శర్మ కాలక్షేపంకబుర్లు-వ్యసనాలు

వ్యసనాలు.
వ్యసనం అనగా “ఎ బేడ్ ప్రాక్టీస్” అన్నాడు నిఘంటు కారుడు. ఇందులో మంచి వ్యసనాలు, చెడ్డ వ్యసనాలు వేరుగా ఉండవు. మొదట సుఖమిస్తున్నట్లుగా కనపడి చివరికి దుఃఖాన్ని కలగచేసేది వ్యసనం. వ్యసనాల గురించి విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన ఒక విషయం గుర్తుకొచ్చింది. ఆ రోజు వ్యసనాలు ఏడు అన్నాడు, విదురుడు. బహుశః సంఖ్య కూడా చివరికి రోదన ధ్వని సూచకమే అయింది. విదురుడు చెప్పిన వ్యసనాలు చూద్దాం,

వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు పల్లదనంబును, దండంబు బరుసదనము,
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత, యనెడు సప్త వ్యసనముల జనదు తగుల.

అయన చెప్పేసేడండి. ఇక మనం చూసుకోవాలి. నేటికీ వీటిలో మార్పు రాలేదు. మరి కొన్ని వీటికి చేరేయేమో తప్పించి, ఒక్కటీ తగ్గలేదు. మొదటగా చెప్పిన వెలది అనేది,పురుషులను ఉద్దేశించి చెప్పినది.గత అరువది సంవత్సరాలుగా నేనెరిగిన సమాజంలో వ్యభిచారం గొప్ప విషయంగాను, ఒకరి కంటే ఎక్కువమంది స్త్రీలతో సంబంధం ఉండటం గొప్పగా భావించేవారు. తూ.గో.జీ లో ప్రత్యేకంగా మూడు నాలుగు ఊళ్ళు ఈ ప్రత్యేకతని నిలబెట్టుకునేవి. నేడిది విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే, ప్రతి గొడవకి మూల కారణాలు వెతికితే దొరికేవి రెండే. ఒకటి స్త్రీ, రెండు ధనం,ఈ రెండు కారణాలు తప్పించి లాయకీ అయిన మూడవ కారణం, తగువుకి కనపడదు. కాని ఈ కారణాలకి ముసుగేసి మరేవో కారణాలతో కలహించుకుంటూ ఉంటారు. చరిత్ర ఏ కాలం నుంచి చూసినా కారణాలివే. మార్పురానిదేమయినా ఉన్నదీ అంటే, ఈ రెండు కారణాలే మార్పు చెందలేదు, ఎంతకాలమయినా.ప్రపంచ యుద్ధాల దగ్గరనుంచి, అన్ని యుద్ధాలకీ మూలం ఈ రెండు కారణాలే. ఈ వ్యసనం మనుషులలో రోజురోజుకు పెరుగుతోందే తప్పించి తగ్గటంలేదు. అదేమిటి, అయితే స్త్రీ, పురుషులంతా ముక్కు మూసుకుని కూచోవాలంటావా అనకండి. ధర్మ,అర్ధ, కామ,మోక్షాలు, నాలుగు పురుషార్ధాలు. ఇక్కడ పురుషుడంటే మానవులని అర్ధం, అనగా స్త్రీ, పురుషులిద్దరూ. మూడవదయిన ఈ పురుషార్ధాన్ని ధర్మంతో ముడెయ్యమన్నారు. ధర్మంతో ముడెయ్యని అర్ధం, కామం, వెలది వ్యసనమేమరి.నేటి కాలానికి తారా చౌదరి లాటి వాళ్ళు వీధికి ముగ్గురు తయారవుతున్నారు. ఈ వ్యసనానికి బానిసయి ప్రాణాలు కోల్పోయినవాడు, ఈ వ్యసనం తప్పించి అన్ని విధాలా గొప్పవాడయిన రావణుడు.

ఇక జూదము, పానము, ఇవి రెండూ కవలపిల్లలలాంటివి. అసలింకా చెప్పాలంటే మూడు వెలది. జూదంబు, పానంబు, ఈ మూడూ, ఒకటి మరోదానికి సంపూరకం, పరిపూరకమున్నూ. నేడు ప్రభుత్వాలు నడుస్తున్నది, సొమ్ము జమ పడుతున్నది ఇందులో ఒకటైన తాగుడు నుంచే. ఈ మధ్య మనం చూస్తున్న విషయాలు అసలు వాటికి చిగుళ్ళు తప్పించి పూర్తి స్వరూపం కాదని పెద్దల ఉవాచ. నా అనుభవంలో,గత అరువది సంవత్సరాల పైబడి జూదం ఏదో రకంగా సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది, బ్రాకెట్టు,మట్కా, లాటరీ,పేకాట. ఇందులోమొదటి మూడూ వెనక పట్టినా నాలగవది మాత్రం చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉంది.పల్లెలలో కూడా ఈ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి.ఈ వ్యసములలో జూదం మూలంగా రాజ్యం పోగొట్టుకున్న వాడు ధర్మరాజు, పానం మూలంగా కచునికి మృతసంజీవని నేర్పవలసి వచ్చింది శుక్రునికి, రాక్షసుల ఇష్టానికి వ్యతిరేకంగా . ఈ ఇద్దరూ ఎంత గొప్పవారయినా ఈ వ్యసనం మూలంగా బాధపడి తమ వారికి కూడా బాధ కలగ చేశారు.

వేట.నిజం చెప్పాలంటే యిది కలిగినవారి వ్యసనం.మిగతావి కావా అనకండి.వేట రాజులకి ఉద్దేశింపబడింది. అది కూడా క్రూర జంతువులను చంపి ప్రజలను రక్షించడానికే కాని, సాధు జంతువులను చంపి తినమని కాదని భీష్ముడు చెప్పేడు.కాని నేడు దానికి వ్యతిరేకంగా సాధుజంతువులను మాంసం కోసం చంపుతున్నారు. ఈ వ్యసనం మూలంగా కొడుకును పోగొట్టుకుని మరణం పాలయిన వాడు దశరధుడు.నీరు తాగుతున్న ఏనుగును వేటడుతున్నాననుకుని ముని కుమారుని చంపి, శాపానికి గురయి కొడుకుని అడవులకుపంపి, ప్రాణాలు పోగొట్టుకున్న వాడు దశరధుడు.

పలుకుపల్లదనం.దీన్ని వాచాలత్వం లేక దంభం అనచ్చేమో. ఎందుకంటే, తన తాహతు మించిన పనులు చేస్తానని చెప్పడం దీనికిందకి వస్తుందనుకుంటా. ఇలా చెప్పడం మూలంగానే దుర్యోధనుడు కర్ణునిపై ఆశ పెంచుకుని పాండవులకు వాడి సూదిమొన మోపిన చోటుకూడా ఇవ్వనని చెప్పినది. దీనికి చెప్పుకోవలసినవాడు కర్ణుడే. ఇది కూడా వ్యసనమన్నారు.

దండంబు పరుసదనము. ఈ వ్యసనానికి మంచి తార్కాణం హిరణ్యకశిపుడు. కొడుకైన ప్రహ్లాదుని అనేక ఇక్కట్ల పాలు చేసి దండించాడు కదా. హరి రక్ష ఉన్న ప్రహ్లాదునేమీ చేయలేకపోయాడు అది వేరు విషయం. చివరిది ఆఖరిది అయిన సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత దీనికీ ఉదాహరణ దుర్యోధనుడెనన్నారు గరికపాటివారు.

ఇలా వ్యసనాల పాలయిపోయినవారు ఇహ పరాలగురించి ఆలోచించక వీటి మీద దృష్టి నిలిపి పాడయిపోతున్నారు. చివరికి దుఃఖం పాలబడుతున్నారు.పై చెప్పినవి కాక, నేడు అక్రమమార్గాలలో డబ్బు సంపాదించడం, కాఫీ,టీ లు, సిగరెట్లు, మత్తు మందులు, ఇవీ నేటి కాలానికి యువతను పట్టి పీడిస్తున్న వ్యసనాలు. నేటి కాలానికి అలవోకగా అబద్ధాలాడుతున్నారు, ప్రతి చిన్న విషయానికీ, ఇందులో ఆడ మగా తేడాలేదు.. “నోరు అంబాలపండు చెయ్యి బలుసు ముల్లు” అని సామెత, పిల్లికి బిచ్చం పెట్టనివాడు, ఎవరో చేసేదానాన్ని తను చేస్తున్నట్లుగా, కబుర్లు చెబుతూ పేపర్లో ఫోటోలు వేయించుకోవడం, నేడు మనం అందరం ఏకగ్రీవంగా బ్లాగు ఒక వ్యసనం అని ఒప్పేసుకుంటున్నాము. దీని పర్యవసానం కూడా చివరికి అలాగే కనపడుతోంది. తోచినది చెప్పడం, ఇంకక్కడనుంచి ఓహో! మీరెంత తెలివయినవారు, ఎంత గొప్పవారని పదిమంది చేత అనిపించుకోడం, ఓ పెద్ద వ్యసనంగా మారిపోయింది. మేధావులు గురించి చెప్పటం లేదండి! వారి బ్లాగుల్లో రాసేదంతా రిసెర్చి లెవెల్లో ఉంటుంది కదండీ, నా గురించేనండి ఈ సొద. వీటి తో బేరీజు వేస్తే కాఫీ,టీ లు చాలా చిన్న వ్యసనాలేనండి. కాఫీ టీ లు కూడా తాగమని గొప్పగా చెప్పుకోక్కరలేదండి. అందరికి ఏదో ఒక వ్యసనం ఉందండి, అది మాన్చుకోలేరండి, పైకి చెప్పరండి, అదండి సంగతి…. ఆయ్!.

ఇంతకీ వ్యసనానికి ముఖ్యకారకులెవరండీ…….మనసు….

 

 

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వ్యసనాలు

    • @మామిడికాయ గారికి,
      ఆయ్! నా బ్లాగుకి స్వాగతమండి. నేనూ బ్లాగుల్లో కొచ్చి ఆరు నెలలండి 182 టపాలు రాసానండి,జూనియర్ బ్లాగర్నండి. ఆయ్! మీకు నచ్చినందుకు సంతోషమండి.
      ధన్యవాదాలండి. ఆయ్!

వ్యాఖ్యానించండి