శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మయ్య బతికేడు.

అమ్మయ్య బతికేడు.

ప్రస్తుతం ఉంటున్న ఊరిలో ఉద్యోగం చేస్తున్న రోజులు,  1980  ప్రాంతం మాట. ఏంటీ ఈ మధ్య అంతా జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతున్నారంటారా. నిజమే పదిరోజులుగా వరుసగా దెబ్బ మీద దెబ్బ లాగా,మూడు వార్తలు, పులి మీద పుట్ర లాగా ఒకదాని మీద ఒకటి వార్తలు మనసును అతలాకుతలం చేసి, కుళ్ళ పొడిచేసి చంపేస్తుంటే, ఏమీ అలోచించనివ్వకుండా చేస్తూంటే, జ్ఞాపకాలు నెమరేసుకోవలసి వస్తూ ఉంది, కొత్తగా రాయడానికి మనసు సహకరించక, మానేద్దామంటే అదో బాధ, ఏం చెప్పుకోనూ? అందుకు జ్ఞాపకాలు రాస్తున్నానన్నమాట, ఇవి జరిగిన సంఘటనలు కనక అలోచించవలసిన అవసరం లేదు కనక యధాతధంగా రాసేయడమే……

ఉదయమే లేచి కార్యక్రమాలు చేసుకుని ఏనిమిది గంటలకి ఆఫీసుకు చేరుకునే దురలవాటు ఉండేది. ఉదయమే ఎక్చేంజిలో అన్ని సెక్షన్లు ఒక సారి తిరిగి ఎక్కడ ఏమితేడా ఉన్నది చూసుకుని ఎవరేపని చేస్తున్నారో, ఎవరు వచ్చేరు, ఎవరు రాలేదు చూసి, అవసరాలు చూసి, ఎక్కడ అవసరం ఎక్కువ ఉంటే అక్కడ తిష్ట వేసుకుని కూచుని, అక్కడి పనికి సహకరించి, చూసి, పది గంటలకి మళ్ళీ ఆఫీసులోకి పోయే అలవాటుండేది.

ఒక రోజు మామూలుగా ఉదయమే ఆఫీసుకొచ్చా. పక్క పల్లెకు ఉన్న ట్రంక్ లైన్ ఒకటి చెడిపోయిందని, అటునుంచి లైన్ మన్ బయలుదేరుతున్నాడని సెక్షన్ లో చెప్పేడు. ఇలా ఫాల్టులు రావడం, లైన్ మన్ లు చూడటం కొత్త కాదు కనక పెద్దగా పట్టించుకోలేదు. మరో సెక్షన్ కి వెళ్ళిపోయా. కాసేపటిలో ఈ సెక్షన్ నుంచి టెక్నీషియన్ పరిగెట్టుకుంటూ వచ్చి “జె.యి గారు ఆ ట్రంక్ లైన్ మీద కరంటు 250 v ఎ.సి వస్తోంది, ఏమి చెయ్యాలో తెలియటం లేదు. అటు ఎక్స్ఛేంజ్ నుంచి టెస్టు లిచ్చాడు. ఫాల్టు చెప్పేను. లైన్ మన్ హనుమంత రెడ్డి బయలుదేరేడు అటునుంచి ఫాల్టు మీద” అని చెప్పేడు. “ఇదేమయ్యా! ఇందాకా చూడలేదా కరంటు ఉన్నది” అన్నా. “అప్పుడు లేదండి. ఆ సమయంలో కరంటు పోయి ఉండచ్చు” అన్నాడు. ఒక క్షణం ఆలోచించి “అటు జె.యి ని మరొక లైన్లో పిలిచి, విషయం చెప్పి అర్జంటుగా బయలుదేరి ఫీల్డ్ లో కి వచ్చెయ్యమని చెప్పండి, నేను ఇటునుంచి ఫీల్డ్ లోకి వెళుతున్నా, వీలుకుదిరితే సబ్ స్టేషన్లుకి ఫోన్ చేసి మనం చెప్పేదాక పవర్ షట్ డౌన్ చేయమని చెప్పండి” అని చెప్పి బయలుదేరిపోయా, మోటార్ సైకిల్ మీద. సబ్ స్టేషన్ లో కరంటు ఆపేస్తే భయం ఉండదు, కాని ఆ రోజుల్లో కరంటు జె.యి లకి ఫోన్లు లేవు, సబ్ స్టేషన్లో వాళ్ళు మనం చెబితే వినకపోవచ్చు.

అటునుంచి జె.యి బయలుదేరి వస్తున్నాడో లేదో తెలియదు. అతనికోసం ఫోన్ చేసి, అతన్ని పట్టుకుని, విషయం చెప్పి నేను బయలుదేరేటప్పటికి ఎంత సమయం పడుతుందో తెలియదు, ఈ లోగా లైన్ మన్ స్థంభం ఎక్కి లైన్ పట్టుకుంటే చచ్చిపోతాడు కనక, “జె.యి కి చెప్పమని” చెప్పి, బయలుదేరిపోయి లైన్లోకి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయా. సహజంగా అటునుంచి బయలుదేరినవాడు, ఆ పల్లెటూరికి దగ్గరగానే ఉంటాడు, లైన్ చూసుకుంటూ వస్తున్నవాడు కనక. నేను అడ్డదారిని బయలు దేరి అసలు దార్లోకి చేరుకుని ముందుకు అతని కోసం చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలా వెళుతుండగా అవతల పల్లెనుంచి మూడు కిలోమీటర్లు నా ఊరునుంచి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో అతను స్థంభం ఎక్కబోతూ కనబడ్డాడు, నాకు ఒక రెండు ఫర్లాంగుల దూరంలో. కేకలేశా “స్థంభం ఎక్కద్దూ” అని, అతనికి వినపడలేదు. అవతలి వైపు నుంచి నా సహచర జె.యి వస్తున్నాడు. అతను కనపడ్డాడు. లైన్ మన్ స్థంభం ఎక్కేస్తున్నాడు. ఎక్కేసేడంటే లైన్ పట్టేసుకుంటాడు, పట్టేసుకున్నాడంటే చచ్చిపోతాడు. ఇది నా భయం. ప్రాణం పోయిన తరవాత చేయగలది లేదు కదా. ఏమి చేయాలో తోచలేదు, బండి స్లో చేసి, బండి పారేసి, బండి మీదనుంచి దూకేసి కింద పడి లేచా. ఇదంతా చుట్టూ ఉన్న జనం చూశారు. నన్ను ఎరుగుదురు కనక “అయ్యో! జె.యి గారు పడిపోయారు బండి మీద నుంచి” అని ఒకతను పెద్ద కేక పెట్టి నాకేసి బయలుదేరేడు. జనం నావైపు వస్తున్నారు. గందరగోళంగా ఉంది. ఇది జరుగుతుంటే లైన్ మన్ చూసి స్థంభం ఎక్కేవాడు దిగి నా కేసి బయలుదేరి వచ్చాడు.ఈ లోగా నా సహచర జె. యి వచ్చాడు, లైన్ మన్ వచ్చాడు, “సార్ బండి మీద నుంచి ఎలా పడిపోయారు, దెబ్బలేమయినా తగిలేయా, పొద్దుటే ఇలా బయలుదేరేరేమిటి?” అంటూ నా ఒళ్ళు తడమటం చూసి నాకు నవ్వు, ఏడుపూ ఏక కాలంలో వచ్చాయి. “అమ్మయ్య ఏమయితేనేమి బతికేడ”నుకుని, “ఆ లైన్ మీద కరంటు వైర్ పడిందయ్యా ఎక్కడో చూసుకుని అది తీయించిన తరవాత లైన్ ముట్టుకోమని నీకు చెప్పాలని, ప్రమాదం జరుగుతుందేమో నని భయపడి, వచ్చేము, నేను దూరం నుంచి అరుస్తున్నాను, స్థంభం ఎక్కద్దని, నీకు వినపడలేదు,” అని చెప్పేను. అక్కడ గుమి గూడిన వారు విషయం తెలుసుకుని, నేను కావాలని బండి మీద నుంచి పడ్డానని తెలుసుకుని, “పోనీ లెండి, మంచి పని జరిగింది,” అని ఎవరిమటుకు వారు వెళ్ళిపోయారు. మిత్రుడిని “ఇంత ఆలస్యమయిందేమి నువ్వు రావడానికి” అంటే “బండి స్టార్ట్ కాలేద”న్నాడు. అప్పుడు లైన్ మన్ ని “నీ గ్లవ్స్, ఇన్సులేటెడ్ ప్లయర్, టెస్టర్ ఏవంటే,” ప్లయర్ చూపించాడు. “అవసరమయినవి ఎందుకు తెచ్చుకోలేదు, వాడటం లేదంటే, ఇలా అలవాటయిపోయింద”ని చెప్పేడు. ఆ సాయంత్రం జె.యి లు ఇద్దరమూ కలిసి ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టి జరిగిన విషయం చెప్పి, ఇక ముందు ఎవరేనా ఈ ప్రాణ రక్షణ ఉపకరణాలు తీసుకుని లైన్ మీద పని చేసేటపుడు తీసుకు వెళ్ళక పోతే, సీరియస్ ఏక్షన్ తీసుకోడం జరుగుతుందనీ, ప్రతి సారి, అందరిని ఇలా కాపాడగల సావకాశం రాకపోవచ్చని, ప్రాణం పోతే తిరిగిరాదనీ, ముందు జాగ్రత్త అవసరమనీ హెచ్చరించి, ఆరోజునుంచి నేను ఎక్కడ పని చేసినా అక్కడ ఈ అలవాటు చేసేను, కొంత మంది పిచ్చాడని, చాదస్తుడనీ తిట్టుకున్నా సరే.

మొన్నీ మధ్య ఈ హనుమంత రెడ్డి కనపడ్డాడు. ఎలా ఉన్నావంటే మీరు ఆ రోజు మీ సెక్షన్ వాణ్ణి కాకపోయినా, నా ప్రాణాలు కాపాడేరు కాని ఈ ధైరాయిడ్ వాపు ( ఉప్పులో అయోడిన్ తక్కువ మూలంగా వచ్చే వ్యాధి) ప్రాణం తీస్తోంది సార్ అంటూ గొంతు వాపు (గాయిటర్) చూపించాడు.విధి బలీయం.

 

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మయ్య బతికేడు.

  1. శర్మ గారూ!
    మీ మరో అనుభవాన్ని మాతో పంచుకున్నారు…
    సమయస్ఫూర్తితో మీరు ఆతని ప్రాణాలు కాపాడారు…
    అభినందనలు మీకు…
    @శ్రీ

    • @పంతుల జోగారావుగారు,
      నా బ్లాగుకు స్వాగతం. ఏదీ మన చేతిలో లేదు, అంతా అమ్మ నిర్ణయం. మనం నిమిత్త మాత్రులం.మిమ్మల్ని ఒక టపా రాసేటంతగా నా టపా కదిలించిందంటే ఆనందం.
      ధన్యవాదాలు

  2. అంత టెన్షన్ లో కూడా మీకు భలే అయిడియా వచ్చిందండి.
    ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న మీ తాపత్రయం ఎంతో గొప్పది.

    • @అనూరాధగారు,
      ఆ ఐడియా అమ్మ ఇచ్చినదే, తాపత్రయం కూడా అమ్మదేనండి, నేను నిమిత్త మాత్రుడిని. నా ద్వారా ఆ పని జరగాలి అంతే.
      ధన్యవాదాలు

  3. చాలా రోజులు గా మీ బ్లాగ్ చదువుతున్నాను. ఎంత బాగా గుర్తు చేసుకుంటారండీ మీ జ్ఞాపకాలు మా కళ్ళకు కట్టినట్టు. వయసులో మీ కంటే చాలా చిన్నవాల్లమయిన మాకు మీ వంటి వారి అనుభవాలు, అనుభూతులే కదండీ ఆ కాలానికి, ఈ కాలానికి వారధి.

    మీ అనుమతి లేకుండానే ఒక ప్రకటన.

    Visit http://bookforyou1nly.blogspot.in/

    for books

  4. మంచి చెయ్యాలి అంటే ఒక అడుగు వెనక్కి వేసినా తప్పు లేదు అని నిరూపించారు కదా

    • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
      ఏ అడుగో నాకు తెలియదు, అలా జరగాలని అమ్మ నిర్ణయం, జరిగింది అంతే.
      ధన్యవాదాలు

  5. సమయస్పూర్తితో ఆ రోజు మీరు అలా బండి మీద నుంచి దూకేసి, అందరి అట్టన్షన్ మీ మీద పడేటట్లు చేసి లైన్ మన్ ని కాపాడారు. మీరు టపాలు రాయడం అసలు మానొద్దు. కాలం అన్ని గాయాల్ని మాపుతుంది, అలాగే కొన్ని
    రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతారు. రాస్తూనే ఉండండి …

    • @శ్రీ గారు,
      ఆ సమయంలో ఏంచేయాలో తోచక అసంకల్పితంగా
      అమ్మ నాచేత చేయించినది ఆ పని, అతనికి బతికే యోగం ఉంది. నేను నిమిత్త మాత్రుడిని.
      ధన్యవాదాలు

వ్యాఖ్యానించండి