శర్మ కాలక్షేపంకబుర్లు-అసాధ్యం.

అసాధ్యం.

లిఖేత సుఖతాసు తైలమపి యత్నతఃపీడయన్
పిబేఛ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః
కదాచిదపి పర్యటన్ శశివిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాదయేత్….భర్తృహరి

తివిరి ఇసుమునతైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు……..లక్ష్మణ కవి.

కష్టం మీదనయినా ఇసుకనుంచి నూనెను పిండచ్చు,ఎండమావిలో నీళ్ళు తాగచ్చు, వెతికి వెతికి కుందేటి కొమ్మునూ తెచ్చుకోవచ్చు కాని మూర్ఖుని మనసును రంజింపచేయలేము అన్నారు కవి.

ఇసుకనుంచి నూనె తీయగలమా? ఒక వేళ ఒలికిపోయినదైనా తిరిగి తీసుకోడం సాధ్యం కాదు. దానిని సాధించాలంటే చాలా తిప్పలు పడి నూనె తీసుకోవాలి, దాదాపు అసాధ్యం, ఎండమావిలో నీరుండదు, ఉన్నట్లు కనపడుతూ ఉంటుంది మరి కొద్ది దూరంలో. అలా నీటి కోసం ఎండమావులలో తిరిగి తిరిగి ఎక్కడో ఒక చోట నీటిని కనుగొని తాగచ్చు, ఇదీ దాదాపు అసాధ్యమే, కుందేలుకి కొమ్ము ఉంటుందా? రెండు చెవులు మాత్రం ఉంటాయి. కొమ్మున్న కుందేలును ఎవరూ చూడలేదు,లేదు, అటువంటి కుందేలుకు కూడా కొమ్ము మొలిపించవచ్చు,ఏమో కావచ్చేమో అనే ఆశ ఉండచ్చు, అది జరగనిదని తెలిసినప్పటికీ.!!!.  కవి గారు చెప్పిన మూడు ఉపమానాలూ ఒక దానికంటే మరొకటి కష్టతరం. ఒకలా చెప్పుకోవాలంటే ఒకటి కష్టం, కష్టతరం, కష్టతమం అనుకోవచ్చు. ఇంత కష్టమైనవాటినైనా సాధించుకోవచ్చేమో కాని మూర్ఖుని మనసు మార్చడం మాత్రం మనవల్ల కాని పని, దానికోసం ప్రయత్నించద్దని, ఆ పైన చెప్పిన కష్ట, కష్టతర, కష్టతమమైన పనులన్నిటికంటెనూ కూడా కష్టమైనదనీ, ఆ ప్రయత్నం వలన ఉపయోగం లేదని పెద్దల మాట.అసాధ్యమైన పనులైనా చేయడానికి సాధ్యపడచ్చేమోనని అనుమానించారు కాని మూర్ఖుని మనసు మార్చడం మాత్రం సాధ్యం కాదని నిష్కర్షగానే చెప్పారు.

లోకంలో మనకు ఇటువంటివారు తగులుతూనే ఉంటారు, మరెలా?

భాస్కర శతక కారుడు ఇలా అన్నారు,

అనఘుని కైన జేకుఱు ననర్హుని గూడి చరించునంతలో
మనమెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైన దప్పవు యధార్థము, తానది యెట్టులన్నచో
నినుముని గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా…

ఇనుముతో కలిసిన అగ్నికి సమ్మెటపోటు తప్పనట్లుగా తగనివానితో స్నేహము చేయుచూ సంచరించినయెడల ఎంతటి సద్గుణవంతునకైనా ఏదియో ఒక సమయమున అవమానము హాని కలుగును.

ఎంత సద్గుణుడైనా సరే చెడ్డవానితో చేరితే మిగిలేది అవమానమూ ఆపైన హాని. ఇది నిత్య వ్యవహారంలో చూస్తూనే ఉంటాం కాని ఇటివంటి స్నేహియులను ఆడ/మగ ఎవరైనా వదుల్చుకోలేము. అందుచేత చేయవలసినదేమంటే వారికి దూరంగా ఉండటమే….ఇది చెప్పడం తేలికే,ఆచరణే కష్టం.

భర్తృహరి మరో శ్లోకంలో ఇలా అన్నారు,

సన్తప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే
అస్తస్సాగరశుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధమమధ్యమోత్తమజుషామేవంవిధావృత్తయ…… భర్తృహరి.

నీరము తప్తలోహమున నిల్చి యనామకమైనశించు నా
నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు, నా
నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభం బౌ
రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్…లక్ష్మణ కవి.

నీటిచుక్క కాలిన ఇనుముపైబడి పేరు కూడా లేక నశించును. అదే నీటిబొట్టు తామరాకుపై నిలిచి ముత్యంలా మెరుస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలోబడి ముత్యమే అవుతుంది. ఈ ఫలితాలే అధములు, మధ్యములు, ఉత్తములను ఆశ్రయించినవారికి కలుగుచున్నవి అని కవిగారి భావం.
అలా కాలిన ఇనుముపైబడిన నీటి చుక్కలాకా ఇటువంటివారికి దూరంగా ఉండమనేగా వీరి భావం కూడా…

మరి మన మనసుందే అది కోతిలాటిది…వద్దన్నపనే చేస్తుంది…ఆ తరవాత వచ్చిన ఫలితాలకి ఏడుస్తుంది, బాధపడిపోతుంది…అదీ చిత్రం…

 

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అసాధ్యం.

  1. మనసు కోతి లాంటిదే. కానీ సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదండీ. సాధన చేసి ఇలాంటివి క్రమంగా సాధించాలి. పోస్టు బాగుంది శర్మగారు.

  2. “తివిరి ఇసుమునతైలంబు దీయవచ్చు” దానిని సాధించాలంటే చాలా తిప్పలు పడి నూనె తీసుకోవాలి,
    ————
    కెనడా లో oil sands (నూనె ఉన్నఇసుక) ఉంటే ఆ ఇసుకని నీళ్ళల్లో ఉడకపెట్టి నూనె తీస్తున్నారు. మీరన్నట్లు “తిప్పలు పడి” తీస్తున్నారు డబ్బు కోసం.

    • రావు లక్కరాజు గారు,
      కవి గారు దీర్ఘదర్శి. ఇప్పటికి ఇసుమున తైలం తీయడం సాధ్య పడిందనమాట. ఒకటో శతాబ్దిలో ఇలా చెప్పేరు. ఎప్పటికైనా ప్రయత్నం మీద ఈ మూడు పనులూ జరగచ్చేమో కాని మూర్ఖుని మనసు మాత్రం ఏ కాలం లోనూ రంజింప చేయలేము, ఆ ప్రయత్నం చెయ్యదనే చెప్పేరండి.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి