శర్మ కాలక్షేపంకబుర్లు-తల్లి ప్రేమ ఓడిపోయిందా?

తల్లి ప్రేమ ఓడిపోయిందా?

కిందటి నెల ఒక సారి రాజమంద్రి వెళ్ళవలసివచ్చింది, తప్పక. అక్కడ పని పూర్తి చేసుకున్న తరవాత వచ్చేద్దామని బయటకు వస్తూ ఉంటే ఒక మిత్రుడు కలిశాడు. ఎలా ఉన్నారంటే, కుశల ప్రశ్నల తరవాత, రండి టీ తాగుదామన్నాడు. టీ తగుతుండగా నేనే మీదగ్గరికి బయలుదేరాలనుకుంటున్నా, ఆడబోయిన తీర్ధం ఎదురవడమంటే ఇదేకాబోలు అన్నాడు. నేనే వచ్చా కదా పనేమిటో చెప్పమన్నా. మీరు ఖాళీ కదా అన్నాడు. నాకు వేరుపనులేమీ లేవు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నా, కావలసిన వారిని కలవాలనుకున్నా, కాని ఇది అర్జంటు అంటున్నారు కదా, ముందు ఇది చూద్దామన్నా.

ఆఫీస్ లో అతని గదిలో కూచున్నాం. విషయం చెప్పేడు. నాకు బుర్రలోకి పోలేదు. ఈ మధ్య చెప్పిన విషయాన్ని వెంటనే తీసుకుని విశ్లేషించడం తగ్గింది,సంగతి విని బుర్ర గందరగోళంలో పడిపోయింది.. మరొక కారణం కవిని కదా అదేనండి, కనపడదు, వినబడదు. పేర్లు గుర్తుండటం లేదు, ఇదొక వ్యాధి అని హోమియో వైద్య పితామహుడు హానిమన్ చెప్పిన మాట, ఇది ఒక రోగ లక్షణం, ఇది వయసుతో పాటు వస్తుందన్నాడు, మందుకూడా చెప్పేడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉంటేనే బాగుందని. అతనికే అనిపించింది, నాకు సంగతి అర్ధం కాలేదని, ఒక నిమిషమని, ఎవరికో కబురు పెడితే ఒక పది, పన్నెండేళ్ళ అమ్మాయి వచ్చింది. ఆమె చెప్పడం మొదలుపెట్టింది, గందరగోళం మరీ పెరిగి, ఇలా కాదని నేను ప్రశ్నలు వేసి సంగతి కనుక్కుని, నాకు అర్ధమైనది చెబుతున్నాను, తప్పులు సరి చేయండని చెప్పి మొదలెట్టేను.

“ఈమె తమ్ముడు,ఈ పాప తల్లి తండ్రులతో ఉండేవారు, వీరి తండ్రి రైల్వేలో ఉద్యోగి, ఒడిస్సాలో ఉద్యోగం చేసేవారు.ఈమె వాళ్ళ తండ్రి ఏమి ఉద్యోగం చేసేవారో,ఎక్కడ చేసేవారో ఈ పాప చెప్పలేదు, ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోయాడు. తండ్రి తాలూకు పింఛను తల్లి తీసుకుంటూ ఉంది. రయిల్వేవారు తల్లికి ఉద్యోగం కూడా ఇచ్చారు. ఉద్యోగం చేసుకుంటూ, పింఛన్ తీసుకుంటూ, ఈ పిల్లలని కొంత కాలం బాగానే చూసింది, తరవాత పని చేసేచోట, ఒకరితో శారీరిక సంబంధం పెట్టుకుంది. నెమ్మదిగా పిల్లలను తీసుకొచ్చి, పిల్లల చదువులకోసమని చెప్పి, నాయనమ్మ దగ్గర వదిలేసి, కొంత కాలం డబ్బులు పంపి, తరవాత మాటా పలుకు లేదు, డబ్బులూ పంపటం లేదు. ఇప్పుడు, ఇదివరలో పని చేసిన చోట కూడా లేదని, కొత్త పరిచయస్తునితో కలసి మరొక ఊరుకు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది,ఆమెను వెతకడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు, పెద్దదయిన నాయనమ్మ వల్ల కాలేదు.. పిల్లలని నాయనమ్మ పెద్దదయిపోవడం మూలంగానూ, మరే ఆధారం లేకపోవడం మూలంగా, పెంచలేక అనాధ శరణాలయం లో చేర్చింది. తల్లి ఏ రకంగాను వీరిని ఆదరించే సావకాశం కనబడటం లేదు, తల్లితో మాట్లాడే ప్రయత్నాలు వమ్మయిపోయాయి, మీరు కోరేది, ప్రస్తుతం పిల్లలు అనాధ శరణాలయం లో ఉన్నారు కనుక, ఈ పిల్లలకు తండ్రి ఫింఛను వచ్చేలా చేయాలి” అంతే కదా సంగతి అన్నా.”ఇద్దరూ అవునన్నారు.

పెద్ద వాళ్ళెవరైనా కలగచేసుకుని, తల్లిని వెతికి, పిల్లలని తీసుకుని తల్లి దగ్గరకు వెళ్ళి పరిష్కారానికి మార్గం చూడండి. పిల్లలిని చూసి తల్లి మారచ్చేమో!, చిక్కు పెద్దది, పిల్లలు చిన్న వాళ్ళు, నాయనమ్మ ముసలిది, చదువు లేనిది. ఇది కుదరకపోతే, మొదటగా, ఈ పిల్లలు, చనిపోయినవారి తాలూకు పిల్లలని ఋజువు కావాలి. స్కూల్ సర్టిఫికట్లు వగైరా సరిపోతాయి.ఫోటో లున్నవయితే మంచిది, లేదంటే పుట్టుమచ్చలు రాసిఉన్నవయినా సరిపోతాయి, ఆధారానికి. తల్లి,తండ్రి వీరు కల్సివున్న ఫోటో ఉంటే మంచిది. వీళ్ళు ఇద్దరూ మైనర్లు కనక మామ్మ ప్రస్తుత సంరక్షకురాలిగా ఒక అర్జి, పెన్షన్ ఆర్దర్ జారీ చేసేవారికి పెడదాము.ఎక్కడకెళ్ళి న్యాయం చేయమని అడిగినా అధారాలు కావాలంటారు, వీరి దగ్గర అవేమీ ఉన్నట్లు కనపడటం లేదు, వాటి గురించి శ్రద్ధ చేయండి అన్నా. ముందు, అతను ఎక్కడ ఏమి ఉద్యోగం చేసేడో, తల్లి ఏమి ఉద్యోగం ఎక్కడ చేస్తున్నదో కనుక్కోండని సలహా ఇచ్చి, అక్కడ నా స్నేహితుని కంప్యూటర్ మీద అర్జీ తయారు చేసి ఇచ్చాను, ఖాళీలు పూర్తిచేసుకోమని. ఆ అమ్మాయిని చూస్తే జాలి వేసింది, నా స్నేహితుడు, మిమ్మల్ని ఈ కేస్ గురించి మిమ్మల్ని పదే ఇక ముందు కూడా ఇబ్బంది పెడతాను, వీరి బాగోగులు ప్రస్తుతం నేను చూస్తున్నాని చెప్పేరు. నాకనిపించింది, కామం ముందు తల్లి ప్రేమ దిగదుడుపేనా? ఒడిపోయిందా? తల్లి ఇల్లా కూడా ఉంటుందా? స్త్రీ పురుష సంబంధాలు ఇంత దిగజారిపోతున్నాయా? తివారి లాటి తండ్రులు, ఇటువంటి తల్లులు పెరిగిపోతున్నారా?

 

22 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తల్లి ప్రేమ ఓడిపోయిందా?

 1. శర్మగారు, ఇక్కడ రాసిన చాలా వ్యఖ్యలలో ఇలాంటి తల్లి కూడ ఉంటారా అని ఆశ్చర్య పోవటం చూసి నాకు చాలా ఆశ్చర్య్తమేసింది. 20 ఏళ్ల క్రితమే ఇటువంటి సంఘటనలు చూసాను. మా ఇంటి ఎదురుగా ఉండే టి కొట్టతని భార్య తన ఇద్దరిని పిల్లలను (అందులో ఒకరు చంటిపిల్ల ) వదలివేసి ఒకడితో వెళ్లి పోయింది. వాడు ఆ పిల్లలను చూసుకొంట్టూ , దుఖాణం లో పనిచేసుకొంట్టూ రెండు పనులతో సతమతమైపోతుండేవాడు. ఇటువంటి సంఘటనలు వాస్తవానికి లెక్కలేని అన్ని ఉంటాయి. కాని డబ్బులు లేని, కూలిపని, చిన్నపనులు చేసుకొనే వీరి జీవితాలను ఎవరు లెక్క చేయరు కనుక వారి గురించి పుస్తకాలలో, కథలలో ఎక్కువగా రాయరు. ఎప్పుడో ఒకరో ఇద్దరో రాసిన ఎవరు పెద్దగా పట్టించుకోరు. మన చుట్టుపక్కల చిన్న చిన్న పనులు చేసేవారి జీవితాలను చూస్తే ఇటువంటి వారి సంఖ్య కలవర పెట్టేస్థాయిలో ఉంట్టుంది.

  • @SriRam గారు
   welcome 2 my blog
   ఈ సమస్య ఈ రోజుదే కాదు. మీరు చెప్పిన మాట నిజమే. ఇది ఇప్పుడు బాగా పెరిగిపోతున్నట్లుగా ఉంది, అదీ నా బాధ.
   ధన్యవాదాలు.

 2. భర్త మరో స్త్రీని పెళ్లి చేస్కుని వెళ్ళిపోతే, దిక్కు తోచక, పిల్లల్ని పోషించలేక, అనాధ శరణాలయంలో అయితే తిండి అయిన దొరుకుతుంది అని పిల్లల్ని తీస్కెళ్ళి , మళ్లీ మనసు ఒప్పుకోక తన వెంట తెచ్చుకుని, కష్టంతో వాళ్ళని చదివిస్తున్న తల్లిని చూసాను.మీరు చెప్పింది చదివితే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనిపించింది. చేయని తప్పులకి ఇలా ఎంత మంది పిల్లలు అనాధలుగా బ్రతుకుతున్నారో. ఊహించుకుంటేనే బాధగా వుంది. బాద్యత లేని తల్లి తండ్రుల్ని ఏం చేసిన తప్పు లేదు.

  • @Kaavya Chandana గారు,
   బాధ్యత లేని తల్లులు, తండ్రులు కోకొల్లలుగా తయారయిపోతున్నారు, నేటి సమాజంలో.పిల్లల బతుకు, వారి ఆనందం, తల్లి తండ్రుల ప్రేమకు నోచని వారిని, తలుచుకుంటేనే నాకు భయమేస్తోంది. బాధ్యత లేని వారిని ఏదో చేసేకంటే వారిని అలా తయారు కాకుండా సమాజ కట్టుబాట్లు మారాలండీ!
   ధన్యవాదాలు.

  • @అనూరాధ గారు,
   ప్రస్తుతానికి నా మిత్రుడు ఆ పిల్లలని చేరదీశాడు, మంచి జరుగుతుందని ఆశిదాం.
   ధన్యవాదాలు.

 3. ప్చ్.. పాపం.
  ఇన్స్పెక్టర్‌తో పర్సనల్‌గా మాట్లాడి ” మా తల్లి కనపడుట లేదు” అని పిల్లలతో ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తే? పోలీసులకు వెతికి పెట్టడం కష్టం కాదు.

  లేదంటే… ఆ పిల్లలకు 10లక్షలు లాటరీ తగిలిందని, తల్లిదండ్రులు వచ్చి క్లైం చేసుకోవాలని పేపర్లో వేయిస్తే?

  • @Snkr గారు,
   మీ కామెంటు ఒక ఆలోచనకి అంకురార్పణ చేసింది. పోలీసుల సాయం తీసుకోవాలనుకుంటున్నాము.
   ధన్యవాదాలు.

 4. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు నా హృదయాన్ని కలచి వేస్తాయి
  వీటికి కారణం ఎవరు అని చెప్పలేము ఎందుకంటే కొంత మంది
  “జీవితం చిన్నది దాన్ని అనుభవించు” అని చెబుతారు
  ఇంకొంత మంది “రేపేమి జరుగుతుందో తెలియదుఈ రోజే అను భావించు” అని అంటారు
  ఇంకొన్ని రాతలు “యుక్త వయసు ఉంది డబ్బులేదు తరువాత డబ్బు ఉంది సమయం లేదు ఇక చివరి కాలంలో డబ్బు సమయం ఉన్నా శక్తి లేదు”
  ఇవన్నీ మనల్ని కర్మ సిద్దాంతం నిజమని తెలిసినా – డబ్బు సుఖం అనే వ్యసనంలో పాడేస్తున్నాయి.
  ఇన్ని తెలిసి కూడా నేను ఇంకా డబ్బు కోసం పరిగెడుతూనే ఉన్నాను. చూద్దాం నాకు రెండుసార్లు పునర్జన్మ ప్రసాదించిన ఆ దేవుడు నా చేత ఏమీ చేయిద్దము అనుకున్నాడో.

  • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు
   మీరు చెప్పినది నిజమే, కాని ఆ మాటలకి అర్ధాలు సందర్భాన్ని బట్టి ఉంటాయనుకుంటా. రెండు సార్లు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు నిశ్చయంగా మీ చేత మంచి పనులే చేయిస్తాడు, నమ్మికతో ఉండండి. డబ్బు అనేది అవసరాలు తీర్చడానికి కావాలి. అది ఎక్కువా కష్టమే, తక్కువా కష్టమే. సంపాదించాలి సద్వినియోగం చెయ్యాలి.
   ధన్యవాదాలు.

 5. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి అని శంకరభగవత్పాదుల ఉవాచ. అంటే చెడ్ద వారయిన సంతానం ఉంటారు కాని, చెడ్డ దయిన తల్లి ఉండదని వారి అభిప్రాయం. నాగరీకం ముదిరి నేడు చెడ్డ తల్లులు, చెడ్డ తండ్రులు ఊరూరాపుష్కలంగా కనిపిస్తున్నారు!

   • శర్మగారు. ఇప్పుడంతా రేఫలకు ద్విత్వం చేస్తున్నారు కానీ తెలుగుభాషా నియమాల్లో అది నిషిధ్దం. రేఫలకు ద్విత్వం బదులు ఱాలకు ద్విత్వం చేయటం సంప్రదాయం. ఉదా: కఱ్ఱ. బుఱ్ఱ, వెఱ్ఱి, మొఱ్ఱి. తొఱ్ఱ

   • మిత్రులు శ్యామల రావుగారు,
    మీరు చెప్పినది నిజమే.కాదనను, కాని వాడుకలోంచి బాగా వెనక పట్టేసింది. భాషకి మార్పు సహజం. కాని రోజూ వాడుకునే మాటలే తప్పులు రాసేస్తున్నారు, పలికేస్తున్నారు, కొంతమంది అయితే చెబితే, భావం ముఖ్యం కాని భాష దేముంది అంటున్నారు. మరి స్పెల్లింగ్ తప్పులు ఎందుకు సరి చేస్తున్నారో మాత్రం తెలియదు.
    ధన్యవాదాలు.

 6. ఈ పిల్లల తల్లి ప్రవర్తన తల్లి తనానికే అప్రతిష్ట !
  వాళ్ళకి తల్లి గురించిన తగిన ఆధారాలు దొరికితే బాగుండును..మాస్టారు. ఆమెని నలుగురిలో నిలువునా నాలుగు కడిగేయాలి.
  అటువంటి తల్లి లేకపోయినా పర్లేదు కాని..తండ్రి పెన్షన్ అయినా దక్కినా బాగుండును.
  తివారి లాంటి వారిని తండ్రి ..అంటారా!? నా దగ్గరైతే తిట్టటానికి పదాలు కూడా లేవు.

  • @వనజ గారు,
   నా మిత్రుడు అదే పనిలో ఉన్నాడు. తొందరగా పరిష్కారం కావాలని కోరిక.తివారి లాటి వాళ్ళు, ఈ తల్లిలాటివారు ఎక్కువైపోతున్నారు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s