శర్మ కాలక్షేపంకబుర్లు-మనిషి మళ్ళీ రోడ్డున పడ్డాడు.

మనిషి మళ్ళీ రోడ్డున పడ్డాడు.

“ఏమోయ్! నిన్నే!! మళ్ళీ ఉద్యోగం లోకి రమ్మంటున్నారు” అన్నా, ఇల్లాలితో. “ఎవరినీ” అంది. “నన్నే” అన్నా. “మిమ్మల్ని, ఈ… వయసులో… ఉ  ద్యో  గా  ని  కి…. రమ్మన్నదెవరబ్బా?” అంది. “అంటే నేను పని రాని వాడిలా కనపడుతున్నానా?” అన్నా. “అహహ! నేననలేదే, మీరే అనుకున్నారు” అంది. “నీ మాటలలో భావం అదేలే” అన్నా. “మీరేదో అనేసుకుని అది నా మాటంటే ఎలా, బాగుంది వరస, దీనికేంగాని, అసలు సంగతేంటో చెప్పరాదూ” అంది. “నేను పని చేసిన రంగంలో ఒక కంపెనీ, గర్నమెంటుదేలే, ఒక ప్రాజక్ట్ చేపట్టిందిట. మా లాటి అనుభవజ్ఞులు కావాలి అంటూంది, అది పూర్తి చేయడానికి.” “నిజమా లేకపోతే నన్ను ఆటపట్టిస్తున్నారా” అంది. “నిజమే.” “ఇంతకీ ఉద్యోగం ఎక్కడట, ఏమిస్తారు” అంది. “గుంటూరు నుంచి శ్రీకాకుళం లోపు, మగవాడి జీతం, ఆడవారి వయసు అడగ కూడద”న్నా. “చెప్పకపోతే పోనీ, దాచుకోండి, మళ్ళీ ఇన్ కం టాక్సో అంటారుగా, అందుకనమాట” అంది. “నెలకి పాతికిస్తారు, నువ్వన్నట్లు ఇన్ కం టాక్స్ పోను ఇరవై వస్తుంది చేతికి” అన్నా. “ఉద్యోగం ఏంటిటా, లోపలా, బయటా?” అంది. “సాధారణం గా ప్రాజెక్ట్ అంటేనే మనిషి మళ్ళీ రోడ్డున పడినట్లే” అన్నా. “అంటే మళ్ళీ మీ తలపాగా మీరూ తయారా?” అంది. “లేదోయ్ ఈ సారి టోపీ కొనుక్కుని గుండు, పిలక దాచేస్తా, అందులో” అన్నా. “ఇరవై కోసం మళ్ళీ రోడ్డున పడటం అవసరమా మీకు, ఈ వయసులో, ఎంతకాలం?” అంది. “రెండేళ్ళు కాంట్రాక్ట్. మళ్ళీ ఉద్యోగం చెయ్యాలని ఉంది, జిలేబీ గారు రిటయిరయ్యి మళ్ళీ ఉద్యొగం కోసం అడవిలోకెళ్ళిపోయారు, నేనేం తీసిపోయానా?” అన్నా. “అయ్యో! ఆవిడ ఏ ముఫ్ఫై ఏళ్ళదోనండి, ఏ సాఫ్ట్ ఉద్యోగమో మానేసి కొత్తదానిలో చేరి ఉంటుంది, మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చెప్పి ఉంటుంది, మీదో పిచ్చి మాలోకం. చేతిలో కుడుము పెడితే పండగనుకుంటే ఎలా” అంది. “కాదనుకుంటానోయ్! ఆవిడ అడవిలో ఉద్యోగానికి వెళ్ళగా లేనిది నేను రోడ్డున పడలేనా ఉద్యొగానికి, ఆవిడకి మనవలున్నారంది” అన్నా. “ఏమో! మీ తిక్క మీదేగాని నా మాటెప్పుడు విన్నారుగనక,ఆవిడకి పిల్లలే ఉండి ఉండరు” అంది. “అయ్యో! నీ మాట వినక ఏ చెఱువు నీళ్ళుతాగేనంటావు ఇన్నాళ్ళూ.” “ఏమో! ఏ చెఱువు నీళ్ళు తాగినా నాకేంటో నచ్చలేదు సుమా!” అంది. ఈలోగా చిన్న కోడలు వచ్చి “మామయ్య గారు, పెద్దవాళ్ళు మాటాడుకునేటపుడు పిల్లలు కలగ చేసుకోకూడదని నాకు చిన్నప్పుడే చెప్పేరు, కాని ఇప్పుడు తప్పక కలగ చేసుకుంటున్నందుకు క్షమించండి. నా ఉద్దేశం అత్తయ్య గారు చెప్పినట్లుగా ఈ ఉద్యోగం మీరు ఈ వయసులో చేయడం నాకూ నచ్చలేదు. మీరలా కులాసాగా ఉంటే అంతే చాలు. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయడం ఎందుకోసం, డబ్బుకోసం, డబ్బు మీకు కావాలా? అక్కరలేదే! మరెవరికివ్వడానికి, మాకే కదా! మీరిప్పటికిచ్చినది చాలు. మా బతుకు మేము బతికే మంచి అలవాట్లిచ్చారు, మీరు శ్రమ పడి సంపాదించి తెచ్చి ఇప్పుడు మాకివ్వక్కరలేదు. అందుచేత ఉద్యోగానికి వద్దనేదే నా సలహా,” అంది.”అమ్మాయి! నీ ఉద్దేశం చెప్పేవు, విషయాన్ని విశ్లేషించావు, చూదాం ఏ జరుగుతుందో, దరఖాస్తు ఇచ్చి ఉంచా” అన్నా. “తిక్క మేళం చెప్పిన మాట వినరమ్మా, చెయ్యనీ, నాలుగురోజులికి నీరసం వస్తే మానేస్తారే, అసలు వాళ్ళీయనకి ఉద్యోగం ఇచ్చినపుడు చూద్దాం లే” అంది. “అలా కాదోయ్! పుట్టినది మొదలు నేటి దాకా నేను, నావాళ్ళు అనే బాధపడ్డా, చివరి రోజులలోనైనా దేశానికేమైనా చేద్దామని, ఆ సావకాశమిస్తే” అన్నా. ఒక్క సారి అంతా నిశ్శబ్దం, ఏమో! ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విది విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ….

అదండి సంగతి వాళ్ళకేం తెలుసు, మళ్ళీ మనిషి రోడ్డున పడ్టం ఖాయం, అప్పటి దాకా..
శలవు
స్వస్తి

ఈ తలకట్టు బినాదేవిగారిదనుకుంటా.వారెవరో తెలియదు కాని వారికి క్షమాపలతో వాడుకుంటున్నా, తలకట్టు మాత్రమే.

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనిషి మళ్ళీ రోడ్డున పడ్డాడు.

  1. మీరిలా బ్లాగుల ద్వారానే దేశసేవ చెయ్యాలని కోరుకుంటున్నాను.

    అయినా మొన్నామధ్య ప్రయాణంలో యువకులతో మాట్లాడి కాలక్షేపం చేసారు కదా!
    మీలాంటి అనుభజ్ఞులు నవతరంతో కమ్యూనికేట్ చేయడం వాళ్ళకి ఎంతో ఉపయోగం.

  2. సేవ చేయాలనే ఆసక్తి మీకు ఉంది. మీ అనుభవం ఉపయోగపడుతుంటే కాదనడం ఎందుకండీ.? మీరు చేయలేని పరిస్థితి వస్తే అప్పుడే మానేయండి.

    కొత్త ఉత్సాహం మీకు ప్రతికూల పరిస్థితులని ఎదుర్కొనే శక్తి ఇస్తుంది మాస్టారూ.. మనోబలం ముందు అన్ని ఉష్ ..కాకి.

  3. తాతయ్య గారూ, వద్దండి , కాని ఏదో రోజులు సరదాగా గడిచిపోతున్నాయి కదా దేవుడి దయ వల్ల. గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు అంటే రమారమి ఒక 500 KM ఉంటుంది, తిరగలేరండి బాబు , అసలే ఎండలు వాయించి వదిలిపెద్తాయి. ఆ ఉక్కపోత, ఎక్కి దిగడం , తిండి బాధ , ఇవన్ని అవసరమా ఇప్పుడు.
    కాని మీరేమో ఇప్పటి దాకా పని చేసి చేసి ఉన్నారు, సడన్ గా రెస్ట్ తీసుకోవడం అంటే కొంచెం కష్టమే.

    • @ వెంకి గారు,
      స్వాగతం
      గుంటూరు నుంచి శ్రీకాకుళం లోపు ఎక్కడో ఒక చోట బహుశః ఒక వంద కిలో మీటర్ల పరిధి ఉండచ్చు.చిన్నవారయినా మీ సలహా బాగుంది. చిన్నబ్బాయి నిన్నటినుంచి గొడవ చేసేస్తున్నాడు,ఎందుకొచ్చిన తిప్పలని.చూదాం
      ధన్యవాదాలు.

  4. సారీ మాష్టారూ, నా ఓటు శ్రీమతి శర్మ గారికి.
    దేశానికి సేవ చేయడానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. మీరు యువకులే అని తెలుసు కానీ ఇప్పుడు మళ్ళి రోడ్డున పడడం ఆమోదించను. డెస్క్ జాబు అయితే నిరభ్యంతరంగా చేయవచ్చు.

    • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యంగారు,
      నా ఇల్లాలి మాటని బలపరిచేవారే ఎక్కువ మంది కనపడుతున్నారు :). దరఖాస్తు ఇచ్చి ఉంచా ఏమవుతుందో చూదాం.
      ధన్యవాదాలు

  5. ఈ వ్యాఖ్య వింతగా ఉండ వచ్చు కానీ ఇది నిజం,
    మిమ్మల్ని మళ్ళీ పిలిపించింది మంచి పనిమంతులు అనే ఒక్క విషయం మాత్రమే కాదు, కొత్తవారికి ఉధ్యోగం ఇవ్వకూడదు అని. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే ఈ పని ౨ సంవత్సరాలు మాత్రమే అదే కొత్తవారికి ఇస్తే ప్రభుత్వం వారిని పూర్తికాలపు ఉధ్యోగిగా చేర్చుకుని అతనికి పించను అందించాలి కదా! ……..మరి.

    మా నాన్నగారికి Retirement కాలం పొడిగించారు అది కూడా పైన విశ్లేషించిన వీధానంలోకే చేరుతుంది.

    • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
      మీరు చెప్పింది నిజం,నూటికి నూరు పాళ్ళూ. 1980 నుండి పూర్తిగా కొత్త వారిని తీసుకోక ఇలా చేస్తున్నారు.
      ధన్యవాదాలు

  6. ఈ జిలేబి ఎవరండీ బాబు, రీటైరెమెంట్ అయి ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోకుండా ఇట్లా అందరినీ పనిలో కి వెళ్ళ డానికి చెబ్తూంది ? ఆవిడకి వేరే పనేమీ లెదా ?

    చీర్స్

    జిలేబి.

    • @జిలేబిగారు,
      మీరయితే చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు, 🙂 చూద్దాం, నందో రాజా భవిష్యతి, అమ్మ దయ ఎలా ఉన్నది తెలియదు కదా.
      ధన్యవాదాలు

  7. రిటైర్ అయ్యక ఏమీ తోచక ఇలా అవకాశం వస్తే మళ్ళీ రోడ్ న పడాలనిపిస్తుందేమో అందరికీ 😉
    కానీ రోజూ ప్రశాంతంగా నిద్దుర లేచి పరుగులెట్టక మనసుకినచ్చినట్టు, దేశానికన్నా మనకేదైనా చేసుకుంటే తృప్తిగా అనిపిస్తుందేమో….

వ్యాఖ్యానించండి