శర్మ కాలక్షేపంకబుర్లు-కామెంటిన కనకాంగి కోక……

750th Post

కామెంటిన కనకాంగి కోక……

“కామెంటిన కనకంగి కోక కాకెత్తుకుపోయింది”. “మనం రాస్తే ఊరికి ఉపకారమా? రాయకపోతే దేశానికి నష్టమా?”, “కొట్టుకొచ్చిందా?పట్టుకొచ్చిందా?” ఇదిగో ఇటువంటి కామెంట్లు ఒకప్పుడు బ్లాగ్ లోకంలో బహు ప్రాచుర్యంలో ఉండేవి, బ్లాగ్ లోకాన్ని ఉఱ్ఱూతలూగించాయి కూడా. ఇలా కామెంట్ చేసేవారిని అనుసరించి, వారు చదివిన కామెంట్ చేసిన టపాలను చదవడం కూడా కొంతమందికి అలవాటుగానూ ఉండేది. నాడు ఉన్నది సరదా, మరి నేడున్నది తగాదా, పిడివాదం,వ్యర్ధ వాదం.

పాతరోజుల్లో తగాదాల్లేవా? లేకేం ఉన్నాయి త్వం అంటే త్వం అనుకునే స్థాయిలోనే ఉండేవి, పాత రోజుల్లో కూడా అప్పుడపుడు త్వం అనుకున్న సంఘటనలూ కనపడతాయి. మానవ మనస్తత్వం ఆనాడు, ఈనాడు, ఏనాడూ మార్పు చెందనిది. నేడు ఎవరిని కదిలించినా కరుస్తా, నరుకుతా, పొడుస్తా, చంపుతా అనే అంటున్నారు, అసహనం, పిడివాదం పెరిగిందేమో అనిపిస్తుంది. వాదాన్ని ఎక్కడ ఆపాలో తెలియక బాధపడుతున్నారు, ఇరు పక్షాలూ.

వ్యాఖ్య, విమర్శ, ఖండన,మండన, కామెంట్ అనేవన్నీ ఒకలా కనపడే మాటలే కాని, తేడా ఉన్నట్టు ఉంది. వ్యాఖ్య అన్నది చెప్పిన విషయాన్ని విశదీకరించడమే అవుతుంది. “అహం బ్రహ్మస్మి”, ఇది మహా వాక్యం. ’నేను దేవుడిని’ అని కదా! మరి, నేను ఎవరు? నేను దేవుడిని ఎలా అయ్యాను? ఇలా దీనినుంచి కలిగే సందేహాలను నివృత్తి చేసేదే వ్యాఖ్య. వ్యాఖ్య అన్నది ఇదిప్పుడు పుట్టినదే కాదు, పాత కాలంలోనూ ఉన్నదే. వ్యాఖ్య మూలంగా, మూలంలో చెప్పినవి, మరింత ప్రకాశించినవీ ఉన్నాయి. వ్యాఖ్య ముఖ్యోద్దేశం ఉన్నదానిని వివరించడమే. ఇలా వ్యాఖ్యలుగా పెద్ద పెద్ద గ్రంధాలే రాశారు, మనవారు. ఈ వ్యాఖ్య చేసేవారు రాసినవారికి సమానమైన విషయ పరిజ్ఞానం ఉన్నవారు, లేదా అంతకంటే విషయం గురించి ఎక్కువ తెలిసినవారయి ఉండాలి.

ఇక విమర్శ. ఇది రెండచులా పదునైన కత్తి. విమర్శ చేసేవారు, రాయబడిన విషయంలో గుణ,దోషాలను సమతుల్యంగా చెప్పగలిగి ఉండాలి. గుణం లో దాగి ఉన్న మర్మాన్ని వివరించాలి, దోషాన్ని కూడా చెప్పాలి, ఎక్కడ, రాసినవారు పొరబడ్డారన్నదీ చెప్పాలి, శైలి, శయ్య గురించి కూడా చెప్పాలి. పాకంగురించీ మాటాడాలి. లేదా దానిని ఎలా చెబితే బాగుండి ఉండేదో చెప్పాలి. నిస్పాక్షికంగా ఉండాలి.ఇదీ విమర్శ లక్షణం, స్థూలంగా. అలా కాకుండా ఒకపక్కనే చూస్తే, చేసేది విమర్శ కానే కాదు. ఇందులో రాసినవారి వ్యక్తిత్వాన్ని కించపరచేలా విమర్శించడం చాలా తప్పు. కాని తరతరాలుగా విమర్శ చేస్తున్నవారంతా చేస్తున్న తప్పే అది, వ్యక్తిత్వాన్ని కించపరచడం. ఎవరు చేసినది, చేస్తున్న పని, వారికి ఇంపుగా, అందంగా కనపడటం మామూలైపోయింది. తాము చెప్పినదే నిజమనుకోడం, అదే వేదమనడం, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళనడమూ, రాసినవారిని హేళన చేయడమూ జరుగుతున్నది. కొంత మంది రచయితలు, ఎక్కువమంది ప్రజలు నమ్మేవాటిని విమర్శ చేయడమూ జరుగుతోంది, ఎప్పుడో పూర్వ కాలంలో జరిగినవి, నాటికి ధర్మాలు, నేటికి కాదు. అందునా వారేమీ దాచుకో లేదు. ‘ఇతిహాసం’ అంటే ఇలాజరిగిందీ అని, ఉన్నది ఉన్నట్టు చెప్పేరు. తప్పులు జరిగితే అదీ చెప్పేరు, దాచుకోలేదు నేటివారిలాగా. నేడు కూడా జరగ కూడనివి జరుగుతున్నాయా లేదా? పూర్వకాలం వాటిని హేళన చేయడం ఎందుకూ? విమర్శ ముసుగులో. ఎవరూ తమ పెద్దలను సంస్కృతిని మార్చుకోలేరు, ముసుగేసుకోవచ్చేమో కాని. ఇటువంటి పనులు, మనలను మనమే విమర్శించుకోవడం, కించ పరచుకోవడం అవుతుంది. ఇది ఒక మానసిక వికారం, అంతే.ఇదో తుత్తి.ఎదుటివారు బాధపడుతుంటే చూసి ఆనందించడాన్ని ఏమంటారో నాకైతే తెలీదనుకోండి. ఇది ఇప్పటివారికేవ్పుట్టినదా? మరి కామెంట్ ఎందులోకి జేరుతుంది? మనం చేస్తున్నది వ్యాఖ్యా? విమర్శా? ఇక ఖండన, మండనల గురించి చెప్పక్కరలేదనుకుంటా.

జరిగిన ముచ్చటలు చెబుతా!

తిరుపతి వేంకట కవులలో వేంకట శాస్త్రిగారు ’పాణిగృహీత’, ’శ్రవణానందం’అనే పుస్తకాలు రాసారు, దాని మీద శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు విమర్శ చేస్తూ “పాణి గృహీత- శ్రవణానంద శృంఖల”అనేది రాశారు. అది ప్రచురించే ముందు శృంఖల వస్తోందనీ ప్రచురించారు. దానిపై వేంకట శాస్త్రిగారు “శృంఖలా తృణీకరణం” రాశారట. దానిపై “గళహస్తిక” అంటే అర్ధ చంద్రప్రయోగం, అనగా మెడపట్టి గెంటేయడం,అని ఒక పుస్తకం రాశారట, శ్రీపాదవారు. దానిని తమ గురువులైన వేంకటరామకృష్ణ కవులు ( వీరూ జంట కవులే, పిఠాపురం వారు, ఆ సంస్థానం వారి అస్థాన కవులు )వారికి వినిపిస్తే, దీనిని ప్రచురించవద్దని గురువులే (రామకృష్ణ కవి) శాసిస్తూ, రెండు ముక్కలుగా చించేశారట. శ్రీపాద వారు దానిని చించేశారట, ముక్కలు ముక్కలుగా. ఈ సంఘటన వారు స్వయంగా అక్షరబద్ధం చేసినదే!

 మరో ముచ్చట.

శ్రీపాదవారు “శ్మశానవాటిక’ అనే పుస్తకాన్ని రాశారు. దానిని వేంకట శాస్త్రిగారు చదివారు. ఒక రోజు శ్రీపాదవారి బంధువొకరు వేంకట శాస్రిగారిని కలియడం జరిగింది. శ్రీపాదవారి బంధువని, అతను శ్రీపాదవారిని చూడటానికే వెళుతున్నట్టూ తెలుసుకున్న వేంకట శాస్త్రిగారు “మీ శ్మశాన వాటికను చూశానని’ శ్రీపాదవారికి చెప్పమని బంధువుకు చెప్పేరు.  బంధువుకు వివరం తెలియదు కనక వచ్చి శ్రీపాదవారితో వేంకట శాస్త్రిగారన్న మాటలు యధాతథంగా చెప్పేరు. దానికి శ్రీపాదవారు, ఆ బంధువు తిరిగివెళుతుండగా మరల వేంకట శాస్త్రి గారిని కలిసి ఇలా చెప్పమన్నారు. “శ్మశానవాటిక నిర్మించాను, తమరు ఉపయోగించుకోవచ్చు” అని. బంధువుకు ఇదేమో కూడా తెలియక శ్రీపాదవారు చెప్పినట్లే వేంకట శాస్త్రిగారిని కలిసి శ్రీపాదవారు చెప్పినమాట చెప్పేరు. దానిపై వేంకట శాస్త్రిగారు కబురు తెచ్చిన శ్రీపాద వారి బంధువుపై మండిపడ్డారు. అప్పుడక్కడున్నవారు వేంకట శాస్త్రిగారిని “కబురు తెచ్చినవాడు దూత, అతని తప్పులేదని” సద్ది చెప్పేరు. ఈ సంభాషణలో మర్మం తెలిసిందా?

వీరిదే మరో ముచ్చట,

వీరిద్దరి మధ్య పచ్చగడ్డి పడేస్తే భగ్గున మండిపోతున్న రోజులు, శ్రీపాద వారు శృంఖల ప్రచురించిన రోజులు.శ్రీపాదవారిది పొలమూరు, మా వూరికి మూడు కిలో మీటర్ల దూరం దక్షిణంగా, కడియం ఇరవై కిలో మీటర్ల దూరం పశ్చిమంగా. మేము రాజమంద్రి వెళ్ళాలంటే కడియం మీదనుంచే వెళ్ళాలి. అందరికి అవుసరమైనది రాజమంద్రి.

ఒక రోజు శ్రీపాదవారు రాజమంద్రిలో రైల్ దిగి ఊళ్ళోకి వెళుతున్నారు, తాలూకా ఆఫీస్ దాటేరు, వీరేశలింగంగారి బొమ్మలోపులో ఎవరో పేరుపెట్టి పిలుస్తూ ఆపి సంభాషణలోకి దింపేరు. శ్రీపాదవారు పని తొందరలో ఉన్నానన్నా వదలలేదు. ఈలోగా ఎవరో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే మీరేనా, నా పేరు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి, నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు నన్నెరుగరు లెండి అని పలకరించారు. దానికి శ్రీపాదవారు నమస్కారం పెట్టేరు. శ్రీపాద వారిది ముఫై వయసు, వేంకట శాస్త్రిగారిది అరవై వయసు. నమస్కారం పెట్టిన వారిని ఆశీర్వదించడం మన సంప్రదాయం. కాని దానికి వ్యతిరేకంగా వేంకట శాస్త్రిగారు తిట్లకి లంకించుకున్నారు. శ్రీపాదవారు ఓర్పువహించినా తిట్లు పెరుగుతున్నాయే కాని తగ్గలేదు. జనం చుట్టూ చేరిపోయారు. ఇక లాభం లేదని శ్రీపాద వారు కూడా తిట్లు తిడుతుంటే, వేంకట శాస్త్రిగారు నా పుస్తకాలని విమర్శిస్తావా? ‘ఇదేంటో తెలుసా?’ అని ఎడమ కాలి చెప్పు చూపారు. ఈ సారి శ్రీపాదవారు ఎడమ కాలి చెప్పే దూశారు, ‘సరదాగా ఉంటే రా’ అంటూ’నీ పుస్తకాలేం గొప్పా? పైనుంచి ఊడిపడ్డాయా’ అని. ఈలోగా చుట్టూ చేరినవారిలో కొందరు విడతీశారు, ఇద్దరినీ. ఈ సంఘటన నడిరోడ్డున జరిగింది, ఇద్దరూ ఎటువంటివారు? ప్రఖ్యాతి వహించినవారే. మరెందుకు ఇలా అయింది? అదంతే మానవ మనస్తత్వం…ఎంత గొప్పవారైనా ఈర్ష్య, అసూయలు తప్పవు… సహజాలు, కాదు సహజాతాలు.

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కామెంటిన కనకాంగి కోక……

  1. మంచి టపా !
    విమర్శ అంటే , ఒక విషయం మీద, నిష్పక్ష పాతం గా తమరి అభిప్రాయాన్ని, తెలియచేయడం !
    విమర్శలు నిర్మాణాత్మకం గా ఉండాలి !
    అందులో రాగ ద్వేషాలకు తావివ్వకూడదు !
    స్వార్ధ పూరితమైన విమర్శ లూ చేయకూడదు !
    వ్యక్తి గత దూషణలు అసలే కూడదు !
    వీటిని దృష్టి లో ఉంచుకుని విమర్శలు చేసే వారు , ఉత్తములు !

    • సుధాకర్ జీ,
      వ్యక్తిగతమైన విమర్శలు పనికిరావు, కాని ఒక్క మాట. ఆదర్శాలు వల్లెవేస్తూ, వాటికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటే , విమర్శలు వ్యక్తిగతంగా కూడా ఉంటాయనుకుంటా.
      ధన్యవాదాలు.

  2. తమరు వెలిబుచ్చిన అభిప్రాయాలు అక్షర సత్యాలు . ప్రజల నమ్మకాలు , మత విశ్వాసాలపై వ్యాఖ్యలు చర్చోపచర్చలు విజ్ఞులు, పండితులు, వేదాలు చదివి ఆచరించినవారు మాత్రమె చేయాలన్నది నా అభిప్రాయం కానీ నేడు సర్వ మతాలూ కొందరు అంధ విజ్ఞులు, నాస్తికుల చేతుల్లో పడినాయి

    • శివకుమార్ గారు,
      భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యమిచ్చింది, దానిని దుర్వినియోగం చేసేవారూ ఉంటారు.సహనం అవసరం కదా!
      ధన్యవాదాలు.

  3. అంతా కాలప్రభావమండీ. ప్రస్తుతం ‘మౌన ముత్తమ భాషణమ్’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. చూదాం ఇంకేవిధంగా మారుతాయో పరిస్థితులు. సమయాభావం కొంత కారణమైతే, మనస్కరించకపోవటం కొంత కారణంగా నేను బ్లాగులు చూడటమూ తగ్గింది, వ్యాఖ్యల నుంచటమూ తదనుగుణంగానే సహజంగా తగ్గింది.

    • శ్యామలరావు గారు,
      పిచ్చి మనసు, వద్దన్న పనే చేస్తూ ఉంటుందండి. ‘మౌనేన కలహో నాస్తి’ పెద్దలు ఇంతకు మించి చెప్పగలనా?
      ధన్యవాదాలు.

  4. ఈర్ష్యా-అసూయా-ద్వేషం-ఎదుటివారి అభిప్రాయాలను సహించలేనివారు(విమర్శించేవారు వేరు),వ్యక్తిగతంగా కించపరచేవారూ ఎంత జ్ఞానులైనా గొప్పవారు కారు. వీరి జ్ఞానం వల్ల ఎటువంటి ప్రయోజనమూ అందించలేరు.

    • కొండలరావు గారు,
      ఈర్ష్య అసూయ ఉన్నా, వారి జ్ఞానం పనికొస్తుందండి, కాని ఈ ఈర్ష్య అసూయలు మాత్రం బాగోవు, ఎవరికి, ఎప్పటికి.
      ధన్యవాదాలు.

  5. ఆయ్ శర్మ గారు,

    “కామెంటిన కనకంగి కోక కాకెత్తుకుపోయింది”. -=–>ఈ బ్లాగ్వెత జిలేబీకృత ‘కాఫీ’ రైటీయం ! !

    సరియైన దక్షిణ చెల్లించ వలె టైటిల్లో ఎక్కించి నందు లకు !

    జేకే!

    చీర్స్
    జిలేబి

    • జిలేబిగారు,
      తమరి కాపీ రైటును ఎప్పుడూ మరచిపోలేదు. తమ దర్శనమైతే చెల్లించుకుంటాంకదా.
      ధన్యవాదాలు.

  6. పండితులైనంత మాత్రాన nobility ఉంటుందనుకోనక్కరలేదు.పండితులకి,కవులకు,అసూయ,ద్వేషం,స్వోత్కర్ష ఎక్కువ.ఇప్పుడంత బాహాటంగా లేదు.పూర్వం ఉండేది.పైగా వైదిక,నియోగ స్పర్ధలు కూడా ఉండేవి.మీరన్నట్లు మానవస్వభావం అన్నికాలాల్లోను ఒకటేమాదిరి.

    • రమణారావు గారు,
      చదువుకున్నవారిలోనూ, పండితులలోనే అసహనం ఎక్కువౌన్నట్టుగా ఉంది.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి