శర్మ కాలక్షేపంకబుర్లు-“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.

“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.

బ్లాగిల్లు శ్రీనివాస్ గారు నా టపాలో వ్యాఖ్య చేస్తూ మా సత్తిబాబు ప్రశ్న
“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?” దగ్గర ఆగిపోయారు. దానినికి నేను సమాధానం అప్పుడే చెప్పేసేను, కాని దీని వెనక ఒక చిన్న కథ ఉంది అది చెప్పుకోవాలి కదా! చెప్పేస్తా వినండి.కతకి ముందు కొద్దిగా చెప్పాలి…అది ఇదే….

పూర్వకాలంలో సమయం తెలుసుకోడానికి పగలు సూర్యుని బట్టి, అనగా మన నీడ పొడవును బట్టి, రాత్రి చుక్కల్ని బట్టి తెలుసుకునేవారు, సమయం చాలా ఖచ్చితంగానూ చెప్పేవారు. రాత్రి దిక్కుల్ని ధృవ నక్షత్రం తో గుర్తించేవారు. ఆ రోజులలో ఆకాశం లో నక్షత్రాలను గుర్తుపట్టేవారు, వాటికి గొల్ల కావడి, పిల్లల కోడి వగైరా పేర్లూ ఉండేవి. గొల్ల కావడి నెత్తి మీద కొచ్చిందంటే ఒక సమయమనీ, పిల్లల కోడి ఉదయించిందంటే తెల్లవారుగట్ల అనీ గుర్తించేవారు. ఇవి కాక ఒక చిత్రమైన విషయం కూడా ఉండేది. కోడి పుంజు, మరదేమి చిత్రమోగాని తెల్లవారు గట్ల మాత్రమే కొక్కొరో కో అని గొంతెత్తి కూస్తుంది. అది తెల్లవారే లోగా రెండు సార్లు కూస్తుందలాగా. మొదటిసారి కూయడాన్ని ‘తొలి, కోడి’ కూతనీ, రెండవ సారి కూయడాన్ని ‘మలి,కోడి కూత’నీ అనేవారు. ఇక నిప్పు గురించి చెప్పాలంటే, అగ్గిపెట్టెలు లేవు. నిజానికి అగ్గిపెట్టెలు మా చిన్నతనాన మాత్రమే పల్లెలలో అడుగుపెట్టేయి. అప్పటివరకు నిప్పును ఎవరో ఒకరి ఇంటినుంచి తెచ్చుకోడమే అలవాటు. నిప్పు ఎవరింటినుంచైనా తెచ్చుకునేవారు. మిగతా వాటికి మడి, మైల అనేవారుకాని నిప్పుకు మైల లేదనేవారు. ఇప్పుడు కత చదవండి అర్ధమవుతుంది.

అనగా అనగా ఒక పల్లెలో ఒక ముసలమ్మ గుడెసెలో కాపరం ఉండేది, ఒకత్తీ. నాటిరోజుల్లో పల్లెటూరంటే పాతికకొంపలుండేవి. ఆ రోజుల్లో ఇప్పటిలాగా గడియారాలూ లేవు, నిప్పు తయారు చేసుకోవాలి, అగ్గిపెట్టెలూ లేవు, గేస్ మాట దేవుడే ఎరుగు. ఇసుక గడియారాలూ లేనిరోజులు. మరి అటువంటి రోజులలో, ముసలమ్మకి ఒక కోడిపుంజూ, ఒక కుంపటీ ఉండేవి. కుంపటి కూడా తెలీదా? హతోస్మి, బొమ్మలో చూడండి, బొగ్గులు నిప్పులూన్నూ. కోడి కూతతో లేచేవారు, ‘తొలికోడి కూసింది లేవండోయ్’ అనేవారు. కోడి కూత విన్నారా ఎప్పుడేనా? ఇప్పుడు నేను వినిపించలేను, ‘కొక్కు రో కో’ అని గొంతెత్తి అరచేది. ప్రయత్నించి వినండి. తొలి కోడి కూతతో లేవడం పల్లె ప్రజలకి అలవాటు, దగ్గరగా చెప్పాలంటే ఇప్పటి సమయం తెల్లవారుగట్ల నాలుగు. మలి కోడి కూతంటే అంటే ఐదు. తొలికోడి కూతకి లేచి ఇంటి పనులు మొదలెట్టుకునేవారు. వంటపనికి ముందు కావలసింది నిప్పు. అది ఉండేది కాదు. సమయమూ తెలిసేది కాదు. ముసలమ్మ దగ్గర కోడిపుంజు సమయంప్రకారం కూసేది, ముసలమ్మ లేచి కుంపటిలోకి చెకుముకి రాళ్ళతో నిప్పు తయారు చేసి కుంపటిలో బొగ్గులను అంటించి ఉంచేది. పల్లెలో వారంతా ముసలమ్మ కోడి కూతతో లేచి ఆవిడ తయారు చేసి ఉంచిన నిప్పు కణికను పిడక మీద వేసుకుని పట్టుకుపోయి పొయ్యిలో వేసుకుని నిప్పు తయారు చేసుకునేవారు, వంటా చేసుకునేవారు. నిప్పుంచుకోవచ్చుగా అనే అనుమానం వస్తుంది కదా! నిప్పుంచుకుంటే కొంప కాలిపోయే ప్రమాదమూ ఉంది, అదీగాక ఇంధనం మనలాగా అనవసరంగా పాడుచేసే అలవాటు నాడు లేదు మరి. పని కాగానే నిప్పు ఆర్పేసేవారు. నిత్యాగ్నిహోత్రులని ఉండేవారు, వారికి అగ్ని గృహమని వేరుగా ఉండేది. అందులో నిప్పును సంరక్షించేవారు.

ఇలా ముసలమ్మ కోడి సమయం తెలుపుతుండగా, నిప్పూ ముసలమ్మ ఇస్తుండగా రోజులు బాగానే గడుస్తున్నాయి, పల్లెవాసులకి. నిప్పుకొచ్చిన ప్రతిసారి పల్లెవాసులు ముసలమ్మతో మాటా మాటా కలిపి ఆవిడ చేస్తున్న సేవని పొగిడి నిప్పు పట్టుకుపోయేవారు. ఇలా పొగడ్తల నిషా ముసలమ్మకి బాగా తలకి ఎక్కిపోయింది. పల్లెవాసులకీ చిరాకొచ్చింది, రోజూ ఇలా పొగడడం చిరాకుగానూ అనిపించి, నిప్పు పట్టుకెళుతున్నారు కాని మాటా మంతీ మానేశారు, సహజంగానే ముసలమ్మకీ కోపమొచ్చింది. ‘హన్నా! ఎంత అన్యాయం నా కోడి కూతకి లేస్తున్నారా! నా కుంపటిలో నిప్పు ఉపయోగించుకుంటున్నారా? ఒక్క మాట చెప్పడానికి ఇంత బాధ పడాలా? నేనేమైనా మడులు మాన్యాలూ అడిగానా? మాటే కదా, అదికూడా మాటాడలేరా?’ అని తర్కించి, వితర్కించి చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. నా కోడీ కుంపటీ లేక వీళ్ళకి ఎలా తెల్లరుతుందో చూస్తాననుకుంది, ఎలా బతుకుతారోననుకుంది, పిచ్చిది. తనకోడి కూయక, సమయం తెలియక లేవలేరనీ, నిప్పు తయారు చేసుకోలేరనీ అనుకుంది పాపం. ఏం చేసిందీ కోడిని ఒక గంప కింద దాచేసి దాని మీద గోనిగుడ్డలు కప్పేసింది, కోడి కూసినా వినపడకుండా. తను ఉదయమే లేచి నిప్పు తయారు చేయకూడదని నిర్ణయించుకుని పడుకుంది. ఊరిప్రజలు మామూలుగానే లేచారు కోడి కూత వినపడకపోయినా! నిప్పుకోసం వెళితే ముసలమ్మ……….

ముసలమ్మ లేకపోయినా కోడి కూయకపోయినా ఏదీ ఆగలేదు, సమయమూ ఆగలేదు… కాదు ఆగదు. ఆగదు ఈ నిమిషం నీ కోసమూ ఆగితే సాగదు ఈ లోకమూ ముందుకు సాగదు ఈ లోకమూ………..ఎవరికోసమూ కాలమాగదు….అవసరానికి మరో ప్రత్యామ్నాయం దొరుకుతుందని ఈ నానుడి భావం. అప్పటినుంచి ఇలా ‘నీకోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?’ అనగా నువ్వులేక ఏపనీ ఆగదనేందుకు ఈ నానుడి ఉపయోగిస్తారు.

మా సత్తిబాబు కూడా మీలాటి మేధావి కదండీ అందుకు నిష్కర్షగా ఇంత అర్ధమున్న ప్రశ్న వేశాడు. అందుకే నేనిచ్చిన సమాధానం,………..నేను రాకముందూ ఈ ప్రపంచం ఉంది, నా తరవాతా ఉంటుంది…ఇది సత్యం.
వస్తా వెళ్ళొస్తా!
మళ్ళెప్పుడొస్తా!!
నీపెళ్ళప్పుడొస్తా.!!!
చూస్తా ఎదురు చూస్తా అనద్దు, మీపెళ్ళి కాదు 🙂

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.

  1. శర్మ గారికి పాదాభివందనం. మీ బ్లాగు చాన్నాళ్ళనుంచి చదువుతున్నా, కామెంటడం ఇదే మొదటిసారి. చాలా చక్కటి విషయాలు క్లుప్తంగా రాస్తారు మీరు. మంచి అంశాలను ఎంచుకుని, కష్టపడి వాటిపై పరిశోధన చేసి, మీరు పదిమందితో పంచుకుంటున్న విషయాలు ఇతరులు మీకు చెప్పకుండా కాపీ చెయ్యడం చాలా దారుణం. మీరు మరీ అంత Diplomatic గా ఉండవలసిన అవసరం లేదు. ఆ సైట్లు ఏమిటో బహిరంగం చేసి వాళ్ళ గుట్టు బయట పెట్టెయ్యండి. దెబ్బకు దెయ్యం దిగి వస్తుంది.

    చక్కటి విషయాలు అందరితో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.
    http://www.veerublog.blogspot.com

    • Veerender గారు,
      అభిమానం మనసులో పెట్టుకుని ఉంచుకుంటే ఎలా తెలుస్తుందండి? దానిని వ్యక్త పరచాలి, లేకపోతే అది ఉండీ లేనట్టే. సమాచార మార్పిడి యుగమట, సభ్యత సంస్కారం ఇదంతా కాకరకాయట.దొంగతనం అనకూడదట, సమాచారం పంచుకోవడమనాలట, ఎక్కువ మంది పంచుకున్నందుకు ఆనందించాలట.. నిజమే లెండి ఉన్నవాడి దగ్గర దోచుకుపోతారు కాని అయ్యవాలంగారి నట్టింటికి ఎవడు కన్నమేస్తాడు? వాడి శ్రమ దండగ. ఇలా చెప్పేవాళ్ళ బ్లాగుల్లో ఏమీ ఉండదండి.డిప్లమేటిక్ గ్గా చెప్పడం కాదండి, నాకు సభ్యత తెలుసుకదా అందుకే చెప్పలేదు, అవసరం వచ్చిన రోజు చెప్పేస్తాగా.
      ధన్యవాదాలు

  2. శర్మ గారూ ,

    నమస్తే .

    వస్తానంటూ వెళ్తుంటే , కొంచెం ఆలోచించవలసి వచ్చేది . మీరిలా అనలేదు కనుక . మీరన్నది ” వస్తా , వెళ్ళొస్తా ” అని భరోసా యివ్వటం వల్ల బ్లాగు మిత్రులారా ఆందోళన చెందకండి .

    శర్మ గారూ యిలా వ్రాస్తూనే వుంటారు మనకోసం .

    ఈ ప్రపంచంలో మనం అణువుతో సమానం . అణువులు ఎన్ని కలిస్తే ప్రపంచమో. అటువంటి ప్రపంచం మనతోటే వుందనుకోవటం పేద్ద తప్పు . అటువంటి ప్రపంచంలో మనం అణువులా వున్నామనుకోవటమే కరెక్ట్ .

    ఏమీలేని రోజుల్లో కోడీ , కుంపటే మనకు దారి చూపించాయి . వాటి సహ(జ) జీవనాన్ని మనం ఎంతగానో వాడుకొన్నాం అని మాత్రం గ్రహించితే చాలు , స్వార్ధపరంగా ఆలోచించకుండా .

    • శర్మాజీ,
      వెళిపోయేప్పుడు కూడా వెళ్ళొస్తా అనడమే మన సభ్యత, సంస్కారం. ఇప్పుడు సభ్యత సంస్కారం అంతా కాకరకాయి! పోనిద్దురూ,పాత కాలం వాణ్ణి కదా అలా అనేశాను. ఇప్పుడు కోళ్ళూ కుంపట్ల అవసరం తీరిపోయిన రోజులు కదండీ, నిజానికి ఆ కథ నేను చెప్ప కూడదు, అది నాకే వర్తిస్తుంది కనక, కాని చెప్పేను ఎందుకు? అన్నీ కాలం తో పాటువని నిజంగా తెలిసినవాడినే కనక.పొరపాట్లుంటే పెద్ద మనసుతో మన్నించండీ
      ధన్యవాదాలు.

      • శర్మ గారూ ,

        మీలాంటి వాళ్ళు యిలా మన్నించమనటం ఏమీ సబబుగా లేదండి. నేనేమీ మిమ్మల్ని విమర్శించలేదు .
        నేను మన్నించాలసినంత తప్పులు మీరు ఏమీ చేయలేదు . నేను మిమ్మల్ని మన్నించేటంత ఘనకార్యం ఏమీ చేయలేదు .

  3. చూసారా నిన్న నా ఒక్క కామెంట్ వల్ల నేడు మన శర్మ గారి ద్వారా ఇన్ని మంచి మాటలు తెలుసుకున్నామో !
    అందుకే జిలేబి గారు అన్నట్లు శర్మ గారిని కామెంట్లతో ‘పొది’ చేయండి !
    మరిన్ని మంచి టపాలు శర్మ గారి “కీబోర్డ్ ” నుంచి రావాలి

    • శ్రీనివాస్ జీ,
      మీ తపన చూస్తే ముచ్చటేస్తోంది! ప్రస్థుతానికింతే, దేనినయినా కాలం సరి చేస్తుంది. ఏదీ ఎవరికోసం ఆగదు, ఆగాలనుకోడం పిచ్చితనం. పాత కాలపు విలువల వలువలు వదిలేసెయ్యాలి, అదే చేయలేక 🙂 సమాచార మార్పిడి యుగం.పొరపాట్లుంటే మన్నించండి.
      ధన్యవాదాలు.

  4. ‘ఇట్లాంటి కథలు చెప్పే వాళ్ళు చాలా అరుదు! సెహబాష్ శర్మ గారు

    (బ్లాగ్ రీడర్లు లారా మీరూ తలో వంతు చేయి వేయండి – కామెంట్ల తో శర్మ గారి ని ‘పొది’ చేయండి !

    సో దట్ శర్మ గారు నెగటివ్ ఎనెర్జీ నించి బయట పడి ఇట్లాంటి మరిన్ని కబుర్లు చెప్పేలా మనలోకం లో కి వచ్చేస్తారు !!)

    జిలేబి

    • జిలేబిగారు,
      మా సత్తిబాబు నాలా నిష్పక్షపాతి, సమవర్తి లాటివాడు. అందుకే అంత ప్రశ్న వేశాడు. నేను చెప్పవలసిన సమాధానమే చెప్పేను. శ్రీనివాస్ గారు ఆ ప్రశ్న దగ్గర ఎందుకు ఆగిపోయారో గ్రహించాను, అందుకే వివరించాను, ముప్పాతిక వయసువాడిని అన్నీ కాలంతో వని గ్రహించలేకపోతే నిజంగా పిచ్చితనమే కదా!
      చెండు లందుకునే వయసా? 🙂
      ధన్యవాదాలు.

  5. శర్మగారు,

    ఈ తొలిఝాము కోడికూత అంటే గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు హైస్కూల్లో చదువుకొనే రోజుల్లో మిత్రుల కోరికపై ఆశువుగా చెప్పిన కందపద్యం.

    కం. తొలిజాము కోడి కూసెను
    తెలవారగ నుండె ననుచు తెలుపుట కొరకై
    కలనిష్టభోగతతులన్
    కులుకుచు నున్నట్టి భిక్షుకుడు కోపించెన్

    కొత్తపేట (తూగోజీ)లో ఒక చోట ధనమ్మమఱ్ఱి అని పెద్ద ఊడలమఱ్ఱి ఉంది (అప్పుడుంది, ఇప్పటి సంగతి తెలియదు) చాలా విశాలమైన ప్రాంతం ఆక్రమించుకొని. మిత్రబృందం పిల్లలం అందరం ఓ పదిమందిమి విహారయాత్ర చేసాం ఒకరోజున అక్కడకు. మధ్యాహ్నం భోజనాల సమయంలోనో ఆ తరువాతనో కాని వాళ్ళు నన్నో పద్యం అప్పటికప్పుడు చెప్పమని ఒక పద్యం చెప్పాలని అడిగితే పై పద్యం చెప్పాను. ఆ తరువాత రోజుల్లోనూ చాలానే చెప్పాను అవకో తవకో చాలానే పద్యాలు కానీ ఈ పద్యమే స్మృతిపథంలో నిలిచిపోయింది.

    త్వరలోనే మీ వ్రాతలూ నిలిచిపోతాయి – ఇలా వాటి వెంట చేసే నా వ్యాఖ్యలూ నిలిచిపోతాయి. కాలో దురతిక్రమణీయః అని కదా ఆర్యోక్తి.

    • శ్యామలరావు గారు,
      పద్యం బాగుంది, ధనమ్మ మఱ్ఱిని నేను పాతికేళ్ళ కితం చూశా, ఇప్పుడుందో లేదో తెలియదు. అన్నీ కాలంతో పాటువే.కొత్త నీరు రావాలి పాత నీరు పోవాలి ఇదే న్యాయం
      ధన్యవాదాలు.

    • అవునండి ఫాతిమా గారూ, మీరన్నదానితో ఏకీభవిస్తున్నాను.

      తే.గీ. మంచి మనిషిని తలపుల నుంచి మనము
      గౌరవించెడు నన్నాళ్ళు ఘనత మీఱ
      వారు మనమధ్య నుందురు వారి పలుకు
      లాదరించుట కర్తవ్య మగును మనకు

      అలా చేయగల సద్భుధ్ధిని భగవంతుడు మనకివ్వాలని కోరుకుందాం.

      • శ్యామలరావు గారు,
        రోజులా మారుతున్నాయ్, విలువలూ మారిపోతున్నాయ్, మనం మారలేమంటే ఎలా? మారలేనివారేమవుతారు, మనమూ అదే అవుతాం. అందుకే ఏమన్నారు, నలుగురితో నారాయణా, కులం తో గోవిందా
        ధన్యవాదాలు.

    • ఫాతిమాజీ,
      ఏదీ కలకాలం ఉండిపోదు, ఇది మనకు తెలుసు కాని చిత్రమైన మనసు కలకాలం ఉండిపోవాలంటుంది. అన్నీ కాలంతో పాటువే, కారణం లేని కార్యం ఉండదు, ఏదో వాగినట్టున్నా, మన్నించండి.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి