శర్మ కాలక్షేపంకబుర్లు-జీవశ్చ శరదాం శతమ్..

జీవశ్చ శరదాం శతమ్...

నూరు శరత్తులు జీవించుదుముగాక! ఇదేంటీ అనచ్చు. నూరు శరత్తులు అంటే నూరు సంవత్సరాలు జీవించుదువుగాక అని ఆశీర్వచనం. ఎంత మంది నిండు నూరేళ్ళూ బతుకుతున్నారు? ఒక వేళ బతికినా ఆరోగ్యంగా ఉంటున్నారు ఇదీ అసలు ప్రశ్న.

ఈ మధ్య ఒక వార్తలో జస్టిస్ కృష్ణయ్యర్ నూరు సంవత్సరాలు జీవించారనీ, ఆరోగ్యంగానే ఉంటూ కాలం చేశారని వార్త చదివుతూ, కొన్ని విశేషాలు గమనించా ఆ వార్తలో. పాత కాలంలో వార్త రాసినవారి పేరూ ఉండేది, పేపర్లో, మరిప్పుడు ఈ కాలంలో అదెందుకు తొలగించేరో తెలియదు, బహుశః సంచలన వార్తలకి, వార్త రాసినవారి పేరు అవసరం లేదనుకుంటా. ఈ వార్త రాసినతను/ఆమె పాత కాలపు మనిషై ఉండి ఉండచ్చనిపించింది.వార్తలో కృష్ణయ్యర్ గారి ఆహారపు అలవాట్లు రాస్తూ ఉదయం భోజనం చేసేవారు, మధ్యాహ్నం వేడిగా టిఫిన్ చేసేవారు, విశ్రమించేవారు, రాత్రి కొద్దిగా ఆహారం తీసుకునేవారు, సాయంత్రం నడచేవారు అని. ఇందులో వింతేముంది? అనికదా అనిపిస్తుంది. నిజానికి ఉన్నదంతా అదే!

వాగ్భటుడని ఒక వైద్యుడు, మన దేశం వాడే, చరకుడు గుర్తున్నాడా?  మహానుభావుడు, ఆయన శిష్యుడు ఈ వాగ్భటుడు. ఈయన మనకు వచ్చే సాధారణ రోగాలలో నూటికి ఎనభై రోగాలను మనమే తగ్గించుకోవచ్చని, మిగిలినవాటికోసమే వైద్యుని అవసరమనీ చెప్పేరు. దానికి తోడు మన దిన చర్య ఎలా ఉండాలో కూడా చెప్పేరు.తెల్లవారు గట్ల బ్రాహ్మీ ముహూర్తం లో లేవమన్నారు. ఆ హారం గురించి చెబుతూ ఉదయమే తొమ్మిదిలోపు కడుపు నిండా తినమన్నారు, ఆ తినడం కూడా ఒక్కఒకరికి ఒక్కొక పద్ధతీ చెప్పేరు. కాయ కష్టం చేసేవారు గొంతుకూచునిభోజనం చేయాలన్నారు, మరో దాన్లోకి పోతున్నామా, వెనక్కొద్దాం. ఉదయం లేవగానే పరగడుపున, ముఖం కడగకుండా, రాత్రి రాగి చెంబులో నిలవ ఉంచిన నీరు తాగమన్నారు, అదీ ఎలా గుటక,గుటకగా తాగమన్నారు. ఉదయం కడుపునిండా తినాలి. మధ్యాహ్నం ఉదయం తిన్నదానిలో మూడో వంతు తగ్గించాలి,మధ్యాహ్న భోజనం తరవాత ఒక కునుకు తీయాలి. సాయంత్రం సూర్యాస్తమయం లోపు ఉదయం తిన్నదానిలో రెండు వంతులు తగ్గించి తినాలి, ఇంకా తినాలనిపిస్తే పళ్ళు కాని, పాలు కాని తీసుకోమన్నారు. ఆహారం తీసుకున్న ప్రతిసారి గంటన్నర తరవాత కడుపునిండా నీళ్ళు తాగమన్నారు. రాత్రి తొందరగా పడుకోమన్నారు, 

మరి కృష్ణయ్యర్ గారి సంగతేంటీ? అయ్యర్ గారు కదా మాంసాహారి కాదు, ఉదయమే కడుపునిండా తినడం, మధ్యాహ్నం మూడో వంతు తగ్గించడం, రాత్రి ఉదయం తిన్నదానిలో మూడూ వంతే తినడం కదా ఆయన చేసినది, అదీగాక ఆయన సూర్యోదయానికి ముందే నాలుగు గంటలకే లేచేవారట. మధ్యాహ్నం కొద్దిగా విశ్రమించేవారట. అందుకే ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్ళూ జీవించారు. మరి మనమో

సూర్యోదయానికి ముందు లేచిన పాపాన ఎప్పుడూపోలేదు, చిన్నప్పటినుంచీ. ఉదయించిన సూర్యుని చూడాలి, ఉదయిస్తున్న సూర్యుని చూడకూడదు,అస్తమిస్తున్న సూర్యుడినీ చూడకూడదు, మనం రెండూ చెయ్యమనుకోండీ. ఉదయం తొమ్మిదికి లేస్తాం, మొహం తొలుస్తాం, కాఫీ పోస్తాం పొట్టలో, ఆరారగా, కుడితిలాగా, ఉదయం లేస్తే కదా మంచి నీళ్ళు తాగడానికి. ఇలా ఉదయమే మంచి నీళ్ళు తాగితే మల విసర్జన సులభమవుతుంది. అసలు రోగాలన్నిటికి మూల కారణం, మలవిసర్జన సరిగా లేకపోవడం. డాక్టర్ దగ్గర కెళ్ళి తలనొప్పి వస్తూందంటే టెస్టులు చేయించి, తలనొప్పి రాకుండా మందిస్తాడు కాని రోగానికి మూలమైన సుఖ విరేచనం లేకపోవడం కారణమని చెప్పడు. ఆ తరవాత లైట్ గా టిఫిన్ చేస్తాం, స్నానిస్తాం, ఆఫీస్ కి పరుగెడతాం. రోజూ విరేచనమే కాదు, విరేచనమయితే ఆరోజు పండగ. చల్లటి నీళ్ళు,ఫ్రిజ్ లో పెట్టినవి మాత్రమే తాగుతాం, అదో ఫేషనూ. చల్లటి నీళ్ళు తాగద్దు, ఫ్రిజ్ లోవి అసలు తాగద్దని ఎవరు చెప్పినా వినం. ఈ చల్లటి నీళ్ళే విరేచనం కాకుండా ఉండడానికి కారణమని గుర్తించం. బజారు చిరుతిళ్ళు ఆప్యాయంగా తింటాం, వద్దని చెప్పినవాళ్ళని వెఱ్ఱివాళ్ళలా చూస్తాం. మనకి ఆరోగ్యం ఎందుకుంటుంది?ఆఫీస్లో మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోది తింటాం. రాత్రి పది దాటాకా కడుపునిండా తిని పడుకుంటాం. మరి ఇదంతా అసలుకి వ్యతిరేకమే కదా!సాధారణంగా మన శరీరం పునరుద్ధరణ, పునరుజ్జీవ కార్యక్రమాలు రాత్రి పూట మనం నిద్రలో ఉండగా చేస్తుంది. రాత్రి కడుపు నిండా తిని పడుకుంటే శరీరం పునరుజ్జీవ, పునరుద్ధరణ కార్యక్రమాలను వాయిదా వేసి ఈ ఆహారాన్ని పచనం చేసే పని లోనే ఉండిపోతుంది. అప్పుడేమవుతుంది? శరీరం తెగుళ్ళబారిన పడుతుంది. మరో సంగతి కూడా రాత్రి పన్నెండులోపు గాఢమైన నిద్ర రెండు గంటలైనా శరీరానికి సరిపోతుంది. మరి మనం అలా చేస్తున్నామా? ఆలోచించండి. శరీరం వ్యాధిని తట్టుకునే వ్యాధి నిరోధక శక్తిని మనమే నిర్వీర్యం చేసేస్తున్నాం, గుర్తించండి. పాతికేళ్ళకే సుగర్, కళ్ళజోడు, ముఫైకి బి.పి ,నలభైకి బైపాస్, అదృష్టం కలిసిరాకపోతే కేన్సర్, అందుకే అరవై వచ్చేటప్పటికే టపా కట్టేస్తాం.నాకు రోజూ ఉదయం నడకలో ఒక మిత్రుడు కలుస్తాడు, బలే చకచకా నడిచేస్తారే మూడుపాతికల వయసులో కూడా, ఏంటీ మీ ఆరోగ్య రహస్యం అంటాడు. అతనికి ఏభై వయసు ‘నీకేప్’ వేసుకుని కుంటుతూ నడుస్తాడు, తప్పక. ‘మాంసాహారం మానెయ్యవయ్యా’ అన్నా! ‘అమ్మో కుదురుతుందాండీ’ అన్నాడు. ఉదయం లేస్తాడు పాపం కష్టపడి నడుస్తాడు, ఆ తరవాత షరా మామూలే! మార్గం చెప్పమన్నాడు, చెప్పేను, ఆచరిస్తే ఆనందం, ముందు బరువు తగ్గుతాడు, ఆ తరవాత మిగిలిన మార్పులొస్తాయి.

మార్పు సాధ్యమా! తల్చుకుంటే సాధ్యమే!! మార్పు చేసుకు చూడండి ఆరోగ్యం ఎలా ఉంటుందో!!! అప్పుడు నూరేళ్ళు గేరంటీ….

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవశ్చ శరదాం శతమ్..

  1. జీవితమంతా ఇట్లా తినడం గురించే (అంటే ఎట్లా తినడం అంటూ!) ఆలోచిస్తే ఇక జీవించేది ఎప్పుడండీ !!

    జేకే!

    జిలేబి
    (పరార్!)

    • జిలేబిగారు,
      మంచి ప్రశ్న వేసి పరార్ ఎందుకు?
      ఏదో ఒకటి, ఎప్పుడో ఒకప్పుడు,ఎంతోకొంత, ఏలాగో ఒకలా తినేస్తే, సంచిలో కుక్కినట్టు, సరిపోతుందనుకుంటే చిక్కేలేదు. అలా చేస్తున్నాం కనకే ఇన్ని తెగుళ్ళు, మందులువాడకమూ, ’శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్’ మరి అటువంటి శరీరాన్ని౯ ఆరోగ్యంగా ఉంచుకోవాలి కదండీ, అందుకు ఇటువంటివన్నీ తప్పవు.
      ధన్యవాదాలు.

  2. చక్కటి విషయాలను తెలియజేసారు.
    ………….
    పల్లె ప్రపంచం లో ప్రచురించిన మీ ఇంటర్వ్యూ చాలా బాగుందండి.ఆ సంభాషణలో అనేక విషయాల గురించి చెబుతూ, నా గురించి కూడా ప్రస్తావించినందుకు మీకు కృతజ్ఞతలండి.
    ……..
    కొన్ని కారణాలవల్ల ,ఈ మధ్య నేను ఇతరుల బ్లాగులలో తరచుగా వ్యాఖ్యలను వ్రాయటం లేదు. ఇందుకు దయచేసి అపార్ధం చేసుకోవద్దు.
    ఇంటర్వ్యూలో.. మీరు నా గురించి కూడా ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు చెప్పాలని ఇప్పుడు వ్యాఖ్యను వ్రాస్తున్నాను. ఇంటర్వ్యూ చేసిన కొండలరావుగారికి కూడా కృతజ్ఞతలు.
    …………..
    ఫేస్ బుక్ లో మీ గురించి..ఒకామె తన ఇష్టం వచ్చినట్లు వ్రాసినట్లు చదివి చాలా బాధనిపించింది. ఆమె అలా వ్రాయటం చాలా దారుణం.
    ఇక మీదట ఇలాంటివి జరగకూడదని ఆశిద్దామండి.

    • అనురాధ గారు,
      అమ్మాయ్! ఈ మధ్య బ్లాగుల్లో కనపడకపోతే……కుశలంకదా!
      చాలా ముఖాముఖీలయ్యాయి, మళ్ళీ కొండలరావు గారడిగితే కాదనలేకపోయా…..ఇదో బలహీనత…..
      ఆ ఉదంతం మరిచిపోదామనే ప్రయత్నం. ఇప్పుడు చెప్పక తప్పలేదు…
      ధన్యవాదాలు.

  3. అనారోగ్యానికి కారణాలు, అలవాట్లు, అంటురోగాలూ !
    అలవాట్లకు కారణాలు , అవగాహన లోపం, నిరాసక్తత !
    అంటురోగాల కు కారణాలు , అజాగ్రత్తా , నిర్లక్ష్యమూ !
    మరణాలకు కారణాలు , అనారోగ్యమూ , ప్రమాదాలూ !
    ప్రమాదాలకు కారణాలు , నిర్లక్ష్యమూ , బాధ్యతా రహితమూ !

    • సుధాకర్ జీ,
      సత్యం చెప్పేరు. అశ్రద్ధ, అజాగ్రత…ఇవన్నీ అనారోగ్యానికి మూల కారణాలు. శరీరం మనం చెప్పినట్టే వింటుంది, మనమే సరిగా చెప్పం…అదీ సంగతి..
      ధన్యవాదాలు.

    • శ్రీనివాస్jI
      ఆరోగ్యమే మహా భాగ్యము……… ఎంత చెట్టుకు అంత గాలి…….సంతోషము సగము బలము….చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ….అస్తు తప్పక ఆచరించి ఆరోగ్యం పొందండి…ఆరోగ్యమస్తు…ఆయుష్యమస్తు…
      ధన్యవాదాలు.

    • వర్మాజీ,
      బాధయినా పడతాం తప్పించి, చెప్పినమాట విని సుఖపడమనే అంటున్నారండి… 🙂 చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ….అన్నారు కదండీ……ఇప్పుడెందుకు చెప్పేనూ…. ఎదురుగా ఒక దృష్టాంతం కనపడింది కనక..
      ధన్యవాదాలు.

  4. చాలా బాగా చెప్పారు సార్.ఇప్పుడు చాలా మంది మేము రాత్రి 11కు పడుకుని ఉదయం 7కి లేస్తాం అంటూ ఏదో గొప్ప గా చెప్పుకుంటారు. సూర్యోదయానికి ముందే లేచి ఆ సమయం లోని ప్రశాంతతని అనుభవిస్తే రోజంతా ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకునే శక్తి వచ్చేయదూ.

    • chitralaxman గారు,
      మీరూ నా పార్టీ మనుషుల్లా ఉన్నారే 🙂 అనుభవించాలండి, ఎంత బాగుంటుందో! మంచి అలవాటు చేసుకోడానికి ఒక మండల కాలం పడుతుంది. మండలమంటే నలభై రోజులు. ఉదయమే నాలుగుకి లేవడం కష్టపడి అలవాటు చేసుకుంటే ఆ తరవాత చాలా నిశ్చయంగా నాలుగుకి ఎవరో కొట్టి లేపినట్లు సరిగా నాలుగుకి మెలుకువ వచ్చేస్తుంది. శరీరం బలేగా ప్రవర్తిస్తుంది. Beautiful working of body clock.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి