శర్మ కాలక్షేపంకబుర్లు-“మూడు స్థలాలలో” (రావిశాస్త్రి) /ఐదో హత్య ఎవరు చేశారూ?

“మూడు స్థలాలలో”( రావిశాస్త్రి)./ ఐదో హత్య ఎవరు చేశారూ?

ఏంటో తెలీదు కాని, కష్టాలలో ఉన్నపుడు నాకు దేవుడు, రావిశాస్త్రి గుర్తొస్త్తారు. 🙂 అలా రావిశాస్త్రి ‘రచనా సాగరం’ పట్టుకు కూచుంటే ”అల్పజీవి”లో సుబ్బయ్య కనపడ్డాడు. అబ్బే కుదరలేదు, మరికొద్దిగా ముందుకెళ్ళా, అక్కడ కనపడిందో కథ “మూడు స్థలాలలో” చదివాను, మళ్ళీ, మళ్ళీచదివాను. మరి మీకోసం చెప్పాలిగా, కథ టూకీగా.రావిశాస్త్రి కధకి పెట్టిన పేరు మూడు స్థలాలలో నేను పెట్టినపేరు ఐదో హత్య ఎవరు చేశారూ?

“ఒక పట్టణం లో ఒక స్త్రీహత్య చేయబడింది, చిత్రంగా చెవులు కోసి పీక కోసి చంపబడింది. ప్రజలు కళవెళ పడ్డారు.  మర్నాడే మరో స్త్రీ హత్య చేయబడింది, అలాగే. ఈ హత్యలు ఎవరో ఒకరే చేస్తున్నారని ప్రజలు, పోలీసులు అనుకున్నారు. ప్రజల గొడవ పెరిగిపోయింది, పెద్ద పెద్ద ఆఫీసర్లంతా దిగేరు, పట్నమంతా ఇదే విషయం మాటాడుకుంటున్నారు, హత్య చేసిందెవరో తెలియలేదు కాని, మరో హత్య జరిగింది. వారాల తేడాలో, అదే పద్ధతిలో మరో స్త్రీ హత్య చేయబడింది. ప్రజలు గగ్గోలు పెట్టేరు. పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టున్నారని తిట్టనివారు లేరు. ఒక రాత్రి ఆ వూరి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక స్త్రీ కూచుని ఉంది, ఒంటరిగా! ఆమెను అందరూ “బజారు లంజ” అంటారు, కాని అసలు పేరు అందాల చిన్న. ఆమె దగ్గరకి ఒక ముష్టి వాడు మరొకరు వచ్చిమాటాడి  వెళతారు. ఒక యువకుడూ వస్తాడు, జేబు కాట్ల పెదపాపడు, వాడు బజారు పాపకి టీ పట్టించి చెయ్యీ, చెయ్యీ కలిపి చీకటిలోకి తీసుకుపోతాడు. వెనకనే ఒక సైకిల్ రిక్షా వెళుతుంది. కొద్ది సేపటికి బజారు పాప కేకలు, పోలీసుల విజిళ్ళు వినపడగా బజారు పాప చెవులు తెగి, పీక కోయబడి చావు బతుకుల మధ్య దొరుకుతుంది. హంతకుడు అక్కడే దొరికాడు.మరణ వాగ్మూలమిచ్చి చనిపోతుంది, అందాల చిన్ని. పోలీసుల్ని ప్రజలు పొగిడారు, బజారు పాప ధైర్యాన్నీ త్యాగాన్నీ కొనియాడారు. కేస్ కోర్టుకి వెళుతుంది. జడ్జీ ఉరి శిక్ష విధిస్తారు. హంతకుడు బోనులోంచి, అంత మంది మధ్యనుంచి తప్పించుకు పారిపోతాడు. ఆ రాత్రి వృత్తినే దైవంగా నమ్ముకున్న డాక్టర్ కేజువాలిటీలో ఉంటాడు, అక్కడ ఉన్న నర్స్ హంతకుడు చాలా లాఘవంగా పారిపోయినందుకు హంతకుడిని శ్లాఘిస్తుండగా, పోలీసులు ఒక గుండు దెబ్బ తిన్న వాడిని తీసుకొస్తారు. రక్తం అర్జంటు గా కావాలంటే కూడా వచ్చిన పోలీస్ ఇస్తాడు, చిత్రంగా అతనే కాల్చినది కూడా.  కోర్ట్ నుంచి పారిపోగా పట్టుకున్నవాడే హంతకుడు , వైద్యం తరవాత అతను బతుకుతాడు, జైల్ కి తీసుకుపోతారు, పోలీసులు. తరవాత ఉరి అమలు జరుపుతున్నారు, చిత్రంగా ప్రాణం పోసిన డాక్టరే హంతకుడు చనిపోయినట్లు ధృవపరుస్తారు.” ఇంతతో కథ అయిపోయింది.

ఈ కథ చదివితే, నాకు చిన్నపుడు చదువు కున్న మరొక కథ గుర్తుకొచ్చింది, పూర్తిగా కాదుగాని, చెబ్తా.

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ఒక దేశాన్ని జెర్మనీ ఆక్రమించింది. ఆ దేశపు పౌరులు కొంతమంది దేశం నుంచి తప్పించుకుపోవాలని బయలుదేరుతారు, నాలుగు మూలలనుంచీ. యాధృచ్చికంగా వారంతా చెక్ పోస్ట్ దగ్గరి హొటల్ లోకలుస్తారు. అలా పారిపోవాలనుకున్నవారిలో ఉన్నఒకామెను వేశ్య గా గుర్తించి తేలికగా మాటాడుతారు, మిగిలినవారు. చెక్ పోస్ట్ దగ్గరి జెర్మన్ ఆఫీసర్ దేనికి లొంగేలా లేడు, బయటిపోయే మార్గమూ కనపడటంలేదు. జెర్మన్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళిన సందర్భంలో, ఆఫీసర్ వేశ్య కేసి ఆశగా చూసినట్లు మిగిలినవారు గుర్తిస్తారు. వేశ్యను ఎరగా వేసి తప్పించుకోవచ్చని తీర్మానిస్తారు, కాని వేశ్యను అడగడమెలా? మొత్తానికి అడుగుతారు, జెర్మన్ ఆఫీసర్ దగ్గర పడుకుని, అతని కోర్కె తీర్చి అందరిని సరిహద్దు దాటించమనీ, నీవెలాగా వేశ్యవే కదా అంటారు. దానికి ఆమె ”నేను వేశ్యనే, నాదేశపౌరులకి కాని ఒక జెర్మన్ తో పక్కపంచుకోను, చనిపోవడానికైనా, నా దేశ గౌరవం నిలపడానికి సిద్ధ”మంటుంది, కాని ససేమిరా జెర్మన్ తో పడుకోనని చెప్పేసింది. ఇప్పుడు మిగిలినవారు గుంపుచింపులు పడతారు, దేశం కోసం నీవు అతని దగ్గర పడుకుంటున్నావు కాని, దేశపు పరువుపోగొట్టడానికి కాదని చెప్పి బలవంత పెట్టి ఒప్పిస్తారు. ఆమెను తీసుకుని జెర్మన్ ఆఫీసర్ దగ్గరకెళ్ళి ఆమెను ఒప్పచెప్పి మిగిలినవారు గేట్ దాటిపోవాలని పన్నాగం పన్నుతారు. ఈలోగా ఆ పోస్ట్ మీద బాంబులు కురవడం వీరంతా ఆ అడావుడిలో తప్పించుకుని దేశం బయటకు పోవడం జరుగుతుంది.

రావి శాస్త్రి గారు పై కథ రాసినపుడు రెండవ కథతో కాని ప్రేరణ పొందేరేమో చెప్పలేను. రెండవ కథలో వేశ్య తాలూకు గొప్పతనం చెప్పబడింది. శాస్త్రిగారి కథలో వేశ్య ప్రాణ త్యాగమూ కొనియాడబడలేదు. ప్రజలొక సారి అనుకుని ఊరుకున్నారు, రచయితా ఆమెగురించి పెద్దగా చెప్పలేదు. సంఘం గురించి ఆమె త్యాగం చాలా గొప్పది, ఒక శిలా విగ్రహం ఉంచి జ్ఞాపకం చేసుకోవలసినది. నేడు సంఘాన్ని విచ్చలవిడిగా దోచుకున్నవారికి వీధికి మూడు విగ్రహాలున్నాయి కాని ఇటువంటి త్యాగ శీలులికి లేకపోవడం చిత్రంగా లేదూ?ఇటువంటివారి త్యాగానికి విలువలేదా? సంఘం గుర్తించదా?

 నిజానికి అందాలచిన్నను హత్య చేసినది హంతకుడా? పోలీసులా?

 

 

 

 

 

 


4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-“మూడు స్థలాలలో” (రావిశాస్త్రి) /ఐదో హత్య ఎవరు చేశారూ?

  1. శర్మ గారూ ,

    నమస్తే .

    వేశ్యకున్న నీతి నియమాలు , మన రాజకీయ నాయకులకు లేకపోవడం అందరూ విఛారించవలసిన విషయమే .

    ఇక మీరన్నట్లు రావిశాస్త్రి గారి లాంటి వాళ్ళు బజారు పాప పాత్రకు అన్యాయం చేశారనే అనిపిస్తున్నది యిది చదివిన తర్వాత .

    హత్య చేసినది పోలీసులేనని అర్ధమవుతున్నది . కారణం , ప్రజల మధ్య ఆ శాఖకున్న నమ్మకం సన్నగిల్లకుండా వుండేటందులకు మాత్రమె , బలపడేటందులకు కాదు సుమా ! .

  2. ‘స్పందించండి అని చెబుతున్నారు కాబట్టి చెబుతున్నా ! – కొందరికి ‘పని లేక’ రావి శాస్త్రి గుర్తుకొస్తారు ! మరి కొందరికి ‘కష్టాలు’ వస్తే రావి శాస్త్రి గుర్తుకొస్తారు !!

    జేకే!
    జిలేబి

వ్యాఖ్యానించండి