శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం.

ఆత్మ పిండం.

“ఆత్మ పిండం” అంటే ఏంటండీ?” అంటూ వచ్చాడు మా సత్తిబాబు.
సనాతన ధర్మంలో (హిందూ మతమన్నది లేదు దాని గురించి వేరుగా చెబుతాలే) తనకు చనిపోయిన తరవాత కర్మ చేసి ఉత్తరగతులు కలిగించేవారు లేనివారు, ఈ ఆత్మ పిండాన్ని వేసుకునేవారు. అదెలాగంటే కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ప్రయాగలో త్రివేణిలో ములిగి గయా ( గయకాదు. గయా స్టేషనులో కూడా గయా అనేరాసుంటుంది) వెళ్ళడమూ అక్కడ పెద్దలకు మూడు చోట్ల పిండాలు వేయడమూ ఆచారం. గయాలో కూడా మొదటగా నదీ తీరంలోను, ఆతరవాత విష్ణు పాదాల వద్దా, చివరగా అశ్వథ్థ వృక్ష మూలంలో నూ పిండాలు పెట్టడం సనాత సంస్కృతి. (’నీ పిండం చెట్టుకిందెట్టా’ అనే తిట్టు ఇదే) ఇలా ఆత్మ పిండం వేసుకోదలచినవారు ముందుగా బ్రహ్మకపాలాన్ని దర్శించి అక్కడ తనకు తానుగా మరణానంతర కర్మలు(దీన్నే ఘటా శ్రార్ధం అంటారు) చేసుకుని,పై క్రమంలో గయా తిరిగివచ్చి అక్కడ పిండం వేసుకోడమే ఆత్మ పిండం వేసుకోడం.

నాదో అనుమానమండీ! బిరుదులూ వగైరాలు సంస్థలో, ప్రభుత్వమో ఇస్తూ ఉంటుంది కదా! ఇలా ఆ బిరుదులను తమకు తామే అధికారం లో ఉన్న వ్యక్తులు ఇచ్చుకోవడాన్ని ఏమంటారండి అన్నాడు.
నాకైతే బోధపడలా…మీకేమైనా తెలిసిందా?…

***

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవంతు.

కాలే వర్షతు పర్జన్యాః పృధివీ సస్య శాలినీ
దేశోహమ్ క్షోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయాః
అపుత్రా పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణాః

అధనాః సధనాః సంతు జీవశ్చ శరదామ్ శతం.

సర్వే జనాః సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీ రస్తు, నిత్యమంగళాని భవంతు.
సర్వ శ్రీరస్తు సర్వ మంగళాని భవంతు.

ఓం శాంతి శాంతి శాంతిః

 

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం.

  1. పిండముల జేసి
    తన ఆత్మను తలపోసి
    కాకులకు …………………………………

    జిలేబి
    (ఈ కామెంటు అర్ధ చంద్రాకృతి
    పూర్తి గా రాసిన వీపు వాయగొట్టు ప్రాబబిలిటీ మెండు!
    అందు వల్ల అసంపూర్ణం)

  2. ఆధ్యాత్మికత కోణంలో నుంచి చూస్తూ సనాతన ధర్మం, వేరు హిందూమతం వేరు అని మీరంట్టున్న్నారు. అహ్మద్ చౌదరి అనే అతను కూడ మీలాటి వాదనే వినిపిస్తున్నారు. ధర్మం అంతా ఒకటే అయితే దేశ విభజన హిందువులు,ముస్లింలు వేరు అనే భావంతో ఎందుకు జరిగింది? ఇప్పటి హిందూ మతస్థులు సనాతన సంస్కృతిని పాటించటంలేదా? గయకెళ్లి పిండాలు పెట్టే హిందువులు ఎంతో మంది ఇప్పటికి ఉన్నారుకదా! విగ్రహారాధన కూడా ఎప్పటి నుంచో హిందువులకు ఉంది, ఉంట్టుంది. దాని వెనుక ఎంతో ఫిలాసఫి ఉంది. అది వేదాలలో ఉపనిషత్ లలో ప్రస్థావన లేదు కనుక అది తప్పు అని చెప్పే హక్కు ఎవ్వరికి లేదు.

    • శ్రీగారు,
      హిందూ మతమన్నదిలేదండి, మనం అనుసరిస్తున్నదే అదే సనాతన ధర్మం లేదా
      సనాతన జీవన విధానం. ఒక చిన్న టపా రాసి విరమిస్తా.
      ధన్యవాదాలు.

  3. మొన్నటిదాకా నిజంగా ‘ఆ తిట్టుకూ అర్ధం తెలియదు.నాకిప్పుడు తెలియాలనిఉంది,అదీ మీలాంటి పెద్దలద్వారా.ధన్యవాదాలు శర్మగారు.చిన్న సందేహం శర్మగారు,నివృత్తిచేస్తారని బావిస్తాను.బ్రహ్మశ్రీ అని ఎవరిని సంభొదిస్తారు?దానికి ఏవి కొలమానాలు?దయచేసి తెలుపగలరు.

    • రాజ్య లక్ష్మిగారు,
      తిట్టుకి అర్ధం చెప్పగలిగేను 🙂
      బ్రహ్మము అనగా భగవంతుడు అని అర్ధం కదండి, భగవంతుని తెలిసినవారిని అలా అనాలటండి, లేదా ఆ స్వరూపుల్నీ అనచ్చు….
      ధన్యవాదాలు.

  4. ఈ హిందూ మతం – సనాతన ధర్మం – హిందూ ధర్మం వీటి మధ్య తేడాలను మీరు వ్రాస్తే తెలుసుకోవాలని ఉన్నదండీ. మన సనాతన ధర్మంలో ఉన్న మంచి విషయాలన్నింటినీ ఒకేచోట చేరిస్తే ఏది మంచిదో, ఏ సంప్రదాయం, ఆచారం ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పటివారికి తెలిసే అవకాశం, వాటిలో మంచివాటిని కొనసాగించేందుకు తగిన జ్ఞానం -అవగాహన కల్పించేందుకు సహకరిస్తుంది.

    • హిందూ ధర్మంలో ఉన్న ప్రతీ అంశం మంచిని పెంచేవే , ధర్మాన్ని నిలబెట్టేవే … ఇందులో మంచివి కొనసాగించాలి -చెడ్డవి వదిలేయాలి అన్న ఆలోచన లేదు

    • కొండలరావు గారు,
      బ్లాగుల్లోకి రావడానికే మనస్కరించడం లేదండి. నాకూ పెద్దగా తెలియదు కాని పెద్దలు చెప్పిన మాటలు కొన్ని నాకు తెలిసినవరకు ఒక చిన్న టపా రాయాలనే ఉంది. సనాతన ధర్మంలో వదిలేయాల్సినవేం లేవండి, అనుసరించేవాళ్ళమనేవారు తప్పులు చేస్తే అది సనాతన ధర్మాందా? ఏ ధర్మమూ, మతమూ, సిద్ధాంతమూ తప్పు చెప్పవండి, తప్పులన్నీ అనుసరించేవారు చేసేవే.టపా అసలు ఉద్దేశం వెనకబడిపోయిందండీ.

      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి