శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మో బ్లాగులు

అమ్మో బ్లాగులు!

వనజగారి బ్లాగులో అసిధార..రండి..రండి..టపా చూశాకా రాయాలనిపించి….

మొత్తం మన దేశ బ్లాగులు చూస్తే తెనుగు,తమిళం లో సమానంగా బ్లాగులు టపాలు ఉంటాయనుకుంటా. ఆ తరవాత కన్నడ, గుజరాతి వస్తాయి, తరవాతి స్థానం పంజాబీ, చివరిది మళయాళం నా అంచనా ప్రకారం. మరి హిందీ, ఇంగ్లీషు వదిలేశారేమంటే, వాటిదే ప్రధమ స్థానం కనక. ఎక్కువ చదువుకున్న కేరళ లో తక్కువ  బ్లాగులున్నాయి. బెంగాలీ, ఒడియా, మరాఠీ వారు బ్లాగులే రాయటం లేదేమో తెలియదు. మళయాళంలో ఒక్కోరోజు ఒక టపా కూడా ఉండదు, ఇదంతా హారం నుండి చూసినది, హారం వారికి ధన్యవాదాలు.

మన తెనుగు బ్లాగులగురించి చూస్తే రాసేవారు, స్త్రీలు, పురుషులు. వీరిని మరల విభాగించుకుంటే స్వదేశం లో ఉన్నవారు, విదేశంలో ఉన్నవారు. స్వదేశవాసులలో మరల విభాగం చూస్తే, పర రాష్ట్ర వాసులు. స్వరాష్ట్రంలో ఉండి బ్లాగు రాసేవారి సంఖ్య తక్కువనుకుంటా, అందునా మాకులా పల్లెటూరివారు. విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెనుగువారికే, భాష, ఆచార వ్యవహారాల పట్ల మక్కువ కనపడుతుంది, అందునా స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. స్వదేశాభిమానం కూడా మెండు, ఇది నా జాతికి గర్వ కారణమే, ఇది గుణమే కాని దోషంకాదు. మగవారికి లేదా అనద్దు, వారికీ ఉంటుంది, కాని మగవాడు అంత గబుక్కున బయటపడడు, ఇది నా అనుభవం కూడా. ఇతర రాష్ట్రాలలో ఉన్నపుడు స్వభాషమీద ఎంత మక్కువ ఉండేదంటే,……. మాటలలో చెప్పడం కష్టం. సాంకేతికంగా పెరిగిన నేటి రోజులలో దానిని వ్యక్తం చేయడానికి మార్గం బ్లాగు…. బ్లాగు రాయడం మంచి అలవాటు, కాని దురదృష్టవశాత్తు, ఇది వ్యసనమై కూచుంది, నా లాటి పనిలేని వారికి,…రాయక ఉండలేని వ్యసనం…తిరిగే కాలు, తిట్టే నోరు తిన్నగా ఉండవని నానుడి, మన తెనుగులో, అదీ సంగతి…

ఏవిషయాల మీద రాస్తారంటే, అన్ని విషయాల మీదా, ముఖే, ముఖే సరస్వతి కదా, ఇక్కడ ఎవరూ గొప్పవారూ లేరు, తక్కువ వారూ లేరు. డిగ్రీలుండటం ప్రధానం కాదు, విజ్ఞానం ప్రధానం, దానిని పది మందికి పంచిపెట్టే విధానం ముఖ్యం. మిత్రులు శ్రీభండారు శ్రీనివాసరావు గారి నేటి టపా “అద్వైతం” లో, పుస్తకాల షాపులో గైడ్ లాగా, ఎవరెంతవారో తెలియదు.. ఇక్కడ మెరిసేదంతా బంగారమూ కాదు, కాకాపోదు.  ఎవరూ సర్వజ్ఞులు కారు,అందరికీ అన్నీ తెలియవు, తెలిసి ఉండక్కరలేదు కూడా, సర్వజ్ఞుడు శంకరుడొకడే. వేదం ఇలా చెబుతోంది, మహన్యాసం లో “ఈశానస్సర్వవిద్యానామ్, మీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమే అస్తు సదాశివోమ్,” మన తణికెళ్ళ భరణి గారేమన్నారంటే, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు, నీలోనకల శివుడు, నాలోన కల శివుడు మంటలను రేపగలడు, కొంపలను కూల్చగలడు, అలాగే, కొంపలను నిలుపగలడని చెప్పేరు. అంటే కలిసి నిలబడితే బలపడతాం, లేదంటే పడిపోతామన మాట…మరో మాట, ఇక్కడ చెప్పేదంతా వారు నిజ జీవితం లో ఆచరిస్తున్నారనీ ఆశ పడక్కర లేదు.

ఇహపోతే, మన బ్లాగులలో వాడే భాష, తెనుగంటున్నారు, ప్రతి పదం ఇంగ్లీషుదే కనపడుతోంది. అదీ గాక, రాసేటప్పుడు తప్పులు కొల్లలుగా కనపడుతున్నాయి. షష్టి, షష్ఠి కి తేడా కనపడటం లేదు, చ,ష,శ,స ల కి తేడా లేదు. కృష్ణుడు అని రాయాలి కాని క్రుష్నుడు అని హృదయాన్న్ని హ్రుదయం గా జ్ఞానం, జ్నానం గా రాసేస్తున్నారు. ఇంగ్లీషు కీ బోర్డ్ మీద తప్పులు రావచ్చు. ఒక సారి తప్పని చెప్పిన తరవాత కూడా, పదే పదే అదే చేస్తే ఏమంటారు? మిత్రులు ఒకరు ఇలా రాయకూడదని వెంటపడి చెప్పేరు, ఆయనను ఈసడించిన వారు కూడా ఉన్నారు. ఇది భాషాభిమానమా? మరో మాట కూడా అన్నారు పాపం అయన్ను, విషయం ముఖ్యం కాని ఎలా రాసిన తప్పులేదని. దీన్నేమంటారు? కూర్చోండి అన్న మాట కూచోండి అయిపోయింది వాడుకలో, ఇంటి దగ్గరున్నంత కాలం బుల్లి మనవరాలు కూచోండి అనేది, ఇప్పుడు బడిలో కెళుతోంది “కూకోండి” అంటూ ఉంది, వస్తుంది అన్నమాటని “వస్తది” అంటోంది :). ఇప్పటికే లేవండి కాస్తా లెగవండి, లెగండి, లెగు అయిపోయి అదే భాష సినిమాలలో కూడా వినపడుతోంది. ఏమో! రేపు అదే వాడుకలో, వాడుక భాషగా పరిగణింపబడుతుందేమో తెలియదు. ప్రాంతీయాలున్నాయి, అవి చాలా తియ్యగా ఉంటాయి, గ్రామీణులు మాట్లాడుతూ ఉంటే విని ఆనందించాలి. తెనుగు అంత తీయగా ఉంటుంది. ఉపమా కాళిదాసస్య అని, ఉపమానాలు దాకా వద్దు కాని, నిత్య సత్యాలు కూడా తిరగేసి చెప్పేస్తున్నారు. నీళ్ళోడుతాయంటాం, కాని విశిష్టంగా, విలోమంగా చెబుతున్నారు. ఒక సినిమాలో భరణి డాన్ గా కనపడతాడు, కవిత్వం పిచ్చి, ఒక కవిత రాస్తాడు, అది,చెల్లిపెళ్ళి,జరగాలి, మళ్ళీ, మళ్ళీ, పత్రికలో ప్రచురిస్తారు,ఒక వేన్ నిండా ఉత్తరాలు స్పందనగా, అది “నీ మొహం తగలెయ్యా! చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఏమిట్రా” అని స్పందిస్తారు. 🙂 అలా ఉంటాయి. ఏంచేస్తాం పుర్రెకో బుద్ధి, జిహ్వకోరుచి అని నానుడి.

ఇహపోతే, ఇది ఒక ప్రముఖ బ్లాగిణి తరచుగా వాడే మాట. ఎక్కువగా చదివే విషయాలేమంటే, అనేదాని మీద మన బ్లాగరొకరు, అవి స్త్రీ పురుష సంబంధాలు,సినిమా,రాజకీయం, మతం అన్నారు, నిజమేనేమో. మరొకరన్నారు, పోచుకోలు కబుర్లు చదివినంతగా మంచి విషయాలు చదవరండి, అన్నారు. ఇక ఎవరి బ్లాగులు ఎక్కువగా చదువుతారంటే, ప్రేమ, విరహం,సినిమా, రాజకీయం గురించిరాసిన బ్లాగులని,  ఠక్కున చెబుతారు ఎవరేనా, మన బ్లాగుల గురించి తెలిసినవారు. కొన్ని మడి బ్లాగులున్నాయి, మన తెనుగులో, వారు మడి బ్లాగర్లేమో, వారు పది మందిలో కలవరు, మాటాడరు, పోనీయండి ఎవరిష్టం వారిదికదా. ఆడవారు, వారి పేరుతో రాసేవారి బ్లాగులకి అత్యంత రద్దీ ఉంటుంది, వారేమి రాసినా, ఆఖరికి చీపురుకట్ట గురించి రాసినా చదువుతారు, అబ్బో ఎంత గొప్పగా చెప్పేరంటారు.. నేను ఈర్షతో చెప్పటంలేదీ మాట, ఉన్న మాట చెబుతున్నా. నాకు స్త్రీలంటే చులకనభావం కాని ఎద్దేవా చేసే అలవాటు కాని లేదు. నేను చిన్నప్పటినుంచి స్త్రీలతోనే ఎక్కువగా సంచరించినవాడిని. నిజానికి ఈ బ్లాగులలో రాసేవారిలో నాలా చదువుకోనివారు, స్త్రీలలో ఎక్కువ చదువుకున్నవారు, కనపడుతూ ఉంటారు. అటువంటి వారి బ్లాగులు చదవడం వారి అనుభవాలు, అనుభూతులు పంచుకోవడం, వారితో పరిచయం, నిజంగా అదృష్టమనే చెప్పాలి. కొంత మంది చెప్పే విషయం కొత్తది కాక అందరికి తెలిసినదైనా, చెప్పే విధానం లో కొత్తదనం ఉంటుంది, అటువంటి వాటిని చూసి ముగ్ధుడనవుతా. కొంతమంది చెప్పేదానిని సరళ విధానంలో, ఒక పి.హెడి. థీసిస్ లాగ రాసేస్తారు, బాగోక ఛస్తుందా? నచ్చినపుడు ఒక మాట పెట్టిపోతారు, చదివినవారు. కొంతమందికి అటువంటి వారి పై ఆరాధన ఉంటుంది, ఇది సహజం కూడా. అదిగో అక్కడే వస్తుంది అసలు సిసలు తిరకాసు. వారేమి రాసినా బాగుందని మెచ్చుకునే వర్గం ఒకటి ఏర్పడిపోతుంది. వ్యాఖ్యలూ కొల్లలుగా ఉంటాయి. సాధారణంగా మనకి ఇష్టమయిన విషయాలు రాసేవారితో ఒక పరిధీ ఏర్పడుతుంది, వారు స్పందిస్తారు కూడా.  ఇష్టమయిన వారు స్పందిస్తే ఏనుగెక్కినంత సంబరమవుతుంది. అటు వంటి వ్యాఖ కోసం ఎదురు చూస్తాం, బ్లాగర్లందరం. ఒక మంచి మాట, ఒక సద్విమర్శ, గొప్ప స్ఫూర్తి నిస్తుంది, అది ఎందుకు చేయరో తెలియదు.   పాపం! బాగా రాసినా, ఎవరూ చదవని, చదివినా స్పందించని బ్లాగులుంటాయి.సినిమా రాజకీయ బ్లాగులలో, అదో లోకం. రాజకీయంలో ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకోడమే కనపడుతుంది. ఇక సినిమా బ్లాగులది అదో లోకం, నాకు పరిచయం లేనిది. సమస్యా పూరణ బ్లాగులు అంటే మక్కువే, కీచులాటలు కూడా చిత్రంగానే ఉంటాయి, కాని గణం, యతి, ప్రాస అని చిన్నప్పుడు చదువుకున్నది పూర్తిగా ఎక్కలేదు, లేకపోతేనా… 🙂

కొంత మందికి బ్లాగులుండవు కాని వ్యాఖ్యలు రాస్తూ ఉంటారు. ఎక్కువ వ్యాఖ్యలు వచ్చే బ్లాగర్లంటే కొద్దిగా ఈర్ష్య సహజం, 🙂 ఐతే ఒకప్పుడు ఇది వెర్రి తలవేసి మారు ఐ.డి లతో నోటికొచ్చినట్లు మాటాడి బ్లాగర్ మనసు గాయపర్చే వారుంటారు, అటువంటివారు సహజంగా బ్లాగరే అయివుంటారు. వారికి అసూయ ఉండి అది కాస్తా ఈర్ష్యగా మారి దాని పర్యవసానంగా విచక్షణ కోల్పోయి ఇటువంటి వ్యాఖలు రాస్తారు. అందరూ వనజగారిలాటివారుండకపోవచ్చు, ఆత్మ విశ్వాసం కోల్పోవచ్చు కూడా. ఇక్కడ ఇప్పుడు రాసినవన్నీ ఎవరో ఒకరిని చూసి రాసినవే :), ఎవరిని కించపరచాలని, ఎగతాళీ చేయాలని మాత్రం ఈ టపా ఉద్దేశం కాదని సవినయ మనవి. రాసుకుంటూ పోతే టపా పెరిగిపోతూ ఉంది.ఆ నాలుగే బ్లాగులనీ మిగిలినవి చెత్తనుకోడం, అంతా చెత్తనుకోడం కూడా అంతే పొరపాటు. ఆ నాలుగూ వారికి నచ్చి ఉండచ్చు,పుర్రెకో బుద్ధి, జిహ్వకోరుచి అని ఇందాకే అనుకున్నాం కదా.

యాదృఛ్ఛికంగా ఇది నా  350 వ టపా. బ్లాగు నా కుటుంబం లో ఎంతగా ప్రభావం చూపుతోందంటే, నా శ్రీమతి, నేను బ్లాగులో రాస్తున్నాని చెప్పేటంతగా,రాసుకుంటూంటే టీ, కాఫీ టిఫిన్లు, కంప్యూటర్ దగ్గరే విసుక్కోకుండా, ఇచ్చేటంతగా, మరొక కుటుంబ సభ్యులు కూడా బ్లాగు మొదలుపెట్టి రాస్తున్నంతగా,రెండు కీ బోర్డ్ లు పాడయ్యేటంతగా, నమ్ముతారా? జిలేబీ గారు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతున్నా, ఉద్యోగానికని వెళ్ళిపోయారు,శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు బ్లాగు సన్యాసం తీసుకుంటున్నానన్నారు, నేను కూడా మళ్ళీ తలపాగా, కాదులెండి, ఈ సారి టోపీ పెట్టుకుని గుంటూరు నుంచి శ్రీకాకుళం మధ్య రోడ్ న పడే సావకాశాలు కనపడుతూ, మీ దగ్గర శలవుతీసుకునే సావకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి.
స్వస్తి

30 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మో బ్లాగులు

  1. శర్మ గారూ , మీ ( తెలుగు ) బ్లాగుల విశ్లేషణ బాగుంది. మీరు టపాలు రాయడం మానుకునే ఆలోచన మాత్రం బాగా లేదు. ఒక వేళ అట్లాంటి నిర్ణయం తీసుకునేట్టయితే, ఒక్క సారిగా మానేయకుండా , వారానికి రెండో, మూడో టపాలు మాత్రమే రాసే నియమం పెట్టుకోండి.మిగతా సమయాలలో, టపాలు నిరంతరం రాస్తున్నప్పుడు మీ ” కుటుంబాన్ని ” ఏ విధం గా ” అశ్రద్ధ ” చేస్తున్నానని అనుకుంటున్నారో , అలా అశ్రద్ధ చేయక ,ఆ ” బాధ్యతలు ” కూడా తృప్తి గా నిర్వర్తిస్తూ ఉంటే, మిగతా సమయాలలో మీ ” కలం ” ఉత్సాహం గానూ , వేగం గానూ కదులుతుంది.

    • @మిత్రులు సుధాకర్ గారు,
      నాకయితే ఆ నిర్ణయం తీసుకోవాలని లేదు, కాని పరిస్థితులు ఆ వైపుకు దారి తీస్తున్నాయి. వివరం గా మనిషి మళ్ళీ రోడ్డున పడ్డాడు టపా వేస్తున్నా. మీ వ్యాఖ్యకి, మీరు నా పట్ల చూపిన ఆదర భావానికి కృతజ్ఞతలు.
      ధన్యవాదాలు.

  2. ఈ లైన్స్ చూడగానే నేను మాత్రం భుజాలు తడుముకున్నానండి.
    “ఇహపోతే, మన బ్లాగులలో వాడే భాష, తెనుగంటున్నారు, ప్రతి పదం ఇంగ్లీషుదే కనపడుతోంది. అదీ గాక, రాసేటప్పుడు తప్పులు కొల్లలుగా కనపడుతున్నాయి. షష్టి, షష్ఠి కి తేడా కనపడటం లేదు, చ,ష,శ,స ల కి తేడా లేదు. కృష్ణుడు అని రాయాలి కాని క్రుష్నుడు అని హృదయాన్న్ని హ్రుదయం గా జ్ఞానం, జ్నానం గా రాసేస్తున్నారు. ఇంగ్లీషు కీ బోర్డ్ మీద తప్పులు రావచ్చు. ఒక సారి తప్పని చెప్పిన తరవాత కూడా, పదే పదే అదే చేస్తే ఏమంటారు?”

    ఇకపై టపాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త గా ఉంటానండి. 🙂

    • @శ్రీ గారు,
      భాష తల్లి, మన భావాన్ని వ్యక్తం చేయడానికి. నేను ఎవరినీ వ్యక్తి గతంగా ఉద్దేశించలేదు. అమ్మే కదా అని చులకనగా చూడద్దన్నదే నా బాధ.మన మాతృ భాషకి ఉన్న నియమ నిబంధనలని పట్టించుకోవాలని నా అక్రోశం. తెనుగు పదాలున్నపుడు ఇంగ్లీషు పదాలెందుకు వాడాలీ అన్నది కూడా నా ఆలోచన. నేనూ తప్పులు రాశా. మిత్రులు సరి దిద్దేరు. సరి దిద్దిన ప్రతి సారి మెరుగుపరచుకున్నా. కొంత కాలానికి చెప్పేవారు కూడా విసుగు చెంది మానేస్తే, మనం పిచ్చి వాళ్ళ స్వర్గం లో ఉండిపోతామేమో అని నా భయం.మీరు మీ బ్లాగులో తీసుకున్న నిర్ణయం నన్ను బాధించింది, కారణం ఈ సమయం లో మీరు ఆ నిర్ణయం తీసుకోడం, నేను తప్పు చేసినట్లుగా బాధ పడుతున్నా.
      ధన్యవాదాలు.

  3. అభినందనలు శర్మగారు. మీ 350 వ టపాకూడా విశ్లేషణాత్మకంగా చాలా బాగుంది. బ్లాగు సన్యాసంలాంటి ఆలోచనలు చేయ్యకుండా, మీ అబిమానులని నిరాశపరచకుండా ఉంటారని ఆశిస్తున్నాను.

    • @వర్మ గారు,
      అమ్మ ఒక సారి రాయరా అంది, మొదలు పెట్టా. ఆపరా అని చెప్పలేదు. అమ్మ పలకలేదు, నా వల్ల కావటం లేదని చెప్పుకుంటున్నా, జవాబివ్వలేదు, ఇచ్చేదాకా అమ్మ మాట వినాలి కదా.
      ధన్యవాదాలు.

  4. బ్లాగులపై బాగా విశ్లేషించారు.తెలుగులో ఎక్కువమంది బ్లాగులు రాస్తున్నందుకు సంతోషించాలి.సమాజంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నట్లే బ్లాగర్లలో కూడా అనేకరకాలు ఉన్నారు.మామూలుగా జనం వేటిగురించి మాట్లాడుకొంటారు ?సినిమాలు,టీ.వీ.లు,రాజకీయాలు,తమ వృత్తులు,కుటుంబాల గురించే కదా.బ్లాగుల్లో కూడా అవే కనిపిస్తాయి.కొందరు మాత్రం కవిత్వం,కళలు,సైన్సు వంటి సీరియస్ విషయాలు బాగా రాస్తున్నారు.కొందరికి భాషా జ్ఞానం బాగానేఉంది.సరే,ఎవరికేది తోచితే దాన్ని రాయనీయండి, వారికి చేతనైన రీతిగా.ఇష్టమున్నవి చదువుతాం.లేనివి వదిలేద్దాం. కొందరు అద్భుతమైన ఫొటోలు ప్రచురిస్తున్నారు.వాట్ని నేను ఇష్టంగా చూస్తూ ఉంటాను.

    • @M.V.Ramanaraoగారు,
      నా బ్లాగుకు స్వాగతం. మీ మొదటి వ్యాఖ్య ఎందుకో స్పాం లో కి వెళిపోయింది. ఇప్పుడే చూశా. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు ముందుగా క్షమాపణలు.
      నేనదే అదే, ఎవరికి ఇష్టం వచ్చినది వారు చదువుకోవచ్చు, వ్యాఖ్యా పెట్టుకోవచ్చు, మెచ్చుకోవచ్చు. తెగబడి, రాసిన బ్లాగరు ఆత్మ విశ్వాసం దెబ్బతినేలా, వనజ గారి బ్లాగులో రాస్తే వారు బాధపడి రాసిన టపాకు ఇది సంపూరకం మాత్రమే.ఎవరినీ కించపరచ కూడదనే నా ఉద్దేశం కూడా.
      ధన్యవాదాలు.

  5. మాస్టారూ.. 350 .ఠపాలు పూర్తి చేసిన మీకు మనసారా అభినందనలు. ప్రతి పోస్ట్ ఒక విలువైన పాఠం గా ఉంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. మీ బ్లాగ్ చూసి మీ అనుభావాలా సారాంశం నుండి ఎన్నో నేర్చుకున్నాను. ధన్యవాదములు.

    ఇంకా ఇంకా మీరు వ్రాయాలి. .

    …రాయక ఉండలేని వ్యసనం…తిరిగే కాలు, తిట్టే నోరు తిన్నగా ఉండవని నానుడి, మన తెనుగులో,

    నిజం చేయండి. ఇంట్లో మీకు లభిస్తున్న సహకారంకి కూడా మా తరపున మనఃపూర్వక ధన్యవాదములు తెలియజేయండి.

    • @వనజ గారు,
      ఒకరైనా నా వల్ల ఉపకారం పొందితే జన్మ ధన్యమే. మీ అభినందనలు ఇల్లాలికి, కోడలికి చెప్పేను, సంబరపడిపోయారు. మనిషి మళ్ళీ రోడ్డున పడ్డాడు, టపా చెప్పేసేనా, వివరంగా రాస్తా.
      ధన్యవాదాలు.

  6. బ్లాగుల గురించి చక్కగా విశ్లేషించారండి.

    350 టపాలను పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు మరియు మీరు మరెన్నో చక్కటి టపాలను వ్రాయాలని కోరుకుంటూ……..

  7. శర్మ గారు,
    ఈ టపాలోని ప్రతి విషయం సత్యం. బాగా చెప్పారు. మీ విశ్లేషణ బావుంది. మీరు బ్లాగు సన్యాసం తీసుకొవద్దని మనవి. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తుంటారు మీరు. అవన్ని ఆపరని ఆశిస్తున్నాను.

    • @చిన్నిగారు,
      సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారని ఇంకా కొన్ని రాసినవే తీసేసేను :)ఆపడం మొదలు పెట్టడం, నాచేత లేదండి, అమ్మ చెప్పాలి ఏదయినా. వివరంగా రాస్తాగాని టపా ముందుగా తెలిసి పోయినట్లుంది 🙂
      ధన్యవాదాలు.

  8. నమస్కారం శర్మ గారు, 350 టపాలు పూర్తి చేసిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు 🙂
    బాబోయ్ !!!! అసలు టపా సూపర్ అనుకోండి (ఇంగ్లీష్ లో అన్నానని కోపగించుకోకండి 🙂 )
    “ఆఖరికి “”చీపురుకట్ట”” గురించి రాసినా చదువుతారు, అబ్బో ఎంత గొప్పగా చెప్పేరంటారు..” ఇది 100% నిజమండి…నేను కూడా ఈర్షతో చెప్పటంలేదండోయ్ ఈ మాట….నేను కొన్ని చోట్ల చూసాను….
    టపా చాలా బాగుంది.

    • @కావ్యగారు,
      మీ అభిమానానికి నమస్కారం. తెనుగు మాట ఉన్నపుడు ఇంగ్లీషు మాట ఉపయోగించడమెందుకూ అన్నదే నా ఆలోచన 🙂
      ధన్యవాదాలు.

  9. కొన్ని సార్లు కొన్ని టపాలు వ్రాసిన వారి మనసు చూపిస్తాయో లేదా వాళ్ళు అలా వ్రాయాలి అని వ్రాసారో అని కూడా ఉంటాయండి తాతగారు.
    నేను మాత్రం వ్రాసిన వాటిలో నేను అలా అవుదాం అనుకునే వ్రాస్తున్నవి(కొంతలో కొంత ప్రయత్నిస్తున్నాను కూడా)

  10. /ఆడవారు, వారి పేరుతో రాసేవారి బ్లాగులకి అత్యంత రద్దీ ఉంటుంది, వారేమి రాసినా, ఆఖరికి చీపురుకట్ట గురించి రాసినా చదువుతారు, అబ్బో ఎంత గొప్పగా చెప్పేరంటార/
    నిజమే. అక్కాయ్-తమ్మాయ్, తాతాయ్-అమ్మాయ్ బ్లాగరులు కొందరు! కొందరికి ఆస్థాన క్విడ్-ప్రో-కో కామెంటర్లు వుంటారు, అదో తుత్తి. 🙂

    /రాజకీయంలో ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకోడమే కనపడుతుంది/
    మరి కాక?! రాజకీయం అంటేనే బురద, దిగినవాడు ప్రత్యర్థి బురదకు వెరవడం ధర్మం కాదు. 🙂 అందులోనూ పొద్దుగాల ‘స్పిరిట్’ ఎక్కువయి రాసే రాతలు, ఒక్కోసారి మనకు కిక్ ఇస్తాయి. 🙂 😉

    /కొంత మందికి బ్లాగులుండవు కాని వ్యాఖ్యలు రాస్తూ ఉంటారు/
    “వ్యాఖ్యలు చేయుటయందే నీకధికారం కలదు గాని, ఆ వ్యాఖ్యలకు కారణం కారాదు. అట్లని వ్యాఖ్యలు చేయుట మానరాదు” అన్న గీతను ఆచరించే పరమ బ్లాగవతోత్తములు. 🙂 క్విడ్-ప్రో-కో్‌లకు అతీతుతులు(చాలా వరకూ).

    /వారికి అసూయ ఉండి అది కాస్తా ఈర్ష్యగా మారి దాని పర్యవసానంగా విచక్షణ కోల్పోయి ఇటువంటి వ్యాఖలు రాస్తారు./
    విసిగిపోయి, ఒళ్ళుమండి అలా రాసివుండవచ్చని అనుకోకూడదా?!

    /ఒక మంచి మాట, ఒక సద్విమర్శ, గొప్ప స్ఫూర్తి నిస్తుంది/
    అవునేమో, కాని అవి అయాచితంగా స్పాంటేనియస్‌గా, క్విడ్-ప్రో-కో గ్రూపునుంచి వచ్చినది అయివుండకపోతేనే.

    • @Snkrగారు,
      మీతో సహా చాలా మంది వ్యాఖ్యలు, నా బ్లాగులో రాసేవారు మీరుచెప్పే,,,,కోవలోకి రారు. ఇక అమ్మాయ్! అబ్బాయ్!! తాతాయ్!!! నేనెవరినీ అనలేదు 🙂 వారే నాతో వరసకలిపి పదే పదే అంటే నేనకపోతే అది సభ్యత కాదేమో, బంధువులయ్యారు తప్పించి నేను రాసినది ప్రతీదీ బాగుందనలా, మీలా, నా మనసుకు నచ్చిన, నేను మెచ్చినవారు చాలా మంది, నా బ్లాగులో వ్యాఖలే పెట్టడం తగ్గించేసేరు.ఒళ్ళు మండి రాస్తారేమో అన్నారు కదా! బాగోకపోతే ఆ బ్లాగు వదిలెయ్యచ్చుగా, ఇలా మాట్లాడటం సభ్యత అంటారా?సద్విమర్శకు ఎప్పుడు స్వాగతమే
      మరో టపా రాయించే ప్రయత్నం చేసేరు కాని 🙂 రాయను
      ధన్యవాదాలు.

      • @Snkrగారు,
        మీతో సహా చాలా మంది వ్యాఖ్యలు, నా బ్లాగులో రాసేవారు మీరుచెప్పే,,,,కోవలోకి రారు. ఇక అమ్మాయ్! అబ్బాయ్!! తాతాయ్!!! నేనెవరినీ అనలేదు 🙂 వారే నాతో వరసకలిపి పదే పదే అంటే నేనకపోతే అది సభ్యత కాదేమో, బంధువులయ్యారు తప్పించి నేను రాసినది ప్రతీదీ బాగుందనలా, మీలా, నా మనసుకు నచ్చిన, నేను మెచ్చినవారు చాలా మంది, నా బ్లాగులో వ్యాఖలే పెట్టడం తగ్గించేసేరు.ఒళ్ళు మండి రాస్తారేమో అన్నారు కదా! బాగోకపోతే ఆ బ్లాగు వదిలెయ్యచ్చుగా, ఇలా మాట్లాడటం సభ్యత అంటారా?సద్విమర్శకు ఎప్పుడు స్వాగతమే
        మరో టపా రాయించే ప్రయత్నం చేసేరు కాని 🙂 రాయను
        ధన్యవాదాలు.

        @తెలుగు భావాలుగారు,
        నచ్చినందుకు మెచ్చుకోలు
        ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి