శర్మ కాలక్షేపంకబుర్లు- పుట్టని బిడ్డకి పేరుపెట్టడం

అజాతపుత్ర నామోత్కీర్తన న్యాయం
అజాతం అంటే పుట్టనిది, నామోత్కీర్తన పేరుపెట్టడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే పుట్టని బిడ్డకి పేరు పెట్టడం. ఒక కొత్తగా పెళ్ళయిన జంట. భార్య గర్భవతి ఏమో అని, అనుమానం, నికరం కాదు. ఏ బిడ్డ పుడుతుంది? చర్చ ప్రారంభమయింది, ఇద్దరి మధ్య. మగపిల్లవాడని భర్త, కాదు ఆడపిల్లని భార్య, కొద్దిసేపు కీచులాడుకుని పేరేం పెడదామంటే, మా నాన్న పేరని భర్త, కాదు మా నాన్నపేరని భార్య, ఆడపిల్లయితే మా అమ్మ పేరని, కాదు మా అమ్మపేరని భార్య కీచులాడుకుని పొద్దుపోయేకా నిద్దరోయారట. తెల్లారి భర్త లేచేటప్పటికి భార్య పక్కన కనపడలేదు, బయట కొచ్చి చూస్తే ఆవిడ చాప, చెంబు పుచ్చుకు కూచుందిట 🙂 ……ఇదీ పుట్టని బిడ్డకి పేరు పెట్టడం తగువు. దీనినే ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అంటాం.కొనగల గేది పెట్టగల బచ్చలిపాదు తినేసినట్టు.

అంధగజ న్యాయం
గుడ్డివాళ్ళు ఏనుగు గురించి విచారించడం. నలుగురు పుట్టు గుడ్డివారు, ఏనుగు ఎలా ఉంటుంది అని చర్చ ప్రారంభించారు, ఎంతకీ ఏనుగు ఎలా ఉంటుందో ఒకరూ చెప్పలేకపోయారు, ఇంతలో అది వింటున్న మీలాటి బుద్ధిమంతుడు, వారిని ఏనుగు దగ్గరకు తీసుకుపోయి వదిలేసి, మీరిప్పుడు ఏనుగు దగ్గర ఉన్నారు, చూడండి అన్నాడట. చూపులేనివారు ఏo చూడగలరు? ఏనుగును తడమటం మొదలుపెట్టి, మొత్తానికి నలుగురూ ఏనుగును చూశామని సంతృప్తి చెందారట. ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలయ్యింది, ఒకడు ఏనుగు స్థంభం లాగా గుండ్రంగా ఉందన్నాడు, మరొకడు సన్నగా పొడుగ్గా కదులుతూ ఉందన్నాడు, మరొకడు భూమి కి ఎత్తుగా చిన్న తోకలా ఉందన్నాడు మరొకడు, ఇలా, ఎవరికి తోచినది వారు చెప్పేరు తప్పించి అసలు ఏనుగు ఎలా ఉంటుందో ఒక్కరికి తెలియలేదు, చెప్పలేకపోయారు. దీనిని బట్టి తెలిసేది, చూపు లేక వారెలా ఏనుగును చూడలేకపోయారో మిధ్యా చదువులు, విజ్ఞానం ఉన్నవారు విషయం యొక్క అసలు రూపాన్ని, సత్యాన్ని తెలుసుకోలేరని, మిధ్యావాదమే చేస్తారని దీని పిండిత, పండితార్ధం.

అభావవిరక్తి న్యాయం
అభావం అంటే భావం లేకపోవడం, విరక్తి అంటే కోరిక లేకపోవడం. నిజానికి దీనిని అందని ద్రాక్ష పుల్లన అని తెనుగులో చెప్పుకోవచ్చు. అబ్బ! చీరెంత బాగుందో! భావం, ఎంతయ్యా ఖరీదు? తక్కువేనండి ఐదువేలు. అబ్బ ఇంత బరువుగా ఉంది, ఐదు వేలెట్టి కొనుక్కుని ఇంత బరువెలా మోస్తాం బాబూ! విరక్తి. అసలు సంగతి ఐదు వేలెట్టి ఆ చీర కొనే స్థోమతు ఆమెకు లేదు, అందుకే విరక్తి. ఆ చీరే కనక రెండు వేలంటే ఆవిడ ఎగిరి గంతేసి కొనేసేది. ఇది మనసు చేసే చిత్రం, అందని ద్రాక్ష పుల్లన కదా.! అదే ఇది.ద్రాక్ష పళ్ళకోసం ఎగిరిన నక్క అవి అందకపోయే సరికి పుల్లగా ఉంటాయని విరక్తి పెంచుకున్నట్టు.

కులాలచక్రన్యాయం
కులాలుడు అంటే కుమ్మరి. చక్రం అంటే తెలిసినదే కదా! బండి చక్రం కుండలో ఇరుసు ఇండగా బూమిపై నిలబడుతుంది. దొర్లిస్తే కొంత దూరం ప్రయాణమూ చేస్తుంది. మరి కుమ్మరి చక్రం చూశారా! కుండలో ఇరుసు భూమిలో పాతి ఉంటుంది, తిప్పితే ఇప్పుడూ ఈ చక్రమూ తిరుగుతుంది, కాని ఎక్కడికీ ప్రయాణం చేయదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది. దీనినే గానుగెద్దు జీవితం అంటాం. చేసిన పనే చేస్తూ తిరిగినచోటే తిరుగుతూ తిన్నవే మళ్ళీ మళ్ళీ మళ్ళీ తింటూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఛస్తూ ఉంటాం. అదనమాట కులాల చక్ర న్యాయం.

మరిన్ని మరోసారి….

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- పుట్టని బిడ్డకి పేరుపెట్టడం

  1. శర్మ గారూ ,

    నమస్తే .

    ఈ మధ్య గత 4 రోజులుగా ఉదయం వ్రాసిన నా వ్యాఖ్య మీ బ్లాగులో ప్రచురణకు నోచుకోవటం లేదు . ఏదో వర్ద్ ప్రెస్ పొరపాటు అని వస్తున్నది . రాత్రికి నాకున్న ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ప్రచురణకు అర్హత పొంది అనుమతికై వేచి వుంటున్నది . ఎందువలననో అర్ధం కావటం లేదు . ఐతే ఒక్కటి ఆనందం . రాత్రికైనా అవకాశం లభిస్తున్నందులకు .

    • శర్మాజీ,
      కామెంట్ల సెక్షన్ మొత్తం తీసేద్దామనుకున్నా. ఆ తరవాత మనసు మార్చుకుని ప్రతి కామెంట్ ని అప్రూవ్ చేసిన తరవాతే కనపడేలా చేశాను. ఈ మధ్య నాకు కూడా బ్లాగు ఇబ్బంది పెడుతోంది, వైరస్ ఏమైనా చేరిందేమో తెలీదు.
      నెనరుంచాలి.
      ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడు దేవుడా.

  2. శర్మ గారూ ,

    శుభోదయం .

    ఈ అధునాతన ప్రపంచంలో చాలా మంది రకర్కాల సామెతలను వాడుతూనే వుంటుంటారు , కాకుంటే అవి ఎలా పుట్టాయో , అందులోని అంతరార్ధం ఏమిటొ తెలియనే తెలియదు . సందర్భాన్ని బట్టి వాడుతుంటుంటారు , అన్వయిస్తుంటారు .

    వాస్తవానికి ఈ సామెతలన్నీ కూడా స్వానుభవంలో నుంచి జన్మ తీసుకున్నవే . వీటి వయసు యింత అని చెప్పలేని పరిస్థితి . ఇవి మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతాయి మన జీవకోటి జీవితాల్లా కాకుండా .

    మీరు వాటి పుటకలని విపులంగా వివరించటం చక్కగా ఆనంద దాయకంగా వుంది . ఎంతో మందికి వుపయోగపడ్తుంది .

    • శర్మాజీ,
      వీటిని సంస్కృతంలో న్యాయాలంటారు, అంటే జీవిత సత్యాలు, అనుభవంతో వచ్చినవే. వాటిని మనం తెనుగులో సామెతలు, నానుడులు అంటాం. సంస్కృతం చెబితే భయంగా ఉంటుంది, తిలకాష్ట మహిషబంధనం లాగా.తెనుగులో తియ్యగా ఉంటుంది.
      నెనరుంచాలి.
      ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడు దేవుడా.

  3. శర్మ గారికి పాదాభివందనం. మీ టపాలు ద్వారా ఇలా నాకు తెలియని మంచి విషయాలు ఎన్నెన్నొ తెలుసుకోగలుగుతున్నాను.ధన్య వాదములు. మీ కీబోర్డ్ నుంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో మంచి టపాలు జాలువారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    http://www.veerublog.blogspot.in

    • వీరేందర్ గారు,
      చిరాకొస్తోందండీ! దగ్గరగా మూడేళ్ళుగా రాస్తున్నా రోజూ. విరమించాలనే ఆలోచన బలంగా నాటుకుపోయింది.
      నెనరుంచాలి.
      ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడు దేవుడా.

వ్యాఖ్యానించండి