షణభంగురం, నీ తరవాతేమీ లేదు, నీతోనే అన్నీ ఉన్నాయి, గుర్తించు హెచ్చరిక!
నరులనుకూడా జంతువులన్నారే అనే సందేహమే కలుగుతుంది. మరొక చోట చెప్పేరు ఇలా ’జంతూనాం నరజన్మ దుర్లభం’ అని. జీవులన్నీ జంతువులే!అందులో నరజన్మ దొరకడమే గొప్ప! ఈ కింది శ్లోకాలలో క్షణభంగురమైన జీవితకాలంలో జరిగేవాటి గురించిన పరివేదన గురించి చెప్పేరు, ముందుకు సాగుదాం…
యావత్కాలం భవేత్కర్మ
తావత్తిష్టంతి జంతవః
తస్మిన్ఖ్షణే వినస్యంతి
తత్ర కా పరివేదనా
ఈ ఉపాధిలో (ఈ శరీరంతో) కర్మపరిపాకం ఎంతకాలముందో అంతకాలమే మానవులు జీవిస్తారు. కర్మ పూర్తైన మరుక్షణం మరణిస్తారు. ఇది సర్వ సహజం, దాని గురించిన పరివేదన వద్దు.
ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా! ఇది గంజాయి దమ్ము కొట్టిన బైరాగి పాట కాదు, సత్యం. మానవులు మూడు కర్మలతో ఉంటారు. సంచితం,ప్రారబ్ధం,ఆగామి. ఒకటి పుట్టుకతో కూడా తెచ్చుకున్న మూట. రెండవది ఈ జన్మలో పోగిచేసుకున్న మూట. ఇక మూడవది జీవితాంతానికి ఉండిపోయిన నిలవ, మరుజన్మకి తోడొచ్చేది. జన్మ రాహిత్యం కావాలంటే మూట ఉండకూడదు, దాన్ని సాధించడం అంత తేలిక కాదు! పుణ్యమో పాపమో ఎంతో కొంత సంచిమొదలు తప్పదు. నిలవలేక సంచి దులిపేస్తే, అది సాధిస్తే పరమ పదమే! జన్మ రాహిత్యమే! ఈ ఉపాధిలో అంటే ఈ శరీరంతో చేయవలసిన పని పూర్తైన వెంటనే, ఈ శరీరం నశిస్తుంది, దానికి పరివేదన ఎందుకు?
ఋణానుబంధ రూపేణా
పశు పత్ని సుతాదయః
ఋణ క్షయే క్షయంయాంతి
తత్రకా పరివేదనా.
ఎంత ఋణానుబంధం ఉన్నదో అంతకాలమే పశువుగాని,పత్నిగాని,సుతులు మొదలైనవారు మనతో ఉంటారు. మనతో ఋణానుబంధం పూర్తికాగానే వెళిపోతారు. పరివేదన ఎందుకు?
పశువులు,పత్ని,సుతులు మొదలైనవారంతా ఋణానుబంధం ఉన్నంత కాలమే మనతో ఉంటారు. ఈ ఋణం మనకి వారుగాని, వారికి మనంగాని ఉన్న ఋణం తీరిన తరవాత వారి దారిన వారు చెల్లిపోతారు. ఇది ఎంతకాలం తెలియదు. ఎవరు ఎవరికి బాకీ తెలియదు. మన సంతానమంతా, మనకి బాకీదార్లు. అందుకే పెద్దలు పిల్లల చేతినుంచి డబ్బు తీసుకోడానికి ఒప్పుకోరు, పక్కన ఉంచమంటారు. ఈ బాకీ లు ఏ రకమైనా కావచ్చు. కొంతమంది మంచిమాట చెప్పి కూడా తిట్లు తింటుంటారు. ఇలా మంచిమాట చెప్పేవారంతా బాకీ దార్లు. వారు అలా మంచిమాటలు చెప్పి హెచ్చరిక చేయక మానలేరు. కాలంతో బాకీ తీరిపోతుంది, ఆ తరవాత ఇలా మంచిమాట చెప్పేవారు జీవితంలో దొరకరు. ఇలా చెల్లిపోయినవారి గురించిన పరివేదనేలా?
పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథాః
తధైవ జంతవః కాలే
తత్ర కా పరివేదనా
ఎండిన ఆకు ఎలా చెట్టునుండి రాలిపోతుందో అలాగే కాలం పూర్తైన వారు రాలిపోతారు, పరివేదన ఎందుకు?
చెట్టున ఆకు పుడుతుంది,పెరుగుతుంది,పండుతుంది, రాలిపోతుంది. అన్ని ఆకులూ ఒక సారి పుట్టవు, అన్ని ఆకులూ ఒక సారి రాలిపోవు. క్రమంగా అనగా అవి పుట్టిన క్రమంలో పండి రాలిపోతుంటాయి. ఇది సృష్టి క్రమం. అప్పుడప్పుడు దీనికి విరుద్ధంగానూ జరుగుతుంటుంది, ఇదీ సృష్టిలో భాగమే. పచ్చికాయ బద్దలైపోయినట్టంటారు, ఇది అసహజమే ఐనా కర్మ పరిపాకం పూర్తైపోతే ఇలాగే జరుగుతుంది. ఇది నిత్యం జరిగేది, అలాగే మానవులలోనూ జరిగేదానికి పరివేదన ఎందుకు చెందుతారు?
ఏక వృక్ష సమారూఢాః
నానాజాతి విహంగమాః
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదనా
ఒక చెట్టు మీదకు రాత్రి వసతికోసం వివిధ జాతి పక్షులు చేరతాయి. ఉదయం కాగానే దేని దారిన అది వెళిపోతుంది. ఇలా జరిగితే దాని గురించిన పరివేదన ఎందుకు?
ఒక చెట్టు మీద నానా జాతి పక్షి సమూహం తలదాచుకున్నట్టుగా ఈ భూమి పైకి జనులు పుడుతుంటారు. తెల్లవారగానే ఏ పక్షి ఎటుపోయేది తెలియదు. అలాగే మానవులు పుడతారు, పెరుగుతారు, అనుబంధాలు,బంధుత్వాలు ఏర్పరచుకుంటారు, చివరగా నశిస్తారు. వారి తరవాత ఈ సమస్త లోకమూ ఏమయింది? నిత్యమూ జరిగేది, తప్పించలేనిది, తప్పించుకోలేనిది, దీనిగురించి పరివేదనేలా?
ఇదం కాష్టం ఇదం కాష్టం
నద్యం వహతి సంగతః
సంయోగశ్చ వియోగశ్చ
కా తత్ర పరివేదనా
రెండు కర్రలు నదిలో కొట్టుకుపోతున్నాయి, కొట్టుకుపోతూ కొంత సేపు కలిసున్నాయి, మరి కొంత సేపటిలో విడిపోయాయి. ఈ సంయోగ వియోగాల గురించిన పరివేదనేలా?
ఈ శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.
ఇందులో వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు ఏభయి ఆ పైన సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే! మరి పరివేదన పనికిరాదన్నారు. వేదన కి పరి వేదన కి తేడా ఉంది. వేదన సహజాతం దానిని అనుభవించాలి, పరి వేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు. సహజం గా జరిగే వియోగానికి సహజమైన స్పందన కావాలి కాని అసహజమైన పరివేదన పనికిరాదన్నారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగితే….
హెచ్చరికలొక క్రమంలో చెప్పేరు, సంపదలు,యౌవనం,అనుభవం ఎలా ఉంటాయో, సంయోగ వియోగాలు ఎలా జరుగుతాయో, ఎంత బాధాకరంగా ఉంటాయో చెప్పేరు. వారు చెప్పిన దానిలో అసహజంగాని మిట్ట వేదాంతం కాని లేవు. ఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.
మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా. ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే! ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.
కొద్దిమాటలలో భావం నాకిలా అనిపించింది.
ఈ ఉపాధిలో ఉన్నంతకాలమే తల్లి,తండ్రి మరి ఇతర బంధాలూ, కన్ను మూస్తే ఏమీ లేదు సుమా! చావుపుట్టుకలనే సంసారసాగరాన్ని తరించడం కష్టం. అంతఃశ్శత్రువులు మన ప్రయత్నాన్ని అడ్డుకుంటూనే ఉంటాయి, జీవితం చిన్నదనే జ్ఞానాన్ని మరుగు పరుస్తుంటాయి,ఆశలో కొట్టుకుపోయేలా చేస్తాయి. అనంతకాలంతో పోలిస్తే మన జీవితకాలం చాలా చిన్నది, ఈ చిన్న జీవితకాలంలో యౌవనం,సంపద ఎంతటివి? ఎంతకాలంవి? అందుచేత జీవితం క్షణభంగురం సుమా జాగరత అనేదే హెచ్చరిక. ఇక తరవాత, మానవుల కర్మ పరిపాకం పూర్తయేదాకా భూమి మీద ఉంటారు. మరికొంతమందితో ఋణమూ, అనుబ ంధమూ కలిగుంటారు. చెట్టున పుట్టిన ఆకులు కాలవశాన పండిరాలినట్టూ, ఒక చెట్టును రాత్రికి ఆశ్రయించుకున్న పక్షులు ఉదయానికి నలుదిక్కులా చెదరిపోయినట్టూ మానవులు చెదరిపోతుంటారు, కాలగతిలో కలసిపోతుంటారు. ఇలాగే ఇద్దరు యువతీ,యువకులు ఒక చోట చేరి కుటుంబం ఏర్పరచుకుంటారు, కాలం గడుస్తూ ఉంటుంది, నా ఇల్లు,నాభార్య, నా డబ్బు, ఇలా చాలా అనుబంధాలూ ఏర్పడతాయి. కాలం చెల్లి ఈ ఇద్దరిలో ఒకరు చెల్లిపోతారు, ఇదిసృష్టిక్రమం,సహజం. ఇలా సహజంగా జరిగేదానికి పరివేదన పడకండి. ఇదీ మాట.
ఇది నిజమైన ఓదార్పు.