దీర్ఘదర్శి
అనగనగా ఒక ఏటి మడుగు, అందులో దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే పేర్లుగల మూడు చేపలు సఖ్యంగా ఉంటున్నాయి. ఒక రోజు మొదటివాడు మిగిలిన మిత్రులతో వేసవికాలం వచ్చేసింది. ఇసుక తిప్పలు బయట పడుతున్నాయి. ఈ మడుగునుంచి బయటి నీళ్ళకి మధ్య సంబంధం తెగిపోయి ఇసుకతిప్ప బయట పడేలా ఉంది, అందుచేత మనం ఇక్కడినుంచి కదిలి మరొక చోటికి పోవడం మంచిదనిపిస్తోంది మీ ఉద్దేశం చెప్పండి, అంటే రెండవవాడు ఇప్పుడంత కంగారెందుకు ఇక్కడబాగుంది, అవసరం వచ్చినపుడు చూసుకుందామన్నాడు. మూడవవాడు, ఇప్పుడొచ్చిన భయం లేదు, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెడుతున్నావన్నాడు. ఈ మాటలు విన్న దీర్ఘదర్శి తను బయటకు వెళ్ళిపోడాని కి సిద్ధమయి, మరునాడు లోతు నీళ్ళలోకి చేరుకుంటాడు. కొద్దికాలం నడిచినతరవాత ఇసుక తిప్ప బయట పడి ఈ మడుగు మిగిలిన నీటినుంచి వేరయైపోయింది. ఇప్పుడు ప్రాప్త కాలజ్ఞుడికి భయం పట్టుకుంది. ఒక రోజు జాలరులు వలలు, మావులు తీసుకుని వేటకొచ్చి చేపలని పట్టుకోడం ప్రారంభిస్తే, జరుగుతున్నది నక్కి గమనించిన ప్రాప్తకాలజ్ఞుడు, ఒక జాలరి పట్టి దండగా గుచ్చిన చేపల మధ్య చేరి, దండలోని దారాన్ని నోటితో పట్టుకుని ఉండిపోయాడు, తనూ పట్టుబడిన వానిలా. రెండవాడు పట్టుకున్న దండను జాలరి మంచి నీటిలో జాడించి పట్టుకుపోదామని నీటిలో జాడిస్తే, ప్రాప్తకాలజ్ఞుడు నెమ్మదిగా నోటితో పట్టుకున్న తాడు వదిలేసి, నీళ్ళలోకి జారుకుని రక్షించుకున్నాడు. ఇలా దీర్ఘదర్శిలా కాని ప్రాప్తకాలజ్ఞుడిలా కాని చేయలేని మూడవవాడు జాలరికి దొరికి పోయాడు. ఇది భారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కధ. కధ చిన్నదేకాని, ఇందులో చాలా విషయం ఉంది, మనకి అవసరమైనది, నిత్య వ్యవహారంలో.
మిత్రులతో ఒకతను మన కంపెనీ పరిస్థితి బాగున్నట్లు లేదు, మనం మరొకదాన్ని చూసుకోవడం మంచిదేమో అన్నాడు, మాటల సందర్భంగా, మిగిలిన ఇద్దరు మిత్రులతో. అందుకు రెండవవారు, మీరు భయపడి భయపెడుతున్నారు, అన్ని కంపెనీలూ ఇలాగే ఉన్నాయి,భయపడి ఎంత దూరం పోగలం? ఇక్కడ ప్రస్తుతం బాగుంది కదా, అంత ప్రమాదం వస్తే చూసుకుందాంలెద్దురూ అన్నాడు. మూడవ వాడు కంపెనీ బాగానే ఉంది మీదే అనవసర భయం, అదీగాక ఇక్కడ మేనేజిమెంటు బాగుంది, మంచివాళ్ళు, మనకీ నివాసానికి, మార్కెట్ కి అన్నిటికీ దగ్గర, మరొక ఊరుపోతే అక్కడ మాత్రం ఎల్లా ఉంటుందో అన్నారు. కొద్ది కాలానికి మొదటివారు, దూరమయినా కొత్త కంపెనీ కి మారిపోయారు, మరొక ఊరిలో. రెండవవారు, కంపెనీ రెండు నెలలకొకసారి ఒక నెల జీతమిస్తామన్నపుడు మేలుకుని బయటకు పోయారు, మూడవవారక్కడే ఉండి అందరితో పాటు లేఆఫ్ లో, ఏమి చెయ్యాలో తోచక దిక్కులు చూస్తున్నారు. బతుకు వీధిన పడినట్లయింది, కొత్తది దొరికేదాకా తిప్పలేకదా..
మరొక ముచ్చట గుర్తొచ్చింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఒక అబ్బాయి, అమ్మాయి ఉద్యోగం లో చేరారు. కొన్నాళ్ళకి ప్రేమలో పడ్డారు, పెళ్ళీ చేసుకున్నారు, పాతికేళ్ళ కితం. ఒక రోజు నేను ఆ వూరు పని మీద పోతే, ఇద్దరూ కలిసేరు, తెలిసినవారు కనక, బలవంతంగా ఇంటికి తీసుకుపోయారు. గొప్పగా ఉంది వీరి జీవితం అనుకున్నా. భోజనాలు చేస్తుండగా అమ్మాయి, “బాబయ్యగారు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నాం” అంది. “బాగుంది, మంచి అలోచన, బేంక్ లోన్ పెట్టి మీ దగ్గర సొమ్ము కొంత పెట్టుకుని కొనండి” అన్నా. దానికతను “డబ్బులెక్కడున్నాయండీ ఈవిడ కొందామంటుంది కానీ” అన్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. “బరువు బాధ్యతలు లేవు, ఇద్దరూ సంపాదించుకుంటున్నారు, డబ్బులేకపోవడమేమీ” అన్నా.”నిజం బాబయ్యగారు, ప్రస్తుతం ఒక లక్ష రూపాయల దగ్గరగా అప్పు మాత్రం ఉంది, నిలవ లేదుకాని” అన్నారిద్దరూ. “మీ స్వ విషయాలలో తలదూర్చినట్లనుకోకపోతే ఒక సంగతి చెబుతా ఎక్కడో తేడా ఉంది సుమా” అన్నా. “ఒక మాట మీ ఇంటి బడ్జట్ ఉందా” అన్నా. “బడ్జటా, ఏమిటండి జీతాలు తెస్తాము ఇంటిలో పెడతాము, అవసరం బట్టి ఖర్చు పెడతాం,ఇద్దరం, అంతే” అన్నారు.”ఇలా అయితే ఎన్నేళ్ళయినా మీరు రూపాయి కూడపెట్టలేరు. రేపు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు, ఇతర ఖర్చులు వచ్చినపుడు కష్టంకదా” అన్నా. “బడ్జెట్ ఎలా” అన్నారు. “కూచోండని” కాగితం తీసుకుని వారి చేతికి రాబడి, ఉజ్జాయింపుగా ఖర్చులు వేసి చూపించి “ఇదిగో ఇంత మిగలాలి, ఇందులో మీ విలాసాలు విందులకు సొమ్ము కేటాయించుకుని మిగిలినది నిలవ చెయ్యచ్చు” అన్నా. “మీరు చెప్పినది బాగుంది, దీనిని అమలు చేయాలంటే ముందు మాకు మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి”అన్నారు. సామెత చెప్పినట్లు నీ నెత్తిమీద ఏదో ఉందంటే నీ చేత్తోనే తీసెయ్యమన్నట్లు, నాకే వచ్చిందా అనుకుని, “పంపుతాను నాకెప్పటికి తీర్చుతార”న్నా. “మీకు సంవత్సరం నాటికి బాకీ తీరుస్తామ”న్నారు. ఇంటికొచ్చి ఒక లక్ష డి.డి తీసి పంపేను. సంవత్సరానికి నా సొమ్ము వడ్డీతో ఇచ్చేశారు. ఈలోగా ఇల్లు కొనుక్కున్నారు, బేంకు లోన్ పెట్టి.పదేళ్ళలో ఇంటి బాకీ తీర్చేసేరు,వెండి బంగారాలు కొనుక్కున్నారు, మరొక ఇల్లు కొనుక్కోడానికి సిద్ధంగా ఉన్నారు, ఏ పని చేసినా ఒకరినొకరు సంప్రదించకుండా చేయటంలేదు, ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు.. సినిమాలు షికార్లు చేస్తున్నారు. సొమ్ము చేతిలోఉంది, పిల్లలు పెరిగేరు,ఉద్యోగాలూ పెరిగేయి, కార్ కొనుక్కున్నారు, అబ్బాయిని ఇంజనీరింగ్ లో చేర్చాలనుకుంటున్నారు. అమ్మాయి చదువుకుంటూ, డేన్స్ నేర్చుకుంటూ ఉంది, ప్రదర్శనలిచ్చింది. అబ్బో! దివ్యంగా ఉంది, బతుకు. నాలుగేళ్ళ కితం ఆ ఊరెడితే మా ఇద్దరినీ ఒక రోజుంచేసుకున్నారు, కార్ ఎక్కించి ఊరుతిప్పేరు, మా పని మీద,వచ్చేటపుడు బట్టలు పెట్టి,గౌరవం చేసి పంపేరు. బాగుపడినందుకు సంతోషించాం.
@జిలేబిగారు,
అంతే కదండి! 🙂
మీరు చెప్పిన కధలో నేను మూడు చేపల వ్యక్తిత్వం ఉన్న వాడిని
మూడవది – నేను మీరు చెప్పిన విధంగా బాధితుడినే Lay off లో నా ఉద్యోగం పోయింది, ఎందుకంటే నమ్మకం మా Manager మీద.
రెండవది – నేను ఎప్పటికప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.
మొదటిది – నేను నెలనెలా నా జీతంలో సగం Banks లో fixed deposit చేసాను.
కానీ ఇప్పుడు అవి చెయ్యలేని పరిస్థితి
Fixed deposit మీద పన్ను పీకుతున్నారు, రెండవది ఉద్యోగ ప్రయత్నాలా అంటే ఇప్పుడు ఎలాగైనా ఒక గమ్యం చేరుకోవాలి అనే సమయం.
మరి ఏ చేప కధ లోకి వేళతానో.
@గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
మొదటివారుకాదని తేలిపోయింది కదా! మూడవవారూ కాదని తేలిపోయింది. ఇక పరిశేష న్యాయం ప్రకారం రెండవ వారే! ప్రయత్నించండి! దొరుకుతుంది ఉద్యోగం. జుట్టుంటేనే చిక్కులు పడుతుంది! దానిని చిక్కులు పడకుండా చూసుకోవాలి. జుట్టు లేకపోతే చిక్కుల సమస్య రాదు కదా!!!
డబ్బును పర్యవేక్షించుకోవాల్సిన అవసరం గురించి బాగా చెప్పారు. “Save for a rainy day” అన్న చీమల సామెత అదే కదా. 🙂
మీ కంపెనీల వుదాహరణ కొంచెం ఆలోచించాల్సిందే… ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యే రిస్క్ వుంటుంది.
మీ లక్ష అప్పు సంవత్సరంలో తీర్చగలిగిన వారు, ఆ మొదటి తీసుకున్న వారికే ఎందుకు తీర్చలేక పోయారు? మీరు వడ్డీలేని/పావులా వడ్డీ అప్పులు గానీ ఇస్తున్నారేంటి? 🙂 😉
@Snkr గారు,
బలే కనిపెట్టేరు కదా! 🙂
@Snkr గారు,
సమయం సందర్భం చూసుకోవాలి కదండీ
మీ దీర్ఘ దర్శకత్వం తో
వారి కి ప్రాప్త కాలజ్ఞానం
కలిగిందని చెప్పండి
దీక్షితులు గారు!
చీర్స్
జిలేబి.