శర్మ కాలక్షేపంకబుర్లు- సింగినాదం-జీలకఱ్ఱ.

సింగినాదం-జీలకఱ్ఱ.

ఈ మధ్య ఒంట్లో బాగోలేదు కదా! సుగర్ పెరిగిపోయి డాక్టర్ దగ్గరకి ప్రదక్షిణలు మొదలెట్టాల్సివచ్చింది. “దరిద్రుడు ఏ రేవుకెళ్ళినా ముళ్ళపరిగే పడిందని”, “దరిద్రుడు తలకడిగితే వడగళ్ళవాన ఎదురయినట్టు”, అని రెండు సామెతలు ఒకలాటివే, నాలాటివారి గురించే చెప్పి ఉంటారు..  డాక్టర్ తో 15 న తీసుకున్న అపాయింట్మెంట్ కేన్సిల్ అయింది, ఆయన ఊరెళ్ళడంతో.అందుకు కొంత మానసికంగా కూడా ఇబ్బంది కలిగింది, దానితో ఉయ్యాలలో కూచుని ఉండటమే చేస్తూవచ్చాను, ఆ సందర్భంగా ఇల్లాలు, కుంటుకుంటూవచ్చి దగ్గర కూచుని
“ఏం? అలావున్నారు” అని ఆరాతీసింది, 
“బానే వున్నా,నీ కాలెలా ఉందీ?” అని అడిగేను.” 
“నాకాలు బానే ఉంది, బొబ్బలు తగ్గేయి, పడింది వేడిపాలు కదా? మందులేసుకుంటున్నాకదా? చాలా మేలు,కలబంద రాసేనంటే డాక్టర్ మంచిపని చేసేరు, అదే రాస్తూ ఉండమన్నారు. కలబంద బాగా పని చేసింది. అది సరే గాని, మాట మార్చేస్తున్నారు,పొద్దుటినుంచి రాత్రి దాకా వదలిపెట్టకుండా కంప్యూటర్ దగ్గరే ఉండేవారు, దాని వైపే వెళ్ళటం లేదు, ఏంటి విశేషం, ఎవరితోనయినా దెబ్బలాడేరా? ఎవరేనా తిట్టేరా?” అని బుజ్జగిస్తూ,ఆరాతీసింది
నవ్వి, “నేనెవరితోనయినా దెబ్బలాడగలనో లేదో నీకు తెలీదా? ఇక నన్ను తిట్టేవాళ్ళెవరూ లేరనుకుంటా,  నన్ను తిట్తుకునేవాళ్ళుంటే అది వాళ్ళ కర్మ, నేనెవరిని ఎప్పుడూ తిట్టలేదు, తిట్టలేనుకూడా, నా బలహీనత నీకు తెలుసు కదా.ఈ ముసలాయన బుఱ్ఱ తినేస్తున్నాడు రోజూ టపాలతో అని, విసుక్కుంటున్నారేమో తెలీదు,” అని ఊరుకున్నా.  ” మూతి ముడుచుకు కూచుంటే మనసులో మాటెలా అర్ధమవుతుందమ్మా,ఏభయి ఏళ్ళనుంచి కాపరం చేస్తున్నా! నాకు తెలీదా మీ సంగతి…లేదు! ఏదో తేడా ఉంది, చెప్పటం లేదు, సరే లెండి, చెప్పకపోతే మీ జట్టు కచ్చి! కచ్చి!!” అంటుంటే “మామ్మా! ఏంటే తాతంటున్నారూ” అంటూ వచ్చింది మనవరాలు.

“సింగినాదం జీలకఱ్ఱ, నీకెందుకే మా సంగతులు ఆయ్(” అని మవరాలిని సరదాగా కసిరింది.
మనవరాలు తక్కువదా? “తాతా! మామ్మ సింగినాదం జీలకఱ్ఱ అంది ఏంటో చెప్పవా” అని ఒళ్ళో కూచుంది.

అన్ని వస్తువులూ అన్ని చోట్లా పండవు, అక్కడ దొరకవు. పాత రోజుల్లో అంటే మా చిన్నప్పటిరోజుల్లో కొన్ని కొన్ని వస్తువులు, నిత్య జీవితానికి కావలసినవి, పై ఊళ్ళనుంచి పడవ మీద కాని, బండి మీద గాని తెచ్చి ఊరివారికి అమ్మి సొమ్ము పట్టుకుపోయే ఆచారం ఉండేది. ఇలా అమ్మే వస్తువులలో ఉప్పు, జీలకఱ్ఱ, టీ, కాఫీ ఉండేవి. ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్రచారం ఉండేది. ఈ జీలకఱ్ఱ అమ్మేవారు సాధారణంగా పడవ మీద తెచ్చేవారు, కాలవ, నది సౌకర్యం లేని చోటికి బండి మీద పట్టుకుపోయేవారు. ఆ ఊరు చేరిన తరవాత ఈ సరుకు తీసుకొచ్చినట్టుగా ప్రజలకు తెలిసేందుకు గాను ఒక్కో ప్రచార సాధనం వాడేవారు. అలా జీలకఱ్ఱ తెచ్చిన వారు శృంగనాదం అనగా కొమ్ము బూరా ఊదుకుంటూ ఊళ్ళో తిరిగేవాడు. శృంగనాదం దేనికి అనిఅడిగితే జీలకఱ్ఱ అమ్మకమని చెప్పడం అలవాటవడంతో. శృంగనాదం జీలకఱ్ఱ కాస్తా సింగినాదం జీలకఱ్ఱ అయి కూచుంది ప్రజల నోట. ఇది కాల క్రమేణా సింగినాదం జీలకఱ్ఱగా గా వాడుకలో ఉండిపోయింది. ఈ ఊత పదం దొరికింది, ప్రజలికి, ఏం లేదు అని చెప్పడానికి వాడుతున్నారు.

ఇక ఉప్పు అమ్మకానికి బండి మీద కాని నావ మీద కాని తెచ్చేవారు. ఒకడు ఉప్పో అని అరుస్తూ పోయేవాడు వీధి వెంట, వాడి వెనక బండి వస్తే సరి లేకపోతే రేవుకి పోయి తెచ్చుకోవలసిందే.

టీ, కాఫీ లు అప్పుడే ప్రచారంలో కొస్తున్న రోజులు, బ్రూక్ బాండ్ వారు గుర్రపు బళ్ళమీద ఏజంట్ ను సరుకును పంపేవారు, పల్లెలకి. ఆ రోజుల్లో గుర్రపుబండి ఊళ్ళోకి రావడమే పెద్ద ప్రచారం, దానికి తోడు ఆ బండి నిండా కంపెనీ ప్రచార సామగ్రి అంటించి ఉండేది. ఈ బండిని ఊరివెంట తిప్పుతూ చక్రంలో తోలుకర్ర ఉంచితే టక  టక మని లయబద్ధమైన శబ్దం వచ్చేది, అదే కాఫీ అమ్మకానికొచ్చినట్లు గుర్తు. ఆ తరవాత లిప్టన్ కంపెనీ వారు కూడా ఇదే కొన సాగించారు. మరో కంపెనీ అగ్గిపెట్టెలు తెచ్చేది, గుర్రపు బండి మీద. దీనిని ”అగ్గి డెక్క” అనేవారు. ఆ అగ్గిపెట్టెపై కళ్ళెం ఉన్న గుర్రం మొహం నాడాలో ముద్రింపబడి ఉండేది. ఇప్పటికీ ఈ కంపెనీ ఉంది, అగ్గిపెట్టెలూ ఉన్నాయి,అదే వింకో.
అని చెబుతుండగా ఊ కొడుతూ చిన్నతల్లి, ఎప్పుడో నిద్రపోయింది, నా ఓడిలో.

“సిగ్గులేని ముఖానికి నవ్వే సింగారం.”

 

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- సింగినాదం-జీలకఱ్ఱ.

  1. సిగ్గేలా నా మొహానికి?
    మేకప్పుతో నవ్వుతూంటే కెమెరాలో
    కాపీ ఏంటని అడిగేవా
    నవ్వే నా దరిద్రగొట్టు మొహానికి సింగారం

    మేష్టారూ ఇది ఎవెర్ ఈ గురించి రాసానో మీకూ తెలుసు ఆ టపాలు దొబ్బే దానికీ తెలుసు. ఎదవ మొకానికి టివీ ఉద్యోగం ఒకటి. దీని బసులు కూడా అలాంటి వాళ్ళే కాబోలు లెండి. దొందూ దొందూ కొందప్పే.

వ్యాఖ్యానించండి