శర్మ కాలక్షేపంకబుర్లు-మరణాంతాని వైరాణి

మరణాంతాని వైరాణి

(శ్రీమద్రామాయణం,యుద్ధకాండ,114 సర్గ)

రామరావణ యుద్ధం ముగిసింది, రాముడు వేసిన బ్రహ్మాస్త్రానికి రావణుడు నేల కూలడంతో. చనిపోయిన అన్నగారిని చూచి విభీషణుడు విచలితుడై ఏడ్చాడు ’అన్నా! మహా వీరుడవు,పరాక్రమశాలివి,విద్యావంతుడవు,రాజనీతికోవిదుడవు కాని ఇలా అయిపోయావు, నీకారోజున నేను చెప్పిన మాటలు రుచించలేదు, కామ పరవశుడవై కన్నులు మూసుకుపోయాయి. నీ గర్వం మూలంగా మహాబలశాలులైన రాక్షసులంతా నశించిపోయారు. ఇంక రాక్షస లోకానికి మిగిలినదేంటి?’ అని పరిపరి విధాల వాపోతూ చివరగా ’విగత జీవుడైన నా అన్నకు ప్రేతకార్యం నీదయతో ఆచరించాలి’, అన్నాడు. దానికిరాముడు, ’విభీషణా!

మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్
క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః

వ్యక్తులు జీవించి యున్నవరకే వైరములుండాలి. వ్యక్తులు మరణించిన తరవాత వైరం ఉండకూడదు. ఇతనికి అంత్య సంస్కారం చెయ్యి, ఇతను నీకులాగే నాకూ గౌరవార్హుడే’,

అనేలోగా రాణివాసం నుంచి రావణ పత్నులు చేరారు.

రాక్షస స్త్రీలు పిచ్చివాళ్ళలా ఏడ్చారు, రావణుడిని కౌగలించుకున్నవారు, కాళ్ళను,ౘేతులను కౌగలించుకుని ఏడ్చినవారు. ’ఇంద్రుడు,యముడుతో సహా ఎందరెందరో నీ ముందు నిలవడానికే భయపడినవారే చివరికి ఇలా అయ్యావా! నీ క్షేమం కోరేవారి మాట వినక ఇలా అయ్యావు గదయ్యా!’ అని ఏడిచారు. అప్పుడు రావణ పట్టమహిషి మందోదరి ’నాధా! నువ్వు కళ్ళెర్రజేస్తే నీ ముందు నిలబడేవాడే లేడయ్యా! మానవమాత్రుడు నిన్ను ఎలా గెలవగలిగాడు? లంకలోకి ఎవరూ కాలు పెట్టలేరు, నీ అనుమతిలేక, కాని ఒక కోతి అడుగుపెట్టింది, నీ రాక్షస బలాన్ని ఖరదూషణులను తెగటార్చినపుడే అనుకున్నా, రాముడు మానవుడు కాదని, ఇప్పటికీ నిన్ను రాముడు చంపేడంటే నమ్మలేకపోతున్నా. మహా సముద్రం మీద సేతు నిర్మాణం జరిగినప్పుడే అనుమానించాను, రాముడు యోగి,మహత్తులకు మహత్తైనవాడు, పరిణామ రహితుడు,లోక సంరక్షణకే మానవునిగా అవతరించాడు. శ్రీరామునితో విరోధం వద్దూ అని ఎంత చెప్పినా వినిపించుకున్నావుగాదు. కామంతో సీత కోసం పాకులాడేవు, సీత నాకంటే అందగత్తెనా? నాకంటే చదువుకున్నదా? ఎందుకామెను ఎత్తుకొచ్చావు? సీత రూపంలో మృత్యువును కోరి తెచ్చుకున్నావు, అందుమూలంగా నీవు నశించావు, రాక్షసలోకం నశించింది, లంక పాడుబడింది, విభీషణుడు రామునితో వైరం వద్దని నీ క్షేమం కోరి చెబితే దాయాది మాటగా పెడచెవిని పెట్టేవు, సీతను రామునికి అప్పజెప్పి ఉంటే ఒక మంచి మిత్రుడు దొరికేవాడు, రాక్షసలోకం బాగుండేది, విననందుకే ఈ దుస్థితి సంభవించింది’, అనుకుంటూ తలుచుకుతలుచుకు ఏడ్చింది, ఆమెను సపత్నులు సేద తీర్చారు. ఇదంతా విన్న రాముడు విభీషణునితో, ’ఈ స్త్రీలనిక పంపివైచి రావణునికి అంతిమ సంస్కారం చెయ్యమ’న్నాడు.

దానికి విభీషణుడు, ’రామా! రావణుడు ధర్మమార్గం వదిలేసినవాడు,కఠినాత్ముడు, అసత్యవాది, పరస్త్రీల ఎడ గౌరవం లేనివాడు,ఇట్టివానికి అంత్యక్రియలు జరపడం నాకిష్టం లేదు, ఇతను నాకంటే పెద్దవాడు, పూజ్యుడే కాని అకృత్యాలు చేసినవాడికి అంత్య సంస్కారాలు నేను చేయకపోయినా లోకం నన్ను తప్పు పట్టదు,తెలిసినవారెవరూ నన్ను నిందించరు’, అన్నాడు.

దానికి రాముడు ’విభీషణా! ఇతను అసత్యవాది,ధర్మ విరోధి, లోక కంటకుడు కావచ్చు కాని

మరణాంతాని వైరాణి నిర్వృత్తంనః ప్రయోజనమ్
క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః
వ్యక్తులు జీవించి యున్నవరకే వైరములుండాలి. వ్యక్తులు మరణించిన తరవాత వైరం ఉండకూడదు. ఇతనికి అంత్య సంస్కారం చెయ్యి, ఇతను నీకులాగే నాకూ గౌరవార్హుడే,

త్వత్సకాశాద్దశగ్రీవః సంస్కారం విధిపూర్వకమ్
ప్రాప్తుమ్ అర్హతి ధర్మజ్ఞ! త్వం యశోభాగ్భవిష్యసి.
ఇక ఇతనికి అంత్య సంస్కారములు జరుపవలసినదే, నీకువలనే ఇతను నాకునూ గౌరవార్హుడే, నీవలన ఈ దశకంఠుడు అంత్య సంస్కారములు పొందుటకు అర్హుడు, దీనివలన నీ కీర్తి ఇనుమడించును’.
అని మళ్ళీ చెప్పి, నీవు రావణుని అంత్య సంస్కారం చేయడం మూలంగా నీ కీర్తి ఇనుమడిస్తుందని చెప్పడంతో, అంత్యక్రియలూ చేశాడు, విభీషణుడు..

లోకంలో ఒక మాటుంది, ’విభీషణుడు రావణునికి అంతిమ సంస్కారం చేయనంటే తానే చేస్తానన్నాడు రాముడు’అని, ఇది పొరపాటు. రావణుడు నీకులాగే నాకూ గౌరవార్హుడు కనకనైనా నీవు అంతిమ సంస్కారం చెయ్యాలని చెప్పేడు తప్పించి తాను చేస్తాననలేదు. రావణునికి జ్ఞాతులిక ఎవరూ మిగలలేదు, విభీషణుడు తప్పించి. విభీషణుడే అంతిమ సంస్కారం చేయవలసినవాడు, అది అతని విధి, ధర్మం కూడా. దీనినే రాముడు సున్నితంగా చెప్పేడు విభీషణునితో, అలా చెప్పడం మూలంగా రాముడు ధర్మాన్ని చెప్పేడు, ధర్మాన్ని అచరింపచేసేడు. ఆ తరవాత నీవు అంతిమ సంస్కారం చేయడం నీ మేలుకే అన్నాడు, రాముడు. ఇదేమీ? విభీషణుడు లంకాధిపతిగా పాలన చేయబోతున్నాడు, ప్రజలు ప్రతి విషయంలోనూ ఇతనిని రావణునితో పోలుస్తారికమీద, అప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా ’అన్నకే అంత్యక్రియలు జరపనివాడు, మనకేం ఉపకారం చేస్తాడూ’ అని నిందిస్తారు, ఇది రాజుగా విభీషణునికి తగనిది, స్నేహితునికి రాజధర్మం చెప్పేడు. చివరగా తను ఈ విషయాలు చెప్పి మిత్ర ధర్మం నెరవేర్చాడు. అదీ రాముడంటే… రామో విగ్రహావాన్ ధర్మ….

స్వస్తి

శర్మ కాలక్షేపంకబుర్లు-అరటిపళ్ళ పచ్చడి.

అరటిపళ్ళ పచ్చడి.

”దేవతార్చనకి లెమ్మంటే ఏంటీ గునుస్తున్నారు” కసిరింది ఇల్లాలు.
మాటాడలేదు.
”వినపడిందా?” అరిచిందీసారి.
”ఊ” అన్నా నెమ్మదిగా..
”ఏం ఆకలిగాలేదా? ఒంటిగంటవుతోందిగా?” ఆరాతీసింది.
”రోజూ అవే కూరలు, పప్పు, తినబుద్ధికావటం లేదు, విసుగొస్తోంది” చెప్పా నెమ్మదిగా.
”మరేం తింటారూ? బుర్రకాయలు తింటారుగాని, తలకాయలు తినడం అలవాటు చేసుకోలేకపోయారుగా! వంకాయకి వరికూటికి విసుగు లేదుకదా?” ప్రశ్నించింది.
”తినబుద్ధికావటం లేద”ని గునిశా.
”రేపు కొర్రన్నం వండుతాగాని ఈపూట వరన్నం తినండి, ఆ కొర్రలుబానే ఉంటాయిగాని దంపాలి, చెరగాలి, ఎంతపనుంటుంది. కోడలు చిన్నపిల్ల, ఓపిగ్గా చేస్తోంది, పిచ్చి వేషాలేస్తే మొత్తం ఎగనామం పెట్టేస్తుంది జాగ్రత,” తగ్గు స్వరంతో హెచ్చరించింది. ’పది నిమిషాల్లో పిలుస్తా కూచోండని” వంటింటిలోకెళ్ళింది.
ఈ చివరిమాటకి కదలికొచ్చింది, నాలో.
పది నిమిషాల్లో పిలిచింది భోజనానికి, ఏవో చేసింది, మధ్యలో అరటిపళ్ళ పచ్చడి తినండి అని వేసింది.
”అరటిపళ్ళ పచ్చడా? అదేంటీ” అడిగా.
అరటిపళ్ళు పచ్చడి చేసుకోవచ్చు, ఇలా అని చెప్పింది.

అరటిపళ్ళని,వేపపువ్వుని, మామిడి పిందెలని ఉగాది పచ్చడిగా చేసుకుంటాంగాని ఆ తరవాతెప్పుడూ చేసుకోం. అరటి పళ్ళ పచ్చడి చేసుకోడం తేలికే, బాగుంటుంది కూడా.
అరటిపళ్ళు తీసుకోండి, మామూలు పళ్ళే, భూషావళీ,చక్కరకేళి ఇవేవి బాగోవు, పచ్చడికి. దొరికితే బొంతరటి పళ్ళు బాగుంటాయి. ఇవి అస్తమానమూ దొరకవు కనక మామూలు దేశవాళీ పళ్ళు బాగుంటాయి. వీటిని మెత్తగా పిసకండి, మిక్సీ లో వెయ్యద్దు, పల్చగా అయిపోతుంది పచ్చడి. పిసికిన అరటిపళ్ళ గుజ్జులో కొద్దిగా చిటికెడు పసుపేయండి, తగిన ఉప్పు, బెల్లం కూడా వేయండి. కొద్దిగా చింతపండు పులుసు చేర్చండి. ఒక్కటంటే ఒక్కటే మిరపకాయ ని మూకుడులో ఆవాలు, మెంతులతో వేయించండి, రెండు చుక్కల నేతితో. మెంతులు ఎక్కువేయండి. ఈ పోపును పచ్చడిలో చిదిపేసి కలిపేయండి. పచ్చడి తయార్. ఉత్తినే తిన్నా బాగుంటుంది, అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది.. మెంతులు ఆరోగ్యానికి మంచివి….

శర్మ కాలక్షేపంకబుర్లు-కుడితిలో పడ్డ ఎలక

కుడితిలో పడ్డ ఎలక

కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకోడం అంటారు, ఇదేంటీ? అన్నట్టు నేటివారికి, కుడితి తెలీదు, ఎలకా తెలీదుకదా! వివరంగా చెబుతా!!

పాతకాలంలో ప్రతి ఇంట పశువులు కూడా ఉండేవి, ఏవి ఉన్నా, లేకపోయినా ఆవు తప్పనిసరిగా ఉండేది. ఆవుకి పచ్చగడ్డి వేసేవారు, ఇంటి దగ్గరున్నంత సేపూ కూడా. దాహం తీర్చుకోడానికి ఒక తొట్టి పెట్టేవారు. ఆ తొట్టి కర్రతో చెయ్యబడి కింద సన్నగాను పైకి వెళ్ళేటప్పటికి మూడడుగుల కైవారంతో రెండడుగుల ఎత్తులో ఉండేది. దీనిలో నీరు, బియ్యం కడిగిన కడుగు, అన్నం వార్చిన గంజి, కూర తరుక్కున్న తరవాత వచ్చే రద్దు, మిగిలిపోయిన అన్నం, మినప, కంది, పెసర పొట్టు ఇలా ఇంట్లో వారు తినేవన్నిటిలోనూ బలమైనవి ఈ తొట్టిలో పోసేవారు. ఆవువాటిని తిని, తాగి బలమైన పాలిచ్చేది. ఆవుతో పాటుగా ఈ తొట్టిమీద ఆధారపడి మరికొన్ని జీవులుండేవి, అవి ఈగ,బల్లి, ఎలక,కాకి. ప్రస్థుతం ఎలకగురించే చెప్పుకుందాం. ఎలక తిన్నదానికంటే పాడుచేసేదే ఎక్కువ. ఈ ఎలకలు దండులా బారులు తీరి కదులుతాయి. ఎలక చాలా తెలివైనది. ఏది కనపడితే దాన్ని కలబడి తినెయ్యదు. దండులో ముసలి ఎలక ముందు తిన్న తరవాత మిగిలినవి తింటాయి, దండుగా కదిలినపుడు. ఇదెందుకో తెలుసా? జాగ్రత. ఆక్కడున్న ఆహారంలో తినకూడనిదుంటే ఆ ముసలి ఎలకకి ఏదో జరుగుతుంది, అది ఆత్మ త్యాగం చేసి, మిగిలినవాటిని రక్షిస్తుంది. దారి తప్పుతున్నాం కదూ!

ఎలక కుడితి తొట్టి దగ్గరకే చేరుతుంది, దానికి తెలుసు అక్కడ తనకి కావలసిన ఆహారం దొరుకుతుందనీ. నెమ్మదిగా కట్టుగొయ్యనున్న పలుపుతాడెక్కి నెమ్మదిగా కుడితి తొట్టి మీదకి చేరుతుంది. అన్నపు కరుడు సగం ములిగి సగం తేలుతూ కనపడుతూ ఉంటుంది. దాని దగ్గరకి చేరాలంటే కుడితితొట్టిలో ఉరక్క తప్పదు, ఉరుకుతుంది, అన్నం కరుడు మీదకి ఎక్కుతుంది నెమ్మదిగా, అన్నం కరుడు ములుగుతూ తేలుతూ ఉంటుంది, స్థిమిత పడ్డ తరవాత కావలసింది తినేస్తుంది, ఇప్పుడు బయటికిరావాలి,ఎలా? రాలేదు, కారణం తొట్టి అంచులు నున్నగా ఉంటాయి, పట్టు దొరకదు, ఎగరచ్చు, సావకాశం లేదు, ఎగరడానికి కాళ్ళకి పట్టు దొరకదు, నొక్కిపెడితే అన్నం కరుడు ములిగిపోతోంది. అన్నం కరుడు దిగి కుడితిలో పడి బయటికిపోయే సావకాశం దొరుకుతుందేమోనని ఈదుతూ ఉంటుంది. సావకాశం దొరకదు, ఆయాసం, నీరసం తప్పించి, ఇప్పుడు అసలు కుడితి తొట్టిలోకి ఎందుకు దిగానూ అని ఆలోచిస్తూ, మళ్ళీ అన్నం కరుడెక్కి కూచుందామనుకుంటే అది విడిపోతోంది. ఎలా బయటికిపోయే దారిలేదు, అక్కడ ఉండేందుకూ దారిలేదు, ఇదే కుడితి తొట్టిలో ఎలక అవస్థ. ఇదెందుకు జరిగిందీ, ప్రలోభం. ఈ ప్రలోభం మానవుల్ని ఎలా ఏడిపిస్తుందో చూద్దామా?

పెళ్ళికొడుకు బుద్ధిమంతుడు, చిన్న ఉద్యోగం,పెద్దగా అందగాడుకాడు, ధనవంతుడూ కాడు, కట్నకానుల ప్రసక్తీ లేదు. మరో పెళ్ళికొడుకు ధనవంతుడు, ఉద్యోగి, కాని కొద్దిగా బుద్ధికే మట్టులేదని వార్తలున్నాయి, కట్నకానుకలూ కావాలంటున్నాడు. ఇప్పుడు ఏ సంబంధానికి సరేనని చెప్పాలి? అమ్మాయి, తల్లి దండ్రులూ కూడా ఏమనుకుంటున్నారు, నేటి కాలంలో! ఏదో ఒక లోటు లేనివాడున్నాడేంటీ? కట్నకానుకలొద్దన్నవాడి దగ్గరేం లోపముందో, ఎవరికి తెలుసు? డబ్బున్నవాడు, అందగాడు, మరికొంత సంపాదించే వీలున్న ఉద్యోగం అని రెండో సంబంధమే చేసుకుంటున్నారు. పెళ్ళయిన వెంఠనే చుక్కలు చూపించాడే అందా పెళ్ళి కూతురు, స్నేహితురాలితో. దానికా స్నేహితురాలు అది అందరూ చేసేపనే:) , నీ మొగుడొకడే తేడా కాదు, సద్దుకో అని:) దీనికి కారణం ప్రలోభం…

మీ పాత బంగారం తెచ్చెయ్యండి, దాని బరువుకు సరిసమానమైన బరువు బంగారపు వస్తువులు పట్టుకెళ్ళండి, మజూరి, తరుగులేదు, ప్రకటన. ఆవిడకీ వడ్డాణం నూరు తులాలది బరువైపోయింది. ఎప్పటిదో తన అమ్మమ్మ అమ్మ చేయించుకున్నదిట, మోటుగానూ ఉంది. మార్చేసుకుంటే. ఇంకెందుకూ ఆలస్యం, కొట్టు దగ్గరకెళితే వాడు ఇటుతిప్పి, అటుతిప్పి, మీటర్లో పెట్టి, అరగదీసి, అబ్బే బంగారంలో కల్తీ ఉందండి, మీరు నూరు తులాలంటున్నారు, దీనిలో అరవైఐదు తులాలకంటే బంగారంలేదు, మీకిష్టమైతే అలా పట్టుకెళ్ళండి అన్నాడు. ఇదేదో తేడాగా ఉందనుకుని అక్కడనుంచి మరోకొట్టుకు, పాపం ఈ కొట్టువాడు అప్పటికే వార్త అవతలివాడికి చేరేసేడు. నేను అరవ ఐదు చెప్పేను, చూసుకో బేరం పోనివ్వకూ, మంచి సరుకు. కతమామూలే కొత్తవాడు డెభ్భై తులాలిస్తానండి, మా దగ్గరంతా నికార్సు, అని అదిపుచ్చుకుంటాడు. మొత్తానికి మోసపోడం ఖాయం. కోట్లవాళ్ళిద్దరూ కలిసి దోచుకున్నారని తెలియక….. ఇదెందుకూ ప్రలోభం, చేతకూలి,తరుగు కలిసొస్తుందని. వ్యాపారస్థుడు మళ్ళీ అదేనగ ఇది చాలా పాతకాలందండీ! ఇప్పుడు ఇంతబాగా చేసిన నగ దొరకడం లేదు, ఇందులో తొంభై తులాల బంగారం, మిగిలినది రాగి, అని చెప్పి లాభానికి అమ్ముకుంటున్నాడు.

నిజానికి నేడు జరుగుతున్న వ్యాపారం అంతా ప్రలోభం మీద జరుగుతున్నదే! ఒక చీరకొంటే ఒకటి ఫ్రీ! దానిఖరీదు నాలుగువేలు. చీరెంత బావుందో. రెండు చీరలు రెండు రంగులు ముచ్చటగా ఉన్నాయి, మోజు. అక్కడే బట్టలు కొనడానికొచ్చిన మరొకావిడ మీరు తీసుకోకపోతే చెప్పండి, నేను తీసుకుంటానంటుంది. మరో జత చూపమంటే అబ్బే ఈ జతఒక్కటే మిగిలిందండీ, మీకు కావాలంటే సరి, లేదంటే వారికిచ్చేస్తా. అమ్మో! ఇంతమంచి చీరలు మళ్ళీ దొరకవేమో, ప్రలోభం, నాకే ఇచ్చెయ్యండి, మాట. ఇంతకీ ఆ పోటీ కొచ్చినావిడ ఇటువంటి బేరానికి నియమింపబడినదే:) ఏమయ్యా! ఒక చీర రెండు వేలకియ్యరాదా? అడగండి, అబ్బే అలా కుదరదండి!ఇది స్కీమండి అంటాడు తప్పించి నిజం చెప్పడు:)

జీవితంలో నిత్యమూ ప్రలోభం లో పడి మోసపోతూనే ఉన్నాం, చాలాచాలా విషయాలలో,ఇంకా మోసపోతాం కూడా, ఇదింతే :) ఆ తరవాత కుడితిలో….. కొట్టుకుంటూ ఉంటాం, టాం,టాం

శర్మ కాలక్షేపంకబుర్లు-వొట్టి గొడ్డుకి…..

వొట్టి గొడ్డుకి…..

”ఒట్టిగొడ్డుకి ఆరుపులెక్కువ” అనిగాని ”ఉట్టిగొడ్డుకి ఆర్పులెక్కువ” అనిగాని అంటుంటారు.

పాతకాలంలో రైతులు పశువులమందను మేపేవారు. అందులో ఎడ్లు,దున్నలు, ఆవులు,గేదెలు, పెయ్యలు,కోడెలు, లేగలు ఉండేవి. ఎడ్లు,దున్నలు బరువైనపనులు చేసేవి, అరక దున్నడం,బండిలాగడం, మోట తోలడం (నీరు నూతినుంచి తోడటాన్ని మోట తోలడం అంటారు)

ఇక ఆవులు, గేదెలు ఇవి పాలిచ్చేవి, రెండు పూటలా పాలిచ్చేవి, ఒకపూట పాలిచ్చేవి, ఒట్టిపోయినవి కూడా ఉండేవి. పాలివ్వనివాటిని ఒట్టిపోయినవి అంటారు.

ఇక కోడెలు పనికి మలపవలసినవి, పొగరుబోతువీ, చెప్పినమాట వినవు, వీటికి ముక్కు కుట్టిస్తారు, ముక్కు తాడూ వేస్తారు, అప్పుడు చెప్పిన మాట వింటాయి.

ఇక చివరివి లేగలు, చాలా చిన్నవి వీటిని సరదాగా తువ్వాయిలు అనీ అంటారు, లేడి పిల్లల్లా గెంతుతూ ఉంటాయి.

ఇన్ని రకాల, వయసుల పశువులన్నిటికీ ఒకే రకం ఆహారం ఇవ్వడు, రైతు. వేటికి తగిన ఆహారం, వాటికి ఇస్తుంటాడు.

బరువు పనులు చేసే ఎడ్లు, దున్నలకి ఎండు గడ్డి,ఉలవలు, కొద్దిగా పచ్చి గడ్డి, చిట్టు, తవుడు,తెలకపిండి, జనపకట్టె, కుడితి ఆహారంగా ఇస్తాడు. వీటిని తిని బలమైన పనులు చేస్తాయి.

పాలిచ్చే, ఒంటి పూటపాలిచ్చే వాటికి పచ్చగడ్డి, జనపకట్టె, తెలక పిండి, చిట్టు, తవుడు, కుడితి ఆహారంగా ఇస్తాడు, పాలు బాగా ఇస్తాయి.

ఒట్టి గొడ్లు, ఇవి ఒట్టిపోయి ఉంటాయి, మళ్ళీ చూలు కట్టే సావకాశమూ ఉండదు, అమ్మెయ్యలేడు, నడివయసులో ఉంటాయి, పనీ చెయ్యలేవు, కాని ఒకప్పుడు మహరాణీ భోగం అనుభవించినవి, పాలిచ్చిన కాలంలో. అప్పుడు ఆహారంగా పై చెప్పినవి తిని వున్నవీ. ఇప్పుడు పాలివ్వని కారణంగా, పాలిచ్చేవాటికి పెట్టే ఆహారం పెట్టరు. పాలిచ్చేవాటికి ఆహారం ఇచ్చేటపుడు అరుస్తూ ఉంటుందీ ఒట్టి గొడ్డు, తనకూ పెట్టలేదని. ఇవి మందలో పోట్లాడుతుంటాయి, అంతకు మించి ఏ పనీ చేయలేవు. వీటికి రైతు ఎండుగడ్డి మాత్రం సమృద్ధిగా వేస్తాడు. అందుకే ”ఒట్టిగొడ్డుకి ఆర్పులెక్కువ” అంటారు.

ఇక కోడెలు ఇవి ”తినడానికి తిమ్మరాజు, పనికి పోతురాజు” అన్న నానుడిలా దున్నబోతే దూడల్లోకి మెయ్యబోతే ఎడ్లలోకి జేరతాయి. ఇవి పని చేయలేవు తగిన వయసులేదు గనక, కాని రేపటి కాలంలో పని చేయవలసినవిగనక ఎడ్లతో సమానంగా తిండి పెట్టాలి, ”దున్నబోతే దూడలలోకి, మెయ్యబోతే ఏడ్లలోకి” అన్న సామెత ఇలా పుట్టిందే, దొంగ గొడ్లకి తిండి దండగ కాని తప్పదు.

ఎప్పుడూ ఏ పనీ చేయక,చెయ్యడం చేతకాక అరిచేవాళ్ళని ఒట్టిగొడ్లు అంటారు. నిజానికి వీళ్ళని ఒట్టిపోయిన వాటితో పోల్చడం అన్యాయమే, ఎందుకంటే ఈ ఒట్టిపోయిన పశువులు ఒకప్పుడు పాలిచ్చినవి కదూ! వీళ్ళైతే ఎప్పుడూ ఏపని చెయ్యనివాళ్ళు,చేతకాని వాళ్ళూనూ…..మరి వీళ్ళే ఇంటికప్పెగిరిపోయేలా అరుస్తారు…

 

శర్మ కాలక్షేపంకబుర్లు-వడ్డాణం

వడ్డాణం

అబ్బా! ఎంతబావుందో!! అంటూ నడుము తడుముకుంటూ వచ్చింది ఇల్లాలు.

ఏంటీ? అని అడిగేలోగానే,

చిన్నతనంలో పెళ్ళి చంద్రహారాలు చేయించారు, ఇప్పటికీ ఉంది, ఎంత బాగుంటుందో! వయసు వరదగోదారి, అంతాముద్దే, ముచ్చటే,మురిపమే, అదేం మాటో మరేమైనా తోస్తేనా? తోచనిస్తేనా?

పదేళ్ళు నడిస్తే కన్నీళ్ళు, కష్టాలు పలకరిస్తే, అదే జీవితమనుకుంటే, మరో వస్తువు వాహనం చేయించుకోవాలనే ఆలోచనే పుట్టలేదు. నలుగురు బుజ్జి కూనలు తయారైతే అదేలోకం, మరోటి తెలిస్తేనా? వయసు శాంత గోదారి.

పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అదో లోకం, అప్పుడు చేయించిన పలకసర్లు గొలుసు చూడముచ్చటగా ఉంది, ఇప్పటికీ…

పిల్లల పెళ్ళిళ్ళూ అయ్యాయి, మనవలు,మనవరాళ్ళు, ముని మనవలు, ఇదో లోకం, మూడో,నాలుగో తరం, ముచ్చటా, అసలు కంటే వడ్డీ ముద్దని, కూతురికి వస్తువు చేయించలేదు, కోడలికి గాజులు చేయించలేదు, అయ్యో! అడగ కుండానే అందరికి అన్నీ చేయించారుగా! వయసు ప్రశాంత గోదారి, ఇంతలోనూ గోవర్ధనం గొలుసు, ఇష్టపడి చేయించుకున్నది కదూ!

వయసు వృద్ధ గోదావరిలో పడింది,అప్పుడప్పుడూ పెట్టుకోడమేగాని ఏదీ నిత్యమూ పెట్టుకోడానికే భయం, ఎవడు పీకనొక్కి చంపుతాడో అని. మన మిత్రుల రాణీ కాసులపేరు, ఎంతకాలం? ఒకటా రెండా ఇరవై సంవత్సరాలు,మన దగ్గర దాచి ఉంచి, బాబోయ్! దీన్ని ఇక మేము కాపాడలేమని బతిమాలి వారి వస్తువు వారికి అప్పజెప్పేం, ఇంట్లో ఉన్నపుడైనా, ఎంటో ఒక్క సారీ మెళ్ళో వేసుకోవాలనే అనిపించలేదు సుమా!ఎప్పుడేనా అనిపించేది వడ్డాణం చేయించుకుంటేనో అని! రోజులు చెల్లిపోయాయి.

డెబ్బయి ఏళ్ళు పైబడ్డ తరవాత నడుముకి ఇది మాత్రం బాగా అమరింది కదూ, వడ్డాణం లాగానూ, బాగా నొక్కి పట్టింది, నెప్పీ తగ్గినట్టుందండీ అంది ఇల్లాలు, నవ్వుతూ..

వడ్డాణం చేయించలేకపోయినందుకు సిగ్గు పడ్డానో, నడుముకి బెల్ట్ వేసుకోవలసివచ్చినదాన్ని కూడా ఇంత తేలిగ్గా, సరసంగా చెప్పిన ఇల్లాలిని మెచ్చుకోవాలో, అభినందించాలో, వడ్డాణం చేయించలేకపోయినా నడుముకి, నెప్పికి బెల్ట్ వేయించినందుకు బాధ పడాలో, తెలియలేదు, ఆవిడ దగ్గర బుర్ర వంచుకున్నా, తప్పు చేసినవాడిలా.

ఏం? ఏమయిందీ అలా వున్నారు, ఇప్పుడు కావలసింది, వడ్డాణం కంటే ఎక్కువది, నడుం నొప్పి తగ్గించే బెల్ట్, చాలా చక్కగా అమిరింది, సుఖంగా ఉంది, ఎందుకు బాధ, అందరికి అన్నీ చేయించడమే సరిపోయింది, మీ జీవితంలో మీరేం చేయించుకున్నారనిగాని, చేయించుకోమనిగాని అడిగామా? కనీసం ఉంగరం కూడా లేదే!

ఏం మాటాడాలో తెలియలేదు.

శర్మ కాలక్షేపంకబుర్లు-మీసం గొరిగించి….

మీసం గొరిగించి….

”మీసం గొరిగించి వేషం లేదు అన్నట్టు” అనేది ఒక తెనుగునానుడి, అందరికి తెలిసినదే. ఒక చిన్న కత చెప్పుకుందాం. ఒక ఔత్సాహిక సమాజం వారో నాటిక వేస్తున్నారు. నాటకాలలో స్త్రీ పాత్రలు కూడా మగవారే వేయడం రివాజుగానూ ఉండే కాలం. అప్పుడప్పుడే స్త్రీ పాత్రలను స్త్రీలు ధరించడం మొదలైన రోజులు. ఇలా స్త్రీ పాత్రలను పురుషులు ధరించి పేరుగాంచినవారెందరో ఉండేవారు, తెనుగునాట, శ్రీ స్థానం నరసింహారావుగారొకరనుకుంటా, అటువంటివారు.

ఒక సమాజం వారు స్త్రీ పాత్ర ఉన్న ఒక నాటకం వేస్తూ రిహార్సల్ చేయడం మొదలెట్టేరు. అందులో స్త్రీ పాత్రను ఒక నటి ధరిస్తోంది. కాని ఈ స్త్రీ పాత్ర నటించాలనే కోరిక ఉన్న ఒకతను రిహార్సల్స్ కి వచ్చి కూచుని నటి తాలూకు సంభాషణల దగ్గరనుంచి, హావభావాలదాకా పూర్తిగా ఆపోశన పట్టేశాడు. నాటక సమాజంవారికి ఈ సంగతి తెలుసు, అవసరమైతే ఉపయోగపడతాడు అనుకుని ఊరుకున్నారు. నాటకం వేసేరోజొచ్చింది. నటి జాడ లేదు, రాలేదు, ఎదురుచూసి విసిగిపోయారు, నాటకం వేయడం కుదరదేమో ననే భయమూ పడ్డారు, అంతలో ఒకరు గుర్తుచేశారు, మరోనటుడు సిద్ధంగా ఉన్నది. దానితో వారిలో ధైర్యం వచ్చింది, ఇతనికి వేషధారణ చేయాలని అనుకున్నారు, మొదటి అడ్డంకిగా మీసాలు కనపడ్డాయి. మంగలిని పిలిచి గడ్డం మీసం నున్నగా గొరిగించి చీరకట్టేశారు. నటుడు అచ్చంగా స్త్రీ లాగానే నడుస్తుంటే చూసిన వాళ్ళు అమ్మయ్య బతికిపోయామనుకున్నారు. అదిగో అంతలో దిగిందా అసలు నటి. ఇప్పుడేం చేయాలి? సమస్య వచ్చింది. నాటక సమాజం వారు దూరదృష్టితో ఆలోచించి నటిచేతనే నటింపజేశారు. పాపం! నటుడు వేషం కోసం మీసం తీయించుకున్నాడు తప్పించి,వేషం వేయడం కుదరలేదు:) అదిగో అప్పటినుంచి మీసం గొరిగించి వేషం లేదన్నట్టు అనే నానుడి ప్రజలలో మిగిలిపోయి, ఉపమానం స్థాయికి చేరిపోయింది.:)

మరోలా చెప్పుకోవాలంటే పిల్లనిస్తామని ఉత్సాహంగా వచ్చినవారు, ఆ తరవాత అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం కుదరలెదని చెప్పినట్టు:) అలా చెప్పడం ఎందుకో అర్ధమైందనుకుంటా:)

ఇది నేటి రాష్ట్రానికి వర్తిస్తుందనుకుంటా. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి విడదీశారు, ఇప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదంటున్నారు.