శర్మ కాలక్షేపంకబుర్లు-శిఖండి-2

https://kastephale.wordpress.com/2018/07/13/శర్మ-కాలక్షేపంకబుర్లు-శి/

తరవాత…

అంబ-ప్రేమ

భీష్ముని మాట

నా తండ్రి శంతన మహారాజుకి సత్యవతీ దేవికి వివాహం జరిపించా. వారికిద్దరు కుమారులు కలిగారు. వారే చిత్రాంగదుడు,విచిత్ర వీర్యుడు. శంతను తదనంతరం చిత్రాంగదునికి పట్టాభిషేకం జరిపించా, సత్యవతీ దేవి అనుమతితో. చిత్రాంగడుడు చిన్నతనంలోనే కాలం చేశాడు. ఆ తరవాత విచిత్ర వీర్యునికి పట్టం కట్టేను.

విచిత్ర వీర్యునికి వివాహ వయసొచ్చింది. కాశీ రాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. సత్యవతీ దేవి అనుజ్ఞతో ఒంటిగా కాశీరాజ్యం చేరుకుని, అక్కడ స్వయం వరానికొచ్చిన రాజులనందరిని ఓడించి పెళ్ళికుమార్తెలను తీసుకొచ్చి నా తల్లి సత్యవతీ దేవికి అప్పజెప్పేను, పెళ్ళికుమార్తెలలో పెద్దదైన అంబ తాను సాళ్వుడిని ప్రేమించాననీ, సాళ్వుడు కూడా తనతో ప్రేమతో ఉన్నాడనీ, అతని దగ్గరకు తనను పంపమనీ, నాతో చెప్పింది. విషయం సత్యవతీ దేవికి తెలిపి ఆ తల్లి మాట ప్రకారంగా అంబను సాళ్వుని వద్దకు వృద్ధస్త్రీలను తోడిచ్చి పంపాను. మిగిలిన ఇద్దరు కన్నెలనూ విచిత్రవీర్యునికిచ్చి వివాహం జరిపించాను. వారే అంబిక,అంబాలిక.

అక్కడేం జరిగిందీ తరవాత…

స్వయంవరం చాటించినప్పుడు యుద్ధంలో వచ్చిన వారిని గెలిచి కన్నెలను చెఱపట్టి వివాహం చేసుకోడం నాటి ఆచారం, అదీ కన్నెల ఇష్టంతోనే, ఇదే రాక్షస వివాహం. కన్నె మరొకరిని మనసుపడిందని తెలిపి, తనను వానివద్దకు పంపమని కోరినంతనే అంబ వివాహ ప్రయత్నం మాన్చి, సాళ్వుని వద్దకు పంపింది సత్యవతీ దేవి, విషయం తెలిసినది గనక. శ్రీ కృష్ణుడు రుక్మిణిని కూడా ఇలాగే వివాహం చేసుకున్నాడు. నేటికి కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం నడుస్తూనే ఉంది. తరవాత సాళ్వుని వద్ద ఏం జరిగిందీ…..

ప్రకటనలు

శర్మ కాలక్షేపంకబుర్లు-శిఖండి-1

పరిచయం.

శ్రీకృష్ణ రాయబారం ముగిసింది. వీడ్కోలివ్వడానికి తోడెళ్ళిన కర్ణుని ద్వారా పాండవుల యుద్ధ ప్రకటన తెలిసిన తరువాత, సభలో ఉన్న భీష్ముని వద్దకు దుర్యోధనుడు చేరి ”తాతా! ఇరు పక్షాలలో, వీరులలో నీకు తెలియనివారు లేరు,ఎవరెంతవారో వివరించవా?” అని అడిగాడు. విన్న తాతగారు ”చెబుతావిను” అని మొదలు పెట్టేరు.

నీవు అతిరథుడవు, నీతమ్ములంతా రథిక శ్రేష్టులు. నా గురించి నేను చెప్పుకోడం బాగుండదు, నా గురించి అందరకూ తెలిసినదే అని, మిగిలినవారందరి బలాలు చెబుతూ చివరకు కర్ణుడు ’అర్ధ రథుడు’ అన్నారు. ఇది విన్న కర్ణుడు కోపంతో ఊగిపోతూ ముసలితనం లో మతి తప్పి మాటాడుతున్నావు నీవే అర్ధరథుడివి అన్నాడు. ఇది విన్న సుయోధనుడు కలగజేసుకుని మీ ఇద్దరిని నమ్ముకుని బాధ్యత మీకప్పగించాను, మీరిద్దరూ ఇలా కొట్లాడుకోడం అంటూ…… తాతా మిగిలినవారి గురించి చెప్పూ అన్నాడు.

పాండవుల గురించి చెబితే నీ మిత్రుడికి కోపం వస్తుంది, నువ్వేమనుకుంటావో చెప్పలేను, మధ్యలో నాకేల నయ్యా ఈ తగులాటం అని బాధపడ్డారు భీష్ముడు. చెప్పు తాతా అని అనగా… పాండవులబలాలు చెబుతూ శిఖండి మహారథుడు అతనిని నేను చంపలేనయ్యా అన్నారు. ”తాతా! అదేల!! ఆ విషయం వివరంగా చెప్పమంటే……భీష్ముడు చెప్పినదే తరవాత…భాగాలలో…చాలా పెద్ద కథ..చిన్న చిన్న భాగాలుగా…..

నామాటగా శిఖండి పరిచయం :- శిఖండి పాండవుల సేనలో ఒక అక్షౌహిని సేనకు నాయకుడు, దృష్టద్యుమ్నుని, ద్రౌపదిల కు అన్నగారు, ద్రుపదుని పెద్ద కుమారుడు, మహావీరుడు. కౌరవుల బలంలో సగం బలాన్ని ద్రుపదుని కుటుంబమే నాశనం చేసింది. శిఖండి భీష్ముని పడగొట్టేడు, దృష్టద్యుమ్నుడు ద్రోణుని పడగొట్టేడు, ఇంక మిగిలిన వీరులను పాండవులు నంచుకున్నారు…

శర్మ కాలక్షేపంకబుర్లు-అతిరథ మహారథులు

అతిరథ మహారథులు

ఈ అతి రథమహారథులన్నది మనం నిత్యమూ వింటూనే ఉంటాం. ఈయనే గొప్పవాడనుకోకండి,ఈ విషయంలో అతిరథ మహారథులున్నారు, ఇలా అంటుంటారు. అసలీ అతిరథ మహారథులెవరు?

మహాభారత కాలం నాటికే యుద్ధానికి నియమాలున్నాయి. అన్నట్టు ఇంతకు ముందుది రామాయణ కాలానికే యుద్ధ నియమాలున్నాయి, నేటి వియన్నా యుద్ధ నియమాలన్నీ వీటినుంచి పుట్టుకొచ్చినవే! మహాభారత కాలం నాటికున్నయుద్ధ నియమాలు, యుద్ధవీరులెలా ఉండేవారు?

పదాతి అనగా భూమిపై నిలబడి కత్తి,డాలు లేదా బరిశ(ఈటె, బల్లెం)తో యుద్ధం చేసేవాడు.
విలుకాడు నేల మీద నిలబడీ యుద్ధం చేయచ్చు లేదా రథం ఎక్కి కూడా విల్లు అమ్ములతో యుద్ధం చేయచ్చు. ఇలా రథం లో ఉండి యుద్ధం చేస్తే రథికుడు అంటారు.
గుర్రం మీద,ఏనుగు మీద ఎక్కి కూడా యుద్ధం చేసేవారు.

యుద్ధ నియమాలలో మొదటిది పదాతి పదాతితో మాత్రమే పోరాడాలి. గుర్రం మీద ఉండి ఏనుగు మీదుండి యుద్ధం చేసేవారు వారివారితోనే యుద్ధం చేయాలి, మరొకరితో యుద్ధం చేయకూడదు. ఇక రథంలో ఉండి యుద్ధం చేసేవారు రథంలో ఉన్నవారితోనే యుద్ధం చేయాలి. వాగ్యుద్ధం చేస్తున్నవారితో వాగ్యుద్ధమే చేయాలి.

దూతను చంపకూడదు.
రాత్రి వేళ యుద్ధం కూడదు. రాత్రి యుద్ధం చేస్తే గోత్రనామాలు చెప్పుకుని యుద్ధానికి దిగాలి.
యుద్ధంలో లేనివారి పైన,స్త్రీలు,పిల్లల మీద అస్త్ర,శస్త్ర ప్రయోగం కూడదు. గాయపడినవారిని, ఓడిపోయినవారిని చంపకూడదు. శరణు కోరిన వారిని చంప కూడదు. అలసినవారితో యుద్ధం చేయ కూడదు. యుద్ధానికి సిద్ధంగా లేనివారితో యుద్ధం కూడదు. బందీగా పట్టుకున్నవారిని హింసించకూడదు. బందీని చంపకూడదు. పదుగురు కలసి ఒకరిపై దాడి చేయ కూడదు.

రధికుడు అంటే రధంలో నిలబడి యుద్ధం చేస్తూ తన రథానికి పూన్చిన గుర్రాలను సారథిని రక్షించుకోవాలి, తనను తాను రక్షించుకుంటూ. ఇదేగాక చక్రరక్షకులని ఇద్దరుంటారు,గుర్రాలమీద రథం పక్క చక్రాలను రక్షిస్తూ, వీరి రక్షణ బాధ్యత కూడా రథికునిదే! ఇలా ఒక రథంలో ఉండి యుద్ధం చేస్తూ వీరందరిని రక్షించగలవాడే రథికుడు. ఇలాటి ఒక వీరుడు పదకొండు వేలమంది రథికులతో ఏకకాలంలో యుద్ధం చేయగలవాడు మహారథుడు. ఇలాటి పెక్కుమంది మహారథులను ఒక్కడూ ఎదుర్కోగలవాడు అతిరథుడు.

తన రథాన్నే రక్షించుకోలేనివాడే అర్థ రథుడు అతడే కర్ణుడు, తాత గారు చెప్పినమాట కదా!

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవ్వనిచే జనించు…

ఎవ్వనిచే జనించు…

యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్
యోఽస్మాత్పరస్మాచ్చ వర్తనం ప్రపద్యే స్వయంభువమ్….భాగవతం. వ్యాసుని మాట.

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్….భాగవతం..పోతన మాట.

నాకు పోతనగారి పద్యం నచ్చినట్టుగా వ్యాసుని శ్లోకం నచ్చలేదు,రెండూ ఒకటే ఐనా. నా నచ్చుబాటుకేంగాని ముందుకు కదులుదాం…

జాయతే గఛ్ఛతే ఇతి జగం అంటే వచ్చేది వెళ్ళేది ఈ సృష్టి సమస్తం. ఎక్కడనుంచి పుడుతోందీ? ఆవిష్కరింపబడుతోంది? అంటే ఎక్కడో ఉన్నట్టేగా? అదెలా ఎదురుగా కనపడుతున్న మఱ్ఱి చెట్టున్నది కదా? ఎక్కడున్నది? ఆవగింజకంటే చాలా చిన్నదైన బీజంలో కదా! అంటే అణురోరణీయాన్ మహతో మహీయాన్. మఱ్ఱిచెట్టు అణువుగానూ ఉన్నది, వృక్షంగానూ ఉన్నది. అలాగే సమస్త జగమూ అణువుగానూ వ్యాప్తిగానూ ఉన్నది. అదే బయటకు ఆవిష్కరింపబడుతున్నది, కాలంతో పెరుగుతున్నది, చివరగా తిరోహితమవుతున్నది.

ఈ కాలం మూడు రకాలు భూత,వర్తమాన,భవిష్యత్తులు. అనగా జరిగిపోయినది,జరుగుతున్నది, జరగబోయేది. ఈ సర్వాన్ని నియంత్రిస్తున్నదెవరు? ఎవరి నియంత్రణా లేకనే జరుగుతున్నదా? లేదు.

దేని ఉనికీ స్థిరంకాదు. కొన్ని మనం చూస్తుండగా పుట్టి కొద్ది సేపటిలోనే మరణిస్తున్నవీ, మరికొన్ని కొన్ని వందల సంవత్సరాలు బతుకుతున్నవీ వున్నాయి. చివరకన్నీ తిరోహితమౌతూనే ఉన్నాయి.

ఈ పుట్టడం పెరగడం చావడం ( అనాది,మధ్య,లయుడెవ్వడు?) అనే సర్వమూ నిర్వహిస్తున్నదెవరు? కాలం. మరి కాలాన్ని నిర్వహిస్తున్నదెవరు? సూర్యుడు. సూర్యుడు కూడా నియంత్రించబడుతున్నాడు. అంటే కాలమే నియంత్రించబడుతోంది. అంటే కాలాన్ని కూడా నియంత్రించే మహా శక్తి. ఆ మహా శక్తిని నే శరణువేడుతున్నాను. ఇదీ ప్రార్ధన.

ఈ సర్వమూ నేటి సైన్సూ ఒప్పుకుంటోంది! అదీ చిత్రం.సూర్యుడు నియంత్రించబడుతున్నాడని సైన్స్ చెబుతోంది. ఋగ్వేదం ఇలా అంటోంది, సూర్యచంద్ర మసౌ ధాతా యధా పూత్వమకల్పయాత్, పృధీవీచంతరిక్ష…..అంటే బ్రహ్మ, సూర్యుడు చంద్రుడు భూమి, అంతరిక్షం మొదలైన వాటిని యధాపూర్వంగా కల్పించాడు, అని. అంటే ఇదివరకున్నవాటిలా మళ్ళీ సృష్టి చేశాడని. ఇదివరకున్నాయంటే, ఎవరివలన ఉన్నాయో అదే మహాశక్తి అణువుగానూ, విశ్వ వ్యాప్తంగానూ ఉన్నది. స్వయంగా ఆవిష్కృతమయే ఆ మహా శక్తికి నమస్కారం.

శర్మ కాలక్షేపంకబుర్లు-బందెల దొడ్డి

బందెల దొడ్డి

బందెల దొడ్డి అంటారు కాని అసలు మాట బందీల దొడ్డి అనేది నా మాట 🙂 ఎవరా బందీలు, ఎక్కడుండేవని కదా తమ అనుమానం అవధరించండి.

పల్లెలలో పశువులు స్వేఛ్ఛగా తిరిగేవి, గ్రామ కంఠాలలో మేసేవి. గ్రామ కంఠాలంటే గ్రామానికి సంబంధించి ఉమ్మడి స్థలాలు, ప్రభుత్వానివే! కొన్ని గొడ్లు గ్రామకంఠాలలో మేస్తూ కూడా పక్క పొలాలలో పడి పైరును పాడు చేస్తే రైతులు బయటికి తోలేసేవారు. ఐనా కొన్ని దొంగ గొడ్లకి ఇలా పై పొలాల్లో మెయ్యడమే అలవాటు. అవెవరి గొడ్డో తెలిస్తే వారికి చెప్పి అదుపు చేసుకోమనే వారు. అలా చెప్పినా వినిపించుకోని సందర్భం లోనూ, ఎవరి గొడ్డో తెలియని సందర్భంలోనూ ఆ గొడ్డును బందీ చేసి మునసబు ఆధీనం లో ఉన్న బందీల దొడ్డికి తరలించేవారు. ఇలా చేరిన పశువుకు మేతతో సహా అన్నిటిని గ్రామ నౌకరు చూసేవాడు. పశువు తప్పిపోతే బందెలదొడ్లు వెతుక్కునేవారు, ప్రతి ఊళ్ళోనూ ఒక బందెల దొడ్డి ఉండేది. తన పశువు బందెలదొడ్డిలో కనపడితే ఆ మున్సబు దగ్గరికిపోయి ఎన్ని రోజులనుంచి ఆ పశువు దొడ్డిలో ఉన్నదో దానికి తగిన మూల్యం, జరిమానా చెల్లించి మరలా ఇంటికి తోలుకుపోయేవారు. ఆగండి..ఆగండి ఇది వింటూంటే ఏదో గుర్తొచ్చిందంటారా నేటి కాలపు విషయం 🙂

కేంప్ రాజకీయాలని బందెల దొడ్డి రాజకీయాలని వీటికి పేరుష.మా వాళ్ళా రోజుల్లో అలా అనేవారు. ముచ్చటైన విషయం, తెలుసా! ఇవి దేశంలో ఎక్కడ మొదలయ్యాయో? దీనికి మొదటివారం మేమే!! ఈ ఆలోచనకి మాదే పేటెంట్ హక్కు. మా జిల్లాలో అనగా తూగోజిలో మా ఊరికిదగ్గరలో ఉన్న ఒక పంచాయతీ సమితికి నాటి రోజుల్లో ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిని ఎన్నుకోడానికి సమయం ఉండిపోయింది, పంచాయితీ ప్రెశిడెంట్ల ఎన్నిక పూర్తయినా. కప్పల తక్కెడ రాజకీయం, ఆయారాం గయారాం లంతా మా తరవాత వారే సుమా! ఆ రోజుల్లో ఉన్నది ఒకటే పార్టీ అదే కాంగ్రెస్, అందులో రెండు వర్గాల మధ్య పోరు. కప్పలతక్కెడలాగా ఇటూ అటూ గెంతి పక్షాలు మార్చకుండేందుకుగాను, మా ప్రాంతంలోని రాజకీయ చాణుక్యుడొకరు పంచాయతి ప్రెసిడెంట్లందరిని బస్సులో బెంగుళూరు ( బెంగలూరుకి బందెలదొడ్డి రాజకీయాలకి ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది)పంపించి తిరిగి వచ్చేటప్పుడు తిరుపతి వేంకన్న బాబు దర్శనం చేయించి గుళ్ళు కొట్టించి, ఒక్కొక్కరికి ఒక పచ్చ కండువా కప్పి ఎన్నిక సమయానికి ఎన్నిక స్థలానికి చేర్చారు. నిజం! దానిని ఆ రోజుల్లో ముచ్చటగా చూశాం, పచ్చటి గుండుతో (గుండు మీద స్వామివారి శ్రీగంధపు పూతతో) పచ్చ తువ్వాలు కప్పుకుని బస్సు దిగుతున్న సర్పంచులని చూసి తరించినవారం. ( అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదు) అలా బందెల దొడ్డి రాజకీయానికి మొదటివారం, ప్రారంభకులం.

నేటి కాలం బందెలదొడ్డిలో సెల్ ఫోన్ లు కూడా ఊడ బెరుక్కున్నారట, ఆ కాలంలో సెల్ ఫోన్ లు లేవు, మామూలు లేండ్ ఫోన్ లే తక్కువ. నాటి కాలానికి గొప్ప హోటల్లో బస, మందు,విందు,పొందు కార్యక్రమాలు అని నాటి సర్పంచ్ లు గుర్తు చేసుకుంటుంటారు.

మీరీ పాటికి వారెవరో గుర్తించి ఉంటారు గా! నేటి రాజకీయాలు చూస్తుంటే టపా తన్నుకొచ్చేసింది, నా ప్రమేయం లేకనే! 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-నాస్తి జాగరతో భయం.

నాస్తి జాగరతో భయం.

కృషితోనాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం.

వ్యవసాయం/పరిశ్రమ/ప్రయత్నం చేస్తే కరువుండదు. తపస్సు చేస్తే పాపం ఉండదు. మౌనంగా ఉంటే కలహం లేదు. జాగ్రత్తగా ఉంటే భయం లేదు.

నాస్తి జాగరతో భయం, భయం దేనినుంచి? ప్రమాదం నుంచి. ప్రమాదం అంటేనే చెప్పివచ్చేది కాదు,హఠాత్తుగా మీద పడేది. పెను కష్టం హఠాత్తుగా మీదకురికితే ఎంతటి వారైనా బిత్తరపోతారు, తత్తర పడతారు. కొన్ని ప్రమాదాలు చెప్పీ వస్తాయి. అలా తత్తరపాటుకు గురికాకుండాలంటే, భయానికి గురికాకుండాలంటే జాగ్రత అవసరం. జాగ్రత అంటే, ఎఱుక కలిగి ఉండడం, హెచ్చరికగా ఉండడం వగైరా చెప్పుకోవచ్చు. ఇలా కాదుగాని ఉదాహరణ చెబుతా!

మా ఊరు అఖండగోదావరి పక్క ఉంది. అక్కడ గోదావరి వెడల్పు ఐదుకిలో మీటర్ల పైమాటేనేమో! ప్రతి సంవత్సరం వరదొచ్చేది. వరదకి ముందు పోతగట్ల వెంట నదివైపు ముఖ్యంగానూ,ఊరివైపూ, ఊళ్ళో ఉన్న పిల్లలమంతా, పందికొక్కు కన్నాలు గుర్తించి, గుర్తుగా పొడుగాటి వెదురు కర్ర ముక్క గుచ్చి ఉంచేవాళ్ళం, మా వెనక పెద్దవాళ్ళు రాళ్ళు వగైరా పుచ్చుకొచ్చి ఆ కన్నాలు పూడ్చుకుంటూ పోయేవారు, దగ్గరగా రెండు కిలో మీటర్ల దూరం. వరద, గట్టు దగ్గరకి వస్తోందనగా ఊళ్ళో ఉన్న పిల్లా మేకాతో సహా అందరూ గోదావరి గట్టు కాపలాకి వెళ్ళేవాళ్ళం,రాత్రి పగలు కూడా. ఐదుగురొక జట్టు, ఒక టార్చి లైటు, ఇద్దరు పెద్దవాళ్ళు, ముగ్గురు పిల్లలు, ఇలా కాపాలా కి గస్తీ తిరిగేవాళ్ళం. ఇంటి దగ్గర, ఇంటికొకరిని కాపాలాకి ఉంచేసేవారు, అలా ఇంటి దగ్గరెవరూ లేనపుడు, పొరుగూరివాళ్ళు వెనకనుంచి వచ్చి దోచుకుపోయిన సంఘటనలూ ఉన్నాయి. గట్లకి కాపలా ఎందుకు? గట్ల వెంట కాపలా కాసి గట్టుకి దగ్గరలోకి, పడవలో గాని,తెప్పమీదగాని వచ్చిన వాళ్ళని పట్టుకుని పెద్దవాళ్ళకి అప్పజెప్పేవాళ్ళం. వీళ్ళెవరూ? పక్క పై ఊరివాళ్ళు, లేదా ఎదురుగట్టు ఊరివాళ్ళు. వీళ్ళనెందుకుపట్టుకోడం అని కదా అనుమానం. వరదవచ్చి గోదావరి తమ వైపుగట్టు తెగితే తమ ఆస్థిపాస్థులు పోతాయని ఎదురు గట్టుకి చిన్న చిల్లు చేసిపోతే,చూడకపోతే గండి పడిపోయినట్టే,వరద మా వైపుపోతే తమరు రక్షింబడాలని కోరిక. అందుకు కాపలా కాసుకునేవాళ్ళం. ప్రమాదం నుంచి రక్షించుకోడానికి చర్య తీసుకునేవాళ్ళం, ఎప్పుడూ మా ఊరు దగ్గర గండి పడలేదు,నేనెరిగి.

మరోమాట
అదో పల్లెటూరు. ఒక మాస్టారు ఆ ఊళ్ళో పుట్టి,పెరిగి,చదువుకుని టీచరై ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కలా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. పూర్వీకులిచ్చిన ఇంట్లో ఉంటూ. చాలా మంది శిష్య గణం చేరింది, పరిచయాలూ పెరిగాయి. ముగ్గురు కొడుకులు కలిగారు. పెద్ద కొడుకు ఊళ్ళో ఉంటే మిగిలినవారు దేశాలు, రాష్ట్రాలు పట్టిపోయారు, బతుకు తెరువు కోసం. భార్య గతించింది, ఒంటివాడైపోయి, పెద్ద కొడుకు దగ్గరే ఉండిపోయాడు, కాలం చేసాడు.

కొడుకులు,కోడళ్ళు, మనవలు,మనవరాళ్ళు, కావలసిన వాళ్ళంతా వచ్చారు, రోజులెళ్ళిపోయాయి. సంవత్సరం గిర్రున తిరిగొచ్చింది, మళ్ళీ అంతా చేరారు, కార్య క్రమాలు చేసారు, చివరిరోజు ఊళ్ళో అందరిని పిలిచి, రాత్రి భోజనాలెట్టేరు. ఊరి పంక్తి అయి తమ భోజనాలు పూర్తయ్యేసరికి రాత్రి మూడయింది, కొడుకులు,కోడళ్ళు, మనవలు,మనవరాళ్ళు అంతా భోజనాలు,వడ్డింపులు కార్యక్రమాల్లో అలసి ఎక్కడివాళ్ళక్కడే నిద్రపోయారు. తెల్లారింది శనివారం ఒక్కళ్ళూ లేవలేదు, మధ్యాహ్నమయింది, ఎవరూ లేవలేదు,నిద్రపోతూనే ఉన్నారు, నాలుగు రోజులనుంచి అలసి ఉన్నారు కదా! సాయంత్రం నాలుగ్గంటల వేళ ఒక్కొకరూ లేచి దంతధావనం కానిచ్చారు.

”మధ్యాహ్నం భోజనాలు లేవు, రాత్రికైనా…” అని ఒక కోడలంటే మరొక కోడలు, ”అబ్బా! నా వల్ల కాదే! ఏం వద్దే బాబూ” అంది. పెద్దకోడలు ”అదేం మాట ఏదో ఒకటి తినకపోతే ఎలా? మళ్ళీ రేపు ప్రయాణాలాయే” అంటే బుల్లి కోడలు, ”ఎలాగా శనివారమేగా ఏదో టిఫిన్ చేసుకు తినేద్దాం లెద్దురూ” అనడం, మొగాళ్ళు, ”ఏదో ఒకటి చెయ్యండర్రా” అనడంతో టిఫిన్ చెయ్యాలని నిర్ణయానికొచ్చేరు. ఏం చెయ్యాలీ అని చూస్తే ఒక అరటి కాయల గెల కనపడింది, ఒక శనగపిండి పేకట్ కనపడింది, కితంరోజు వాడి దింపిన కాగునూనె, బూరెల మూకుట్లో కనపడింది. బజ్జీలేసుకుందామే అన్నారొకరు. సరేనన్నారు. ఒకరు అరటి కాయలు తరిగేరు, మరొకరు శనగపిండి కలిపేరు, మరొకరు కాగు నూనె స్టవ్ మీదెక్కించి సిద్దం చేసేరు. మరొకరు బజ్జీలేసేరు. చట్నీ ఎదో చేసిందుంటే కానిచ్చేసేరు.అమ్మయ్య! తిన్నవాళ్ళకి తిన్నన్ని బజ్జీలు పెట్టేసి తోడికోడళ్ళు ముగ్గురూ కూచుని కబుర్లు చెప్పుకుంటూ బజ్జీలు తిన్నారు. ఇందులో పెద్దకోడలికి తినే వస్తువు ప్రతీది నోట్లోకి ఎగరేసుకోవడం అలవాటు. బజ్జీలు అలాగే తిన్నది. రాత్రికి అంతా మళ్ళీ నిద్రకి పడ్డారు.

రాత్రి గొంతులో ఎదో ఉన్నట్టనిపిస్తే రెండు సార్లు మంచినీళ్ళుతాగి, పుక్కిలించి ఉమ్మేసి, గొంతు గరగలాడించి ఏదో చేసి గడిపేసింది, ఆదివారం తెల్లారింది. సాయంత్రం ప్రయాణం, అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు, ఫ్లైట్ ఎక్కవలసినవాళ్ళు,రైళ్ళు మారవలసినవాళ్ళు, సద్దుకుంటున్నారు. పెద్దకోడలికి గొంతు వాచింది, గొంతులో ఏదో ఉన్నట్టే ఉంది, ఎవరికి చెప్పలేదు, మధ్యాహ్నం భోజనాల దగ్గర చూసేరంతా! ”ఏమయిందంటే,ఏమయిందన్నారు”, ”ఏమో తెలియటం లేద”ంది. భోజలయ్యాకా పక్కనే ఉన్న చిన్న టవున్ కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి నిర్ణయం చేసారు. అదృష్టంగా ఒక కొడుకు తెచ్చిన కారుంటే అందులో తీసుకెళ్ళేరు. ఆ చిన్న పట్టణంలో డాక్టర్లు ఉన్నారుగాని ఆరోజెవరూ లేరు, ఆదివారం అందునా సాయంత్రం. ఏం చెయ్యాలని అనుకుంటూ ఉండగా ఒక ముసలి డాక్టర్ గారు పని లేక,తోచక హాస్పిటల్లో కూచునుంటే ఆయన దగ్గరికి తీసుకుపోయారు. ఆయన వివరాలడిగి చూసి, ఏదో గొంతులో పెట్టి చూసి గొంతులో ఏదో ఉన్నట్టుందని చెప్పి, వైద్యానికి ఉపక్రమించి, వాంతికి మందు తాగించారు. వాంతిని జాగ్రత్తగా పట్టమన్నారు, బేసిన్ లో. రెండు సార్లు వాంతి చేయించిన తరవాత చూస్తే గొంతులో ఏమీ ఉన్నట్టు కనపడటం లేదు, ఇప్పుడు వాంతిలో వెతకమన్నారు.

వాంతిని క్షుణ్ణంగా వెతికేసేరు, నర్స్ అరిచింది ”ఆ దొరికింద”ని, ఏంటబ్బా అని చూసారంతా! అదే ఒక పక్క దగ్గరికి నొక్కుకుపోయి అందులో చిన్న బజ్జీ ముక్క చిక్కుకుని రెండవ పక్క సగం పైగా లేచి ఉన్న ”స్టాప్లర్ పిన్”. డాక్టర్ గారికి ఫీసిచ్చి, నమస్కారం పెట్టి. అయ్యయ్యో! ఎంత పని జరిగింది, చిన్న జాగ్రత తీసుకోకపోవడం, విచారించారు. ఎలా వచ్చి ఉంటుంది బజ్జీలోకి ఆలోచించారు,మరెలాగా బజ్జీలోకి వచ్చే సావకాశం లేదు, శనగపిండి పేకెట్ కున్న స్టాప్లర్ పిన్ కలిపిన పిండిలో పడి ఉంటుందని తీర్మానించేరు. శనగపిండి కలిపినవారు, ”పేకట్ విప్పివుందో, విప్పానో గుర్తులేదు. పేకెట్ కి ఉన్న పిన్ ఒకటి పిండిలో పడిపోయిందనమాట” అన్నది అంతా అవుననుకున్నారు.

మధ్యాహ్నం మొదలైన ఈ హడావుడి పూర్తయ్యేటప్పటి సాయంత్రం ఆరు గంటలైంది. ఈ లోగా అందరిలోనూ ఆతృత,ఏమయింది? ఏమవుతుంది, తమ ప్రయాణాలు సాగేనా, ఈవిణ్ణి ఒకత్తిని ఇలా వదిలేసి పోతే..ఎలా..? ఇలా ఆలోచనలు సాగిపోయి, అందరూ వ్యసన పడ్డారు.

చిన్న జాగ్రత్త, పిండి అలాగే పేకెట్ నుంచి పోసి కలిపెయ్యక, ఒక్క సారి జల్లించుకునుంటే….ఇలా జరిగేదా? నాస్తి జాగరతో భయం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతోనే ఉంటాయంటారా! అస్తు!! మీమాట నేనెందు కాదనాలి?

శర్మ కాలక్షేపంకబుర్లు- సూర్యగ్రహణం చూడటం తెలుసునా?

 సూర్యగ్రహణం చూడటం తెలుసునా? 

      ఉదయించే సూర్యుణ్ణి చూడద్దన్నారు, ఉదయించిన సూర్యుని చూడమన్నారు, పెద్దలు.సూర్యుణ్ణి నేరుగా చూస్తే కళ్ళుపోతాయి, తాత్కాలిక అంధత్వం కలుగుతుంది లేదా శాశ్వత అంధత్వమూ కలగచ్చు. అదే గ్రహణ సూర్యుణ్ణి చూసినా జరిగేది. సూర్య గ్రహణం చూడాలంటే ఫిల్టర్లు వగైరా వగయిరాలు కావాలి లేదా దూర దర్శన శాలకి పోవాలి. సామాన్యులు సూర్య గ్రహణం చూడలేరన్నదే నేటి వారి మాట.

పాత రోజుల్లో సూర్య గ్రహణాన్ని,పల్లెటూళ్ళలో కూడా చూసేవారు, ఉత్తి కళ్ళతోనే! ఎలా? ఇప్పుడు మీరూ చేయచ్చీ పని, ఇందులో సైన్స్ ఉందా? మనవారికి సైన్స్ తెలుసునా?

పెద్ద పళ్ళెం తీసుకోండి, దాని నిండా నీరుపోయండి. ఆరుబయట, నీడ పడని చోట పెట్టండి. ఒక రోకలి తీసుకోండి, దానిని నీళ్ళున్న పళ్ళెంలో నిలపండి. రోకలి నీడ పడే చోటుకు పక్కగా సూర్య బింబం యొక్క ప్రతిబింబం చూడండి. మీ కళ్ళ కి వేరు రక్షణ పరికారాలేం అక్కరలేదు, మేమంతా ఇలా సూర్య గ్రహణాన్ని ఇలా చూసినవాళ్ళమే! ఇది సైన్సవునో కాదో నాకు తెలీదుగాని, సైన్స్ ను జీవితంలోకి తెచ్చుకున్నామంతే!

సూర్యగ్రహణాన్ని ఇలా చూడచ్చన్న సంగతి తెలుసా? మన పూర్వీకులకి సైన్స్ తెలుసా?